ప్రణయమా… స్వార్థమా? – భాగం 5

          “నేనేమన్నాను సుజాత ఇపుడు?” ఆశ్చర్యంగా అంది.

          “మా ఇంట్లో వెనక డోర్ చూస్తానంటే ఏమన్నట్టు? నువ్వు అనుమానించినట్టే కదా? అపూర్వ ఇంట్లో అపూర్వ ఉంది. ఆమెని ఎవరో చంపేస్తే నువ్వు మా ఇల్లు చూస్తానని అంటావేంటి? అలా అడగటంలో నీ ఉద్దేశమేంటి?”

          చిన్నగా నిట్టూర్చి “నా ఉద్దేశంలో ఇప్పటివరకు అయితే నీ పై ఏ దురుద్దేశం లేదు సుజాత. అపూర్వ మరణించిన రోజు నువ్వు, మీ ఆయన ఇద్దరూ లేరన్నావు. ఇంటికి తాళం ఉందన్నావు. కానీ మూసి ఉన్న మీ ఇంటి కిటికీ కి ఒకవేళ నువ్వు బోల్టు పెట్టి ఉంటే తలుపు ఎలా తెరుచుకుంది? నా అనుమానమల్లా దీనిచుట్టే. తెరిచుకుంది అంటే ఇంట్లో మీరైనా ఉండాలి ఇంకా వేరే ఎవరైనా ఉండాలి. మీరు లేరు, ఇంటికి తాళం ఉంది అన్నావు. కానీ మీ ఇంట్లో ఎవరో ఉంటేనే కదా మీ కిటికీ తెరుచుకోవడానికి కారణం. ఇది నా పాయింట్. నేనేమనుకున్నాను అంటే ఒకవేళ మీ ఇంటికి వెనక డోర్ గానీ ఉందేమో అలా గాని ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చి కిటికీ తెరిచారేమో అని అడిగా. ఇందులో నిన్ను అనుమానించేది ఏముంది? ఎందుకు అంతలా నువ్వు రియాక్ట్ అయ్యావు?” కాస్త సీరియస్ గానే అంది కాత్యాయని.

          “ఓహ్… అలా అన్నావా. ఒకవేళ నువ్వన్నట్టు ఎవరైనా వచ్చారు అనుకుందామన్నా నేను ఇంటికి వచ్చేసరికి పెట్టిన డోర్ పెట్టినట్టే ఉంది కాత్యా. బహుశ ఆ కిటికీకి కూడా నేను బోల్టు వెయ్యలేదేమో, గాలికి మూసున్నది తెరుచుకుందేమో. ఇక ఇంట్లోకి ఎవరన్న వచ్చారేమో అని నీ సందేహం కదా. మెయిన్ డోర్ కి అయితే తాళం ఉంది. అలా ఎవరూ రాలేదు నువ్వు కూడా సీసీటీవి లో చూసావు. ఇక వెనుక డోర్ కి బయటి నుండి నేను తాళం వేయనేలేదు ఒకవేళ ఎవరన్నా తాళం పగలగొట్టి లోపలికి వచ్చారేమో అని అనుకోవడానికి. ఇంటిలోపలినుంచే వెనక డోర్ కి గడియలు పెట్టాను. అలాంటప్పుడు బయటి మనిషి లోపలి నుండి గడియలేసి మూసున్న గుమ్మం తీసుకుని ఇంట్లోకి ఎలా వస్తాడు చెప్పు? నువ్వు అనవసరంగా అన్నింటినీ అనుమానిస్తున్నావ్ కాత్యా. దా చూపిస్తా వెనక డోర్” అని లేచింది. కాత్యాయనిని తీసుకెళ్ళి ఇంటి వెనక డోర్ ని చూపించి “ఈ డోర్ ఎప్పుడు మూసే ఉంచుతాం” అంది.

          పరీక్షగా డోర్ ని చూసింది. డోర్ కి పైన బోల్టులు పెట్టున్నాయి. మళ్ళీ కింద కూడ గడియ పెట్టుంది. అవతల నుండి ఎవరన్నా లోపలికి రావాలి అంటే మామూలు వ్యక్తులకు ఇంపాజిబుల్. కానీ ఏమో… ఇలాంటివి తీయడంలో నేర్పు ఉన్నవాళ్ళకు మాత్రం కష్టం కాకపోవచ్చేమో అనుకుంది కాత్యాయని.

          “ఎందుకు ఈ డోర్ తీయరు?” అడిగింది.

          “మాకేమవసరం కాత్య. ఈ వెనక వీధి రోడ్డు అటు కాలనీ లోపలికి వెళుతుంది. ఆ రోడ్డులో పోయే అవసరమూ పెద్దగా ఉండదనుకో. ఎపుడన్న అవసరముంటే తప్ప తెరవము ఈ డోర్.”

          ఇద్దరూ తిరిగి హాల్లోకి వచ్చారు.

          ‘డోర్ బలంగానే ఉంది. బోల్టులు కూడా. మరి కిటికీ ఎవరు తీసుంటారు? లేకా నిజంగానే సుజాత అన్నట్టు గాలికి తెరుచుకుందా? కానీ గాలికి అయినా కూడా అప్పటివరకు తెరుచుకోని ఆ కిటికీ సరిగ్గా ఆ వ్యాను ఆగినప్పుడే తెరుచుకుంటుందా? లేక సుజాత ఏమైనా దాచుతుందా? ఎందుకు డోర్ చూస్తా అంటే అంతలా రియాక్ట్ అయింది? లేకపోతే నార్మల్ గానే నేను అలా అడిగేసరికి ఫీల్ అయి కోపంకి వచ్చిందా? ఏమో అలా కూడా కావచ్చునేమో. లేక నేనే అనవసరంగా వీటన్నింటినీ భూతద్దంలో చూసి అనుమానిస్తున్నానా? అపూర్వ హత్యకు సుజాతకి ఈ ఇంటికి నిజంగానే ఏ సంబంధమూ లేదా? ఏదీ అర్థం కావడంలేదు. ఒకసారి వరుణ్ తో మాట్లాడాలి’ అనుకుంది. “సరే సుజాత నేను వెళతా” అని చెప్పి బయటకు వచ్చేసింది కాత్యాయని.

          స్కూటీ దగ్గరకు వచ్చి తలతిప్పి వరుణ్ ఇంటి వైపు చూసింది. ఇదివరకు ఆ ఇంటిని చూడగానే అపూర్వని చూసిన భావనకు లోనయ్యేది. కానీ ఇపుడు ఆమె లేదన్న నిజం కాత్యాయనికి ఏడుపు తెప్పించింది. అప్రయత్నంగా దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుని స్కూటీతో అటు నడిచి. గేటు ముందు ఆపి, గేటు తీసుకుని లోనకు నడిచింది.

          ఎంతయినా ఇది అపూర్వ ఇల్లు. తను మరణించినంత మాత్రాన ఇది తన పరాయి ఇల్లు అవుతుందా అనుకుని గుమ్మం తట్టకుండానే నేరుగా గుమ్మం దాటి లోపలికి వెళ్ళింది. ఎదురుగా సోఫాలో వరుణ్ తల్లి విమల, అతని తండ్రి స్నేహితుడు విష్ణుమూర్తి కనిపించారు. ఆయనే వరుణ్ కోసం లా పాయింట్లు మాట్లాడిన లాయర్.

          తాను వరుణ్ ని నిందించడం వారు తనని తిట్టడం అన్నీ గుర్తొచ్చింది. ఏదీ తెలుసుకోకుండా ఇష్టమొచ్చినట్లు వాగాను అనుకుని “నన్ను క్షమించండి అత్తయ్య. నేను పొరబడి వరుణ్ ని అనుమానించాను. అపూర్వ మరణం తట్టుకోలేకపోతున్నాను ఇప్పటికీ. ఏం చేస్తున్నానో నాకే అర్థం కావడంలేదు” అంది బాధగా తలదించుకుని.

          “ఇందాకే వరుణ్ వచ్చాడు కాత్యా. నాకు అంతా చెప్పాడు. నీ అనుమానాలు నీవి. ఈరోజుల్లో అలానే జరుగుతున్నాయి. పేపర్లలో రోజు ఇలాంటి వార్తలే. నీ ప్లేసులో ఎవరున్నా బహుశా నీలాగే అనేవారేమో. ఇపుడయితే నీకు నిజం తెలిసిందిగా కాత్యా. అది చాలు మాకు. రా కూర్చో” ఆప్యాయంగా అంది వరుణ్ తల్లి విమల.

          “థాంక్ యూ అత్తయ్య. నన్ను అర్థం చేసుకున్నావు” అంటూ కూర్చుంది.

          “నేను నీకు కాఫీ కలుపుకొనొస్తా” అని లోపలికి వెళ్ళింది విమల.

