వృషభ విలాపం – కవిత

చూడ చక్కని కాడెద్దు

కాడిమోకు కింద నలిగి

నాగటి చాల్లల్ల నడిచి,

పసిడి గింజల్ని ప్రంపంచానికి పంచిన నీకు

నేటి కరువుకు కడుపెండుతున్నది

అనునిత్యం అన్నగా తోడున్న నీకు

పిరికెడు గడ్డిపెట్టి పొట్టనింపలేక

తుదికి దోసెడు నీళ్ళైన పట్టలేక

కళేబాలకు సాగనంపుతుంటే

గుండెపగిలి విలపిస్తున్న నీ యజమానిని కని,

ఆ మేఘం కరిగి వర్షపు దారగా రాలేదా?

నీ మెడలో ప్రేమతో గంట కట్టిన వాడే

నేడు నీ మెడ తెగనరుక్కోమంటుంటే

ఆ వానదేవుడికి కడుపుతరుక్కుపోవడం లేదా?

చెంగుచెంగుమంటూ గెంతే నీ పాదాల

అడుగుల చప్పుడు రేపు వినబడక

నీ స్నేహితుడేమవుతాడో?

నీవు అంబ అని లాలనగా పిలిచే నీ రైతు

తన మనస్సుకు కలిగిన గాయానికి

ఎంతగా రోదిస్తాడో?

నీవు ఈ రోజు చూసే ఆ జాలి చూపుకి

సమాధానమివ్వలేని నీ సోదరుని

కన్నీళ్ళు జారి నీకు వీడ్కోలు చెబుతున్నాయి.