Gangaa – Part 33

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

ఆ రోజు నాగుల పంచమి..

మడికెట్ల నరుసువాయి పూరీలు చేయడానికి పిండి తడిపి, ‘గంగా.. ఆ బేషన్ గిన్నెలో గోధమ పిండి తడిపి పెట్టిన.. ఆ పిండి పిసుకు. బాగా మెత్తగా పిసుకు. పిండి ఎంత మెత్తగా పిసికితే అంత మంచిగా పూరీలు సాగుతయ్.’ అన్నది.

నేను ఆ పిండి ముద్దను పిస్కుతె నా వేళ్ళు ఆ పిండి ముద్దలకు సొస్తలెవ్.

నేను ఆమెకు, ‘గట్టిగా ఉన్నది, నీళ్ళు పోసి పిస్కన్న’ అని అడిగిన.

అప్పుడు మడికెట్ల నరుసువాయి కోపంగా, ‘ ఆ మంచిగనే.. ఇగ నీళ్ళువోసి పిస్కుతె, పూరీలు మెత్తగ అయితయ్. ఆ మెత్తటి పూరీలను గోలిస్తే నూనె అంతా ఇంకిపోతది. నీళ్ళు వోసి పిస్కల్లా అంటున్నవ్.. నీళ్ళు పొయ్యకు, రోట్లెసి దంచు, అదే మెత్తగా అయితది’ చెప్పింది.

నేను పిండి ముద్దను తీసుకొని వెళ్ళి, రోట్లె పెట్టిన. రోట్లె పెట్టి రోకలి దుడ్డుతో దంచితే, రోకలి దుడ్డు ఎగురుతున్నది. అట్లనే ఒక గంటసేపు దంచిన. ఎంత దంచిన రోకలి దుడ్డు ఎగురుతున్నది కానీ పిండి మెత్తగా అయితలేదు. అట్లనే గట్టిగ ఉన్నది. పిండిని తీసుకుపోయి ఆమెకు చూపించిన.

ఆమె, ‘ఏం దంచినవ్? ఇంకా గట్టిగనే ఉంది. ఇంకా దంచుపో’ అన్నది.

నాకు చేతులు, చేతి వేళ్ళు నొస్తున్నయ్. ఇంకా దంచు అంటుంది అనుకున్న. నాకు దుఖం వస్తున్నది. కానీ ఏం చేస్తా, దంచ అంటే కొడతది అని మళ్ళీ దంచడం మొదలు పెట్టిన. నాకు భుజాలు, మోచేతులు బాగా నొస్తున్నయ్. బాగా చెమటలు వస్తున్నయ్. మళ్ళీ గంట సేపు దంచిన. అప్పుడు ఆమె వచ్చి, ‘ సాల్, పిండి తీసుకొని రా, పూరీలు చేద్దువు’ అన్నది.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45