“ఎక్కడి నుంచి మీరు?” ఇంగ్లీషులో అడిగాడు వినీత్.
“హైదరాబాద్” పొడిగా చెప్పింది.
“ఓహ్ మీరు కూడానా” ఆశ్చర్యంగా అన్నాడు.
“మీరు కూడానా అంటే?”
“కొన్ని రోజులక్రితం ఒకామె ఇక్కడే హోటల్లో బస చేసి వెళ్ళింది. ఆమె అచ్చం మీలాగే ఉంటుంది. అందుకే నేను ఇందాకటి నుండి మిమ్మల్ని చూస్తున్న. మీరు అమెనేన లేక ఆమె బంధువా అని”
అతను తనని ఫ్లర్ట్ చేయడానికి ఏదోటి అలా చెబుతున్నాడని అనుకుంది పరిచయం పెంచుకోవడం అప్పటికప్పుడు ఎదో కథలల్లి మాట్లాడే ప్రయత్నం చేసే అబ్బాయిలు గుర్తోచి. “ఓహ్…” అంది.
ఇద్దరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అరకును చూడటానికి వచ్చానని అంకిత చెప్పింది.
అరకు గురించి, అక్కడి విశేషాలు చెబుతూ ఆమెతో మాట్లాడసాగాడు వినీత్.
తప్పని సరై మాట్లాడుతోంది కాత్యాయని.
ఇంతలో సడన్ గా వినీత్ అన్నాడు వారి ముందు నుండి హోటల్ వైపు వెళుతున్న ఓ అమ్మాయిని చూపించి “హే ఆమెని చూసావా” ఆ వెంటనే, “ఆమె ఓ పెద్ద కారెక్టర్ లెస్ గర్ల్ తెలుసా. బి కేర్ ఫుల్ విత్ హర్” అన్నాడు.
అసందర్భంగా తనకు తెలియని అమ్మాయి గురించి తనకెందుకు చెబుతున్నాడో అర్థంకాక చిర్రెత్తుకొచ్చి “ఆమె గురించి నాకెందుకు చెప్తున్నారు మీరు?” అంది సీరియస్ గా.
“హేయ్ ఈజీ… నేను జనరల్ గా చెప్పాను. మీరు ఓ వారం పాటు ఇక్కడే ఉంటా అన్నారు. ఎవరు తెలీదు అన్నారు కదా. సో జాగ్రత్త కోసం అని చెప్పా అంతే”
ఏం మాట్లాడలేదు ఆమె.
“ఓకే అండి మళ్ళీ మాట్లాడదాం” అని చెప్పి లేచింది. అతని బదులు కోసం చూడకుండా వేగంగా హోటల్లోకి వెళ్ళిపోయింది.
తన గదిలోకి వచ్చి కూర్చుంది కాత్యాయని. ఏం ఆలోచిద్దామన్న ఆమెకి ఆలోచనే రావడంలేదు. ‘ఇడియట్ మైండ్ అంత డిస్టర్బ్ చేశాడు. మొహమాటంకి పోయి మాట్లాడా. అనుభవించక తప్పుతుందా’ అనుకుంది తనని తానె నిందించుకుంటూ. ఏం చేయాలో తోచక కిటికీ దగ్గర వచ్చి నిలబడింది. వెనకున్న గార్డెన్ ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. బయటినుండి చల్లని గాలి ఆమె ముఖాన్ని స్పృశిస్తూంటే అలానే గార్డెన్ లోకి చూస్తుండపోయింది.
ఇంతలో సడన్గా ఆమె కార్ణాలకు ఏవరివో మాటలు సోకాయి. ‘ఎవరు…?’ అనుకుంటూ గార్డెన్ లో పరికించి చూసింది ఎవరూ కనిపించలేదు. కిటికీ ఊచల దగ్గరకు ముఖం తెచ్చి పక్కకు చూసింది. ఇందాక వినీత్ చూపించిన అమ్మాయి గార్డెన్ లో ఉంది. ఫోనులో మాట్లాడుతోంది.
“అబ్బ వాడి గోల భరించలేకపోతున్నా. అందుకే ఇవాలే ఖాళీ చేసేస్తున్నా” అంటోంది ఆమె.
కాత్యాయనికి అర్థం కాలేదు. అయినా వింటోంది.
