Bathukamma Festival: బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగ గురించి తెలుగులో (About Bathukamma festival in Telugu) మీ కోసం.

About Bathukamma Festival in Telugu Image

బతుకమ్మ… తెలంగాణ వ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పూల పండుగ. ఈ పండుగ ప్రత్యేకత, విశిష్టతను బట్టి, బతుకమ్మ పండుగను మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా చెప్పుకోవచ్చు.

తెలంగాణ ఆడపడుచులు సంబురంగా జరుపుకునే తొమ్మిది రోజుల ఈ బతుకమ్మ పండుగ మహాలయ అమావాస్య నాడు మొదలయి మహానవమి దాకా కొనసాగుతుంది. ఈ ఏడాది బతుకమ్మ పండుగ తేదీలు: 28, సెప్టెంబర్ నుండి 6, అక్టోబర్ వరకు.

Myths about Bathukamma Festival-

పురాణాల ప్రకారం… బతుకమ్మ కథ

బతుకమ్మ పండుగ వెనుక చాలా కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్య కథలను తెలుసుకుందాం.

కూతురుగా లక్ష్మి దేవి…

చోళ దేశ రాజు ధర్మాంగుడు అతని సతీమణి సత్యవతికి సంతానం లేదు. పిల్లల కోసం ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేశారు. వనం కి వెళ్లి తపస్సు చేశారు. వారి భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమైన లక్ష్మీ దేవిని, తమకు కూతురిగా జన్మించమని కోరుకున్నారు. వారి కోరిక మన్నించి లక్ష్మీ దేవి ఆ దంపతులకు కూతురిగా పుడుతుంది. అపుడు రాజ్యంలోని వేదపండితులు అందరు కోటకు విచ్చేసి, ఆ బిడ్డను ‘బతుకమ్మ’ అని ఆశీర్వదించారు. అంటే కలకాలం బతుకమ్మ అని.

శివుడు లేని…

కల్యాణి చాళుక్య (ప్రస్తుత తెలంగాణ) రాజ్యాన్ని సత్యస్రాయుడు పరిపాలించేవాడు. ఆ రాజ్యంలోని వేములవాడ (నేటి కరీనగర్)లో ప్రసిద్ద రాజరాజేశ్వర ఆలయం ఉండేది. అందులో రాజరాజేశ్వరుడు, రాజరాజేశ్వరీ కొలువై ఉన్నారు. రాజరాజేశ్వరీ దేవి కష్ట సమయంలో తమకు అండగా ఉంటుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. అయితే చోళ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు రాజరాజ కుమారుడు, వేములవాడ మీద యుద్ధం చేసి గెలుస్తాడు. తన విజయానికి గుర్తుగా, అతను రాజరాజేశ్వర ఆలయాన్ని ధ్వంసం చేసి అందులోని బృహత్ శివలింగాన్ని తీసుకెళ్ళి తన తండ్రికి బహుమతిగా ఇస్తాడు. రాజరాజ రాజు బృహత్ శివ లింగం కోసం బ్రిహదేశ్వరాలయం నిర్మించాడు. దాంతో ప్రజలు రాజరాజేశ్వర ఆలయంలోని బృహద్ లింగాన్ని చోళులు దొంగిలించుకు పోయి బృహదమ్మ (పార్వతి దేవి) నుండి శివలింగాన్ని వేరు చేశారని బాధపడి, బృహదమ్మ (పార్వతి) దేవి ఆనందం కోసం ఆమెకు ఇష్టమైన పూలను మేరు పర్వతంలా పేర్చి, బతుకమ్మ శిఖరం పైన పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి ఆటపాటలతో ఘనంగా ప్రతీ ఏట పండుగలా జరుపుకోవడం ప్రారంభించారు. అలా బృహదమ్మ పేరు నుండి వచ్చిన పేరే బతుకమ్మ. ఇది ప్రాచూర్యంలో ఉన్న మరో కథ.

బతుకమ్మ పండగ రోజు మహిళలు ఏం చేస్తారు?

బతుకమ్మ పండుగ నాడు తెలంగాణా ఆడపడుచులు అందరు నిండుగా అందంగా ముస్తాబు అవుతారు. మహిళలు చీరలు, అమ్మాయిలు లంగా వోణిలు,  సాంప్రదాయ దుస్తులు, నగలు ధరిస్తారు. సాయంత్రం 4-5 అయింది అంటే వీధుల్లో బతుకమ్మ సందడి నెలకొంటుంది. బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యం చేస్తారు. సూర్యాస్తమయం అయ్యేలోపు బతుకమ్మలను తలపై పెట్టుకొని దగ్గరలోని చెరువు, సరస్సుకు వెళతారు. అక్కడ మరో మారు పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. ఆ సమయంలో ఆ ప్రాంతం అంతా రంగు రంగుల పూలు, మధురమైన పాటలు, మహిళల నృత్యంతో ఎంతో ఆహ్లాదంగా మనోహరంగా ఉంటుంది. బతుకమ్మను నిమజ్జనం చేసే ముందు, బతుకమ్మ పైన పెట్టిన పసుపుతో చేసిన గౌరమ్మను తీస్కుని నీటిలో నిమజ్జనం చేస్తారు.

Bathukamma 9 Days Names:

తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ పండుగ ఒక్కో రోజు ఒక్కో రూపాన్ని కలిగి ఉంటుంది. అవి:

  1. ఎంగిలి పూల బతుకమ్మ
  2. అటుకుల బతుకమ్మ 
  3. ముద్దపప్పు బతుకమ్మ 
  4. నానే బియ్యం బతుకమ్మ 
  5. అట్ల బతుకమ్మ 
  6. అలిగిన బతుకమ్మ 
  7. వేపకాయల బతుకమ్మ 
  8. వెన్నముద్దల బతుకమ్మ 
  9. సద్దుల బతుకమ్మ 

ఇవి నాకు తెలిసిన బతుకమ్మ కథలు. మీకు ఇంకేదైనా బతుకమ్మ కథ తెలుసుంటే కింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి.

Read Also: