జ్వాలముఖి – భాగం – 3

జ్వాలముఖి - భాగం - 3

          గొరరియ రాజుకి యుద్ధం గురించి సందేశం పంపిస్తాడు. విక్రమాదిత్య, వీరుడితో కలిసి యుద్ధసన్నాహాలు చేస్తున్నారని తెలుసుకుంటాడు రాజు. ఆ వీరుడు గురించి తెలుసుకోమని సైన్యాన్ని ఆజ్ఞపిస్తాడు గొరరియ రాజు. దానికి చంద్రాదిత్య-“ఆ వీరుడు గురించి నేను విన్నాను. చాల యుద్ధాల్లో పాల్గోని ఎందరో రాజులని, సైన్యాన్ని మట్టికరిపించారు. ధైర్యానికి పెట్టింది పేరని విన్నానని” చెప్తాడు. ఎలా అయినా యుద్ధంలో గెలవాలని దానికి కావాలిసిన ఏర్పాట్లు చేయమని చంద్రాదిత్యకి చెప్తాడు మహారాజు. మరోవైపు చంద్రాదిత్య గురించి విక్రమాదిత్య ప్రణవ్ సింహా రాజుకి అతను వీరుడని జాగ్రత్తగా మెలగాలని చెప్తాడు.

          చంద్రాదిత్యకి ఆ పటం ఎక్కడుందో అర్థమవదు. ఆ పూజ మందిరం వైపు వెళ్ళే ప్రయత్నం చెస్తాడు కాని విఫలం అవుతాడు. యుద్ధం రోజు రాజావారిని, సైన్యాన్ని తప్పించుకుని వచ్చి ఆ పూజ మందిరం వైపు వెళ్ళాలనుకుంటాడు. యుద్ధం ప్రకటించిన రోజు రానే వస్తుంది. ఉదయము నుండి రాజుతోనే ఉంటాడు చంద్రాదిత్య. వివిధ ఆయుధాలు సేకరిస్తా ఉంటాడు. ఖడ్గం అన్నింటికి సాన పెడతారు. రాజు గారు యుద్ధ భూమికి బయలుదేరేముందు, వివిధ ఆయుధాలు ధరిస్తారు. ఇక బయలుదేరబోయె ముందు, వారి తండ్రిగారి విగ్రహం వద్దకు వెళ్ళి వినమ్రంగా నమస్కరించి ఆ విగ్రహానికి ఉన్న ఖడ్గం ధరిస్తారు. ఆ ఖడ్గం చాలా వింతగా చేయించి ఉంటుంది. వారి తండ్రిగారి హయాంలో ఆయన ఎటువంటి యుద్ధం అయిన  ఆ ఖడ్గంతోనే చేసేవారు. ఆయన వీరపరాక్రమానికి గుర్తుగా ఒక మహర్షి దీవించి ఆ ఖడ్గం ప్రసాదించారట. ఆ ఖడ్గం యొక్క పిడి బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంటుంది. ఆ రాజ్యంలో ఉన్న ఆయుధాలలో ఆ ఖడ్గమే రాజు గారి తండ్రిగారికి అత్యంత ప్రియమైనదని ఆ ఖడ్గం ధరిస్తే అదృష్టం సొంతమౌతుందని వారి నమ్మకం. అందుకే వారి విగ్రహం దగ్గరే ఆ ఖడ్గం కొలువుంచుతారు. ఏదైనా యుద్ధాలు ప్రకటిస్తే అప్పుడు ఆ ఖడ్గం ధరిస్తారు రాజుగారు.

          వారి తండ్రిగారి ఆశీర్వాదం తీసుకుని ఆ ఖడ్గం ధరించి యుద్ధభూమికి బయలుదేరుతారు రాజుగారు. మార్గమధ్యలో రాజుగారిని తప్పించుకొని వెళ్ళి మందిరంలో వెతుకుదామనుకొంటాడు చంద్రాదిత్య కాని ఒకసారి రాజుగారిని ఆ పటం గురించి అడగడం మంచిదని నిర్ణయించుకుని ఇలా అడుగుతాడు – “రాజావారు ఏదో పటం కోసం ఈ యుద్ధం ప్రకటించారు కదా మరి ఆ చిత్ర పటం జాగ్రత్తపరిచారా అని అనుమానం వచ్చింది” దానికి రాజు భద్రంగా తన దగ్గరే ఉంది అని చెప్తాడు. దానికి కంగుతింటాడు చంద్రాదిత్య. “యుద్ధం ప్రకటించగానే ఆ పటం గురించి అడిగినప్పుడు పటం జాగ్రత్తగా దాచానని చెప్తాడు రాజు.

