గెలుపు – కవిత

బ్రతకలేవా నేస్తం…..బ్రతకగోరి…..

బ్రతకలేవా నేస్తం …ఈ అర్దంకాని లోకాన ఇమిడిపోయి…..

చుట్టూ ఉన్న లోకంతో

ఇమడలేక, నడవలేక

బ్రతకలేవా నేస్తం…..బ్రతకగోరి…..

చావు కావాలన్న ఆలోచన యే….,

నువ్వు విగతుడవైతే..????

నిన్ను చూసి నీ తల్లి పడే ఆవేదనని ఊహించిందా?

ఊహించి…నీ తల్లి నీపై పెట్టుకున్న

నమ్మకాన్ని వమ్ము చేయక ఎదగమందా?

ఎదిగి…నీ తల్లి పడ్డ శ్రమకు,

నీ తల్లి కన్న కలలకు సార్ధకతను చేకూర్చమందా…..?

ఆ తల్లి ఎదుర్కొన్న కష్టాలతో పోల్చు,

నీవు ఓడింది ఎంత? నీవు కష్టించింది ఎంత?

ఆ తల్లి చూపిన ధైర్య సాహసాల్ని గుర్తించి,

నిన్ను నిస్సహాయుడివన్న అడ్డంకుల్ని దూలాలుగా మార్చి….,

నిన్ను, నీ తెలివిని కట్టి పడేసిన చిక్కుముడుల్ని ఉరితాడులా కట్టి….,

నీవు పట్టిన తప్పుదోవలోనే….

కర్కసంగా ఉరితీయ్….

నీపై గెలవాలన్న విధి సైతం

నీకు దాసోహం కాకమానదు.

అక్కడ నుండి పడే ప్రతీ అడుగు,

నిన్ను నీ గెలుపు వైపే పరిగెత్తిస్తుంది.

చేవ‌ తక్కువ వాడిలా… పెంచలేద్రా నీ తల్లి నిన్ను,

చేతులు ముడ్చుకొని విధికి భయపడి

విలవిల్లాడి చస్తావని కాదురా…‌నీ తల్లి…

పురిటి నొప్పులు సైతం సహించి కన్నది నిన్ను….

పురిటి సమయంలో ‌పురిటి బిడ్డగా ఉన్నపుడే…

నీ తల్లిని కాపాడుకోగలిగిన సమర్ధుడివి నీవు….!

నీ పోరాటం పుట్టుకతోనే ప్రారంభమయిందని….

తెలుసుకోలేని కొంత పిచ్చికాలం ,

నీపై గెలవాలనుకోవడం‌ నిజంగా పిచ్చితనం..!!

ఆ‌ గతి తప్పిన కాలానికి అవకాశం ఇవ్వడం నీ అమాయకత్వం..!!!

మేలుకో మిత్రమా…! మేలుకో ఇకనైన…!!

తెలుపు నేస్తం…!!! నీ శక్తియుక్తులకు పదునెక్కువని‌ ఇకపైన…!!!!

చావాలన్న కోరిక సైతం చచ్చి‌తీరుతుంది…

శక్తి నెరిగి గెలిచి తీరాలన్న‌ నీ పట్టుదలను చూసి….

“గెలుపు తధ్యం … తధాస్తు” అనరా దేవతలు సైతం…..