Gangaa – Part 41

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

బతుకమ్మ పండుగు వచ్చింది.

మడికెట్ల నరుసువాయి నన్ను మస్కున ( తెల్లవారక ముందు) నిద్ర లేపింది.

వాకిళ్ళు అన్నీ నూకి (ఊడ్చి), అలుకు(సాంపు) చల్లి ముగ్గులెయ్యుమన్నది.

ఇంకా కడపలన్నీ కడిగి, ముగ్గులు వేసి పసుపు కుంకుమ పెట్టుమన్నది.

ఆమె చెప్పిన అన్ని పనులు చేసేసరికి ప్రొద్దున పది గంటలు అయింది.

అప్పుడు మొహం కడుక్కున్న. నాకు చాయి కూడా పోయలేదు.

బాగా చలి పెట్టింది.

మడికెట్ల నరుసువాయి పెద్ద కూతురు విషమ్మ, ‘ ఏయ్ గంగా.. ఇటురా’ అన్నది.

నేను ఆమె దగ్గరికి వెళ్ళిన.

ఆమె, ‘రైలు పట్టల దగర పెద్ద మల్లె చెట్లు ఉన్నయ్. పువ్వులు ఏరుకురాపో’ అని ఒక గుల్ల ఇచ్చింది.

నేను ఆ గుల్ల తీసుకొని పోతున్న. సుప్రియ నాకు కలిసింది, ‘ఎటుపోతున్నవబ్బా..’ అని అడిగింది.

‘మల్లె పూలు ఎరుకురాన పోతున్న’ అన్న.

సుప్రియ, ‘నేను కూడా వస్తా అబ్బా.. ఉండు, నేను మా ఇంటికి వెళ్ళి గుల్ల తెచ్చుకుంట..’ అని వెళ్ళింది.

గుల్ల తీసుకొని వచ్చింది. ఇద్దరం వెళ్లినం.

రైలు పట్టలకు, అవతలి వైపు, తోక మల్లె చెట్లు రెండు, వేప చెట్ల లాగ పెద్దగ ఉన్నయ్.

మేము చెట్ల కిందికి వెళ్లినం. కింద రాలిన పూలు బాగా ఉన్నయ్. ఇద్దరం పూలను ఎరుకున్నం.

పూలను గుల్లలల్ల తీసుకొని ఇంటికి వచ్చినం. సుప్రియ వాళ్ళింటికి వెళ్ళింది. నేను వీళ్ళ ఇంటికి వెళ్ళిన.

నేను వెళ్ళేసరికి, మడికెట్ల నరుసువాయి బిడ్డలు విషమ్మ, సుబ్బమ్మ, కంటమ్మ ముగ్గురు అన్నం తింటున్నరు.

నేను వాళ్ళ దగ్గరకు వెళ్లలేదు. విషమ్మకి గుల్ల అక్కడ పెట్టిన అని చెప్పి, బయట వచ్చి కూర్చున్న.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45