          ఒకసారి ఆ పటం జాగ్రత్తగా  దాచారెమో చూడమని రాజుకి చెప్పినప్పుడు మందిరం వైపు వెళ్ళాడు. ఇవాళ ఉదయం నుండి రాజుతోనే ఉన్నాను మందిరం వైపు వెళ్ళలేదు మరి పటం తన దగ్గర ఉంది అంటారేంటి” అని ఆలోచనలో పడతాడు చంద్రాదిత్య. ఉదయము నుండి రాజుగారిలో వచ్చిన మార్పు గురించి ఆలోచిస్తుంటాడు. యుద్ధభూమికి బయలుదేరేముందు రాజుగారు వారి తండ్రి గారిని నమస్కరించి ఆయన గారి ఖడ్గం ధరించారు. అది తప్ప రాజుగారిలో ఉదయము నుండి ఏ మార్పు రాలేదు.  అంటే ఆ పటం ఆ ఖడ్గంలోనే దాచి ఉండాలి. కాని అన్ని ఆయుధాలలో ఎలా ఆ ఖడ్గం గుర్తుపట్టడం? ఆ ఖడ్గం పిడి బంగారు వర్ణంలో ధగధగ మెరుస్తు ఉంటుంది- అదే గుర్తు.

          రాజు దగ్గరి నుండి ఆ ఖడ్గం తస్కరించాలని ఆలోచిస్తుంటాడు. ఇంకోవైపు గులకమలె రాజు యుద్ధం ప్రకటించాడు కాని మనసులో ఏదో అందోళన చెందుతూ ఉంటాడు. యుద్ధ బాధ్యతలు విక్రమాదిత్యకి అప్పజెప్పి ఇలా చెప్తాడు-“విక్రమాదిత్య యుద్ధ ఫలితం ఎలా ఉంటుందో తెలీదు కాని ఆ పటం మాత్రం ఆ రాజు చేతికి చిక్కకూడదు. నీవు వచ్చినప్పుడు నీతో చెప్పాను, సమయం వచ్చినప్పుడు ఆ పటం నీ చేతిలో పెడతాను దాన్ని రక్షించే భాధ్యత తమరిదే అని చెప్పాను. ఇప్పుడు ఆ సమయం వచ్చినది ఆ పటం ఎక్కడ ఉంది అన్న విషయం తమరికి చెబుతాను దాన్ని కాపాడండి” అని చెప్తారు రాజుగారు.

          “అలాగే ఆ పటం ఎక్కడ ఉందో సెలవివ్వండి” అని అంటాడు విక్రమాదిత్య. మన రాజకోట పైన ఒక గోపురం మీదా మన రాజ్యానికి గుర్తు అయిన సింహం నోట్లో భద్రపరిచాను అని చెప్తాడు రాజు. అందుకే రాజ్యంలో, రాజకోటలో ఎక్కడ వెతికినా దొరకలేదనుకొంటాడు విక్రమాదిత్య. యుద్ధ భూమికి బయలుదేరే ముందే ఆ పటం తస్కరిస్తాడు విక్రమాదిత్య. అటుపిమ్మట రాజూగారితో యుద్ధభూమికి బయలుదేరుతు విక్రమాదిత్య రాజు గారి తో ఇలాగ అంటాడు-” ఆ పటం నా దగ్గర ఉండటం కంటే ఇప్పుడు భద్రపరిచి పెట్టిన స్థలంలోనే పెట్టేడం మంచిది, అక్కడ ఉన్నది అని ఎవరికి అనుమానం రాదు ఎందుకంటే ఒకవేళ నేను మిమల్న్ని కాపాడే సమయంలో దురదృష్టవషాత్తు మరణించిన లేకపోతె వాళ్ళకి దొరికిన దానిని నా దగ్గర నుంచి బలవంతంగా తీసుకుంటారు” అని చెప్పి యుద్ధానికి బయలుదెరుతారు.

             యుద్ధం భీకరంగా సాగుతూ ఉంటుంది. ఎందరో సైనికులు ప్రాణాలు వదులుతారు.

