ఎవరు… గ్రహాంతరవాసులా? – నాలుగవ భాగం

          తెల్లవారింది…

          రంగ తన పని తాను చేసుకుపోతున్నాడన్నా మాటే గానీ అతని మనసంతా నిన్న రాత్రి అడవికి వెళ్లి ఇంకా తిరిగి రాని వినీత్ పైనే ఉంది.

          6 గంటలప్పుడు లాడ్జి ఓనరు వచ్చాడు.

          వస్తూనే రంగాతో “అడవిలో ఈ ఘోరాలు స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు గిరాకీ తగ్గింది. లేకపోతె అడవిని చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా మన లాడ్జి లోనే దిగే వాళ్ళు. ఇప్పుడు చూడు జనాలు లేరు. గిరాకీ లేదు. ఇది ఇలాగే సాగితే, ఇంకా మూసుకోవాల్సిందే. నిన్న ఎవరైనా ఒక్కరన్నా లాడ్జిలో దిగారా?” ఆరా తీస్తూ అన్నాడు నలభై ఏళ్ళ మల్లికార్జున్.

          “నిన్న ఒకరు దిగారు సార్. కానీ…” అంటూ నసిగాడు రంగ.

          “కానీ ఏంట్రా?”

          “నేను ఎంత చెప్పినా వినకుండా నిన్న రాత్రి అతను అడవికి వెళ్ళాడు… ఇంకా రాలేదు”

          ఆ మాట వినగానే కంగారు పడిపోయాడు మల్లికార్జున్. “రేయ ఎంత పని చేసావ్ రా. పోలీసులు అడుగుతే ఏమని చెప్పాలిరా” అన్నాడు.

          “మీరు మరీను. ఇందులో మన తప్పు ఏముంది సార్. అయినా నేను వద్దు అనే చెప్పిన. కానీ వినకుండా అతనే వెళ్ళాడు. మనల్ని ఎందుకు అంటారు పోలీసులు” అన్నాడు రంగ.

          “డబ్బులు కట్టాడా?” ఆరాగా అడిగాడు.

          ‘అవున’న్నట్టు తలూపి, “ఒకసారి చూసి వస్తా సార్” అన్నాడు రంగ.

          “ఏంట్రా చూసోచ్చేది?”

          “అతన్ని సార్. అడవికి వెళ్ళిన వినీత్ ని. ఒకసారి అడవి దాకా వెళ్లి వస్త. నా మనసుకు ఎందుకో అతనికి ఏం కాలేదు అనిపిస్తోంది”

          “నీ మనసు చెప్పడం కాదురా. అడవికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు తిరిగి రాలేదు. ఇతను దేవుడా ఏం కాకపోడానికి? సరే. నీ ఇష్టం. నీకు ఏదైనా అయితే నాకు సంబంధం లేదు” అనేసి అక్కన్నుండి వెళ్ళిపోయాడు మల్లికార్జున్.

          బయటకు వచ్చి సైకిల్ తీసి బలంగా పెడల్ తొక్కుతూ అడవికి వెళ్ళే చెత్త కుప్పల ప్రదేశం దగ్గరికి బయల్దేరాడు.

          అక్కడికి చేరుకొని పక్కన సైకిల్ ఆపి దిగి ముక్కు మూసుకుని సన్నని కాలి బాటలోంచి లోపలికి నడిచాడు.

          అడవి దగ్గరగా వెళ్లి ఆగాడు రంగ.

          కానీ అడవిలోకి వెళ్ళడానికి అతనికి ధైర్యం చాలడం లేదు. అడవిలోకి పరికించి చూస్తూ… “సార్… సార్…” అంటూ గట్టిగా పిలవసాగాడు.

          ఇంకో రెండు మూడు సార్లు పిలిచి ఏదైతే ఆదవాని అనుకుని ధైర్యం చేసి అడవిలోకి నడిచాడు “సార్… సార్..” అని పిలుస్తూ. అలా పదడుగులు వెళ్ళాడో లేడో అతనికి కింద పడున్న వినీత్ కనిపించాడు. “సార్…” అంటూ పరిగెట్టుకెల్లాడు అతని దగ్గరికి.

*     *     *     *     *     *

          రాత్రి…

          సమయం పది దాటింది..

