గోలకొండ పత్రిక – కథ రెవికల గుడ్డ – సమీక్ష

గోలకొండ పత్రిక - కథ రెవికల గుడ్డ - సమీక్ష

          1926లో సురవరం ప్రతాప రెడ్డి గారి సంపాదకత్వములో ద్వైవార పత్రికగా  ప్రారంభమైన “గోలకొండ పత్రిక” తెలంగాణలో సాహితి, సాంస్కృతిక చైతన్యాన్నిప్రజలలో పురికొల్పటంలో ప్రధాన పాత్ర వహించింది. ఈ పత్రికలో రైతులకు ఉపయోగపడే అంశాలతో పాటు సాహిత్యము, గ్రంథాలయ  ఉద్యమము, సంఘ సంస్కరణ, మహిళాభివృద్ధి, కుల సంఘాల వికాసము వంటి అంశాలపై విరివిగా వ్యాసాలు, వార్తలు ప్రచురితము అయ్యేవి. ఈపత్రిక నిజాం రాష్ట్రములోని  తెలుగువాళ్ళను ఒకతాటిపై తెచ్చి రాజకీయ చైతన్యాన్ని తెచ్చి స్వరాష్ట్ర సాధనకోసము ప్రయత్నిస్తూ ఇతరుల వెటకారపు అవమానాలు భరిస్తు ఆంధ్ర మహా సభల నిర్మాణములో చురుకైన పాత్ర పోషించింది. మొదట 1926లో ఈ పత్రికలో మాడపాటి హనుమంత రావు గారు కథలకు ఆహ్వానము పలుకుతు ఉత్తమ కథకు ఐదు రూపాయలు బహుమతి ప్రకటించారు కథా ఇతివృత్తాలు నిజాం రాష్ట్రాంధ్రకు సంబంధించినవిగా ఉండాలని భాష సులభముగా ఉండాలని పేర్కొన్నారు. 

తరువాత ఈ పత్రిక సారసత్వ అనుబంధము కోసము ప్రత్యేకముగా చిన్నకథలు కావాలని 1933లో ప్రకటించి, 1934 నుండి “మా చిన్నకథ” అనే శీర్షిక క్రింద తెలంగాణలోని పలువురు రచయితల కథలను ప్రచురించి చాలామంది కథకులను వెలుగులోకి తెచ్చిన ఘనత ఈ పత్రికదే.  మధ్యలో ఈ శీర్షికను కధాన్ జలి గా మార్చారు.  తెలంగాణలో కవులున్నారా? అన్న తెలాంగాణేతురుల ప్రశ్నకు ఆ రోజుల్లోనే ఈ కథల ప్రచురణ ద్వారా ధీటైన సమాధానము ఇచ్చారు. ఈ పత్రికలో ప్రచురించిన కథలన్నీ నేటి తరము కథకులకు మార్గదర్శకాలు గోలకొండ పత్రిక చేసిన సాహితి సేవకు ఆనవాళ్లు. పత్రికలో ప్రచురణమైన కథలన్నీ 1926 నుండి 49 వరకు పలు రచయితలు రచించినవే. కథానిక అంటూ నిర్దిష్టమైన పేరు పెట్టింది ఇంద్రగంటి  హనుమచ్చాస్త్రిగారు. ఈ కథలన్ని నేటి తరానికి పాత తరానికి వారధి లాంటివి.

గోలకొండ పత్రిక కథలు పేరిట విడుదల అయిన సంకలనములోని యాభై  రెండు కథలలో ప్రస్తుతము, బొడ్డు బాపిరాజు గారు అనే రచయిత వ్రాసిన కథ, “రెవికల గుడ్డ” గురించి ముచ్చటించుకుందాము. ఈ కథ 1935 లో గోలకొండ పత్రికలో ప్రచురిచితము అయింది. ఈ కథలో ఒక పంతులుగారు ఇళ్ల వెంబడి తిరుగుతూ బట్టలు అమ్మే ఒక వ్యాపారి చేతిలో ఎలా మోసపోయి నాసిరకం, చాలీచాలని  రెవికల గుడ్డ ముక్కను ఎక్కువ ధరకు కొనటము జరుగుతుంది. ఈ ఇతివృత్తాన్ని రచయిత  హాస్యంగా వివరిస్తాడు. సాయుబు సంపాదన బూబమ్మ చెవిపోగులకే చాలదు అన్న సామెత ప్రకారము పంతులుగారి జీతము రాళ్లు అయన భార్య బట్టల గదికే సరిపోదు. మనిషికి అన్నము పెట్టి సంతృప్తి పరచగలము కానీ ఒట్టిచ్చి మెప్పించలేము. ఉదాహరణకు పండుగకు వచ్చిన కొత్త అల్లుడు వడ్డించిన పదార్ధాలే వదిలి  తెచ్చినవి సుతారాం ముట్టడు కాని మామగారు శక్తికి మించి అంపుకోలు బట్టలిస్తే చాలు మూతి బిగిస్తాడు.