          ఇంతలో చంద్రాదిత్య రాజు దగ్గరి నుండి ఖడ్గం తస్కరిస్తాడు. యుద్ధం ముగిసే సమయానికి ఆ ఖడ్గం నుండి పటం తస్కరించి మళ్ళీ ఆ ఖడ్గంని రాజు దగ్గర వదిలేస్తాడు. మళ్ళీ రాజు ఆ పటం కోసం ఖడ్గం వెతికితే అనుమానం వస్తుంది అని రాజుని  చంపుదాము అనుకుంటాడు కాని మనసు అంగీకరించదు అందుకని వెనుక నుంచి తల మీదా బలంగా కొడుతాడు. మళ్ళీ రాజుకి మెలుకువ వచ్చేసరికి ఆ రాజ్యాన్ని వదిలి వెల్లిపోతాను కాబట్టి ఏమి అపాయం లేదనుకుంటాడు చంద్రాదిత్య. ముగిసిపోయింది అనుకునే సమయానికి రాజులు కొంతమంది సైన్యం మాత్రం మిగులుతారు.  చంద్రాదిత్య , విక్రమాదిత్య కోసం అందరూ వెతుకుతారు. యుద్ధ భూమి మొత్తం రక్తసిక్తమౌతుంది. రక్తం ఏరులై పారుతుంది. ఆ యుద్ధంలో వీళ్లిద్దరు కూడా మరణించి ఉంటారు అనుకొంటారు అందరూ. ఇకా గులకమలె రాజ్యానికి చెందిన ప్రణవ్ సింహా రాజు గాయాలతో కుప్పకూలిపోయిన అగ్నిప్రవ రాజు పై యుద్ధం చేసి గెలవటం అది ఒక గెలుపు కాదు అని కాని ఆ పటంని దక్కించుకోవడం కోసం మళ్ళీ వస్తాను అని హచ్చరించి, కాపాడే పనిలో తన ప్రాణాలు పోగొట్టుకున్న విక్రమాదిత్యని తలచుకుని భాదపడతూ రాజ్యం వైపు ప్రయణం సాగిస్త్తాడు. అగ్నిప్రవ రాజుకి తలకి బాగ గాయం అవటం చూసిన సైనికులు అతనని రాజకోటకి తరలిస్తారు మరియు రాజుగారి ఖడ్గంని యధావిధిగా వారి తండ్రిగారి విగ్రహానికి అలంకరిస్తారు.

          ఇక ఆ పటాలను తస్కరించాక అవి తీసుకుని రాజ్యంవైపు అడుగులు వేశారు. పటాలు తీసుకువచ్చినందుకు రాణి వారు సంతోషితులౌతారు. వారిద్దరిని ఘనంగా సత్కరిస్తుంది మహారాణి. ఆ తరువాత ఆ పటాలు ఋషి పుంగవుడికి సమర్పిస్తుంది రాణి. ఋషి వారు సంభ్రమాశ్చర్యాలకి గురౌతారు. ఆ సంతోషం నుంచి తేరుకుని ఆ పటం చూపిస్తు ఆ గుహ సముద్ర గర్భంలో ఎక్కడుందో చెప్తు, ఆ ప్రయాణం ఎంత కష్టమైనదో మన అందరం  ఊహించగలము అని కాని ఆ మహా శివుడి యొక్క నామం జపిస్తు ఆ విశ్వెశురిడి  మీద భారం వదిలి వేయాలి అని వివరణ ఇస్తాడు.  తరువాత ఇంకో పటం కేసి చూస్తు అక్కడి సంకేతాలను చూపిస్తు గుహలోకి ఎలా వెళ్ళాలో చెబుతాడు ఋషివర్యులు మహారాణికి.

          మంత్రం గల లేఖను రాణి వారికి ఇస్తాడు ఋషి. గుహలోనికి ప్రవేశించిన పిమ్మట ఆ శక్తి విగ్రహం ముందు నిలబడి ధ్యానంలో మంత్రం చదవాలి. అది పూర్తవగానే  ఆ పేటికలో నుండి జ్వాలముఖి మణి బయటికి వచ్చి మహాశక్తి ఆకారంలోకి మారుతుంది. మళ్ళీ అదే మంత్రం ఉచ్ఛరించాలి. అలా కాని పక్షంలో, మరచి ఆ జ్వాలముఖి మణి ని శక్తి ఆకారంలోనే తాకాలి అని ప్రయత్నిస్తే, ఆ శక్తి స్వరూపం అగ్నిరూపం దాల్చి, భయంకరమైన అగ్నికణలను వెదజల్లుతుంది. అతి పెద్ద ప్రళయం సంభవిస్తుంది. కావున జాగ్రత్త అని హెచ్చరిస్తారు ఋషివర్యులు.

