జ్వాలముఖి – భాగం-2

జ్వాలముఖి - భాగం-2

          మకర సంక్రాతి సమీపిస్తుంది కాబట్టి అక్కడికి ఎలా వెళ్ళాలో మార్గం అడుగుతుంది. అప్పుడు ముణివర్యులు ఇలా సెలవిచ్చారు – “అతి కష్టమైన పని ఇక్కడి నుండే మొదలవుతుంది. ఆ సముద్రంలో జలగర్భంలో ఆ గుహ ఎక్కడ ఉన్నది, దానిలోనికి ప్రవేశం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకు సంబంధించిన మార్గ నిర్దేశక పటం ఇద్దరు రాజుల దగ్గర భద్రపరిచి ఉన్నది. కాని ఆ రాజులు పటాలు ఎక్కడ పెట్టారన్నది ఎవరికి తెలియదు. 20-30 సంవత్సరాలుగా నమ్మకంగా పని చేస్తున్నవారికి కూడా చెప్పలేదు ఆ రాజులు. అంతదాక ఎందుకు ఆజన్మాంతం వారికి తోడుండే వారి సహధర్మచారీనులకే అటువంటి ఒక పటం తమ రాజ్యంలో రాజుల దగ్గర ఉందని తెలియదు. అటువంటి రాజ్యాలకి వెళ్ళి ఆ రాజుల దగ్గర నుండి ఆ మార్గ నిర్దేశక పటాలు తస్కరించాలి అంటే జరిగేపనేనా? ఎంత నైపుణ్యవంతులకైనా అది కష్టంతో కూడిన పనే” అని చెబుతారు ఋషి వర్యులు.

          ఆలోచనలో పడుతుంది మహారాణి. ఆ రాజ్యం గురించి, రాజుల గురించి మొత్తం కనుక్కుంటుంది. ఆ రాజుల పటం ఎలా అయిన తస్కరించాలని నిర్ణయించుకుంటుంది. అందుకోసం తనకెంతో నమ్మకమైన బుద్ధిశాలురైన ఇద్దరు సేనాధిపతులను పిలుపిస్తుంది. వారి నామధేయాలు “చంద్రాదిత్య”, “విక్రమాదిత్య”. రాణీవారు వారిని పిలిపించి ఆ పటం గురించి ఇలా వివరిస్తుంది.

          “గొరరియ” రాజ్యాన్ని పరిపాలించే రాజు శ్రీ మహారాజు అగ్నిప్రవ అత్యంత కౄరుడు. తన ప్రజలపై తప్ప వేరే రాజ్య ప్రజలంటే పడదు. తన వారిపై ఎవరన్నా కక్ష కడితే వారిని సంహరించే దాక నిద్రపోడు.

          ఇక రెండో రాజు “గులకమలె” రాజ్యాన్ని పాలించే శ్రీ మహారాజు ప్రనవ సింహా సౌమ్యుడు, శాంతి స్వభావి కాని అపర మేధావి. ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే తెలివి ఉంది. మంచి చేసే మనుషులకి చాల విలువిస్తాడు. అటువంటి రాజుల దగ్గర నుండి పటం తస్కరించడం కష్టమైన కార్యం. అంచేత ఈ రాజుల దగ్గర నుండి పటాలు చాల చాకచక్యంగా తస్కరించాలి. తేడా జరిగిన మరుక్షణం ప్రాణాలు తీసేస్తారు అని చెప్తుంది. “మీపై రాజ్య భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎటువంటి పొరపాటు జరిగినా, మీరెవరో ఆ రాజులకి తెలిసిన మరు క్షణం మన రాజ్యం పై దాడి చేస్తారు. మన ఊహకి అందనంత విద్వంసం సృష్టించి ఎవరికి మనుగడ అన్నదే లేకుండా చేస్తారు. అందుకని రాజ్య భారం మీపై పెడుతున్నాను. జాగ్రత్తగా మెలిగి కార్యం సాధించుకురండి – విజయస్తు” అని దీవించి పంపిస్తుంది మహారాణి.

          రాణిగారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరుతారు ఇద్దరు సేనాధిపతులు. మార్గ మద్యంలో ఆ రాజుల గురించి రాణిగారు వర్ణించిన తీరు గుర్తు చేసుకుంటారు. ఒక రాజు తన ప్రజలకి విలువిస్తే ఇంకో రాజు మంచికి ప్రాణం ఇస్తాడు. ఇద్దరు సేనాధిపతులు ఒక ఉపాయం ఆలోచించి ఒకరు ఒక రాజు దగ్గరికి, ఇంకొకరు ఇంకో రాజు దగ్గరికి బయలు దేరుతారు. కాని ప్రతీ పక్షం రోజులకి ఒకసారి కలిసి ఆ రాజ్యాల గురించి చర్చించుకోవాలని అనుకొంటారు. చంద్రాదిత్య గొరరియ రాజ్యం వైపు వెళ్తాడు. పథకం ప్రకారం ఆ రాజ్యసైన్యంపై దాడి చేయిస్తాడు. తరువాత ఆ సైన్యాన్ని తానే కాపాడినట్టు నటిస్తాడు. అలా ఒక ఆలోచన ప్రకారం రాజుకి దగ్గరవ్వాలనుకొంటాడు – ఎందుకంటే ఆ రాజు కి తన ప్రజలన్నా, రాజ్యసైన్యం అన్న ఎనలేని ప్రేమ అని. అలా ఆ సైనికులను కాపాడాడని, సైనికులు రాజు దగ్గరకి తీసుకెళ్తారు. రాజు చంద్రాదిత్య సాహసానికి, ధీరత్వానికి అతను చేసిన సహాయానికి ముగ్ధుడై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. తనకి కొలువు లేదని ఏమన్న పని ఉంటే ఇవ్వమని అడుగుతాడు. అతని సాహసానికి సంతోషించి సైన్యంలో చేరమంటాడు రాజు.  క్రమక్రమంగా రాజుతో అన్ని యుద్ధాల్లో పాల్గోంటూ అతని పరాక్రమంతో యుద్ధంలో గెలిచేలా చెస్తాడు. అలా రాజుకి అత్యంత ప్రియమైన మనిషిగా మారుతాడు. నమ్మకమైన మనిషిగా మారుతాడు. అత్యంతా గోప్యంగా ఉంచే సమాచారం కూడా చంద్రాదిత్య చెప్పె అంత సన్నిహితుడౌతాడు.

          ఇదిలా ఉండంగా గులకమలె రాజ్యం వైపు వెళ్తాడు విక్రమాదిత్య. రాజు తెలివైనవాడు. మంచి వ్యక్తి. విక్రమాదిత్య అనుకున్న ప్రకారం ఆ రాజ్యపు పొలిమేరలో ఉన్న నది తీరాన పడిపోయి ఉన్నట్టు నటిస్తాడు. అక్కడ భటులు చూసి రాజుకి చెప్తారు. రాజు భటులకి అతనిని తీసుకురమ్మని చెప్తారు. తర్వాత రాజు గారి వైద్యుడిని పిలిపిస్తారు. ఒక రోజు తర్వాత మెల్కువ వచ్చి లేస్తాడు విక్రమాదిత్య. “తమరెవరు? ఎందుకలా నదీ తీరాన పడి ఉన్నారు? మీ వస్త్రధారణ బట్టి మీరు ఏదో రాజ్యానికి సేనాధిపతిలా ఉన్నారు. మీకేం కష్టం వచ్చినది?” అని అడుగుతారు రాజుగారు. దానికి విక్రమాదిత్య ఇలా సమాధానం చెప్తాడు-“నా నామధేయము విక్రమాదిత్య. నేను ఒక రాజ్యానికి సేనాధిపతిని. మా రాజుగారు, నేను, సైన్యం ఒక కార్యార్దం కోసం ప్రయాణం సాగిస్తుండగా, అనుకోని విధముగా ముష్కరులు ఒక్క సారిగా దాడి చేసారు. ఏమి చేయాలో తెలియని రాజుగారు తన 10 సం|| కుమారుడిని తనకి చాల నమ్మకస్తుడనని నాకిచ్చి పంపేశారు. ఆ ముష్కరులు సైన్యాన్ని రాజుని వధించారు. మమ్ములని ఆ ముష్కరులు వెంబడించారు. నన్ను చంపినా పర్వాలేదని రాకుమారుడు సురక్షితంగా ఉండాలని దాచేసి నేను మరొకవైపు పరుగులు తీసా. ఆ ముష్కరులు నన్ను చంపడానికి బాణం సంధించారు. దాని నుండి తప్పించుకోబోయి ఆ నదిలో పడిపోయాను. మెల్కువ వచ్చి చూసేసరికి ఇక్కడ ఉన్నాను.

