ఏమిదీ…రెక్కలున్న సీతాకోకచిలుకకు – నచ్చిన
రంగులద్ది బొమ్మగా చూసి మురిసిపోతున్నాం..!
ఏమిదీ…రివ్వుమని ఎగిరి కేరింతలాడే గువ్వపిల్ల
రెండు కాళ్ళకీ – కాళ్ళసాయం వంటి రెక్కలకీ,
రాయి కట్టిన – రాతి గుండెల రాక్షస మూకలం మనం!
రెక్కాపక ఎగరమంటున్నాం పిట్టని – నిర్జీవపు
రాయికన్నా హీనం మనం..!
ఏమిదీ…మండుఎండల కొలిమిలో – పిందె
మామిడి రసాలు రక్తం జుర్రుకొను కర్కశం మనది ! ,
అ-మ్మ అవని నుదుటిన మట్టి కుంకుమ బొట్టు – మేనికి పులుముకొని —
ఆటలాడి-అలసిన పిమ్మట,
అ-మ్మ ఒడిలో సేదతీరాల్సిన బాల్యదశ బిడ్డలను..విద్యను
ముక్కున పట్టి అడిగిన చోటు చీదే –
మరయంత్రులుగా చేసుకుంటున్నాం మనం..!!
—————
రెక్కలిస్తే దేవుడు సీతాకోకకు – తాను ఎగి–
రే దారిలో రక్షణ కావాలి మనం..,
రెక్కల్లో బలం అవ్వాలి మనం…!!!
రివ్వుమని ఎగిరి కేరింతకొట్టే గువ్వ పిల్ల
రెక్కల స్వేచ్చకి నింగంత ఆటస్థలం అవ్వాలి మనం,ప-
రిధుల్లేనంత ఎత్తుకు —
ఎదగాలని చెప్పాలిమనం.!
ఎంత ఎత్తుకు ఎగిరినా నేలమీద వాలడం మరవద్దని
నేర్పాలి మనం..!
మండుటెండల- వేడికి చిరాకు పడమని
వెచ్చదనం ఆస్వాదించాలని నేర్పాలి మనం..!
మన్ను లో ఆటలాడమనే కాదు,
మన్నువిలువ పెంచే యంత్రాలు కనిపెట్టాలి అని నేర్పాలి మనం..!
మాయ చేయొద్దు మనం..!,
మబ్బుల్లా మారి కాంతికారకుడిని కప్పేసి,
మనం చూపే దారే వెలుగునిస్తుందని….!!
మిణుగురులై పంచుదాం మనం,
పున్న-మి వెన్నెల రేయిన కురిసే అమ్రృత ధార రుచిని!
NOTE:
తమ పిల్లల చదువు మాత్రమె కన్నవారికి వారి జీవితన్ని పరిపూర్ణత తో నింపుతుంధి అని భావించి తమ రక్తాన్ని పిల్లల చదువుకి దార పొసే తల్లి దండ్రులందరికి నా శతకోటి కైమోడ్పులు. అలాంటి వారంటే నాకెంతో గౌరవం.
పక్క వారిని చూసి ప్రతీది పోల్చుకుని పోటి కై పిల్లల పసి వయసు నుంచే వారి పై IIT చదవలి అని వొత్తిడి తెచ్చే తల్లి దండ్రులను ఉద్దేశించి రాసినది మాత్రమే ఈ కవిత. అంతే కాని ఎవరి వ్యక్తిగత మనోభావాల్ని దెబ్బ తీయాలి అని కాని కించపరచాలి అని కాని నా ఉద్దేశ్యం కాదు.