          మకర సంక్రాంతి పర్వదినం సమీస్తుంది. కావున ఋషి ఆశీస్సులు అందుకుని పటం నిర్దేశిస్తున్న వైపు పయనం అవుతుంది. మార్గమద్యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటుంది. అన్ని దాటుకుని అడవులు, కౄరమృగాలు ఎదురౌతాయి. కాని తన గమ్యం ముందు అవన్ని చాల చిన్నగా అనిపిస్తాయి రాణిగారికి. ఎట్టకేలకు అన్ని కష్టాలు అధిగమిస్తు ఆ జలగర్భంలోని గుహకి చేరుకుంటుంది. ఆ గుహ పైన చాల సంకేతాలు ఉంటాయి. మరో పటం ఆధారంతో ఆ సంకేతాలన్ని ఛేదిస్తూ గుహలోనికి ప్రవేశిస్తుంది మహారాణి. లోపలకి ప్రవేశించగానే ఋషివర్యులు చెప్పినమాదిరిగా మహాశక్తి విగ్రహం దేదీప్యమానంగా ప్రకాశిస్తు కాంతులు వెదజల్లుతుంది. ఆ శక్తి స్వరూపం ముందు ఉన్న కొలనులో ఒక తామర పువ్వు ఉంది. సూర్యాస్తమ  సమయం అవగానే మకర జ్యోతి దర్శనమిచ్చే ముహుర్తాన మంత్రం ఉచ్ఛరిస్తుంది రాణి. మంత్రం పూర్తవగానే జ్యోతులు వెదజల్లుతూ ఆ పేటిక నుండి ఆ జ్వాలముఖి మణి బయటికి వచ్చి నీలం రంగులోకి ఆ మహాశక్తి ఆకారంలోకి మారుతుంది. అది చూసిన రాణిగారు సంభ్రమాశ్చర్యాలకి గురౌతారు.

          మహాశక్తి ఆ దివిలో స్వేత వర్ణంలో ప్రకాశిస్తూ అశేష పూజలు అందుకొంటుంది. ఆ మైమరపులో మంత్రం చదవడం మరచిపోతుంది. తేరుకుని ఋషి చెప్పిన ప్రళయం ఙ్ణాపకం వచ్చి అదే మంత్రం మళ్ళి జపిస్తుంది. అవగానే ఆశక్తి స్వరూపంలో ఉన్న ఆ జ్వాలముఖి మణి దివ్య ఆకారం నుండి మరల యధావిదిగా మారి ఆ పేటికలో చేరుతుంది. అదంతా తిలకిస్తున్న రాణి గారికి అదంతా కలా నిజమా లేదా మాయ అన్నది అర్ధమవదు. ఋషి పుంగవుడు చెప్పిన మాటలు గుర్తు వస్తాయి- “మకర జ్యోతి దర్శనిమిచ్చి కనుమరుగైన నిమిషం ఆ గుహ ద్వారం దానంతట అదే మూసివేయబడుతుంది. మళ్ళీ మకర జ్యోతి దర్శనం రోజే ఆ మంత్రం పని చేసి ఆ ద్వారం తెరుచుకుంటుంది. కావున త్వరగా ఆ జ్వాలముఖి మణి తీసుకొని బయటపడాలి” అని వెంటనే రాణి వారు ఆ శక్తి విగ్రహానికి నమస్కరించి ఆ జ్వాలముఖి మణి పేటిక తీసుకొని  బయటకి వచ్చిన మరు క్షణమే ఆ గుహ ద్వారం ముసివేయబడుతుంది. 

          రాణీ వారు ఆ జ్వాలముఖి మణి గ్రహించి రాజ్యానికి పయణమవుతారు. మహారాణి వారు ఆ జ్వాలముఖి మణిని తీసుకురావడం చూసి ఆశ్చర్యపోతారు  ఋషివర్యులు. ఆ దైవ స్వరూపమైన జ్వాలముఖి మణి కి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. 15 దినములు నిష్టతో ఉండి శక్తి స్వరూపమైన ఉమాదేవిని(పార్వతిదేవి) భక్తిగా కొలుస్తారు. రాణీవారు ఆ 15 దినమూలు అంత నిష్టగా పూజలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్ధమవక ఋషిని అడుగుతుంది. అప్పుడు ఋషి- కారణం లేకపోలేదమ్మ- అని తానెందుకు అన్ని పూజలు నిర్వహిస్తున్నానో వివరిస్తాడు.

