హాలోవీన్ ఎలా వచ్చింది?

About Halloween Festival in Telugu

About Halloween in Telugu
About Halloween in Telugu

సాధారణంగా పండుగ అని అనగానే మనకు మొదట గుర్తొచ్చేది దైవం. పండుగ నాడు దేవుళ్లను ఆరాధించి, పూజించి సంబరంగా మనకు మంచి జరగాలని ఆశిస్తూ జరుపుకుంటాము. కానీ దెయ్యాల కోసం జరుపుకునే పండుగ కూడా ఒకటి ఉందని మీకు తెలుసా?… అదే హాలోవీన్ పండుగ! ఈ పండుగను ప్రతీ సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకుంటారు.

హాలోవీన్ పండుగ ఎలా వచ్చింది? ఎందుకు జరుపుకుంటాము?

నేడు మనం జరుపుకునే ఈ హాలోవీన్ పండుగ పూర్వం దాదాపు 2000 సంవత్సరాల క్రితం కెల్ట్ లేదా సెల్టిక్లు లు జరుపుకునే సాంహైన్  పండుగ రెండూ ఒకటే అని అంటారు. అందుకు కారణం ఏంటంటే ఐర్లాండ్ నుండి కొందరు ప్రజలు ఉత్తర అమెరికాకు వలస వెళ్లారు. వీరు ఈ సాంహైన్ పండుగను అక్కడి వారికి పరిచయం చేశారు. అలా ఉత్తర అమెరికా నుండి కాలానుగుణంగా ప్రపంచం నలుమూలలా పాకి మతంతో సంబంధం లేకుండా అందరు ఈ హాలోవీన్ పండుగను జరుపుకోవడం మొదలుపెట్టారు.

కెల్ట్ లేదా సెల్టిక్లు ఈ సాంహైన్ పండుగను కొన్ని నమ్మకాల వలన జరుపుకునేవారు. ఆ నమ్మకం ఏమిటంటే అక్టోబర్ 31 వ తేదీన బ్రతికి ఉన్నవారికి, మరణించిన వారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయి అని. అపుడు మరణించిన వారు బ్రతికున్న వారితో కలిసి నడుస్తారని వారు నమ్మేవారు.

హాలోవీన్ రోజు భయంకరంగా ఎందుకు ముస్తాబు అవుతారు?

హాలోవీన్ పండుగనాడు దెయ్యాలు, రక్తపిశాచాలు, కొరివి దెయ్యాలు, ఆత్మలు, తోడేళ్ళు లాంటి ఎన్నో చిత్ర విచిత్రమైన భిన్న వస్త్రాలంకరణతో అందరు ముస్తాబు అవుతారు. అలా ఎందుకు అంటే మరణించిన వారు బ్రతికున్న వారి మధ్యకు వచ్చినపుడు, దెయ్యాల వస్త్రాలంకరణలో ఉన్న మనుషులను చూసి వారిని కూడా తమలాంటి దెయ్యాలే అనుకుని వారిని ఏమి చెయ్యకుండా తిరిగి వెళ్లిపోతాయి అని. ఇది ఓ నమ్మకం.

హాలోవీన్ గుమ్మడికాయలు ఎందుకు?

జాక్ ఓ లాంతర్ లేదా గుమ్మడికాయ లాంతర్ లను హాలోవీన్ నాడు తప్పక ఇంటా బయట పెడతారు. అలా ఎందుకు పెడతారంటే ఇంట్లో లేదా బయట గుమ్మడికాయ లేదా మరేదైనా దుంప తో చేసిన లాంతర్లను వెలిగించి పెడితే ఇవి ఆత్మలను, దుష్టశక్తులను దూరంగా పారదోలతాయని ఒక నమ్మకం. అందుకే హాలోవీన్ పండగనాడు ప్రతీ ఒకరు గుమ్మడికాయ లాంతర్లను వెలిగించడం మనం చూస్తుంటాం. ఇలా గుమ్మడికాయ లాంతర్లు వెలిగించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.

హాలోవీన్ పండుగ నాడు పిల్లలు రాత్రి పూట ట్రిక్ అండ్ ట్రీట్ వేడుక జరుపుకుంటారు. ఇందులో భాగంగా పిల్లలు చుట్టూ ఉన్న ఇళ్లకు వెళ్లి ట్రీట్ అడుగుతారు. ఈ ట్రిక్ అండ్ ట్రీట్ లో ట్రిక్ అంటే ఒకవేళ పిల్లలు వెళ్లిన ఇంటి యజమానులు పిల్లలు అడిగింది ఇవ్వనపుడు, పిల్లలు బెదిరింపు చర్యగా గోల చేసి యజమానుల నుండి వాళ్ళు అడిగింది సాధించుకుంటారు. ఇలా నేటికీ ట్రిక్ అండ్ ట్రీట్ వేడుక హాలోవీన్ నాడు పిల్లలు జరుపుకుంటారు.

ఇవి హాలోవీన్ పండుగ విశేషాలు. భయంకరమైన దుస్తులు, విచిత్ర అలంకరణతో ఈ పండుగను అందరూ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. హాలోవీన్ గురించి ఇంకేమైనా విషయాలు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో మాకు తప్పక తెలియజేయగలరు. 

Check Also: