సోఫాలో కూలబడ్డాడు ఏడుస్తూ వరుణ్.
“ఏడిస్తే కరిగిపోయి నువ్వు నిర్దోషివని అనుకుంటానని భ్రమపడకు వరుణ్. ఐ నెవెర్ ఫర్గివ్ యు. నిన్ను ఊచల వెనక్కి పంపించందే నేను నిద్రపోను” అన్నాను.
టక్కున లేచాడు వరుణ్. క్షణకాలం నన్ను చూసి వేగంగా కిచెన్‌లోకి వెళ్ళాడు.
వరుణ్ చర్య అర్థం కాలేదు నాకు.
వెళ్ళిన వేగంతోనే చేతిలో కూరగాయలు తరిగే చాకుతో తిరిగొచ్చి ఎదురుగా నిలబడి “చేయని తప్పుకు మాటలతో చంపే బదులు నువ్వే చంపేయి కాత్యా. ఆనందంగా చచ్చిపోతాను. అలా అయిన అపూర్వ దగ్గరకి వెళతాను” అన్నడు చాకిస్తూ.
నా అడుగు అప్రయత్నంగా వెనక్కి పడింది. వరుణ్ కళ్ళల్లోకి చూసా. అతని కళ్ళు కొట్టొచ్చినట్టు చెబుతున్నాయి నిర్దోషని. కానీ ఎలా? ఎలా వారుణ్ నిర్దోషి అవగలడు? మొబైల్లో అపూర్వ వరుణ్ అనడం నిజం కాదా? నెవెర్… నా చెవుల నిండా విన్న. వరుణ్ కాకపొతే ఎందుకు వరుణ్ అంటుంది? అపూర్వకి వరుణ్ పేరుతొ భర్త తప్ప మరో స్నేహితుడు కాదు కదా తెలిసిన వాళ్లలో కూడా ఆ పేరు ఉన్నవాళ్ళు లేరు. నో… ! వరుణ్ ఈజ్ ద కిల్లర్! హి ఈజ్!! హి ఈజ్ జస్ట్ మేకింగ్ మి బిలీవ్ హిం. దట్స్ ఇట్. అలా అనుకోగానే విపరీత కోపం తన్నుకొచ్చింది నాకు.
“అబ్బా.. చాలా బాగా మాట్లాడుతున్నావు వరుణ్. నా స్థానంలో ఎవరున్నా నిన్ను నమ్మేస్తారు. కానీ నేను కాదు. ఈ వేషాలు నా దగ్గర వేయకు. అయినా నీతో మాట్లాడటానికి వచ్చాను చూడు నాది.. నాది బుద్ది తక్కువ. నువ్వు నిజం చెప్తావని అనుకున్నా కానీ ఇలా తెగించి మాట్లాడతావని ఊహించలేకపోయా. అయినా ఎలా ఊహిస్తాను? నువ్వు నా బావవి కదా. నిజం చెప్తావని అనుకున్నా. అపూర్వనే చంపావు ఇంకా నీకు అబద్ధం చెప్పడం ఓ లెక్కలోదా”
“నువ్వు ఇలా నమ్మవు కదా.. అయితే నేనే చస్తాను” అంటూ చాకుతో పొడుచుకోబోతుంటే అప్పటి వరకు వాళ్ళ అమ్మ ఎక్కడుందో తెలీదు కానీ టక్కున పరిగెత్తుకొచ్చి వరుణ్ ని ఆపింది. నా చెంప మీద చెళ్ళున చరిచింది. నాకు అర్థమవదా? అదంతా వాళ్ళ డ్రామా అని. ఛీ! కుటుంబం అంతా కలిసి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు.