“వాడు వాడి వెకిలి చేష్టలు. అసలు వాడు అమ్మాయిల గురించి ఏమనుకుంటున్నాడో. ఒంటరిగా హోటల్ లో ఉంటే అలా చేస్తాడా”
“లేదు. ఎందుకు చెప్పడమే? ఇక్కడ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోతే అయిపోతుందిగా. ఆ వినీత్ గాడిని ఎదో ఒకరోజు ఎవరో ఒకరు తన్నకపోరులే. సరే. నువ్వు తొందరగా రావే నన్ను పికప్ చేసుకో” అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
కాత్యాయని బృకుటి ముడివడింది. ‘ఏంటి అతనేమో ఈమె గురించి అలా చెప్పాడు. ఈమె ఫోనులో అతని గురించి ఇలా చెబుతోంది?’
‘అయినా నేనేంటి వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను? ఇవన్నీ నాకవసరమా?’ అనుకుంది.
‘వినీత్ నాలాంటి అమ్మాయిని చూసా అన్నాడు. ఫ్లర్ట్ చేయడానికి అన్నాడేమో అనుకున్నా. ఒకవేళ నిజంగానే అన్నాడా అతను? నాలాంటి హైదరాబాద్ అమ్మాయి అంటే అపూర్వే అయున్దోచ్చా ఆమె? అపూర్వ నాకన్నా అందంగా ఉన్నా అదాటున చూస్తే దాదాపు మా పోలికలు అయితే కలుస్తాయి. కొత్తవాళ్ళు చూసినా మమ్మల్ని సిస్టర్స్ ఆ మీరు అంటారు. అంటే అతను నిజమే చెప్పాడా? కానీ ఇందాక ఈ అమ్మాయి గురించి అతను చెప్పింది అబద్ధం అయితే ఇదెలా నిజం అవుతుంది?’
‘ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే టైం వెస్ట్’ అనుకుని ఓ నిర్ణయానికి వచ్చి గది బయటకు వచ్చింది. ఎంట్రెన్స్ దగ్గర ఫ్లోర్ ని క్లీన్ చేస్తున్నాడు పనివాడు. ఎంట్రెన్స్ దాటి వెనక గార్డెన్ లోకి వెళ్ళింది. అక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. ‘ఎలా పేరు తెలియదు. ఈ హోటల్ లో ఏ రూములో ఉందొ ఏమో’ అనుకుంటూ తిరిగి హోటల్ లోకి నడిచింది. ఆమె దృష్టి ఫ్లోర్ ని క్లీన్ చేస్తున్న పనివాడిపై పడింది. అతని దగ్గరకు వెళ్లి “ఇందాక ఒకమ్మాయి లోపలికి వచ్చింది, జీన్స్ పాంట్, బ్లాక్ షర్టు వేసుకుంది. తను ఏ రూమ్ లో ఉంటుంది కాస్త చెప్తారా? నేను కూడా ఇదే హోటల్ లో ఉంటున్నాను” అని తన రూమ్ నంబరు చెప్పింది కాత్యాయని.
జీన్స్ వేసుకునే అమ్మాయి ఆ హోటల్లో ఒక్కరే ఉండటం తో ఆ పనివాడికి ఆమె ఎవరి గురించి అడుగుతుందో స్ఫురించి వెంటనే చెప్పాడు ఆమె రూమ్ నంబర్.
“థాంక్స్” అని చెప్పి అక్కడినుంచి కదిలింది కాత్యాయని. ఆమె గది దగ్గరకు వెళ్లేసరికి తలుపు తెరిచే ఉంది. లోపల బ్యాగులు సర్దుతూ కనిపించింది ఆ అమ్మాయి. చిన్నగా తలుపు మీద తట్టింది.
ఆమె వెనుదిరిగి చూసింది. కొత్తమనిషి కావడంతో “ఎవరు?” అంది ఆమెను ఉద్దేశించి.
“నేను కొత్తగా దిగాను ఈ హోటల్లో…” అంటూ ఆగిపోయింది ఏం మాట్లాడాలో తెలియక.
“సో?”
“నేను లోపలికి రావొచ్చా?”
“యెస్. కమ్” అంది.
ఆమె చైర్ చూపించింది కూర్చోమంటూ. కాత్యాయని కూర్చోగానే “చెప్పండి” అంది.