పంతులుగారికి కాఫీ, టీ, చుట్టా బీడీ సిగరెట్ వంటి అలవాట్లు ఏమీలేవు కానీ వాళ్లా విడ దుబారా ముందు ఈయన పొదుపు లెక్కకురాదు. ఆవిడగారికి కూడా సోపులు సెంట్లపైన మక్కువలేదు కానీ ఉన్న మొజంతా బట్టలపైనే. నిజానికి కాపురానికి వచ్చినప్పటినుంచి ఆవిడకు పంతులుగారు అయన చేత్తో ఒక గజము గుడ్డ కొనివ్వలేదు, ఆయన పని అల్లా ఆవిడగారు కొన్న బట్టలకు బిల్లు చెల్లించటమే. ఈయనకు బట్టల నాణ్యత తెలియదు అని, బేరము చేయటము అస్సలు రాదనీ ఆవిడగారి గట్టి అభిప్రాయము.  పైపెచ్చు ఆయన షర్ట్ కు ఎంత గుడ్డ పడుతుందో ఏ గుడ్డకొనాలో కూడా తెలియదు కాబట్టి అన్ని ఆవిడగారే చూసుకోవాలి. ఈయన పని అల్లా మొదటి తారీఖున తీసుకున్న జీతము ఆవిడగారికి సర్వాధికారాలతో అప్పజెప్పటమే. కొన్నబట్టలు భర్త గారికి చూపించి ఆ బట్టలు కొనటంలో తానూ ఎంత తెలివిగా చౌకగా కొన్నది కథలు  కథలుగా చెపుతుంది. భర్తగారు తనకు తెలిసిన వాళ్ళు ఇదే రకము బట్టలను ఇంతకన్నా చౌకగా కొన్నారని (అబద్దాలు) చెప్పి భార్యను ఏడిపిస్తుంటాడు ఆవిడేమో గుడ్డల నాణ్యత ధరలు వర్తకులకంటే నాకే ఎక్కువ తెలుసు అని మొగుడుగారితో వాదిస్తుంది. ఆవిడా పుణ్యన ఇంటింటికి తిరిగి బట్టలు అమ్ముకొనే వర్తకులందరికి పంతులుగారి ఇల్లు బాగా పరిచయమే వాళ్ళు కూడా ఇంటికివచ్చి వాళ్ళ వ్యాపారపు తెలివి తేటలతో సరుకును పంతులుగారి భార్యకు అంటగడుతుంటారు. ఏ గుడ్డను లేదా ఏ చీరను చూపించినా తాన్లకు తాన్లు అమ్మగా యీ కొద్ది మిగిలాయి, అని కథలు చెపుతారు. ఇంకా ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళ భార్యలందరూ తమదగ్గరే బట్టలు కొన్నట్లు నిదర్శన పూర్వకముగా  చెబుతారు. మగవాళ్ళు లేని సమయము చూసుకొని ఈ బట్టలు అమ్ముకొనేవాళ్ళు ఇళ్ళదగ్గరకు చేరి మూటలు దింపి ఆ చుట్టూ ప్రక్కల ఆడవారిని పోగుచేసి వాళ్ళ వ్యాపారము చేసుకుంటారు. గొప్పకోసము కనీసము ఒక రెవిక గుడ్డ అయినా కొనక తప్పదు.  ఈ ఆడవారికి పైపెచ్చు అరువు అవకాశము కూడా ఇస్తారు 

ఇంతవరకు రచయిత  చెప్పింది చెప్పబోయే కథకు ఉపోద్ఘాతమే ఇంకా అసలు కథలోకి వద్దాము. ఆదివారము సెలవు పూట భార్యతో కలిసి సాయంత్రము అలా బయటికి వెళదామని అనుకుంటున్న సమయములో భార్యగారు పిలుస్తుంది. ఎందుకంటే దీపాలు పెట్టే వేళ బట్టల వర్తకుడు మూట దింపుకొని అమ్మకానికి సిద్ధముగా ఉన్నాడు. ఎట్లాగూ కొనక తప్పదని తెలిసినప్పుడు వద్దని భార్య కోపానికి గురి అవటం ఎందుకని నిర్ణయించుకొని నేను సిద్దమే అని అక్కడ రచయిత గారు కూలబడ్డాడు. తెలివిగల వర్తకుడు నమస్కారము పెట్టి చాలా మర్యాదగా పలకరించాడు. వర్తకుడు మూట విప్పి రకరకాల చీరలు చూపిస్తూ వాటి నాణ్యతను వివరిస్తున్నాడు రచయిత  భార్య రకరకాల క్లిష్టమైన ప్రశ్నలు వేస్తుంది. రచయిత మౌనపాత్ర వహిస్తున్నాడు. ఏంతో  ఓర్పుగా బట్టలు చూపిస్తున్న వర్తకుడి పట్ల రచయిత గారికి జాలి పెరిగి ఎదో ఒకటి కొనక పొతే బాగోదు అని నిర్ణయానికి వచ్చాడు. ముఖములో భావాలను గుర్తించిన వర్తకుడు,”పంతులుగారు మీకు బట్టల నాణ్యత బాగా తెలుసుకదా మీరు చుడండి”, అని పంతులు గారిని  కొద్దిగా ములగ చెట్టు ఎక్కించాడు వెంటనే భార్య, “ఆయనకు ఏమి తెలుసు?”  అనేటప్పటికీ రచయిత గారికి కొద్దిగా తన తెలివితేటలను రుజువుచేసుకోవాలి అనే పట్టుదల పెరిగింది, బేరము చేయాలన్న సంకల్పము స్థిరపడింది. ఆశ్చర్యముగా భార్య ప్రేక్షక పాత్ర వహించి జరుగుతున్న తంతును చూస్తూ కూర్చుంది. ఇంకేముంది రచయితగారు వర్తకుడితో బేరానికి దిగి బట్టలను పరీక్షించటము మొదలుపెట్టాడు. 