          మేడమీద ఒంటరిగా నిలుచుని ఆకాశంలోకి చూస్తోంది కాత్యాయని.

          “ఎలా ఉంది ప్రియాంక పరిస్థితి” అని వినిపించడంతో గిరుక్కున తలతిప్పి వెనక్కి చూసింది కాత్యాయని. ఎదురుగా ప్రియాంక అమ్మ గారు వందన.

          “ప్రియాంక పరిస్థితి ఏంటి అంటి?” తడబడింది కాత్యాయని.

          గాడంగా శ్వాసించి “నాకంత తెలుసు కాత్యా. ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చెప్పాడు ఇవ్వాళ ఉదయం. అది అసలే బాధలో ఉంది నేను ఏమన్నా అది తట్టుకోలేదేమో అని భయమేసింది. ప్రియాంక తనంత తానె వచ్చి చెప్పేంత వరకు నేను తెలియనట్టే ఉందామని డిసైడ్ అయ్యా. అలా ఉంటే అన్న అది కాస్త తెరుకుంటుందేమోనని నా ఆశ” అసలు విషయం చెప్పింది వందన.

          “ఎలా ఉందని ఏం చెప్పమంటారు అంటి. పిచ్చిదానిలా అయింది. రాహుల్ రాహుల్ రాహుల్ …ఇదే దాని బుర్ర నిండా. నన్ను హెల్ప్ చేయమంతోంది రాహుల్ ని వెతకడంలో. నేను దానికి ఏ విధంగా హెల్ప్ చేయాలో కూడా నాకు తోచట్లే. అదేమో నామీద గంపెడు ఆశతో ఉంది” బాధగా అంది.

          “నువ్వు ఎదో ఒకటి చెప్పి దానికి ధైర్యాన్ని ఇవ్వు కాత్య. ఎలాగైనా అది రాహుల్ బాధలోంచి కోలుకుని మామూలు మనిషి అవ్వాలి. అదే దానికి, మాకు నువ్వు చేసే హెల్ప్” అని చెప్పి అక్కన్నుండి వెళ్ళిపోయింది వందన.

          చాలా సేపు వందన వెళ్ళిన వైపే చూస్తూండిపోయింది కాత్య.

          గాడంగా శ్వాసించి మేడ దిగి కిందికి వచ్చింది. ప్రియాంక గది దగ్గరకెళ్ళింది. లోపల గడియ వేస్కోనట్టుంది తలుపు కాస్త తెరిచే ఉంది. దాన్ని కొంచం తోసి లోపలికి తొంగి చూసింది, గాఢ నిద్రలో ఉంది ప్రియాంక. తలుపు తిరిగి వేసి తన గదిలోకి వెళ్ళింది.

          లైట్ ఆఫ్ చేసి పడుకుంది. ఇలా పాడుకోగానే అలా నిద్ర కమ్మేసింది ఆమెను.

*     *     *     *     *     *

          పౌర్ణమి రాత్రి…

          దూరంగా దట్టమైన అడవి…

          ఆ అడవి దిశగా ఓ యువతి నడుచుకుంటూ వెళుతోంది.

          ‘ఇంతరాత్రి అడవి వైపు వెళుతుంది ఎవేరీమే?’ అనుకుంటూ ఆమెనే చూస్తోంది కాత్యాయని.

          ఇంతలో-

          ఉన్నట్టుండి వెళ్తున్న ఆ యువతి టక్కున తలతిప్పి వెనక్కి చూసింది. పున్నమి వెన్నెల వెలుగులో ఆమె ముఖం స్పష్టంగా కనిపిస్తోంది.  కాత్యాయని పెదవులు అప్రయత్నంగా ‘అపూర్వ’ అని పలికాయి.

          అపూర్వ తిరిగి అడవి వైపు నడక సాగించింది. కాని మునుపటిలా నెమ్మదిగా కాదు… వేగంగా. ఇంతలో-

          అడవిలో ఏదో భారీ కదలిక.. ఏంటని పరికించి చూస్తోంది కాత్యాయని.

          ఆకాశం అంత ఎత్తులో ఉన్న ఆక్టోపస అడవిలో లేచి నిలబడి ఓ చేతును అపూర్వ వైపు వేగంగా కదిలిస్తోంది.