సంభాషణ ఎలా మొదలు పెట్టాలో, ఏం మాట్లాడాలో తెలియడం లేదు ఆమెకు. “ఇందాక మీరు ఫోనులో ఈ హోటల్ మేనేజర్ గురించి మాట్లాడుతుంటే విన్నాను..” అంటూ ఆగింది.
ఆమెకు అర్థమైపోయింది తను హోటల్ మేనేజర్ గురించి అలా మాట్లాడటం విని భయపడి డిటైల్స్ తెలుసుకుందాం అని వచ్చిందేమోనని “వాడు మేనేజరా? ఉత్తి ఫాల్తు ఫెలో. ఒంటరిగా వచ్చావా ఈ హోటల్ కి?” అడిగింది క్లోజ్ గా.
తలాడించింది అవునన్నట్టు.
“నాకు నువ్వు ఫోనులో మాట్లాడింది విన్నా అనగానే అర్థమయిపోయింది. నేను ఇంకా ఓ వారం పాటు ఉందామనుకున్న. కాని వాడి వల్లే ఖాళీ చేస్తున్న. యు బి కేర్ ఫుల్ విత్ హిం” అంది.
బ్యాగ్ కి జిప్ వేసి పక్కన పెడుతూ “నేను మా కాబోయే భర్త రఘుతో వచ్చాను ఇక్కడికి. వచ్చిన దగ్గరి నుండి వాడి ప్రవర్తనే డిఫరెంట్. 5 డేస్ తరువాత రఘు తన బిజినెస్ పని మీద వెళ్ళాడు నన్ను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఎంజాయ్ చేసి రమ్మని. రఘు వెళ్ళినప్పటి నుండి నా గురించి ఏమనుకున్నాడో తెలియదు. మిస్….” అంటూ ఆగిపోయింది ఆమె పేరు ఏమిటి అన్నట్టు.
“కాత్యాయని” చెప్పింది.
“నా పేరు నిత్య. తను వెళ్ళిన మరుసటినాటి నుండి నాతో క్లోజ్ గా మాట్లాడుతూ కుళ్ళు జోకులు. నిన్న నా గదిలోకి వచ్చి పిచ్చిగా మాట్లాడాడు. చెంప పగలగొట్టి గెట్ అవుట్ అన్న. పోయాడు సైలెంట్ గా. ఈ విషయం మా ఇంట్లో చెప్పా. వచ్చేసేయమన్నారు. అందుకే బయల్దేరుతున్న. రాత్రంతా భయంతో ఉన్న. వాడు నా మీద పగబట్టి ఏమైనా పిచ్చి ఆలోచనలు చేస్తాడేమోనని. థాంక్ గాడ్. అలా ఏమి చేయలేదు” బెడ్ మీద కూర్చుని జరిగినదంతా వివరంగా చెప్పింది. మొబైల్లో తన ఎంగేజ్ మెంట్ ఫొటోస్, అరకు వచ్చాక దిగిన ఫొటోస్ కాత్యాయనికి చూపించింది.
‘ఓహో ఇదన్నమాట సంగతి. కొట్టిందన్న పగతో ఈమె గురించి నాకు చేదుగా చెప్పాడు. నాకే చెప్పాడు అంటే అందరికి అలాగే చెడుగా చెబుతున్నాడన్నమాట. నేను ఈమెతో మాట్లాడితే నాకు నిజం తెలుస్తుందని ‘ఆమెతో బి కేర్ ఫుల్’ అని అన్నాడన్నమాట. ఛీ. ఇంత నీచానికి దిగజారి అలా చెబుతాడా. వాడు చేసిన తప్పుకి నిజానికి నాలుగు తన్నాలి. కానీ నిత్య జస్ట్ చెంప మీద కొట్టి బయటకెళ్ళు అంది. అంత దానికే ఆమె గురించి అలా చెడుగా చెప్పడం తప్పు కాదా? వీడిలా చెప్పడం ఈమెను చేసుకోబోయే వాడికి తెలిస్తే? పెళ్లి ఆగిపోదా? చ్చీ ఇలాంటి వాళ్ళ వల్లే ఎందరివో కాపురాలు కూలిపోతాయి. అసలు ఎందుకు ఉంటారో వీళ్ళు’
“ఏం ఆలోచిస్తున్నారు” మౌనంగా ఉన్న కాత్యాయనితో అంది నిత్య.
