‘అఖిలాశ’ – పుస్తక సమీక్ష

          కవితలు.. వీటిని రాయడం చాలా తేలికే అనుకుంటూ ఉంటాం. కానీ అందరికీ అలా రాయడం అనుకున్నంత తేలికేమీ కాదు. అందరిలో కొందరు మాత్రమే రాయగలరు. కవితకు ఎంచుకున్న అంశం ఏదైనా అవనీ… రాయదలచుకున్న అంశం పై రాయాలనే భావన మనసులో నుండి రావాలి. అలా మనసులో నుండి తన్నుకువచ్చే అక్షరాలను కవితగా రాసినపుడే అవి మనసుకు హత్తుకునే కవితలు కాగలవు.

          ఇపుడు జానీ తక్కెడశిల రాసిన తొలి పుస్తకం ‘అఖిలాశ’ పై సమీక్ష రాయదలిచాను. ముందుగా కవి గురించి చిన్నగా తెలుసుకుందాం. పూర్తీ పేరు తక్కెడశిల జానీ భాషా చరణ్. కలం పేరు అఖిలాష. నివాసం పులివెందుల, కడప జిల్లా.

'అఖిలాశ' - పుస్తక సమీక్ష

          జానీ రాసిన కవితల్లో నేను చదివిన మొదటి కవిత్వం రూపాయి-కసాయి. ఆ కవిత్వం మనసును తాకింది. ఇక మనం సమీక్షలోకి వెళదాం.

          అఖిలాశ కవిత్వ పుస్తకంలో ఉన్న మొత్తం కవితల సంఖ్య 51. కవితలన్నీ వచన కవిత్వంలో సాగాయి.  

          ‘అఖిలాశ’లో కవితలు చదువుతూ వెళుతుంటే అందులోని ప్రతీ కవిత ఒకదానితో మరొకటి పోలికే లేకుండా దేనికి అదే అన్నట్టు ప్రతీ కవిత ఓ నిండైన భావాన్ని కలిగి ఉంది. వీటన్నింటిల్లో కొన్ని కవితల గురించి చెప్పాలనుకుంటున్నా. అన్నీ చెప్పేయొచ్చు… కానీ నేను చెప్పినదానికన్నా మీరు స్వతహాగా చదివితేనే కదా కవిత ఏదైనా అందులోని మాధుర్యాన్ని మీరు ఆస్వాదించగలరు. ఏమంటారు? అందుకే వాటిని మీరే ‘అఖిలాశ’లో చదవండి.

          నిశ్శబ్దము వలదు, గండం, జ్ఞానం కవితల గురించి నా అభిప్రాయంలో చూద్దాం.

          గండం..

          ఈ కవిత నేటి సమాజంలో జరుగుతున్నా ఘోరాలకు ప్రతిబింబంలా లోతైన భావాన్ని నిలువెల్లా కలిగుంది. ప్రతీ పదం.. ప్రతీ వాక్యం… అందులో ఎంతో అర్థం..!

          కవిత చివరలో…

          “మేమూ… మనుషులమే కదా!

          మరి మాకెందుకీ శిక్ష!!”

          హృదయాన్ని సూటిగా గుచ్చగలిగేంత వాడైన వాక్యాలతో ఉన్న ఈ కవిత చాలా బాగుంది.

          జ్ఞానం…

          యువతకూ… ప్రతి ఒక్కరికీ మార్గనిర్దేశకంగా సాగే ఈ కవితను జానీ చక్కగా రాసారు. ప్రతి కవితలోనూ చివర్లోనో మొదట్లోనో ఏదో ఒక గ్రహించవలసిన అంశం తప్పక ఉంటుంది. అలా ఈ కవిత ఆది నుండి అంతం వరకూ గ్రహించవలసిన ఎన్నో విషయాలు కలిగి ఉండి స్పూర్తిదాయకంగా ఉంది.

          నిశ్శబ్దము వలదు…

          ఈ కవిత నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో జానీ చెప్పిన అంశం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అదే సమాజంలో ఎన్నో ఘోరాలాకు మరెన్నో సంఘటనలకు కారణమవుతోంది. అలా జరిగే వాటికి మూలమేంటో ఆలోచిస్తే గానీ కారణం మన బుర్రకు తట్టదు. లేదా ఒకరు చెబితే కానీ తెలియదు. చెడు మార్గాలలో వెళ్ళకుండా, సన్మార్గంలోనే వెళ్ళేలా, వారికి అన్నీ స్పష్టంగా తెలియజేయాలి అనే ఓ ప్రధాన అంశంతో రాసిన ఈ కవిత అందరినీ ముఖ్యంగా యువతనీ వారి తల్లిదండ్రులని ఆలోచింపజేసేదిగా ఉందని నిస్సంకోచంగా చెప్పగలను.

          ఈ కవితలతో బాటూ వనితా, ప్రేమ, జీవితం లాంటి మొదలగు అంశాలను ప్రధానం చేసుకొని మిగతా 49 కవితలు సాగాయి. మొత్తంగా ‘అఖిలాశ’ కవితా సంపుటి బాగుంది. జానీ రాసిన కవితలు పుస్తకంగా తొలిసారిగానే వచ్చినా కవితలు బాగుండటం వలన ఈ కవిత్వ ఝరి జాని నుండి మొదటగా వచ్చిన దానిలాగ అగుపించడం లేదు. మున్ముందు కూడా ఇలాంటి మంచి మరిన్ని కవితలు రాసి అవన్నీ పుస్తకంగా రావాలని నా ఆశాభావం తెలుపుతున్నాను.

పుస్తకం: ‘అఖిలాశ’
కవి: తక్కెడశిల జానీ భాషా చరణ్
వేల: రూ. 50
ప్రచురణ: జె.వి.పబ్లికేషన్స్
ప్రతులకు సంప్రదించండి: జ్యోతివలబోజు, సెల్: 80963 10140
ఈ పుస్తకం అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలలో లభిస్తుంది.