వేచి ఉన్నా నేస్తం! – కవిత

వేచి ఉన్నా నేస్తం! - కవిత

నీతోనే పంచుకోవాలని,

గుండెలో గూడు కట్టుకున్న ఊసులన్ని

నీ మీద నా ప్రేమను

విన్నవించుకోవాలని,

నీ కళ్ళు నాపై కురిపించే ఆరాధనను చూసి

కరగిపోవాలని,

ఆశల మేఘాలపై పయనిస్తూ,

నీ కోసం వచ్చాను నేస్తం!

కాని,

నీ కనులలోని తిరస్కారాన్ని కని,

నీ మాటలోని కరకుతనాన్ని విని,

గాయపడ్ద హృదయంతో

దూరంగానే

నిలుచున్నా నేస్తం!

గుండెలోని గాయం నుంచి

ఉబికి వస్తున్న రుధిరం

కనుల నుంచి చెక్కిలి పైకి

జాలువారకుండా,

అధరాలను మునిపంటితో

నొక్కి ఆపాను నేస్తం!

కుములుతున్న హృదయంతో,

మూగవోయిన గొంతుతో,

వణుకుతున్న మేనితో,

నీవు నడిచే దారిలో

ఓ పక్కగా కుర్చున్నా నేస్తం!

ఏ నాటికైనా నీ వాణి

మధురంగా మారుతుందని,

నీ కనుల నుంచి ప్రేమామృతం

జాలువారుతుందని,

నా తపస్సు ఫలిస్తుందని,

కొండంత ఆశతో

వేచి ఉన్నా నేస్తం!

1 thought on “వేచి ఉన్నా నేస్తం! – కవిత”

Comments are closed.