“నథింగ్. మీరు ఇదంతా రఘుకి చెప్పారా మరి?”
“నో… ఇంకో నెలలో పెళ్లి. ఇవన్ని చెబితే మళ్ళీ తను ఏమన్నా తప్పుగా అనుకుంటే ఎలా? ఇవన్ని చెప్పడం అవసరమా చెప్పు. ఎలాగో మాది అరకు కాదు. ఇక్కడి నుండి ఇవాలే వెళ్ళిపోతున్న ఇంటికి” అంది.
“మీకో విషయం చెప్పాలి”
“ఊ.. చెప్పండి”
“ఇందాక ఆ వినీత్ నాతో మాట్లాడాడు..” అంటూ అతను ఆమె గురించి చెడుగా చెప్పిన విషయం చెప్పి “ప్లీజ్. ఇప్పుడు మీరు తొందరపడి వాడిని ఏమి అనకండి. ఇంటికి వెళ్ళాక రఘు కి అతను వెళ్ళగానే ఇక్కడ ఏం జరిగిందో అంతా చెప్పండి. ఇలాంటి విషయాలు దాచకపోవడమే మేలు. పొరపాటున ఈ విషయం నీ ద్వారా కాకుండా మూడో వ్యక్తి ద్వారా అతనికి తెలిస్తే… ఆ తరువాత దీని గురించి నీకు అడిగితే… అప్పుడు నువ్వు నిజం చెప్పినా ప్రయోజనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు తప్పు చేయకున్నా చేసినట్టు అయిపోవచ్చు. సో అంతా చెప్పేయ్” అంది కాత్యాయని.
ఓ క్షణం ఆలోచించింది ఆమె. “వాడు అంత చెడ్డగా చెప్పాడా నాగురించి?” ఇప్పటి వరకూ ఆమెలో ఉన్న చలాకి తనం పూర్తిగా పోయి ముఖం వాడిపోయింది.
“మంచి వాళ్ళు అయితే నమ్మరు. చెడ్డవాళ్ళు అయితే ఏది చెబితే అదే నమ్ముతారు నిత్య. యు డోంట్ వర్రీ అబౌట్ ఇట్. నువ్వు చెయ్యాల్సిందల్లా నిజాన్ని చెప్పడం. ముఖ్యంగా నిన్ను చేసుకోబోయే వ్యక్తికీ. ఓకే నా?” అని లేచింది కాత్యాయని.
“యు ఆర్ రైట్. థాంక్ యు సో మచ్” అంటూ ఆమె దగ్గరికి వచ్చి హగ్ చేసుకుంది.
“నువ్వు నా పెళ్ళికి తప్పకుండ రావాలి” అని బ్యాగులోంచి పెళ్లి కార్డ్ తీసిచ్చింది.
“తప్పకుండా” అంది కాత్యాయని.
* * * * * *
నిత్య ఆమె ఫ్రెండ్ రావడంతో రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయింది.
కాత్యాయని వినీత్ దగ్గరకు వెళ్ళింది. రిసెప్షన్ దగ్గర ఉన్నాడు అతను.
“హాయ్ వినీత్” అంది.
“హాయ్” ఆశ్చర్యంగా అన్నాడు.
“ఏంటి అలా చూస్తున్నారు” నవ్వుతూ అంది.
“మీరు నాకు హాయ్ చెప్పారు. నేను ఊహించలేదు. అందుకే షాక్ అయ్యా”
“హాయ్ చెప్పడం నేరమా ఏంటి షాక్ అయ్యారు?”
“నో నో అలా కాదు” కంగారు పడిపోయాడు.
“ఇక్కడ తెలిసినవాళ్ళు ఎవరు లేరు. రాగానే మొదట సరదాగా మాట్లాడింది మీరే. అందుకే పలకరించా. అంతే” తిరిగి తనే “ఓకే క్యారీ ఆన్ … అలా కాసేపు గార్డెన్ లో కూర్చుంటా” అనేసి వేగంగా అక్కడినుంచి కదిలింది.
కాత్యాయని అనుకున్నట్టే ఆమె వెనకే అడుగులేసాడు వినీత్.
బెంచ్ మీద కూర్చుని పక్కకు చూసిన ఆమెకి ఎదురుగా వినీత్ కనిపించాడు. “ఏంటి మీరు కూడా వచ్చారా” అంది.