          “చూడమ్మా కాత్యా… మన కళ్ళూ, చెవులూ కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తాయి. కనిపించిందల్లా నిజం కాకపోవచ్చు, అలాగే మనం విన్నది కూడా. వరుణ్ అని అపూర్వ అనడం విన్నావు కానీ వరుణ్ మాటలు గానీ ఇంకా ఏదైనా విన్నావా నువ్వు? ఒకసారి శాంతంగా… అపూర్వ నీ తోబుట్టువు అన్న విషయం పక్కన బెట్టి ఆలోచించి చూడు. నీకే అర్థమవుతుంది. నేను నీ బాధ అర్థం చేసుకోగలను. అపూర్వ అంటే నీకు ఎంతో ప్రాణం. బహుశ తనమీది నీ ప్రేమ నిజాన్ని గ్రహించనీయకుండా చేసుండొచ్చు.

          నేను అపూర్వ కేసును లోతుగా స్టడీ చేశాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే. అపూర్వ మర్డర్ చాలా నీట్ గా ప్లాన్ చేసినట్టు అనిపించింది. ఒక్క క్లూ అంటే ఒక్కటి లభించలేదు. కానీ యెంత తెలివిగా చేసినా ఎక్కడో ఒక చోట తప్పు చేయకపోడు. ఏదో ఒకరోజు చేసింది ఎవరో కానీ తప్పక పట్టుబడతాడు” అన్నాడు విష్ణు మూర్తి. 

          ఇంతలో విమల కాఫీ కప్పుతో వస్తూ “ఆ భగవంతుడు మంచి వాళ్ళనే త్వరగా తీసుకెళతాడు” అంది విమల అపూర్వను జ్ఞాపకం చేసుకుంటూ. కాఫీ కప్పును కాత్యాయనికి ఇచ్చి ఆమె పక్కన కూర్చుంది.

          కాత్యాయని మౌనంగా ఉండిపోయింది.

          “మీ అమ్మానాన్నలను తలచుకుంటేనే చాలా బాధగా ఉంది కాత్యా” అంది విమల బాధగా. “వాళ్ళని బాగా చూసుకునే బాధ్యత ఇక నీదే” అంది.

          “అప్పట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అన్నారు, ఏమైనా మంచి సంబంధాలు దొరికాయా కాత్యా” అడిగాడు విష్ణుమూర్తి.

          “ఇప్పుడే చేసుకోవాలని లేదు అంకుల్. మళ్ళీ అపూర్వ ఇలా…. అమ్మానాన్నలకు ఇదే చెప్పా ఇప్పుడు ఈ టాపిక్ వద్దని. వాళ్ళూ నన్ను అర్థం చేసుకున్నారు” అంది కాత్యాయని.

           ‘అలాగా’ అన్నట్టు తలూపి, “విమల… కాస్త చిన్న పనుంది. చూసుకుని వస్తా నేను” అంటూ లేచాడు విష్ణుమూర్తి.

          “అలాగే అన్నయ్య. తొందరగా రా. వైజాగ్ వెళ్ళాలి మనం”

          తలూపి కాత్యాయనికి వెళ్తున్నానని చెప్పి బయటకి వెళ్ళాడు విష్ణుమూర్తి.

          “ఈయన ఉదయం వెళ్ళారు బయటకి, స్టేషనుకు వెళ్ళాలి ఇంకా రాలేదు” భర్తను తలచుకుంటూ అంది విమల.

          కాఫీ తాగి కప్పు పక్కన పెడుతూ “వైజాగ్ ఏంటి అత్తయ్య. ఎవరు వెళుతున్నారు?” అడిగింది కాత్యాయని.

          నిట్టూర్చింది విమల. “నీకు తెలియంది ఏం ఉంది కాత్యా. అపూర్వ దూరం అయిన దగ్గర నుండి వరుణ్ మనిషిలా లేడు. వాడిని చూస్తేనే నాకు భయమేస్తోంది.. .వీడు ఏమైపోతాడా అని. అందుకే మీ మావయ్యకు చెప్పి విష్ణు మూర్తి అన్నయ్యను, అమెరికాలో ఉంటున్న విష్ణుమూర్తి కూతురు శాలినిని పిలిపించా.

          వరుణ్ కి కాస్త ప్లేసు మారినట్టు ఉంటుంది అని అందరమూ  వైజాగ్ లోని మా సొంతూరుకు వెళుతున్నాము. జరిగిపోయిన కాలం తిరిగిరాదు… మనుషులూ రారు. బాధపడుతూ ఉంటే మరణించిన అపూర్వ తిరిగి రాదు కదా. వరుణ్ మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే మేమే ఏదో ఒకటి చేయాలి. అందుకే ఈ యోజన చేసాము” చెప్పింది విమల.