“నువ్వసలు మనిషివేనా? అపూర్వ నీకు మాత్రమే అక్కనా. నాకు కోడలు కాదా వీడికి భార్యకాదా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్యని ఎలా చంపుతాడనుకున్నావే నా కొడుకు? చంపేసేలా ఉన్నావు కదే వీడ్ని” అంటూ వరుణ్ ని గుండెలకు హత్తుకుని భోరుమని విలపించింది. డ్రమాటిక్ గా. ఏమి ఆక్టింగ్.
అక్కడి నుండి అయితే వచ్చేసా కానీ వరుణ్ నేరాన్ని ఋజువు చేసి అపూర్వను చంపిన నేరానికి కనీసం శిక్ష అయిన పడేలా చేయడం ఎలానో అర్థం కాలేదు.
రాయడం ముగించి పక్కన పెట్టింది డైరీని.
‘అసలు వరుణ్ ఎందుకు అపూర్వని చంపాడు? దీనికి కారణం తెలియాలి. ఆ విషయం తెలియాలంటే అంతకు ముందు వారి ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియాలి. కానీ ఎలా? ఏం జరిగిందో చెప్పగలిగేది ఇద్దరే ఒకరు అపూర్వ రెండు వరుణ్. వరుణ్ చెప్పడం లేదు.. ఇక మిగిలింది అపూర్వే.. కానీ అది ఈ లోకంలో లేదే చెప్పడానికి’ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి కాత్యాయానికి.
‘వరుణ్ ఇంటి పక్కవాళ్ళను అడుగుతే ఏమైనా తెలుస్తుందేమో?’ అలా అనుకోగానే కొత్త ఉత్సాహం వచ్చినట్టయింది ఆమెకి. లేచేల్లి ల్యాప్ టాప ఆన్ చేసింది. సోషల్ నెట్వర్కులో అపూర్వ ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్న వాళ్ళ పక్కింటి సుజాతకి మెసేజ్ చేసింది. ఆన్లైన్ లో లేదు. ఫోన్ నెంబర్ చూసింది కానీ లేదు. ఆమె సమాధానం కోసం వెయిట్ చేయడం తప్పించి మరో దారి లేదు కాత్యాయనికి. ఇలా కాదని డైరెక్టుగా ఇంటికే వెళదామన్నా ఈ విషయం వరుణ్ కి వాళ్ల కుటుంబ సభ్యులకు తెలిసి నిజాన్ని వాళ్ళ నోటి నుండి కూడా రాకుండా నొక్కేస్తారేమోనని ఆమె భయం. అందుకే ఆన్లైన్ లో మెసేజ్ చేసింది. సుజాతతో ఆన్లైనులో అయితే చాలా పరిచయం కానీ ఆమెతో నేరుగా ఎక్కువ మాట్లాడింది లేదు. అపూర్వ దగ్గరకు వెళ్ళినప్పుడు అపుడపుడూ మాట్లాడేది కానీ తన ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు. అపూర్వకు మాత్రం సుజాత మంచి మిత్రురాలు.
నీరసంగా లేచేల్లి మంచం మీద పడుకుంది.
సాయంత్రం వచ్చింది సుజాత నుండి రిప్లై. ఆ సౌండ్ వింటూనే అప్పటి వరకు వచ్చి రాని నిద్రలో ఉన్న కాత్యాయని టక్కున మెలుకుని వెళ్లి కూర్చుంది ల్యాపీ దగ్గర. వెబ్ కాం ఆన్ చేసి వీడియో కాల్ చేసింది.
“హల్లో కాత్యా ఏంటి అర్జెంటుగా మాట్లాడాలని అన్నావ్?” అంది కాల్ రిసీవ్ చేసిన సుజాత. బెడ్ రూమ్ లో నుండి మాట్లాడుతోంది. గదిలో ఎవరు కనిపించడం లేదు. అయినా అనుమానంతో “నీతో పాటు ఇంకెవరూ లేరు కదా అక్కడ?” అడిగింది కాత్యాయని.