“రాకూడదా…” అన్నాడు అతనూ నవ్వుతూ.
ఆమె నవ్వింది.
“మీరు చాలా అందంగా నవ్వుతారు” అన్నాడు ఆమెనే చూస్తూ.
“నన్ను పొగుడుతున్నారా? నేను ఇలాంటి పొగడ్తలకు పడను” అంది నవ్వేస్తూ.
“మరి వేటికి పడతారు?”
“ఎలా పడతానో ఎవరైనా చెబుతారా” అంది నవ్వుతూనే.
అలా మొదలైన వారి సంభాషణ అరకు, ప్రకృతి వైపు మళ్ళింది.
కాసేపటికి “అపుడు మాట్లాడినపుడు అన్నారు కదా నాలాంటి అమ్మాయి ఈ హోటల్ కి వచ్చిందని” అంది. అతనితో ఆమె ఇలా మాట్లాడటానికి కారణం ఇదే తనను పోలిన అమ్మాయి ఎవరా అని తెలుసుకోడం కోసం.
“యెస్”
“ఆమెను మీరు ప్రేమించారా?”
“అదేంటి అలా అడిగారు?”
“అంటే మామూలుగా ఇష్టపడ్డ అమ్మాయిలనే కదా అబ్బాయిలు ఇంకో అమ్మాయిలో చూస్తారు. మీరు నేను అమెలా ఉన్నా అన్నారుగా… అందుకే..” ఆర్థోక్తిగా ఆగింది.
“ఓహ్ అలా అన్నారా”
“యెస్”
“మీకో విషయం తెలుసా ఈ అందమయిన అమ్మాయిలందరూ పెద్ద ఫ్రాడ్ లు” అన్నాడు.
“వాట్ డు యు మీన్? అంటే నేను ఫ్రాడ్ అనా? లేక నేను అందంగా లేననా?”
“నో నో .. నా ఉద్దేశం మీరు కాదు. మీరు చాలా అందంగా ఉన్నారు. కొందరు అమ్మాయిలు. జస్ట్ సం ఆఫ్ దెం”
“మరి అందరు అమ్మాయిలూ అంటే అలాగే వస్తుంది అర్థం. సరే కానీ ఇప్పుడు అమ్మాయిలు… ఫ్రాడ్ అని చెప్తున్నారు ఎవరి గురించి? ఏమైంది అసలు?” అడిగింది.
“మీలాగే ఉన్న హైదరాబాద్ అమ్మాయి ఇక్కడికి వచ్చింది అన్నా కదా…”
“అవును”
“ఆమె పెద్ద మోసగత్తె”
“అదేంటి అలా అంటున్నారు?”
“యెస్. నిజమే అంటున్నాను. ఆమె, నా స్నేహితుడు ఒకప్పుడు ప్రేమికులు. ఏమైందో కాని వాడిని వదిలేసి ఇంకోకొన్ని పెళ్లి చేసుకుంది. వాడితోనే ఇక్కడికి వచ్చింది”
“ఓహ్ మీరు ఆమె గురించి చెబితే మీరే ప్రేమించారేమో, మిమ్మల్ని కాదని తను వెళ్లిపోయిందేమో అనుకున్నా”
“నో.. అయినా ఇపుడా విషయం మన మధ్య ఎందుకులే”
‘మన మధ్యలో ఎందుకా? అబ్బో!’ అనుకుని “ఎలా ఉంటుంది ఆమె? ఏమైనా ఫోటో ఉందా? అంటే నాలా ఉందన్నారుగా… ఒకసారి చూద్దామని” అంది.
“ఫోటో… లేదు నా దగ్గర” అన్నాడు.
‘ఫోటో నిజంగానే లేదా లేక అబద్ధం చెప్తున్నాడా? ఎలా ఆ అమ్మాయి అపూర్వా కాదా అన్న విషయం తెలుసుకోవడం?’ ఆలోచిస్తోంది కాత్యాయని.
“ఏమైంది అలా సైలెంట్ అయిపోయారు?”
“మీ ఫ్రెండ్ ను మోసం చేసిన అమ్మాయి నా లాగ ఉందన్నవుగా. ఆమెను చూసి నన్ను చూసిన వాళ్ళు నా కారెక్టర్ కూడా అలాంటిదే అనుకుంటారా అనిపిస్తోంది” ఇదే అదునుగా అంది.
