రుద్రాక్ష

          ప్రస్తుతము టీ.వి.లలో రుద్రాక్ష ధారణ గురించి రుద్రాక్షలలోని రకాల గురించి, వాటి ధారణ వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేక కార్యక్రమాలను నిత్యమూ చూస్తూ ఉంటాము. సిద్ధాంతులు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు, పురాణా ప్రవచనకారులు వీటి గురించి ఉపన్యాసాలు ఇవ్వటం లేదా టీ.వి.లలో ప్రేక్షకుల సందేహాలకు జవాబులివ్వటము  జరుగుతూ ఉంటుంది. మన ప్రాంతాలలో జరిగే ఎగ్జిబిషన్లలో వీటి అమ్మకాలను చూస్తూ ఉంటాము.  చాలా మంది రుద్రాక్షలను 32, లేదా 64 లేదా 108 జపమాలగా ధరిస్తుంటారు. ఈ జపమాలను నేపాలీయులు శ్రీమాల అని కూడా అంటారు. మనకు దొరికే రుద్రాక్షలు అన్ని నేపాల్ నుంచి వచ్చేవే. రుద్రాక్షకు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే శివ పురాణము ప్రకారము రుద్రాక్ష పరమశివునికి ప్రీతికరమైనది. అందువల్ల హిందువులు మరీ ముఖ్యముగా శైవ సాంప్రదాయాన్ని పాటించేవారికి రుద్రాక్ష పరమ పవిత్రమైనది. రుద్రాక్ష ధారణ వల్ల పాపాలు తొలగి, ధరించినవారు శివునికి ప్రీతి పాత్రులవుతారని హిందువుల నమ్మకము. రుద్రాక్షను ధరించి భక్తితో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రము జపిస్తే సకల శుభాలు కలుగుతాయని శివపురాణములో పేర్కొనబడింది. రుద్రాక్షను ధరించినవారు మద్యమాంసములను ముట్టకూడదు, మరే యితర అనైతిక కార్యక్రమాలలో పాల్గొనకూడదు.

          నేపాల్లోని పశుపతినాథ్ మందిరములోని పూజారులు విధిగా జపమాలను ధరించి దేవాలయ విధులలో పాల్గొంటారు. సాధారణముగా రుద్రాక్ష మూడు సైజులలో లభ్యమవుతుంది. పెద్దది ఉసిరికాయ సైజులో ఉంటుంది. మధ్య రకము ఇంకొద్ది చిన్నదిగా ఉంటుంది. చిన్న సైజు శనగ గింజ సైజు ఉంటుంది. చిన్న సైజు రుద్రాక్షలు శ్రేష్ఠము. సహజమైన రుద్రాక్ష నీటిలో మునుగుతుంది  తేలదు. కృత్రిమమైనవి నీటిలో తేలుతాయి. సహజమైన వాటికి మధ్య రంధ్రము ఉంటుంది. రుద్రాక్ష అనేది వృక్ష శాస్త్రము ప్రకారము “ఎలాయొకార్పస్” అనే సాంకేతిక నామము కలిగిన చెట్టు విత్తనము. ఈ చెట్టు “ఎలాయొకార్పేసియే” అనే కుటుంబానికి చెందినది. రుద్రాక్ష చెట్టు వర్షాకాలములో పూలు పూసి చలికాలము అంటే నవంబర్ డిసెంబర్ నెలలలో కాయలు కాస్తాయి. నేపాల్లోని భోజ్ పూర్  జిల్లాలోని అరుణ్ లోయలో గల  దింగ్లా ప్రాంతములో ఈ చెట్లు అధికముగా ఉంటాయి.

