Gangaa – Part 43

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

ఆ రోజు ఆదివారం. సుప్రియ నా దగ్గరకు వచ్చింది. ఒక కాంట, పది పైసల బిళ్ళ నాకు చూపించింది.

నేను, ‘ఎందుకు చూపిస్తున్నవ్’ అన్న.

సుప్రియ, ‘మా అన్న ఇంక వాళ్ళ క్లాస్ పిల్లగాడు, రైలు పట్ట మీద చెరొక కాంట పెట్టిండ్రంట. రైలు, పట్టల మీద నుండి పోయిన తర్వాత, వాళ్ళు పోయి కాంటలను తీసుకున్నరు. అవి కత్తులలెక్క అయినయ్. మా ఇంట్ల అందరికీ చూపిచ్చిండ్రు. నాకు ఇయ్యుమని అడిగితే నాకు ఇయ్యలేదు. నా కాంటను నేను తీసుకొని పోయి రైలు పట్ట మీద పెట్టి కత్తిలెక్క చేసుకుంట అని ఈ కాంట, పది పైసలు తెచ్చుకున్న. నువ్ కూడా ఒక కాంట, ఒక పది పైసలు తీసుకొనిరా. ఇద్దరం రైలు పట్టల దగ్గరకి పోయి కత్తులు చేసుకొని వద్దం.’ అన్నది.

నేను, ‘నా దగ్గర కాంట ఒక్కటే ఉన్నది, పైసలు లేవు.’ అన్న.

సుప్రియ, ‘మీ ఇంట్ల ఓళ్ళనన్న అడుగు.. ఇస్తరు’ అన్నది.

‘నేనెప్పుడు అడగలేదు, అడిగిన వాళ్లివ్వరు’ అన్న.

సుప్రియ, ‘అయితే ఆయి(నానమ్మ)ని అడుగుదం, ఇస్తది.. దా’ అని ఆయి(నానమ్మ) దగ్గరికి తీస్కుపోయింది. ‘ఆయి(నానమ్మ) నాకు మా అమ్మ పది పైసలు ఇచ్చింది. నేను బింగిరి కొనుక్కుంట. పాపం గంగకి బింగిరి కొనుక్కోదందుకు పైసలు లేవు. గంగకు పది పైసలు ఇయ్యు ఆయి(నానమ్మ)’ అడిగింది. సుప్రియ అడగంగానే వాళ్ల నానమ్మ బొడ్డు దగ్గర చెక్కుకున్న సంచి తీసి, దాంట్లో నుండి పది పైసలు ఇచ్చింది.

మేము మధ్యాహ్నం రైలు పట్టల దగ్గరకి వెళ్లినం. మాల్ గాడి(గూడ్స్ రైల్) పన్నెండు గంటలకు వస్తది. మాల్ గాడి బాగా దూరం ఉన్నప్పుడు హారన్ వేసింది. హారన్ వినిపించింది కానీ రైలు కనిపించలేదు.

సుప్రియ, ‘అబ్బ.. రైలు వస్తుంది. జల్ది పోయి, రైలు పట్ట మీద కాంట, పది పైసలు పెట్టి వద్దం’ అన్నది.

ఇద్దరం పోయి కాంట, పది పైసలు రైలు పట్ట మీద ఇద్దరివి దూరం దూరం పెట్టినం. రైలు పట్టల దగ్గర నుండి ఉరికిపోయి బాగా దూరం నిల్చున్నం. కొంచం సేపటికి రైలు పోయింది. రైలు పోయిన తర్వాత ఉరుక్కుంటు పోయి ఎవరి కాంట, పది పైసలు వాళ్ళం తీసుకున్నం.

కాంట చాకులాగ ఏమి కాలేదు. కాంట షేపులోనే బద్దలెక్కల అయ్యింది. నేను సుప్రియతో, ‘కత్తిలెక్కల అయితది అన్నవ్.. ఇదేంది బద్దలెక్కలైంది?’ అన్న.

సుప్రియ, ‘ఇదే కత్తి. మా అన్నది కూడా ఇట్లనే అయింది. దా పోదాం.’ అన్నది.

ఇద్దరం వచ్చేసినం.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45