          విమల చెప్పింది విన్నాక కాత్యాయనికి నోట మాట రాలేదు. మౌనంగా ఉండిపోయింది.

          “పిల్లలు చిన్నగ ఉన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు మేము విష్ణుమూర్తి అన్నయ్య కుటుంబం వాళ్ళు పక్కపక్క ఇళ్ళల్లోనే ఉండే వాళ్ళం. శాలినికి చిన్నప్పటి నుండి వాడంటే ఇష్టం. కానీ వాడు అపూర్వని ప్రేమించానని పెళ్ళిచేసుకున్నాడు. మేము కూడా వాడి ఇష్టాన్ని ఇక కాదనలేకపోయాం అపుడు. కానీ ఆ విధి ఇలా చేస్తుందని మేము అస్సలు ఊహించలేదు కాత్యా.

          జరిగిందేదో జరిగిపోయిందని కాలంతో పాటు మనమూ ఇక ముందుకు సాగడం తప్ప ఏం చేయగలం. అందుకే చిన్నప్పటి నుండి వాడిని ఇష్టపడే శాలినిని పిలిపించాం. చెప్పు కాత్యా నేను చేసింది  కరక్టే కదా? అపూర్వ మరణించగానే నా కొడుక్కి ఇంకో పెళ్లి కోసం ఆలోచిస్తున్నానని నువ్వు మాత్రం తిట్టుకోవద్దు. మా వైపు నుండీ ఆలోచించు. మాకు వాడొక్కడే కొడుకు. ఏం చేయమంటావు చెప్పు” అలా అంటూంటే ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

          ‘ఓహో… ఇందుకా వీళ్ళని పిలిపించింది’ అనుకుంది కాత్యాయని.

          కళ్ళు తుడుచుకుని “ఏంటి కాత్య ఏం మాట్లాడవు?” అంది విమల మౌనంగా ఉన్న కాత్యాయనితో.

          “అయితే వైజాగ్ లో పెళ్ళా వరుణ్ కి శాలినితో?”

          “అదేంటి కాత్యా అలా అంటావు? అంత పాపిష్టుల్లాగా కనిపిస్తున్నామా మేము నీకు. మా గురించి నీకు తెలియదా. మేము అపూర్వని అపురూపంగా చూసుకోలేదా చెప్పు. సొంత కూతురుకంటే ఎక్కువ చూసుకున్నాము. జరిగింది తలుచుకుని ఇపుడు జరగాల్సింది మరచిపోతే రేపు నా కొడుకు జీవితం ఎవరు ఆలోచిస్తారు చెప్పు?

          అపూర్వ మరణించి మూన్నెళ్లన్నా కాలేదు అపుడే పెళ్లి ఎలా చేస్తామురా. శాలిని వాడికి మంచి స్నేహితురాలు ఈ సమయంలో అది నాలుగు మాటలు మాట్లాడుతూ పక్కన ఉంటే వాడికి కాస్త తోడున్నట్టూ ఉంటుంది, వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఒక అభిప్రాయము కుదురుతుందని శాలినిని పిలిపించా. అంతే తప్పించి వాళ్లకి ఇప్పుడే పెళ్లి చేయడానికి కాదురా.

          నిజానికి నేను ఇలా పిలిస్తే శాలిని ససేమిరా రానంది. నేను వస్తే అందరు నన్ను తప్పుగా అనుకుంటారు అపూర్వ మరణించగానే వరుణ్ ని మోగుడ్ని చేసుకోడానికి ప్రయత్నిస్తుంది శాలిని అని. నాకు అలా ఇష్టంలేదు అని అంది. కానీ నేనే బలవంతంగా పిలిపించా. వరుణ్ కోసం రమ్మన్నా. ఇప్పుడు తొందరపడకపోతే భవిష్యత్తులో వాడు ఇక పెళ్లి మాట అసలుకే ఎత్తకపోతే ఎలా అని కాత్యా… అందుకే..” అంటూ చెప్పడం ఆపింది.

          ఏం మాట్లాడాలో తెలియలేదు కాత్యాయనికి. అలా అని అవును అని కూడా అనాలనుకోలేదు ఆమె. వరుణ్ తో మాట్లాడటానికి వచ్చాను అన్న విషయం జ్ఞాపకం వచ్చి “వరుణ్ ఎక్కడున్నాడు” అడిగింది.

