ఉక్కు మనిషి – సర్దార్ వల్లభాయి పటేల్

           భారత స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు బ్రిటిష్ వారితో పోరాడి ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రము సంపాదించి పెట్టారు. అటువంటి వారిని స్మరించుకుంటూ మనము ఆగస్టు 15 న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. కానీ సర్దార్ వల్లభాయి పటేల్ ను మనము స్వాతంత్ర సమరయోధుడిగానే కాకుండా నవ భారత నిర్మాతగా గుర్తుపెట్టుకుంటాము. స్వాతంత్రము వచ్చినాక అప్పటివరకు స్వతంత్రముగా ఉన్న సంస్థానాలను ముఖ్యముగా హైదరబాద్, జునాగఢ్ వంటి సంస్థానాలను  భారతదేశములో విలీనము చేసిన ఘనత సర్దార్ పటేల్ దే. ఈ విధముగా సంస్థానాల విలీనము కావటాడానికి గట్టి కృషి చేసి సఫలుడైన ప్రముఖుడిగా భారతదేశ చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందాడు.  ఆయన దేశభక్తి జాతీయ భావాలు ముందుచూపు వల్ల నేడు స్వతంత్ర భారతము సంఘటితముగా రిపబ్లిక్ గా ఉన్నది. ఈ విషయములో భారతీయులు సర్దార్ పటేల్ ను ఎల్లకాలం స్మరించుకుంటారు. స్వాతంత్రము తరువాత ఏర్ఫడ్డ కాశ్మిర్  సమస్య రావణాసురుడి కాష్ఠము లాగా నేటికీ ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర సమస్యగా ఉండిపోయింది. ఆనాడు సర్దార్ పటేల్ కు  పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఉంటె హైదరాబాద్ సంస్థానముతో పాటు కాశ్మిర్  సంస్థానముకూడా ఇండియాలో విలీనము అయి ఉండేది అని రాజకీయ విశ్లేషకుల గట్టి అభిప్రాయము. సర్దార్ వల్లభాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్‌లోని నాడియార్‌లో జన్మించాడు.  ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగా జరిగిననూ ఉన్నత న్యాయశాస్త్రం చదువులకై 36 ఏళ్ల వయస్సులో ఇంగ్లాండు వెళ్ళి30 నెలలో  బారిష్టర్ పరీక్ష ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. ఆ తర్వాత స్వదేశానికి తిరిగివచ్చి అహ్మదాబాదులో న్యాయవాద వృత్తిని చేపట్టి ఆనతి కాలములోనే గొప్ప లాయరుగా విశేష కీర్తిని, ధనాన్నిఆర్జించాడు. ఆయన ఎల్లప్పుడూ తెల్ల దొరలా సూటు బూటు వేసుకొని దర్జాగా తిరిగేవాడు. తన భార్య అయిన ఝవెర్బాను పుట్టింటి నుండి తీసుకొచ్చి గోద్రాలో కాపురం పెట్టాడు. 1904లో ఆయనకు ఒక కుమార్తె – మణిబెన్, 1906లో దహ్యాభాయ్ అను కుమారుడు జన్మించారు. 1909లో ఆయన భార్య కాన్సర్ వ్యాధితో మరణించింది. వల్లభాయ్ కోర్టులో ఒక కేసు గురించి వాదిస్తున్నపుడు ఆమె మరణించిన వార్తను అందించినపుడు ఆ పేపరును చూసి తన జేబులో పెట్టుకొని, తిరిగి కేసు వాదించి గెలిచాడు. ఆ తర్వాతే ఆ వార్తను ఇతరులకు తెలియ చేసాడు. ఆమె మరణానంతరం తిరిగి వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నాడు. తన కుటుంబసభ్యుల సహకారంతో పిల్లలను పెద్దవాళ్ళను చేసాడు. లాయరుగా ప్రాక్టీస్ చేస్తూ దేశములో జరుగుతున్న జాతీయోద్యమానికి ప్రభావితుడై గాంధీజీ చేపట్టిన సహాయనిరాకరణ ఉద్యమములో చురుగ్గా పాల్గొన్నాడు. 1928లో బ్రిటిష్ ప్రభుత్వము విధించిన పన్నులకు వ్యతిరేకముగా బార్డోలీలో కిసాన్ ఉద్యమాన్ని చేపట్టి విజయవంతము చేసాడు అ సందర్భములోనే ఆయనకు సర్దార్ అనే బిరుదు లభించింది. సహాయ నిరాకరణ ఉద్యామానికి దాదాపు మూడు లక్షల మంది కార్యకర్తలను సమీకరించి ఆరోజుల్లోనే 15 లక్షల రూపాయలను విరాళాలుగా సేకరించాడు. విదేశ వస్తు బహిష్కరణలో భాగముగా తానూ వేసుకొనే  తెల్ల దొరల డ్రస్సులను అగ్నికి ఆహుతిచేసాడు. తన కుమార్తె మణి, కుమారుడు దాహ్యాతో కలిసి జీవితాంతము ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