          రాకుమారుడి కోసం తన ప్రాణ త్యాగం చేయాలనుకోవడం రాజుకి నచ్చుతుంది. విక్రమాదిత్య రాజుకి సెలవు చెప్పి బయలుదేరబోతాడు. రాజుగారు ఆపి ఎక్కడి వరుకు ప్రయాణం అని అడుగుతారు. రాజు గారిని కాపాడలేక పోయాను. నా ముఖం ప్రజలకి చూపలేను. కాబట్టి గమ్యం లేని ప్రయాణం. ఎక్కడ నా అవసరం ఉంటే అక్కడి వరకు అని చెబుతాడు.

          అందుకు రాజు తన రాజ్యంలోనె ఉండిపోవలిసిందిగా కోరతాడు. దానికి విక్రమాదిత్య, “నా వల్ల ఏదన్న ముఖ్యకార్యం జరగాల్సి ఉంటే, ఏదన్న మంచి కార్యం జరగాల్సిన అవసరం ఉంటే తప్ప ఇక్కడ ఉండిపోలేను”  అని చెప్తాడు.

          “నా రాజ్యంపై దాడి చేయడానికి పొరుగు దేశం రాజు మాటు వేసుకొని కూర్చున్నాడు. దానికి కారణం లేకపోలేదు అతి ముఖ్యమైనది ఒకటి నా దగ్గర ఉంది. రెండవది అతని వద్ద ఉన్నది. ఒక మహత్కార్యం కోసం అవి రెండుకావాలి. అందుకోసం నువ్వు ఇక్కడ ఉండాలి. నా దగ్గర ఉన్నది నీకు అప్పజెపుతాను కాని ఇప్పుడు కాదు. దానికి అపాయం అని తెలిసినప్పుడు నీకు ఇస్తాను. దాన్ని జాగ్రత్తగా కాపాడే బాధ్యత నీదే, అదేలా కాపాడాలి అన్నది నీ మేధస్సుకే వదిలేస్తున్నా” అని అంటాడు రాజు.

          సరే అని ఒప్పుకుంటాడు విక్రమాదిత్య. అలా ఇద్దరు సేనాధిపతులు రాజులకు సన్నిహితులుగా మారతారు. పక్షం రోజుల తర్వాత కలుసుకొంటారు. ఇరు రాజ్యాల గురించి, రాజుల గురించి, రాజ్యం వివరాల గురించి మాట్లాడుకుంటారు. పటం ఎక్కడుంది ఇంకా తెలీదని చెప్పుకుంటారు. ఇక ఆలస్యం అవుతుందని రాజులకి అనుమానం రాకూడదని బయలుదేరతారు ఎవరి గమ్యస్థానాలకి వారు. ఈ సమాచారం అంత మహారాణికి విక్రమాదిత్య  పంపుతాడు. ఆ రాజ్య సైన్యంలో కలిసిపోయి అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డారని తెలుసుకొని సంతోషిస్తుంది మహారాణి. రోజులు గడుస్తున్నాయి. రాజులకి బాగా సన్నిహితంగా అవుతారు. మళ్ళి ఇరువురు పక్షం రోజుల తర్వాత కలుస్తారు. రాజ్యంలో అణువణువు తెలుసుకొంటారు. రాజులు నమ్మి తమ ఆస్తుల వివరాలు కూడా చెప్తారు. కాని ఎంతలా ప్రయత్నించినా ఆ పటం ఎక్కడ దాచరో తెలియడం లేదని చెప్తాడు విక్రమాదిత్య చంద్రాదిత్యతో. తాను కూడా ఏమి కనిపెట్టలేక పోయానని అసంతృప్తి చెందుతాడు చంద్రాదిత్య.