          “గదిలో ఉన్నాడమ్మ”

          “సరే మాట్లాడి వెళతా” అంటూ లేచింది.

          అది వినగానే టక్కున “వాడిదగ్గర శాలిని ఉంది కాత్యా. నువ్వూ…” వద్దన్నట్టు అభ్యర్తనగా ముఖం పెట్టి అంది విమల.

          ఆమె ఎందుకలా అందో అర్థమయిపోయింది కాత్యాయనికి. “ఓహ్…” అంది నడవబోయిందల్లా ఆగిపోతూ. మా ఇల్లే అని అనుకున్నా.. కానీ అపూర్వ దూరం అయినట్టే ఈ ఇల్లు కూడా పరాయిదే అయిపోయింది అనుకుంది.

          “సరే నేను బయల్దేరతా అత్తయ్య” అంది చేసేదేమీ లేక.

          మొహమాటపడుతూనే తలూపింది విమల సరేనన్నట్టు.

          వెనుదిరిగి గుమ్మం వైపు నడిచింది కాత్యాయని. అప్పుడే తన గదిలో నుండి హాల్లోకి వచ్చిన వరుణ్ కాత్యాయనిని చూసి “కాత్యా… ఎప్పుడొచ్చావ్?” అన్నాడు ఆశ్చర్యంతో.

          ఆ పిలుపుతో ఆగి తలతిప్పి చూసిన ఆమెకి ఎదురుగా వరుణ్, అతని వెనకే వచ్చిన శాలిని కనిపించారు. “నీతో మాట్లాడదామని వచ్చా వరుణ్. నువ్వు శాలినితో మాట్లాడుతున్నావని… వెళుతున్నా” అంది.

          “శాలినితో మాట్లాడితే నువ్వెందుకు వెళ్ళడం?” ఆశ్చర్యంగా అన్నాడు.

          కంగారు పడిపోయింది విమల కాత్యాయని ఏం చెబుతుందోనని.

          విమల ముఖం చూడగానే ఏం జరిగి ఉంటుందో శాలినికి అర్థం అయింది. తాను వరుణ్ తో మాట్లాడుతున్నానని కాత్యను అత్తయ్య రానివ్వలేదు కావచ్చు అని. “హలో కాత్యాయని, ఏంటి ఇది మాత్రం నీ ఇల్లు కాదా ఏంటి. నువ్వు డైరెక్టుగా వచ్చేయచ్చుగా. అపూర్వ ఇపుడు లేనంత మాత్రాన ఈ ఇల్లు, మేము అందరమూ పరాయి వాళ్లము కాదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు మాట్లాడవచ్చు. ఇలాంటి కొత్త మర్యాదలు పెట్టుకోకు. అర్థమయింద” అంటూ కాత్యాయని దగ్గరికి వచ్చి అంది శాలిని.

          “ఎస్. కాత్యా. ఏంటిది కొత్తగా? నువ్వు డైరెక్టుగా రావచ్చు కదా. దా ఏంటి విషయం చెప్పు” అని తన గదిలోకి వెళుతూ రమ్మని సంజ్ఞ చేసాడు వరుణ్. వెళ్ళింది కాత్యాయని.

          హాల్లో… శాలిని, విమలతో “ఎందుకు అత్తయ్య… పాపం కాత్యని పంపలేదు. పాపం ఫీల్ అయిందేమో” అంది.

          “నాకు నా కొడుకు మామూలు అవడం ముఖ్యం శాలిని. నీతో మాట్లాడుతున్నప్పుడు వాడి ముఖం బాధతో నాకు కనిపించదు. అపూర్వ లేదు అన్న బాధ వాడిలో అస్సలు ఉండకూడదు. అందుకే….” అంటూ తరువాత ఇంకేం మాట్లాడలేకపోయింది విమల.

          చిన్నగా నవ్వి “అత్తయ్యా.. నీ మనసు నాకు అర్థమయింది. నువ్వు ఇక వరుణ్ గురించి చింత పెట్టకోకు. వరుణ్ బాధ్యత నాది. ఓకే నా” అంది.

          అది వినగానే విమల కళ్ళు చెమ్మగిల్లాయి ఆనందంతో. శాలినిని హృదయానికి హత్తుకుంది ఆప్యాయంగా.

          గదిలో కాత్యాయనితో “చెప్పు కాత్య. ఏంటి విషయం” అన్నాడు వరుణ్. ఆమె రాకకు కారణం ఏమిటా అని ఆలోచిస్తూ.