           గుజరాత్ లో మద్యపానము, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకముగా పోరాడాడు. 1931లో కరాచీ భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పుసత్యాగ్రహము, క్విట్ ఇండియా ఉద్యమాలలో కూడా ప్రముఖ పాత్ర వహించాడు. ఈ విధముగా స్వాతంత్ర పోరాటంలో ప్రతి ఉద్యమములో ప్రతిదశలో చురుగ్గా పాల్గొన్న ప్రముఖులలో పటేల్ ఒకడు. స్వాతంత్ర్యోద్యమములోనే కాకుండా దేశప్రజల సంక్షేమము కొరకు అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. భారత జాతీయ ఉద్యమములో పటేల్ నెహ్రూతో విభేదించేవాడు 1936లో జరిగిన  జాతీయ కాంగ్రెస్ సదస్సులో నెహ్రు సోషలిజాన్ని పటేల్ వ్యతిరేకించాడు. స్వాతంత్రము వచ్చినాక  నెహ్రు మంత్రి మండలిలో హోమ్ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా మరణించే వరకు అంటే 1950 డిశంబర్ 15 వరకు, పదవులను సమర్ధవంతముగా నిర్వహించాడు. సంస్థానాల విలీనము విషయములో నెహ్రు మాటను కాదని బలప్రయోగము, సైనిక చర్యలను చేపట్టి భారత దేశములో అన్ని సంస్థానాలను విలీనము చేశాడు. దేశ విభజన అనంతరము అనేక ప్రాంతాలలో ఏర్పడ్డ మతకల్లోలను చాక చక్యముగా అణిచివేశాడు. 80శాతము హిందువులున్నప్పటికీ నైజాము పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానము పటేల్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది. నైజాం నవాబ్ జిన్నాను సహాయము అర్ధించాడు. కానీ జిన్నా అంగీకరించలేదు. పటేల్ ప్రభుత్వము తరుఫున కేఎమ్ మున్షి ని నైజాం దగ్గరకు రాయబారిగా పంపి భారతదేశములో విలీనంకాకపోతే సైనిక చర్య తప్పదని గట్టిగా హెచ్చరిక ఇచ్చాడు కానీ నైజాం ముఖ్య అనుచరుడు ఖాసీం రజ్వి తన ప్రయత్నాలు చివరిదాకా చేసి ఫలితము లేక భారత సైన్యము హైదరాబాద్ లో అడుగు పెడుతున్నాయని తెలిసి పాకిస్తాన్ పారిపోయి అక్కడే చనిపోయాడు. నైజం నవాబ్ హైదరాబాద్ విమానాశ్రయములో పటేల్ ను సాదరముగా ఆహ్వానించి తాను లొంగిపోతున్నట్లు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశములో విలీనము చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ విధముగా రక్త పాతము లేకుండా హైదరాబాద్ ను భారతదేశములో కలిపినా ఘనత పటేల్ ది.  ఇది అయన రాజకీయ చతురతకు నిదర్శనము.

           కాశ్మిర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి నివేదించవద్దని నెహ్రూతో వాదించాడు కానీ నెహ్రు ఆనాడు చేసిన పనివల్ల నేటికీ కాశ్మిర్ సమస్య అపరిష్కృతముగానే ఇండియా పాకిస్థానుల మధ్య ఉండిపోయింది. అలాగే పాకిస్తాను కు 55 కోట్లు ఇవ్వరాదని నెహ్రూతో వాదించాడు. నెహ్రు అప్పటి గవర్నర్ జనరల్ గా ఉన్న రాజగోపాలాచారిని దేశ తోలి అధ్యక్షుడిగా చేయాలని ప్రయత్నించినప్పుడు పటేల్ బాబు రాజేంద్రప్రసాద్ ను ప్రతిపాదించి సఫలీకృతుడైనాడు. అలాగే 1950 కాంగ్రెస్ సమావేశములో నెహ్రు అభ్యర్థి కృపలానిని కాదని తన అభ్యర్థి పురుషోత్తం దాస్ టాన్ డాన్ ను గెలిపించుకున్నాడు. భారత రాజ్యాంగ రచనకై ఏర్పడిన భారత రాజ్యాంగ సభలో సీనియర్ సభ్యుడిగా పటేల్ మంచి సహకారాన్ని అందించాడు. అంబేద్కర్ ను డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా నియమించటంలో పటేల్ ప్రముఖ పాత్ర వహించాడు. భారత రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల కమిటీ కి చైర్మను గా పనిచేశాడు. భారత పార్లమెంట్ లో రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్ లను నామినేట్ చేసే అధికారన్నీ పటేల్ ప్రతిపాదించాడు. ఈ విధముగా సర్దార్ వల్లభాయి పటేల్ స్వతంత్ర పోరాటములోను ఆ తరువాత భారతదేశాన్ని సంఘటితముగా ఉంచటములోను ప్రముఖ పాత్ర వహించిన ప్రముఖుడు. దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆయన చేసిన పనుల ఫలితాలను మనము ఇప్పుడు అనుభవిస్తున్నాము. అందుకనే పటేల్ ను రాజకీయవేత్తగా కాకుండా ఒక స్టేట్స్ మన్ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తారు.