ఓ తండ్రి బాధ్యతను మరింత పెంచి
ఓ తల్లి ఆత్మీయతను కంటిలో దాచి
ఆ మనసు ఆరాటాన్ని పెదవంచున అణచి
ఆ కలల నావల్ని కడలి తీరం చేర్చి
ఆడుకుని మురిసిన ముంగిటని విడిచి
అడుగిడే మెట్టినింటి పిలుపుల్ని వలచి
పారాణి పాదాల, కస్తూరి గంధాల
అరవిచ్చిన అక్షంతో, ముకుళించిన హస్తాలతో
నవ బంధాల భారాలను చిరునవ్వున మోసేందుకు
నడచి వస్తోంది నళిని నేడు పందిట్లోకి
స్వాగతిస్తోంది నవ జీవనాన్ని మదిలోకి…
జంట హృదయాలు కొంగుముడి జతగా
సరాగాల శ్రుతిలో జరిపే ఆలాపనకు
తాంబూలాల మార్పున మొగ్గ తొడిగే శ్రీకారం…
నిండు స్వప్నాలు సంప్రదాయ సాయంతో
సంతోషాల తేలే బంధాలలో, సందోహాన వీచే
సమ్మోహన గాలిలో కలిసి పూసే మమతల ప్రాకారం…
భిన్న పార్శ్వాలు భేదం మరిచి ఒక్కటై
కనుల విందుగా పరిణయ జలంతో ప్రతిగా
కలలు పండించే బతుకు పంటల సాకారం…
మనసుల్ని ముడివేసి, అనుబంధాల మడిలో
అనురాగాల్ని అల్లేసి, తరగని ఆనందడోలికలో
వాయులీనాత్మలు దరించే అర్ధనారీశ్వర రూపం..
Nice poetry about wedding