          ఇందాక సుజాత ఇంట్లో జరిగిందంతా చెప్పింది కాత్యాయని వరుణ్ తో. “అపూర్వను ఎవరు చంపారో ఎందుకు చంపారో ఏమీ తెలుసుకోలేకపోతున్నా వరుణ్. ఏడుపు వస్తుంది. పోలీసులు ఇన్ని రోజులు అవుతున్నా ఏమీ  తెలుసుకోలేకపోతున్నారు. నాకు పిచ్చెక్కినట్టు ఉంది ఎవరు చేసారో తెలియక. చేసింది ఎవరో తెలిస్తే వాడ్ని నేనే నా చేతులతో చంపుతా” కోపంతో రగిలిపోతూ అంది కాత్యాయని.

          “నువ్వే ఇలా అంటే నా పరిస్థితి ఎవరికీ చెప్పుకోవాలి కాత్యా. రాత్రిళ్ళు నిద్ర రావడంలేదు. కళ్ళు మూసినా తెరిచినా అన్ని అపూర్వ జ్ఞాపకాలే. ఒక్కోసారి నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. కళ్ళు నులుముకుని చూస్తే కనిపించదు. పిచ్చివాడిని అవుతున్నా. ఆ దేవుడు నాకీ శిక్ష ఎందుకు వేసాడో అర్థం కావడం లేదు” అని అంటున్న వరుణ్ కళ్ళలో నుండి కన్నీళ్లు జారాయి దుఃఖంతో.

          వరుణ్ కి ఏం ధైర్యం చెప్పాలో ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు కాత్యాయనికి. అయినా ఆమెనే బాధలో ఉంది ఇక అతన్ని ఎలా ఓదార్చగలదు.

          కళ్ళు తుడుచుకుని “నేను నీ దగ్గరి నుండి వస్తూ ఇన్స్పెక్టర్ ని కలిసాను” అన్నాడు. 

          “ఏమన్నాడు? ఇన్స్పెక్టర్?”

          “అపూర్వ ఫ్రెండ్స్ ని ఎంక్వైరీ చేసారట కాలేజ్ డేస్ ఫ్రెండ్స్ నుండి అందరిని. ఇన్వెస్టిగేషన్ కీలక దశకు వచ్చింది తొందరలోనే హత్య చేసిన వ్యక్తిని పట్టుకుంటాం అని చెప్పాడు”

          “ఫ్రెండ్స్ నా? వాళ్ళని ఎందుకు? అయినా ఏ క్లూ బట్టి చేస్తున్నారు?” ఆశ్చర్యంగా అంది.

          “చెప్పలేం కదా. వాళ్ళు అన్ని ఆంగిల్స్ నుండి చేస్తారు. అదీ కరక్టే కాత్యా. అయిన పోలీసులు చెప్పారు కదా కాత్యా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని. మళ్ళీ నువ్వు ఇవన్నీ చేస్తే ఎలా.. నీకు ఏమన్నా అయితే అపుడు మీ అమ్మానాన్నల పరిస్థితి ఏంటి? అనవసరంగా ఇలా బయట తిరగకు కాత్యా. నువ్వు అపూర్వ మీద ప్రేమతో చేస్తున్నావు నాకు తెలుసు కానీ ఇలా నువ్వు ఒంటరిగా తిరగడం నాకు భయమేస్తోంది. ఒక పని చేయి ఇకనుంచి నువ్వు నేను ప్రతీది ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వు మాత్రం ప్లీజ్ ఒంటరిగా ఎక్కడికీ వెళ్లొద్దు. నాకు ఫోన్ చెయ్ నేనూ వస్తా నీతో”

          చిన్నగా లోలోనే నవ్వుకుంది కాత్యాయని. ఇంకో రెండు మూడు గంటలు అయితే వైజాగ్ వెళ్లిపోతావ్ నాకు ఎలా హెల్ప్ చేయగలవ్ వరుణ్? వరుణ్ కి తెలియదా తానూ వైజాగ్ వెళుతున్నానని? అనుకుని అడిగింది ఇదే ప్రశ్న అతన్ని.

          “వైజాగా నేనా..? అమ్మ చెప్పిందా? కానీ నాతో చెప్పలేదే? అమ్మతో మాట్లాడుతా ఒక్కనిమిషం” అంటూ లేవబోయాడు.