          తరువాత ఆ జ్వాలముఖి మణి యొక్క మహిమ వివరిస్తారు.- ” మీ జన్మ పుణీతమైనది. మకర జ్యోతి దర్శనమిచ్చి పుణ్య ముహూర్తాన మంత్రం ఉచ్ఛరించావు కావున ఈ జ్వాలముఖి మణి కి ధైవత్వం అమరినది. కావున నీకు ఆపద వాటిల్లబోయె ముందు ఈ జ్వాలముఖి మణి నుంచి  ఓం కార నాదం సంకేతంలా వినిపిస్తుంది. ఆ క్షణాన మంత్రం పఠిస్తే ఆ జ్వాలముఖి మణి నీలం రంగులోకి మారి మహాశక్తి ఆకారం దాలుస్తుంది. ఆ ఆకారం యొక్క ప్రతిబింబంలో నీకు రాబోయె ఆపద జరగబోయె పరిణామాలు కనిపిస్తాయి. అప్పుడు నీకు నువ్వు తీసుకొవలిసిన జాగ్రత్తలు తెలుస్తాయి. ఏ రాజు అయిన యుద్ధం ప్రకటిస్తే ఎటువైపు దాడి చేస్తారు అన్నది చూపెడుతుంది. దానికనుగుణంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తాయి. ఒక్క మాటలో చెప్పలంటె విశ్వంలో జరగబోయె ప్రతి విషయం గురించి తెలుసుకోవొచ్చు, అది ఎవరి దగ్గర ఉంటె వాళ్ళకి అపజయం ఉండదు. శివుడే రక్షక భటుడు అయ్యి అనుక్షణం కాపాడుతు ఉంటాడు. తరువాత మళ్ళీ అదే మంత్రం జపిస్తే మరల ఆ జ్వాలముఖి మణి ఆకారంలోకి  వస్తుంది. ఎల్లప్పుడు ఈ జ్వాలముఖి మణి నీటిలోనే ఉండాలి. అప్పుడే నీవు జపించిన మంత్రం ఫలిస్తుంది” అని వివరిస్తాడు ఋషి.

          మరియు 15 రోజులు విశేష పూజలు చేయించింది ఎందుకంటే ఈ జ్వాలముఖి మణి నీకు దూరమైన మరుక్షణం నీవు మరణిస్తావు. అలాగ జరిగిన పక్షాన నీకు మరో జన్మ ఉంటుంది. ఆ జన్మ లో మళ్ళీ ఆ జ్వాలముఖి మణి ని నువ్వే నీ చేతులతో మహాశక్తి దగ్గరికి చేరుస్తావు. అది ఎలాగా అన్నది నీకు కాలమే చెప్పిద్ది- అని చెప్తాడు ఋషి. రోజులు గడుస్తుంటాయి. ఆ జ్వాలముఖి మణి ప్రభావం వల్ల ఆ రాజ్యపు పూర్వవైభవం మళ్ళీ వస్తుంది. లక్ష్మీ దేవి మరల తాండవమాడుతుంది. అనతి కాలంలోనే కుముది రాజ్యం గురించి అంతట ప్రచారమవుతుంది. ఈ ప్రచారం గొరరియ, గులకమలె రాజ్యాలో కూడా చేరుతుంది . రాజులకి అనుమానం వస్తుంది. మూడు మాసాల క్రితం వరకు విజయలక్ష్మీ దేవి కటాక్షం లేని రాజ్యం, నిర్విర్యమైన రాజ్యం ఇంతలా ఎలా పుంజుకొస్తుంది అని వెంటనే తమ తమ గూఢాచారులను పంపి విషయం కనుక్కోవాలని ఆఙ్ణాపిస్తారు. గుఢాచారులు కుముది రాజ్యంకి వెళ్ళి జరిగింది అంత తెలుసుకొని మొత్తం సమాచారం అంత రాజులకి చేరుస్తారు. అది విన్న రాజులు నిర్ఘాంతపోతారు. వెంటనే తమ తమ పటాలు ఉన్నయో లేదో చూస్తారు. అవి కనపడకపోయెసరికి జరిగిన మోసం అర్ధమై కోపోద్రిక్తులవుతారు. ఎలా అయినా ఆ జ్వాలముఖి మణి ఆ రాజ్యం నుండి తస్కరించాలనుకుంటారు.

(ఇంకా ఉంది)

భాగాలు: 1234