సాహిత్యం – కవిత

శబ్దం నుంచి జనించె అక్షరం

అది మానవ జాతికి వరం

గళం నుంచి పుట్టింది పదం

అదే జానపదం

గిరిజనుల నోళ్ళల్లో

జానపదుల పదాల్లో

పల్లెవాసుల తిరునాళ్ళలో

వెల్లి విరిసె జాన పదాలు

అవి జ్ఞాన పథాలు

రామాయణ మహాభారతాలు

కవుల కలాల నుంచి వెలువడిన

కావ్యాలు, పద్యాలు, శతకాలు

మానవాళిని ధర్మం, న్యాయం, నీతి 

జ్ఞాన పథాన నడిపించే నవ వేదాలు

కాల పరీక్షకు తట్టుకున్న పరమార్థాలు

ఏ నాటికైనా ఈ నాటికైనా జనులకు

నీతిని బోధించే జీవిత సత్యాలు

స్వాతంత్ర్య సమర కాలంలో

కవులు లిఖించిన గీతాలు

దేశ భక్తులలో నింపే జాతీయ వాదం

సాహిత్యం సదా జాతిహితం

సమాజ వికాసమే  అభిమతం