వర్తకుడు, “మీ పై అధికారి భార్య గారికి ఇచ్చినటువంటి రెవిక గుడ్డ ముక్క ఒకేటే మిగిలింది మీ అదృష్టముకొద్దీ, అది చుడండి మీకు తప్పక నచ్చుతుంది అమ్మగారికి చాలా బాగా ఉంటుంది”, అని తన  వ్యాపార ధోరణిలో మూట అంతా  వెతికి ఒక రెవిక గుడ్డతీసి పంతులుగారికి చూపించి, “మీతో వేడుక బేరాలు ఆడను మీ పై అధికారిగారింట్లో గజము రూపాయికి ఇచ్చాను మీరు ఒక బేడా(రెండు అణాలు) తగ్గించుకొని ముప్పాతిక గజము ముక్క తీసుకోండి,”అని వర్తకుడు చెప్పాడు ఏ రెండు రూపాయలో ఉంటుంది అనుకున్న రచయితకు ఇది చాలా చౌక బేరము అనిపించి అయినప్పటికీ గజము ముప్పావలా చొప్పున ముప్పాతిక గజము రెవిక గుడ్డ ఇచ్చేయి”, అని పంతులుగారు ఖచ్చితముగా చెప్పాడు. వర్తకుడు కొద్దిగా సణిగి బేరానికి ఒప్పుకున్నాడు. ముప్పాతిక గజము జాకెట్ కు సరిపోతుందా అని అనుమానంగా భార్య వర్తకుడిని అడిగితే భేషుగ్గా సరిపోతుంది. అని చెప్పి డబ్బులుతీసుకొని మూట సర్దుకొని వెళ్ళిపోయాడు. మొదటిసారిగా తానూ బేరము చేసి రెవిక గుడ్డ కొన్నందుకు పంతులుగారికి చాలా సంతోషము వేసింది.

మర్నాడు ఉదయము వెలుతురులో ఆ రెవిక గుడ్డను చూస్తే అది అసలు జరీ బుటా కాదు, శుభ లేఖలమీద అద్దె బంగారపు అక్షరాలు లాంటివి, అంటే నకిలీవి. వర్తకుడు బాగా టోపీ వేసాడని అర్ధమయింది. ఈ రహస్యము ఆవిడగారికి ముందే తెలుసుట కానీ భర్త తెలివితక్కువ తనాన్ని ఋజువుచేయటానికి చూస్తూ ఉరుకున్నదట. దర్జీకి జాకెట్ కుట్టమని ఇస్తే వాడు గుడ్డ చాలదు అన్నాడు. పైపెచ్చు ఆ రెవిక గుడ్డ పావలా రకమని కామెంట్ చేశాడు. ఇంకో పాతిక గజము ముక్క పట్టుకొస్తే కలిపి జాకెట్ కుడతానని చెప్పాడు. ఈ గుడ్డ తీసుకోని అటువంటి గుడ్డ కోసము బజారు అంతా  తిరిగినా ప్రయోజనము లేకపోయింది. మళ్లి  ఆ గుడ్డ ముక్క అమ్మిన వర్తకుడి పత్తా లేదు. పంతులుగారి భార్య పంతులుగారిని  దెప్పుతూనే ఉంది.  అలా ముగిసింది పంతులుగారి రెవికల బేరము.

1 thought on “గోలకొండ పత్రిక – కథ రెవికల గుడ్డ – సమీక్ష”

  1. మంచి పుస్తకాన్ని చక్కగా సమీక్షించారు అభినందనలు. పుస్తకం వెల,దొరికే చోటు చెప్పండి.

Comments are closed.