          ఇక ఆలస్యం చేయకూడదని మనం మళ్ళి 12 రోజుల తర్వాత కలుస్తాం కదా ఈ లోపు ఎక్కడ పెట్టారొ వెతాకాలి. దొరికనిపక్షాన ఆ రోజు ఇంక ఏం చేయాలో పథకం వేద్దాం అని అనుకొంటారు. సరే అనుకొని వెళ్తారు. ఈ పక్షం రోజులు తీవ్రంగా వెతుకుతారు. తెలుసుకోవాలని చాల విధాలుగా ప్రయత్నిస్తారు. కాని విఫలమౌతారు. వాళ్ళు కలవాల్సిన 12 వ రోజు వచ్చేసింది. వాళ్ళు కుముది రాజ్యం వదిలి ఆ పటం అన్వేషణలో పడి అప్పటికి 36 రోజులు గడుస్తాయి. మకర సంక్రాంతి సమీపిస్తుంది. ఇంక ఆలస్యం చేయకూడదు అని విక్రమాదిత్య తాననుకున్న పథకం గురించి ఇలా చెప్తాడు. “చంద్రాదిత్య మనం ఈ కార్యం చేపట్టి 36 రోజులు గడిచాయి ఇంక కాలయాపన చేయడం అనవసరం. నేను వెళ్ళి “గులకమలె” రాజుకి ఇక యుద్ధం ప్రకటిద్దామని చెప్పి, గొరరియ రాజుకి ఒక వర్తమానం పంపిస్తాను. నా నామధేయం ఆ వర్తమానంలో చేర్చి, ఒక వీరుడితో యుద్ధానికి వస్తున్నాము అని చెప్పి వర్తమానం పంపిస్తాం. నా నామధేయం వినగానే మీ రాజుగారికి నా గురించి నీకు తెలుసునన్నట్టుగా చెప్పు. యుద్ధం ప్రకటిస్తాము కావున ఆ పటం గురించి నాకు మా రాజుగారు కచ్చితంగా చెబుతారు. ఇక మీ రాజు ఆ రహస్యం గురించి చెప్పేలా చేయి” అని చెప్తాడు. ఆలోచనలో పడతాడు చంద్రాదిత్య. రాజ్యంలో ప్రతీ మూల వెతికినా కానీ నేను ఒక రాజు గారి పూజ మందిరం వైపు మాత్రం ఎన్నడూ వెళ్ళలేదు. రాజు గారు ఎవరిని అటు పక్కన వెళ్ళనివ్వరు. అక్కడే దాచారేమో అని అనుమానం. సరే నీవు చెప్పిన విధంగా రాజుగారికి చెబుతాను. యుద్ధం రోజు ఆ పటం సంపాదిస్తాను అని విక్రమాదిత్యకి మాట ఇచ్చి బయలు దేరుతాడు చంద్రాదిత్య. అనుకున్న ప్రకారం గులకమలె రాజు దగ్గరికి వెళ్ళి విక్రమాదిత్య ఇలా చెప్తాడు- ” రాజు గారు నేను వచ్చి చాల రోజులు గడుస్తున్నది. ఇక నేను వెళ్ళాల్సిన సమయం ఆసన్నమవుతున్నది కనుక గొరరియ రాజ్యం పై మనమే యుద్ధం ప్రకటించి వారి దగ్గర ఉన్న ఆ రెండవ భాగం సంపాదిద్దాం. అప్పుడు ఆ ముఖ్యమైనా వస్తువేదో మీ దగ్గరే ఉంటుంది ఆ ధైవ కార్యం ఏదో మీరే చేయండి. మీరు ఒప్పుకుంటే తక్షణమే యుద్ధ సన్నహాలు చేసి గొరరియ రాజుకి వర్తమానం పంపిస్తాను” అని చెప్తాడు. రాజుగారికి విక్రమాదిత్య చెప్పినది సబబుగానే అనిపిస్తుంది. యుద్ధ సన్నాహాలు చేయమని ఆజ్ఞాపిస్తాడు.

(ఇంకా ఉంది)

భాగాలు: 1234