          రుద్రాక్షలు వైద్య పరముగా కూడా ముఖ్యమైనవి ఆయుర్వేద వైద్యములో వీటిని ఉపయోగిస్తారు. ముఖ్యముగా అధిక రక్త పీడనాన్ని రుద్రాక్ష అదుపు చేస్తుందని చాలా మంది నమ్మకము. ఆటలమ్మ, తడపర వంటి వ్యాధి సోకిన వారికి రుద్రాక్షను శుభ్రమైన రాయిమీద అరగదీసి ఆ లేపనాన్ని పొక్కులమీద వ్రాస్తారు. రుద్రాక్షను పాలతో అరగదీసి తీసుకుంటే దగ్గు జలుబు తగ్గుతాయి. హిస్టీరియా, మూర్చ వంటి వ్యాధుల చికిత్సకు కూడా రుద్రాక్షను వాడతారు. ఈ విధముగా ఆయుర్వేద వైద్యములో రుద్రాక్షను ఉపయోగిస్తారు.

          రుద్రాక్షల విలువ ప్రాముఖ్యత వాటిపై ఉండే నిలువు గాడులను బట్టి ఉంటుంది. ఈ గాడులనే ముఖాలని వ్యవహరిస్తారు. ఈ ముఖాలు ఒకటి నుండి పదిహేను లేదా అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. అన్నిటికన్నా విలువైనది అరుదైనది  ఏక ముఖ రుద్రాక్ష. ఇది పరబ్రహ్మ స్వరూపముగా భావిస్తారు. ఇది రుద్రాక్షలలో రాజు లాంటిది. దీనికి సూర్యుడు అధిపతి.  దీనిని ధరించినవారికి భోగ, మోక్ష మరియు అన్ని రకాల విజయాలు లభ్యమవుతాయి. ఏక ముఖ రుద్రాక్షను పశుపతినాథ్ మందిరములో భద్రపరిచి బాల చతుర్దశి నాడు జరిగే వేడుకలో భక్తుల సందర్శనార్ధము ఉంచుతారు.  ప్రతినెలా పౌర్ణమినాడు కూడా భక్తుల సందర్శనార్ధము ఉంచుతారు.

          ద్విముఖ రుద్రాక్ష: దీనికి అధిపతి చంద్రుడు. దీనిని అర్ధనారీశ్వర రూపముగా పరిగణిస్తారు. ఇది శివ పార్వతులకు ప్రతీక కాబట్టి ఐక్యతకు చిహ్నము. ఈ ఐక్యత గురు శిష్యుల, భార్యాభర్తల, తల్లిదండ్రులు పిల్లల, స్నేహితుల మధ్య ఉండేది. కాబట్టి ఇది ధరించినవారు సుఖ సంతోషాలతో ఉంటారు.

          త్రిముఖ రుద్రాక్ష కు అధిపతి అంగారకుడు అంటే అగ్నికి ప్రతిరూపము. అన్నిటిని దహించిన పరమపవిత్రముగా ఉండేదే అగ్ని. కాబట్టి దీనిని ధరించినవారు పాపాలనుండి విముక్తిని పొందుతారు.

          చతుర్ముఖ రుద్రాక్ష: దీనికి అధిపతి బుధుడు. ఇది బ్రహ్మకు  ప్రతిరూపము. దీనిని ధరించవారికి సృజనాత్మకత పెరుగుతుంది కాబట్టి విద్యార్థులు శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీనిని ధరిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని నమ్మకము.

          పంచముఖ రుద్రాక్ష : దీనికి అధిపతి బృహస్పతి(గురుడు). ఇది పరమ శివుని ప్రతిరూపము.  దీనిని ధరించిన వారికి ఆరోగ్యము శాంతి లభిస్తుంది. ఇది అధిక రక్తపీడనాన్నిగుండె జబ్బులను నియంత్రిస్తుంది. ఇది ధరించినవారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ జపమాల ధరించిన వారికి అకాల మృత్యువు సంభవించదు.

          షష్ఠ ముఖ రుద్రాక్ష: దీనికి అధిపతి శుక్రుడు. ఇది కార్తికేయుని ప్రతిరూపము. ఇది వ్యాపారవేత్తలకు ఎగ్జిక్యూటివ్లకు, జర్నలిస్టులకు మంచిది. ఇది ధరించిన వారు మంచి తెలివి తేటలతో వ్యవహరిస్తారు. దీనిని కుడి చేతికి ధరిస్తే రక్త పీడనాన్ని అదుపుచేస్తుంది.

          సప్తముఖి రుద్రాక్ష: దీనికి అధిపతి శని. ఇది మహాలక్ష్మికి ప్రతిరూపము. దీనిని ధరించినవారికి లక్ష్మి కటాక్షము ఉంటుంది. కాబట్టి ఆర్థిక బాధలు పడేవారు దీనిని ధరించటం మంచిది.

          అష్టముఖ రుద్రాక్ష: దీనికి అధిపతి రాహువు.  ఇది వినాయకుడికి ప్రతిరూపము. కాబట్టి ఇది ధరించినవారికి పనులు విఘ్నాలు లేకుండా జరుగుతాయి.

          నవముఖ రుద్రాక్ష: దీనికి అధిపతి కేతువు. ఇది దుర్గా దేవికి ప్రతిరూపము కాబట్టి దీనిని ధరించివారు శక్తివంతులవుతారు. జీవితములో విజయాలు సాధించటానికి అవసరమైన ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది. ఇలా నవగ్రహాలకు ప్రతీకగా తొమ్మిది రకాల రుద్రాక్షలే కాకుండా పది, పదకొండు, పన్నెండు, పదమూడు, పద్నాలుగు ముఖాల రుద్రాక్షలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా గౌరీశంకర రుద్రాక్ష, గణేశా రుద్రాక్ష కూడా ఉన్నాయి. గౌరీ శంకర రుద్రాక్షలో శివ పార్వతుల శక్తి ఉంటుంది. ఇందులో రెండు రుద్రాక్షలు సహజముగానే కలిసి ఉంటాయి. భక్తులు వారి అవసరాలను బట్టి తగిన రుద్రాక్షను పండితుల సలహామేరకు ధరించి నిష్ఠగా ఉంటే మంచి ఫలితాలను పొందుతారు.

          ఎటొచ్చి సరి అయిన  నకిలీ కానీ రుద్రాక్షలను సంపాదించి ధరించాలి. అసలైన రుద్రాక్షలను గుర్తించటానికి కొన్ని పరీక్షలు ఉన్నాయి అవి తెలుసుకుందాము. మొదటిది రుద్రాక్ష చుట్టూ అయస్కాంత వలయము ఉంటుంది. దీనిని గుర్తించటానికి రుద్రాక్షను రెండు రాగి నాణెల మధ్య ఉంచితే రుద్రాక్ష దానంతట అదే తిరుగుతుంది. రెండవది అసలైన రుద్రాక్ష నీటిలో లేదా పాలలో మునుగుతుంది. పూర్తిగా పక్వస్థితికి రాని  రుద్రాక్ష అసలైనది అయినప్పటికీ  నీటిలో, పాలలో తేలుతుంది. మూడవది రుద్రాక్షను ఒక గ్లాసులో ఉంచి అది పూర్తిగా మునిగే వరకు నీరుపోసి  ఒక గంట తరువాత ఆ నీటి ఉష్ణోగ్రతను పరిశీలిస్తే ఆ రుద్రాక్ష అసలుది అయితే ఒక డిగ్రీ సెంటిగ్రేడు కన్నా ఎక్కువ పెరుగుతుంది. నాలుగవది ఎక్కువ టైమ్ తీసుకొనే పరీక్ష. దీనిని సాధారణముగా ఏక ముఖ రుద్రాక్షను పరీక్షించటానికి చేస్తారు. ఒక గ్లాసు తాజా పాలలో రుద్రాక్షను ఉంచి రెండు రోజుల తరువాత పాలను పరీక్షించిన పాలు పాడవవు. ఏక ముఖ రుద్రాక్ష అయితే పాలను 5 నుండి 7 రోజుల వరకు పాడవకుండా ఉంచుతుంది. కాబట్టి మోసగాళ్ల మాటలు నమ్మకుండా ఈ చిన్న పరీక్షలు చేసి అసలు ఏదో నకిలీ ఏదో గుర్తించి రుద్రాక్షలు తీసుకోండి. వాటి వల్ల మంచి ఫలితాలను పొందండి.