          కంగారు పడిపోయింది కాత్యాయనీ. “అపూర్వ… వెనక్కి వచ్చేయ్…” గట్టిగా అరుస్తూ ఆమెను ఆపడానికి పరిగెత్తబోయి… కాలుకు ఎదో అడ్డు తగిలి బొక్కబోర్ల పడిపోయింది. అలా పడుతూ అపూర్వ వైపు చూసిన కాత్యాయానికి… అడవిలోని ఆక్టోపస్ తన పొడవాటి చేత్తో అపూర్వను ఆమాంతం చుట్టేసి తన వైపు లాక్కుంటూ కనిపించింది.

          “అపూర్వా…..” గట్టిగా రోదిస్తూ అరిచింది కాత్యాయని.

*     *     *     *     *     *

          “అపూర్వ…” గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది కాత్యాయని. నిద్రలోంచి లేస్తూనే ముందుకు చూసింది… ఎదురుగా అపూర్వ లేదు… గది గోడలు చిమ్మ చీకటి కనిపించింది. అపుడు అర్థమైంది ఆమెకు ఇప్పటి వరకు అడవిలోని ఆక్టోపస్ అపూర్వను ఎత్తుకుపోవడం అంతా కల అని. టక్కున బెడ్ దిగి వెళ్లి లైట్ వేసింది. ఒక్కసారిగా ఆ  కాంతిని తట్టుకోలేక కళ్ళు మూసుకుంది.

          చేతుని కళ్ళకు అడ్డు పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరిచింది.

          ఆమె ఎదురుగా ఓ ఆకారం. స్పష్టంగా కనిపించడం లేదు. అదిరిపడింది కాత్యాయని.

          కళ్ళు నలుముకుని చూసింది…

          ఇపుడు క్లియర్ గా కనిపిస్తోంది…

          ఎప్పుడు వచ్చిందో తెలియదు కాని అక్కడ ప్రియాంక నిలబడి ఉంది.

          “నువ్వా… ఎపుడు వచ్చావ్? నిన్ను ఇలా సడన్ గా చూసేసరికి అదిరిపడి చచ్చా. అయినా గదిలోకి వచ్చి కూడా లైట్ వెయ్యకుండా అలా చీకట్లో ఉన్నావ్ ఏంటే?”

          ప్రియాంక మాట్లాడలేదు. స్టూల్ మీదున్న జగ్గులోంచి నీళ్ళు గ్లాసులో పోసి కాత్యాయనికి ఇచ్చి “ముందు తాగు” అంది.

          కృతజ్ఞతగా చూస్తూ గ్లాస్ అందుకుని గటగటా తాగేసింది నీళ్ళని. గ్లాసు పక్కన పెట్టి బెడ్ మీద వెళ్లి కూర్చుంది.

          “పీడకల వచ్చిందా?” అడిగింది ప్రియాంక.

          “ఊ”

          “ఏం కల?” అడుగుతూ కాత్యాయని పక్కన వచ్చి కూర్చుంది ప్రియాంక.

          చెప్పింది కాత్యాయని.

          “నీ కలలో వచ్చిన అడవి నల్లమల అడవి అని నా అభిప్రాయం” అంతా విని ఉన్నట్టుండి అంది ప్రియాంక.

          “నల్లమలనా? ఆ అడవిని ఫోటోలలో టీవీల్లో తప్పించి నిజంగా చూడలేదు. అది నా కలలో ఎందుకు వస్తుంది?” ఆశ్చర్యంగా అడిగింది కాత్యాయని.

          “ఏమో.. నాకు అలా అనిపించింది”

          ‘ప్రియాంకకు ఎందుకు అలా అనిపించింది? అయినా ఇంత భయంకరమైన కల నాకు ఇప్పటి వరకు రాలేదు. అసలు ఏంటి ఈ కల అర్థం? అపూర్వ అడవిలోకి ఎందుకు వెళుతోంది? ఆక్టోపస్ అపూర్వను చుట్టేసి తీస్కుపోతుంది. ఏంటీ ఈ కలకు అర్థం అసలు? నిజంగా నా కలలో ఆ ఆక్టోపస్ ఉన్న అడవి నల్లమలనేనా?’ అని అనుకుంటూ దిండు పక్కన ఉన్న తన మొబైల్ ని వంగి అందుకుంది.

          “ఇపుడు ఆ మొబైల్ ఎందుకు? వరుణ్ కి కాల్ ఆ?” అడిగింది ప్రియాంక.

          “వరుణ్ కా. లేదు. ఇపుడు మళ్ళీ అపూర్వను గుర్తు చేసి బాధపెట్టడం ఎందుకు. ఇపుడిపుడే అపూర్వని మరచిపోతున్నాడు అని చెప్పింది అత్తయ్య”

          “మరి ఎందుకు మొబైల్?” అర్థం కాలేదు ప్రియాంకకి.

          “నువ్వు అన్నావ్ గా. నా కలలోని అడవి నల్లమలా అని. నల్లమల అడవి ఫొటోస్ నెట్ లో చూద్దాం అని” చెప్పి దూరం నుండి నల్లమల అడవిని తీసినటువంటి ఫోటోలు వెతకసాగింది.

          ఆసక్తిగా ప్రియాంక కూడా చూస్తోంది మొబైల్ లోకి.

          ఆమె ప్రయత్నం ఏంతో సేపు కొనసాగాక ముందే ఆమె వెతుకుతున్నాటు వంటి ఫోటో కనిపించింది. ఆ ఫొటోనే చూస్తూ “ప్రియాంకా.. నీకు నా కలలోని అడవి నల్లమల అని ఎందుకు అనిపించిందో తెలియదు కాని… నువ్వు అన్నది మాత్రం అక్షరాల నిజం. ఇదే అడవి నా కలలో వచ్చింది. చూడు ఈ ఫోటో. అచ్చం ఇలాగె ఉంది నా కలలో ఆ అడవి కూడా. పక్కన చెత్త కుప్పల ప్రదేశం.. దూరంగా ఊరి లైట్లు. అచ్చు ఇలాగే” అంటూ ఓ ఫోటోని ప్రియాంకకు చూపించింది.

*     *     *     *     *     *

          ఎవరిదో గొంతు లీలగా ‘సమయానికి నేను వెళ్ళా కాబట్టి బ్రతికాడు’ వినిపించింది.

          కనురెప్పలను భారంగా తెరిచాడు వినీత్. అంతే-

          “లేచాడు .. లేచాడు..” ఎవరో ఇద్దరు ముగ్గురు ఒక్కసారిగా అన్నారు.

          నెమ్మదిగా బెడ్ మీద లేచి కూర్చున్న వినీత్ కి తన చుట్టూ దాదాపు పది మంది వరకు జనం, గుమ్మంలో నిలబడి ఎదో చెబుతున్న రంగ కనిపించారు. అతనికి ఇదంతా ఏంటో అర్థం కావడం లేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది.. ‘రాత్రి రంగకు చెప్పి అడవికి వెళ్ళ.. తలంతా భారంగా అవుతూంటే తలపట్టుకున్న. ఇపుడు లేచి చూస్తె ఇక్కడున్నా ఏంటీ?’  అయోమయంలో ఉన్నాడు వినీత్.

          “లేచారా సార్. వద్దు వద్దు అన్నా వినకుండా వెళ్ళారు. నేను గాని రాకపోతే మీ పని అయిపోయేదే. ఇందాకే డాక్టర్ వచ్చి మిమల్ని చెక్ చేసి వెళ్ళారు. మరో గంట అక్కడే ఉంటె మీరు బ్రతికే వారు కాదని అన్నారు డాక్టర్” అని చెప్పి “సరె, మీరంతా వెళ్ళండి. ఇప్పుడే స్పృహ వచ్చింది. కాస్త గాలి ఆడనియ్యండి” అని అందరిని గదిలోంచి పంపించేసి, వినీత్ తో “సర్, వేడిగా టీ తీసుకొస్త. మీరు ఫ్రెష్ అయి రండి. టాబ్లెట్లు బల్ల మీద పెట్టా. వచ్చాక ఎలా వేసుకోవాలో చెబుత” అని వెళ్ళిపోయాడు రంగ.