“నీకు ఆ అనుమానం అక్కరలేదు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉన్న”
“అపూర్వ గురించే సుజాత. అసలు అపూర్వ వరుణ్ ఎలా ఉండే వారు గొడవపడే వారా? మీ ఇల్లు పక్కనే కదా”
చిన్నగా నిట్టూర్చింది సుజాత. “వాళ్ళు చాలా అన్యోన్యమైన దంపతులు కాత్యా. నేనెప్పుడూ వాళ్ళు గొడవపడటం వినలేదు. నువ్వు పంపిన మెస్సేజ్‌లు అన్నీ చదివా. అయినా ఎందుకు నీకు వరుణే అపూర్వను చంపాడనిపిస్తోంది? ఫోనులో అపూర్వ వరుణ్ అని అన్నంత మాత్రాన ఆ టైమ్‌లో వరుణ్ వచ్చాడని, ఆమెని తనే చంపాడని ఎలా అనుకుంటావు చెప్పు? మామూలుగా తనకు తానూ వరుణ్ అని పిలిచిందేమో కదా. నాతో ఎప్పుడు మాట్లాడినా వరుణ్ గురించే ఎక్కువ మాట్లాడేది. ఏదైనా గుర్తొచ్చి అతని పేరు అన్నదేమో. అంత దానికి వరుణ్ ని అనుమానించడం తప్పు కాత్యా. వరుణ్ ఎంత మంచి వాడో ఈ కాలనీలో అందరికి తెలుసు. అయిన నీకు తెలియంది కాదా అతను ఎలాంటి వాడో.. చెప్పు?”
“ఇవన్ని నీ చేత అనిపించుకోడానికి కాదు సుజాత. ప్లీజ్ అలా గొడవ గానీ ఇంకా ఏదైనా వాళ్ళింట్లో జరిగిందా ఇలా జరగక ముందు. ప్లీజ్ గుర్తుతెచ్చుకుని చెప్పు సుజాతా” ప్రాధేయపడుతూ అడిగింది.
కాసేపు ఆలోచించి “లేదు కాత్యా.. నేను ఉన్నప్పుడైతే అలా నేనేమి వినలేదు. చూడలేదు. వాళ్ళ హాల్లో కిటికీ మా హాలు కిటికీలోకి కనిపిస్తూంది. వాళ్ళ కిటికీ కూడా తెరిచే ఉంటుంది. కానీ అపూర్వ హత్యకు గురయ్యే రెండు రోజుల ముందు నుండి నేను ఇంట్లో లేను. నేను లేనని మా ఆయన కూడా ఇంటికి రాకుండా వాళ్ళ అక్క వాళ్ళింటికి వెళ్ళాడు. సో ఇంటికి తాళం ఉంది. ఆ సమయంలో నువ్వు అనుమానిస్తున్నట్టు ఏమైనా జరిగుండొచ్చు మరి”
“అక్కడ వీధిలో ఎక్కడైనా సీసీ కెమెరాలు ఉన్నాయా సుజాత? అవి గాని ఉంటే ఆ రోజు అపూర్వ ఇంటికి ఎవరు వచ్చారు అన్నది తేలిగ్గానే తెలిసిపోతుంది గా”
“ఈ మాత్రం తెలివి పోలీసులకు ఉండదా కాత్యా. వాళ్ళు అన్నీ చెక్ చేసారు. మా ఎదురింటి వాళ్ళకుంది. వాళ్ళింటికి వెళ్లి చూసారట. ఆ ఇంటావిడే నాకు చెప్పింది. వరుణ్ ఆ ఇంటి నుండి కారులో వెళ్ళాక ఎవరు రాలేదు. తొమ్మిదిన్నరకో పదింటికో వరుణ్ వచ్చాడు. కానీ అతను వచ్చిన కాసేపటికే అంబులెన్సు పోలీసు వ్యానులు వచ్చాయి. అంటే అపూర్వ హత్యకు గురయ్యకే వరుణ్ రావడం స్పష్టంగా రుజువు అవుతోందిగా”
ఆలోచనలో పడింది కాత్యాయని.