“హేయ్… అలా ఎందుకు అనుకుంటారు. ఆమె వేరు నువ్వు వేరు” అన్నాడు.
“నేను ఆమెలా ఉన్నాననే నన్ను చూసావుగా. నన్ను అలాగే చూసావు అంటే నా గురించి కూడా నువ్వు అలాగే అనుకున్నవేమో కదా”
“లేదు లేదు. నేను మాములుగానే చూసా. అయినా నీకు ఆమెకు చాలా డిఫరెంట్. నువ్వేమి ఆమెలా ఉండవు”
“ఆమె ఫోటో చూస్తేనే కదా ఆ విషయం నాకు తెలిసేది. నువ్వు నా మనసు కుదుటపడటం కోసం నేనామేలా లేనని చెప్తున్నవేమో కదా”
“ఓకే. ఫర్ యు ఐ ఆస్క్ మై ఫ్రెండ్ హర్ ఫోటో”
అది వినగానే కాత్యాయని ముఖం వికసించింది.
సరిగ్గా అప్పుడే ఆమె మొబైల్ రింగ్ అయింది. వరుణ్ నుండి కాల్. “జస్ట్ ఎ మినట్ వినీత్. ఇంటి నుంచి ఫోన్” అని చెప్పి అక్కడి నుండి పక్కకు వెళ్ళింది.
“హలో వరుణ్” అంది.
“కాత్యా ఎక్కడున్నావ్? అపూర్వను చంపినా వాణ్ని పట్టుకున్నారు” ఉద్వేగంగా అన్నాడు అవతలి నుండి వరుణ్.
“వాట్?”
“యెస్. ఇన్స్పెక్టర్ చెప్పాడు”
“ఎవరు చేసారు?” గుండె వేగంగా కొట్టుకుంటూంటే అడిగింది.
“చెన్నైలో ఉండే ఎవరో వరుణ్”
ఎన్నో ప్రశ్నలు ఆమెను చుట్టుముడుతూంటే “నాకు ఇన్స్పెక్టర్ నంబర్ ఇవ్వు వరుణ్” అడిగింది.
“నంబరా? ఎందుకు? వెళ్లి కలవవచ్చుకదా కాత్యా”
“నువ్వు ముందు నంబర్ ఇవ్వు”
“ఓకే రాస్కో” నంబర్ చెప్పాడు వరుణ్.
మొబైల్ లో నంబర్ నోట్ చేస్కుని “ఓకే వరుణ్ మళ్ళి మాట్లాడతా” అని చెప్పి కట్ చేసింది. వినీత్ దగ్గరకొచ్చి “వినీత్ మళ్ళీ మాట్లాడదాం” అంది.
“ఓకే” అన్నాడు చిరునవ్వుతో.
చిన్నగా నవ్వి వేగంగా అక్కడి నుండి కదిలింది.
రూమ్ లోకి వెళ్ళగానే ముందు డోర్ మూసి, బెడ్ మీద కూర్చుని వరుణ్ చెప్పిన నంబర్ కి కాల్ చేసింది.
“హలో ఇన్స్పెక్టర్ అజయ్ స్పీకింగ్”
ఉద్వేగంతో ఆమె కాళ్ళు చేతులు స్వల్పంగా కంపిస్తూంటే “హలో ఇన్స్పెక్టర్ నేను కాత్యాయని. అపూర్వను చంపిన వాణ్ణి పట్టుకున్నారట? వరుణ్ చెప్పాడు” అంది.
“హలో కాత్యా. ఇపుడు నువ్వు ఎక్కడున్నావు?”
కాస్త తటపటాయించి “ఫ్రెండ్ ఇంటికి ఊరికి వచ్చాను. ప్లీజ్ చెప్పండి” అంది.
“ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ గోయింగ్ ఆన్ కాత్యాయని. పట్టుకున్న వ్యక్తే నేరస్తుడు అని ఖచ్చితంగా చెప్పలేం. నేరం అతనే చేసాడని ఋజువు కాలేదు”
“అసలు ఎలా కనిపెట్టారు? ఎవరతను అసలు”
“అపూర్వ, వరుణ్ కాల్ డేటా చెక్ చేసాము. అపూర్వ మరణించే ముందు రోజు ఆమె నెంబరుకు, వరుణ్ నంబరుకు ఒక నంబర్ నుంచి కాల్ ఉంది. వరుణ్ని పిలిచి ఎంక్వైరీ చేసాము. మేము అడిగిన అన్ని నంబర్స్ గురించి డిటైల్స్ చెప్పాడు కానీ ఆ ఒక్క నంబర్ గురించి అడిగినపుడు అతని ముఖంలో మార్పు చూసాము. గట్టిగా అడిగితే కాని వరుణ్ చెప్పలేదు. ఫైనల్లీ అది అపూర్వ ఎక్స్ బాయ్ఫ్రెండ్ ది అని చెప్పాడు.
పేరు చెప్పలేదట. కాల్ చేసి నీ భార్య నా గర్ల్ ఫ్రెండ్. నీలో ఏం చూసిందో లేదా నా దగ్గర ఏంలేదో తెలీదు గాని గాఢంగా ప్రేమించిన అపూర్వ నన్ను వదిలేసి నిన్ను పెళ్లిచేసుకుంది అన్నాడట.
ఏం మాట్లాడుతున్నావ్? ఆమె నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం ఎవడ్రా నువ్వు అని వాణ్ని వరుణ్ నిలదీసాడట. వెంటనే కాల్ కట్ చేశాడట. ఏదో ప్రాంక్ కాల్ అని వదిలేశాడట. ఈ విషయం గురించి అపూర్వతో మాట్లాడలేదట. ఆ నంబర్ ని ట్రేస్ చేసి చూస్తే అది చెన్నై లో ఉండే వరుణ్ అనే పేరు గల వ్యక్తిది. నా మైండ్ లో వెంటనే ఫ్లాష్ అయింది నువ్వు మొదటి నుండి ఫోనులో అపూర్వ వరుణ్ అని అనడం విన్న సంగతి చెప్పడం. మేము వెళ్లి అడిగేసరికి వాడు డిఫరెంట్ స్టోరీ చెబుతున్నాడు. ఆఫ్ కోర్స్ తప్పించుకోడానికి నేరస్తులు కథలు చెప్పడం మామూలే అనుకో”
“అపూర్వకు బాయ్ ఫ్రెండ్ ఆ? ఇంపాజిబుల్. ఇంతకీ వాడ్ని అడుగుతే యేమని చెబుతున్నాడు?”
“సరదా కోసం కాల్ చేసాడట అంతే కానీ ఆమె హత్యకు అతనికి ఏ సంబంధం లేదని గట్టిగా చెబుతున్నాడు”
“సరదా కోసమా? సరదా కోసం చేసే వాడికి హైదరాబాద్ లో ఉన్న భార్య భర్తల నంబర్లు ఎలా దొరికాయట?”
“గుడ్ క్వశ్చన్. అతని ఫ్రెండ్ ఇచ్చాడట. అతని కోసం మా వాళ్ళను పంపించాను. ఇవ్వాలో రేపో అతన్ని కూడా తీసుకొస్తారు”
“ఇన్స్పెక్టర్ ప్లీజ్. మీకు నేను కాల్ చేస్తుంట. దయచేసి నాకు ఏమైనా ఇంకా డీటైల్స్ తెలిస్తే చెప్పండి” రిక్వెస్ట్ చేసింది కాత్యాయని.
“తప్పకుండ చెబుతాను కాత్యయని”
“థాంక్ యూ సో మచ్” చెప్పి కాల్ కట్ చేసింది.
‘ఎవరు ఈ వరుణ్?’ ఆలోచిస్తోంది.
అప్పుడే ఆమె గది తలుపును ఎవరో తట్టిన చప్పుడు. ‘ఎవరయి ఉంటారు?’ అనుకుంటూ తలుపు తీసింది.
ఎదురుగా వినీత్.
“వినీత్?”
“ఫోటో చూస్తా చూస్తా అన్నావుగా ఇదిగో చూడు” అని మొబైల్లో ఓ ఫోటో ఓపెన్ చేసి కాత్యాయనికి చూపించాడు.
అందులో ఫోటో చూసిన కాత్యాయని ఒక్కసారిగా షాక్ అయింది.
కారణం అది అపూర్వ ఫోటో!
(ఇంకా ఉంది)