          వినీత్ కి ఒళ్ళంతా నీరసంగా ఉంది. ‘అడవిలోకి వెళ్ళగానే నాకు ఎందుకు అలా అయింది? నిజంగానే అడవిలో ఏదైనా ఉందా? చి చి.. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? కానీ…’ ఇలా ఆలోచిస్తూంటే తల తిరిగినట్టై తూలాడు వినీత్.

          సరిగ్గా అదే సమయంలో లోపలి టీ తో వచ్చిన రంగ, కప్పు చటుక్కున బల్ల మీద పెట్టి అతన్ని పడకుండా పట్టుకున్నాడు. “బుర్రకు ఎక్కువ పని పెట్టకండి సార్” అన్నాడు.

          సరిగా నిలబడుతూ “రంగా నిన్నోటి అడగనా?” అన్నాడు.

          “మీరు ఏం అడుగుతారో నాకు తెలుసు గాని ముందు మీరు ఫ్రెష్ అయి రండి. లేదా ఈ బెడ్ టీ తాగండి” అంటూ కప్పు తీయబోయాడు రంగ.

          వద్దు అని సైగ చేసి బాత్రూం వైపు అడుగులేసాడు.

          వినీత్ వచ్చేంతవరకు అతని గదిలోనే ఉన్నాడు రంగ.

          వినీత్ వచ్చి కూర్చోగానే టీ కప్పు, బ్రెడ్ అందించాడు.

          బ్రెడ్ తిని, టీ తాగాక “రంగ నేను అడవిలోకి వెళ్ళగానే కాసేపటికే పడిపోయా. మరి నువ్వు కూడా వచ్చావు అడవిలోకి. మరి నీకేం కాలేదు ఎందుకు?” అడిగాడు.

          “మీరు ఈ సంగతి అడుగుతారని తెలుసు. అడవిలో కి అడుగు పెట్టి మిమ్మల్ని చూడగానే మీ దగ్గరికి వచ్చానా.. ఇలా వచ్చానో లేదో నాకు తీవ్రమైన తల నొప్పి మొదలైంది. ఇంకా ఎక్కువ సేపు అక్కడ ఉంటె నాకు ఏమైనా అవుతుందేమోనని భయపడి మిమ్మల్ని భుజాల మీద వేసుకొని తొందరగా బయటికి వచ్చేశ. మీకు ఒక విషయం చెప్పనా. అడవిలోంచి భయటికి రాగానే నా తలనొప్పి మంత్రం వేసినట్టు మాయమైపోయింది” అంటూ జరిగింది చెప్పాడు రంగ.

          “సరే సార్. నేను వెళత. నా డ్యూటి అయిపోయినా మీకోసమే ఉన్న ఇంట సేపు. నేను బయల్దేరతా” అని చెప్పేసి బల్ల మీదున్న మందులు ఎలా వేసుకోవాలో వినీత్ కి చెప్పి వెళ్ళిపోయాడు రంగ.

          రంగకు ఎలా కృతజ్ఞతా చెప్పాలో అర్థం కాక వెళ్తున్న అతన్నే చూస్తుండిపోయాడు వినీత్.

*     *     *     *     *     *

          రాత్రి 11 అవుతోంది…

          ఊరి వాళ్ళంతా ఒకదగ్గర పోగయ్యి అడవి వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

          అడవిలోంచి రంగు రంగుల లైట్లు గాల్లోకి ఎగురుతూ మాయమవుతున్నాయి. కొద్ది సేపటికికి ఆకాశంలో నుండి ఎదో తోకచుక్క రాలి పడుతున్నట్టు ఓ తెల్లని కాంతి అడవి వైపు దూసుకోస్తోంది.

          ఊరి జనాలతో పాటు వినీత్ కూడా చూస్తున్నాడు ఇదంతా.

          ఆ కాంతి దగ్గరికి వస్తున్నా కొద్ది దాని పరిమాణం పెరుగుతోంది. వేగంగా దూసుకు వచ్చి అడవి మద్యలో పడింది. ఆ వెంటనే పెద్ద ధ్వని వచ్చింది. భూమి ఒక్కసారిగా కంపించింది. ఊరి వాళ్ళంతా భయంతో చెల్లాచెదురుగా పరిగెత్తారు.

(ఇంకా ఉంది)