Gangaa – Part 42

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

ఒకరోజు స్కూల్ బందు ఉంది. మద్యాహ్నం పన్నెండు గంటలకు సుప్రియ నా దగ్గరకు వచ్చింది.

సుప్రియ, ‘గంగా.. గాడ జామచెట్టు ఉన్నది, అందరు జామపండ్లు తెంపుకుపోతున్నరు.. మనం కూడా తెచ్చుకుందమా?’ అన్నది.

‘సరే’ అన్న.

‘దా.. పోదాం’ అన్నది.

ఇద్దరం వెళ్లినం. సుప్రియ నన్ను పాడుబడ్డ ఇంటికి తీసుకెళ్లింది. ఆ ఇంటి పెరట్లో ఉన్న జామ చెట్టుని చూపించింది.

నేను ఇల్లును చూడగానే, ‘వద్దబ్బా ఇంటికి వెళ్లిపోదాం, అందరు ఈ ఇంట్లో దయ్యాలు ఉన్నయ్ అంటరు’ అన్న.

సుప్రియ, ‘ఏం.. లేవు. మా ఇంటి పక్కోళ్ళు తెచ్చుకున్నరు. దెయ్యాల్లేవ్ ఏం లెవ్, దా పోదాం.. మనం కూడా తెచ్చుకుందం’ అన్నది.

ఆ ఇంటి పెరడు చుట్టూ కంప నాటిండ్రు. ‘ఎట్ల లోపలికి పోతరు?’ అన్న సుప్రియతో.

సుప్రియ, ‘వాళ్ళు కంపకి ఒక పొక్క చేసి, ఆ పొక్కల నుండి లోపలికి పోయి.. జామపండ్లు తెచ్చుకున్నరట. నాకు చెప్పిండ్రు’ అన్నది.

కంప మొత్తం చూసినం. కంపకు ఒక దగ్గర పందులు, కుక్కలు దూరే అంతా ఒక పొక్క కన్పించింది.

సుప్రియ, ‘ఇదే పొక్క అబ్బా’ అని చూపించి, ‘నడు ఆ పొక్కలో నుండి పోదాం’ అన్నది.

సుప్రియ అంబాడుకుంటూ ఆ పొక్కలో నుండి లోపలికి పోయింది. తర్వాత నేను కూడా అంబాడుకుంటూ పొక్కలో నుండి లోపలికి పోయిన. చెట్టుని చూసినం. దానికి జామకాయలు, జామపండ్లు బాగా ఉన్నయ్.

చెట్టుకు, కింది నుండే కొమ్మలు ఉన్నయ్. చెట్టును ఎక్కచ్చు. సుప్రియ చెట్టెక్కింది. తర్వాత నేను చెట్టెక్కిన. ఎవరికి నచ్చిన పండ్లను వాళ్ళం తెంపుకున్నం. ఆ పండ్లను లంగలో పోసుకొని, పండ్లు పడిపోకుండా లంగను పట్టుకొని, చెట్టు దిగినం.

మేము చెట్టు మీద ఉన్నప్పుడు, మమ్మల్ని ఎవరో చూసిండ్రు. మేము చెట్టు దిగిన తర్వాత, కంప దగ్గర బయట నుండి ఎవరో, ‘లోపల ఎవరు? నేను జామ చెట్టు వాళ్ళకు చెప్తా. ఎవరు మీరు?’ అన్నడు.

మేము భయంపట్టి, ఇద్దరం పండ్లను చెట్టు దగ్గరనే పడేసినం. ‘ఎట్లనబ్బా’ అని అనుకున్నం.

అతను, ‘బయటకు రండ్రి’ అన్నడు.

మేం భయంపట్టి బయటకెళ్లలేదు.

అతను, ‘దాంట్లో పెద్ద పెద్ద పాములున్నయ్. నేనెమన బయటకు రండ్రి’ అన్నడు.

నువ్ ముందుపో.. నువ్ ముందుపో అని ఒకరికొకరం అనుకున్నం.

సుప్రియ, ‘నేను పోను అని’ గోడకు అతుక్కొని నిల్చున్నది.

అతను, ‘కొట్లాడుకోకుండ్రి, మిమ్మల్నేమి అన.. జామచెట్టోళ్ళకి చెప్ప, బైటకి రండ్రి’ అన్నడు.

నేనే ముందు అంబాడుకుంటూ ఆ పొక్కలో నుండి బయటకు వచ్చిన. తర్వాత సుప్రియ అంబాడుకుంటూ పొక్కలో నుండి బయటకు వచ్చింది. ఇద్దరం నిల్చున్నం.

అతను, ‘పండ్లెవ్వి?’ అడిగిండు.

మేము, ‘చెట్టు దగ్గరనే పడేసినం’ అన్నం.

అతను, ‘మీ ఇంటికి పొండ్రి. ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకుండ్రి. ఈ ఇంట్లో దెయ్యాలు, పెద్ద పెద్ద పాములు ఉన్నయ్.’ చెప్పిండు.

మేము, ‘సరే రాము’ అన్నం.

మేము అక్కడి నుండి వెళ్లిపోయినం.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45