          “ప్లీజ్ వరుణ్. ఏమీ అడగొద్దు. మీ అమ్మనాన్న ఏది చేసినా నీ మంచి కోసమే. వాళ్ళకు తెలియదా ఏది కరక్టో కాదో” అంది కాత్యాయని. విమల చెప్పిందంతా గుర్తొచ్చి.

          “కానీ కాత్యా…” అని అనబోతున్న అతనితో –

          “ఇంకేం మాట్లాడకు వరుణ్. నువ్వు వెళుతున్నావ్ అంతే ఓకేనా”

          నిట్టూరుస్తూ “నువ్వు నాకు చెప్పేంత దానివి ఇంకా కాలేదు కాత్యా. ఇప్పుడు ఏం చేయబోతున్నావ్? నాకు అదయినా చెప్పు?” అన్నాడు. 

          “నా అనుమానం కరక్టే అయితే చంపినా వ్యక్తి సుజాత ఇంట్లోనే దాక్కుని, నువ్వు వెళ్ళిపోగానే కిటికీలోంచి బయటకు వచ్చి అపూర్వను చంపాడేమో అని. నువ్వు ఇది చెప్పు వరుణ్ అపూర్వ హత్యకు గురవకముందు అపూర్వకు సుజాతతో లేదా ఇంకెవరితోనైన ఏవైన గొడవలు జరిగాయా? జ్ఞాపకం తెచ్చుకో?”

          “గొడవలు.. ఊహూ. అలా ఏమి కాలేదు కాత్యా. ఒకవేళ అపూర్వకి ఎవరితోనైనా గొడవ జరిగుంటే నేను ఆఫీసు నుండి రాగానే నాకు అంతా చెబుతుంది. కానీ నాకు అలా ఏమీ చెప్పలేదు”

          “అవునా”

          “ఆ నువ్వు అడుగుతే ఓ విషయం జ్ఞాపకం వచ్చింది. సరిగ్గా అపూర్వ హత్యకు రెండు నెలల ముందు అనుకుంట అపూర్వది ఓ డైమండ్ నెక్లెస్ పోయింది. ఈ విషయం నాతో చాలా బాధపడుతూ చెప్పింది”

          “అవును. నాతో చెప్పింది. పెళ్ళికి వేసుకెళ్ళ, వచ్చాక చూస్తే మెడలో నెక్లెస్ లేదని”. “మీరు అరకు వెళ్ళారు కదా. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందా?” అంది.

          “లేదురా కాత్యా. అలా ఏది జరగలేదు. అరకులో వారం పైనే ఉన్నాము. చాలా ఎంజాయ్ చేసాము” అలా అంటూంటే ఆ రోజులు అతని కళ్ళ ముందు మెదిలాయి. “నాకు తెలియదు కాత్యా తనతో అదే నా చివరి ఎంజాయ్ అవుతుందని. తెలిసుంటే అసలు అరకు నుండి తిరిగి వచ్చే వాళ్ళమే కాదు” బాధగా అన్నాడు.

          “మీరు అరకు నుండి వచ్చాకే ఇలా జరిగింది కదా. మీరిద్దరు అరకు వెళ్ళిన దగ్గరనుండి ఏమేమి జరిగాయో నాకు అన్ని డీటైల్డ్ గా చెప్పు”

          అంతా చెప్పాడు వరుణ్.

*        *        *        *        *        *

          వరుణ్ దగ్గర నుండి నేరుగా ఇంటికి వచ్చిన కాత్యాయని ఆలోచనలో పడింది.

          వరుణ్ ని ముందు అనుమానించాను. కానీ తాను కాదని సీసీటీవి చూసాక అనిపిస్తోంది. వరుణ్ కాదూ అంటే హత్య చేసిన వ్యక్తి వేరే అని అర్థం కదా. మరి ఎవరు అసలు? అపూర్వను చంపేంత కసి ఎవరికి ఉందసలు? అరకు నుండి వచ్చిన మరుసటి రోజే అపూర్వ హత్యకు గురయింది. వారం రోజులుగా వాళ్ళు ఇంట్లోనే లేరు. అంటే హత్య చేసిన వ్యక్తికీ వీళ్ళు అరకు నుండి వచ్చిన సంగతి తెలియగానే ఆ నెక్స్ట్ డే వచ్చి హత్య చేసాడా?

