Samaajam – Katha

సమాజం

“తొందరగా డబ్బులు కట్టు అమ్మాయి రూంలో ఎదురుచూస్తుంది”, పాన్ నములుతూ, పెద్ద గొంతుతో రేఖ సురేష్ తో అంది.

సురేష్ తన దగ్గర వున్న డబ్బులు రేఖకు ఇచ్చి 203 రూంలోకి వెళ్ళాడు.

అక్కడ-
వాణి సురేష్ దగ్గరికి వచ్చి
“ఎన్ని గంటలు?” అడిగింది.

“2 గంటలు” అన్నాడు.

“అబ్బో 2 గంటలా? ఏం చేద్దామనో ?” నవ్వుతూ అంది.

సురేష్ ఏం బదులు ఇవ్వకుండా దర్వాజా దగ్గరే నుంచోని వున్నాడు.

“సరేకానీ మంచం దగ్గరికిరా” అంది.

సురేష్ అల మౌనంగానే వుంటూ ఎడమ కంటి నుంచి కన్నీటి దారాలు కారుస్తున్నాడు.

“ఇదిగో ఏం అయ్యింది? నీ 2 గంటలు వృధా చేసుకోకు” అంది.

అలా సురేష్ మంచం దగ్గరికి వచ్చి కూర్చున్నాడు కానీ ఇంకా గట్టిగా ఏడుస్తున్నాడు. 

“ప్రేమ వ్యవహారమా..?” అడిగింది.

“అవును” అన్నాడు.

“అనుకున్న.. ఇక్కడికి వచ్చే సగం మంది కారణం ఇదే” అని
“సరే కానీ నీ కథ ఏంటోచెప్పు నీ 2 గంటలు వృధా కాకుండా వుంటాయి” అంది.

“నా పేరు సురేష్ నేను ఇప్పుడు ఇంజనీరింగ్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నాను. నేనూ, రమ్య ఇంజనీర్ సెకండ్ ఇయర్ నుంచి ప్రేమించుకుంటున్నాం. అంతా బాగానే వుంది కానీ ఈ మధ్య కాలం నుంచే గొడవలు మొదలయ్యాయి.. కొన్ని రోజుల నుంచి మా ఫ్రెండ్స్ తో తిరగవద్దు అనేది రమ్య. ఫ్రెండ్స్ తో వెంటనే మాట్లాడవద్దు అంటే ఎలా? మాట్లాడటం లేదు అని అబద్దం చెప్పేవాడిని నేను కూడా.. కానీ వారం రోజుల నుంచి నా ఫ్రెండ్ రాజు తనని ఇబ్బంది పెడుతున్నాడు అని నాకే అబద్ధాలు చెపుతుంది. నిన్న కూడా ఆ విషయంలో గొడవ పడ్డాము.. ఆ గొడవలో తనే నన్ను వదిలేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది” బాధపడుతూ చెప్పాడు.

ఇది విన్నాక, వాణి ఒక్క నవ్వు నవ్వి..
“నిన్ను వదిలేసి వెళ్ళింది అని బాధ పడుతున్నావా..? తను వదిలి వెళ్లకపోతే తనే ఎక్కువ బాధపడేది” అంది.

“ఎంటి నేను ఎంత బాగా చూసుకున్నాను, నన్ను వదిలేస్తే తను సంతోషంగా వుంటుందా?” అన్నాడు.

“సంతోషంగా ఉంటుంది అనలేదు బాధపడకుండా వుంటుంది అని అన్నాను” అంది.

“నాకు అర్దం కాలేదు?” అన్నాడు.

“ఎందుకుంటే తను నిన్ను ఇంకా ప్రేమిస్తుంది కానీ తన బాధ నువ్వు అర్థం చేసుకోలేదు అని తను వెళ్లిపోయింది” అంది.

“కొంచెం అర్దం అయ్యేలా చెప్పండి.” అన్నాడు.

“మీ ఇన్నేళ్ల  పరిచయంలో ఏ రోజయిన తను ఇలా చేసిందా ?” అంది.

“లేదు” అన్నాడు.

“కానీ ఇపుడే ఎందుకు ఇలా చేస్తుంది? తను ఏదో ఇబ్బంది పడుతుంది. తనతోనే కదా ఎక్కువ సమయం గడుపుతూ ఉంటావ్, అయినా కానీ మీ ఫ్రెండ్స్ తో వుండవద్దు అని అనింది అంటే తను నిజంగా ఏదో ఇబ్బంది పడుతుంది. కానీ నువ్వు అది వినకపోయేసరికి నీకు నిజం చెప్పింది. కానీ నువ్వు ఏం చేశావు, తన మీదనే అరిచావు, తనదే తప్పు అని అన్నావు. అది తట్టుకోలేక తనే వెళ్ళిపోయింది. తనని భద్రంగా చూసుకోవలసిన వాడే ఇలా మాట్లాడితే ఏ అమ్మాయి అయిన ఇలానే వెళ్ళిపోతుంది” అంది.

“కానీ నా స్నేహితుడు చాలా మంచివాడు” అన్నాడు.


“ఎవరు మంచి..? ఎవరు చెడు..? నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ చెడ్డవాళ్ళా? బైట భార్యలను హింసించే వాళ్ళు  మంచి వాళ్ళా? నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సుఖం కోసం వచ్చినా కానీ భార్యలను మంచిగా చూసుకుంటారు. ఇప్పుడు చెప్పు, ఎవడు మంచివాడు? ఎవడు చెడ్డవాడు? అంతా నీ ఆలోచనలోనే వుంది.. ఇంకొక మాట, ఒక ఆడది తనని ఇబ్బంది పెట్టే చూపు తగిలితే ఎంత మానసికంగా ఇబ్బంది పడుతుందో, ఆ చూపులకి అలవాటు పడిన నాలాంటి దానిని అడుగు చెప్తుంది” అని నవ్వింది.. “నచ్చని వారు తాకితేనే మనసు మదన పడుతుంది. అలాంటిది మనసు చంపుకొని బ్రతుకుతున్నా..” అంటూ  కళ్లు తుడుచుకుంది.. “నమ్మకం అనే పదం మీద ఎన్ని జీవితాలు ఆధారపడి ఉన్నాయి.. ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకోకు. అదే నా జీవితం లో కోల్పోయాను.. నా భర్త అనారోగ్యంతో వున్నపుడు నేను పని చేసే యజమాని నాకు డబ్బులు ఇచ్చి ఆయన దగ్గర 10 సంవత్సరాలు పని చెయ్యాలి అని పత్రం రాయించుకున్నారు. కానీ నా భర్త ఆరోగ్యం మెరుగు అయ్యాక అందరూ నేను ఆ యజమానితో పడుకోవడం వల్లే డబ్బులు వచ్చాయి అని నా భర్త తో అన్నారు.. నా భర్త అదే నమ్మి నన్ను వదిలేశాడు.. ఆ యజమాని పత్రాలు చింపేసాడు.. ఎందుకంటే యజమాని పరువు పోయింది కదా, అంతేకాదు నన్ను డబ్బులు కూడా తిరిగి ఇవ్వవద్దు అని అన్నాడు. నా పని పోయింది. కానీ నాకు ఒక కొడుకు వున్నాడు, ఒక సంసారం వుంది అది గడవడానికే ఇలా” చెప్పి నవ్వింది.. “అందుకనే మనం ప్రేమించేవారు ఏమైనా చెప్తే నమ్మాలి ఆ నమ్మకం లేకపోతే బంధాలు నిలబడవు” అంది.. “ఇంతకు నిన్ను ఇక్కడికి ఎవడు  వెళ్ళమన్నాడు” అడిగింది. 

“నా ఫ్రెండ్ రాజు” అన్నాడు.

“ఇప్పటికైనా అర్ధం అయ్యిందా వాడు ఎలాంటి వాడో? నిన్ను ఇక్కడికి పంపించి నీ రమ్య తో నువ్వు ఇక్కడికి  వచ్చావు అని చెప్తాడు.. ఇంకా రమ్యకి నీ మీద వున్న కొంచెం నమ్మకం కూడా పోతుంది.. వెంటనే వెళ్ళి రమ్య కి జరిగింది చెప్పి నీ ప్రేమను దక్కించుకో” అంది.

సురేష్ కి తన ఫ్రెండ్ చేసిన మోసం తెలిసి వచ్చింది. వెంటనే రమ్య దగ్గరికి వెళ్ళి తనకు జరిగింది చెప్పి క్షమాపణలు అడిగాడు. రమ్య ఏడుస్తూ వెళ్ళి సురేష్ ని వాటేసుకుంది. కొంచెం సమయం అయ్యాక రమ్య కి రాజు నుంచి మెసేజ్ వచ్చింది “సురేష్ వ్యభిచారి దగ్గరకు వెళ్ళాడు” అని. అది చూసి సురేష్ చాలా కోపంతో రాజు దగ్గరికి వెళ్లి వాడిని చితక్కొట్టి రమ్యకి క్షమాపణలు చెప్పించాడు. తర్వాత రమ్య, సురేష్ లు వాణి దగ్గరికి వెళ్ళి ధన్యవాదాలు తెలిపారు.

ఇప్పుడు చెప్పండి ఇలాంటి పని చేస్తూ ఒక ప్రేమ జంటని కలిపిన వాణి గొప్పదా..? లేక బయట సమాజంలో మంచివాడిలా వుంటూ ఇద్దరిని విడగొట్టాలి అనుకున్న రాజు గొప్పవాడా..?

మంచి చెడు అనేది అంతా మన ఆలోచన లోనే వుంటుంది………

రచన: అర్జ. నీలిమ

మరిన్ని రచనలకు: https://manandari.com/arja-neelima/