          అపూర్వకి వరుణ్ తో పెళ్ళయి ఏడాది పైనే అవుతుంది. అరకు నుండి వెళ్లి వచ్చిన తరువాతే ఎందుకు హత్యకు గురయింది? అసలు అరకులో ఏదైనా జరిగిందా? కానీ వరుణ్ అక్కడ జరిగిందంతా చెప్పాడు. అనుమానించాల్సినంత ఏదీ జరగలేదు. ఒకవేళ వరుణ్ నాకు చెప్పడం లేదా? అరకు నుండి వచ్చాకే హత్యకు గురయింది కాబాట్టి అరకులో ఎవరైనా అపూర్వకు శత్రువు ఉన్నాడా? అక్కడ అపూర్వను చూసి, వీళ్ళు ఇంటికి వచ్చేయగానే ఇక్కడికి వచ్చి అపూర్వను చంపుంటాడా? అయినా అరకులో అపూర్వ శత్రువు ఉంటే ఏదైనా చేయాలనుకుంటే అక్కడే చేయాలి అలా చేయకుండా ఇంటి దగ్గర ఎందుకు చేస్తాడు? లేక ఇక్కడి వ్యక్తే ఎవరైనా హత్య చేసాడా? అసలు నేను సరిగ్గానే ఆలోచిస్తున్నానా? ఆలోచించేది అంతా కరక్టేనా? అని పరిపరివిధాలుగా ఆలోచిస్తోంది కాత్యాయని.

          అసలు అరకుకు అపూర్వ మరణానికి నిజంగా ఏమైనా సంబంధం ఉందా? ఏమో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ అరకు నుండి వచ్చాకే ఇలా జరిగింది కాబట్టి ఏదైనా ఒక చిన్న లింక్ అన్నా అరకుకు అపూర్వ హత్యకూ సంబంధం ఉందేమో అనిపిస్తుంది. అసలు ఉన్నదీ లేనిది అరకు వెళితే కానీ చెప్పలేం. వరుణ్ అక్కడ అంతా బాగానే గడిచిందని చెప్పాడు. కానీ అతను గమనించనిది ఏదైనా జరిగుండవచ్చు కదా. ఇలాంటివన్నీ అక్కడికి వెళితే కానీ తెలియవు. వాళ్ళు స్టే చేసిన దగ్గర ఇంకెవరైనా వరుణ్ అనే పేరుగల వారు ఉన్నారా అనేది కూడా తెలుసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చింది కాత్యాయని. ఆ మరునాడే ఇంట్లో ఫ్రెండ్ పెళ్ళికి వెళుతున్నాను అని చెప్పి అరకుకు బయలుదేరింది కాత్యాయని.

*        *        *        *        *        *

          అరకు లోయ దగ్గరలో వరుణ్, అపూర్వ బస చేసిన హోటల్లోనే రూమ్ బుక్ చేసుకుని దిగింది కాత్యాయని. అందంగా దాదాపు కలపతో, అంతస్తులు లేకుండా నేలపై నిర్మించిన అందమైన హోటల్ అది. గదిలో సామాను పెట్టి, స్నానం చేసి ఫుడ్ గదిలోకి తెప్పించుకుని తినేసి గార్డెన్ కు వెళ్ళింది. అది సాయంకాల సమయం. చెట్టుకింద బెంచీ మీద వెళ్లి కూర్చుంది.

          అరకుకు వచ్చేసా ఇపుడేం చేయాలి? ఎలా ప్రారభించాలి నా ఇన్వెస్టిగేషన్? అని ఆలోచనలో పడింది. ఏం చేయాలో ఎంతకూ తట్టకపోవడంతో విసుగ్గా తల విదిలించి పక్కకు చూసింది. ఆమెను ఎప్పటి నుంచి చూస్తున్నాడో తెలియదు కానీ ఆ హోటల్ మేనేజర్ చిరునవ్వుతో ఆమెనే పలకరింపుగా చూస్తు కనిపించాడు. పాతికేళ్ళకు అటూ ఇటూ తేడా వయస్సులో అందంగా ఉన్నాడు అతను.

          ‘వీడేంటి నేనేదో వీడికి తెలుసన్నట్టు నవ్వుతూ చూస్తున్నాడు?’ అనుకుని మొహమాటంగానే చిన్నగా నవ్వింది.

          ఆమె నవ్వడమే ఆలస్యమన్నట్టు మొఖమంతా నోరు చేసుకుని “హలో కాత్యాయనిగారు” అంటూ ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు వినీత్ అనే ఆ హోటల్ మేనేజరు.

          ఆ చర్యకు విస్తూబోయింది కాత్యాయని. ఆమె ఊహించలేదు అతను తన పక్కన వచ్చి అలా కూర్చుంటాడని.

(ఇంకా ఉంది)

భాగాలు: 1234567