“నేను ఆ సీసీ కేమెర ఫూటేజీ చూడటం కుదురుతుందా సుజాత. వాళ్ళింటికి నేను వచ్చి చూడాలనుకుంటున్నా” అడిగింది.
“హా రా. ఆ ఇంటి వాళ్ళు నాకు బాగా పరిచయం. నేను చెబుతా. చూడనిస్తారు”
“రాత్రికి పది తర్వాత వస్తాను. ఓకేనా? అప్పుడయితేనే వరుణ్ కి గానీ వాళ్ళ కుటుంబానికి గానీ నేను వచ్చినట్టు తెలియదు. ప్లీజ్ సుజాత రాత్రి అనుకోకుండా నాకు ఈ హెల్ప్ చేసి పెట్టు”
“ఓకే కాత్యాయని”
“చాలా థాంక్స్ సుజాత! ఆ .. ఇంకో విషయం. నువ్వు నేను వచ్చేంతవరకు ఈ విషయం ఎవరికీ చెప్పకు. మీ ఎదురింటి వాళ్లకు కూడా”
తలూపింది సుజాత ‘అలాగే’ అంటూ.
* * * * * *
సుజాత ఎదురింటి వాళ్ళు ఆమె అన్నట్టే నిజంగా మంచి వాళ్ళే. అంత రాత్రి వెళ్ళినా చూడమన్నారు. కాత్యాయని, సుజాత ఇద్దరు కలిసి వెళ్ళారు లోపలి గదిలోకి. వాళ్ళ పెద్దబ్బాయి పక్కనున్న కుర్చీల్లో కూర్చోమని, సీడీ వేసి ఆ రోజు వీడియో ప్లేయ్ చేసి “మీరు చూసి వెళ్ళేప్పుడు చెప్పండి” అనేసి వెళ్ళిపోయాడు.
వీడియో ప్లేయ్ అవుతోంది. వరుణ్ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. అపూర్వ గేటు దగ్గర నిలబడుతూంటే, వరుణ్ కారు ముందుకేల్లిపోయింది. అపూర్వకూడా ఇంట్లోకెళ్ళి తలుపేసుకుంది. విడియో ప్లే అవుతూ ఉంది… కాత్యాయని కన్నార్పకుండా తదేకంగా విడియోనే చూస్తోంది.
సుజాతకు మాత్రం నిద్ర ముంచుకు వస్తోంది. పదినిమిషాలయినా గడవక ముందే కునికి పాట్లు పడటం ప్రారంభించింది. అది గమనించి “సుజాత మరి నువ్వు ఇంటికేల్లు. నేను ఇది చూసేసి వెళ్తాను” అంది.
“సరే” అనేసి తను వెళ్ళిపోయింది.
టైం వేగంగా గడుస్తోంది. కొంచం కూడా విడియోను ఫార్వార్డ్ చేయకుండా చూస్తోంది కాత్యాయని.
ఇంతలో ఓ వ్యాను నెమ్మదిగా వచ్చి సరిగ్గా వరుణ్ ఇంటికి అడ్డంగా ఆగింది. కాత్యాయని కనుబొమలు ముడివడ్డాయి. వ్యాను వంక పరీక్షగా చూసింది. పాల వ్యాను. డ్రైవరూ దిగలేదు, ఎవరూ దిగలేదు కాసేపు ఆగినట్టే ఆగి మళ్ళీ వేగంగా వెళ్ళిపోయింది. ఇంటి వైపు చూసిన కాత్యాయానికి, గుమ్మం తెరిచి ఉండటం కనిపించింది. ‘అంటే ఇక్కడ సీసీ కెమెరా ఉందనీ ఆ హంతకుడికి తెలుసన్నమాట. అందుకే ప్లాన్ ప్రకారం ఇంటికి వెళ్లేముందే వ్యాను ఆపించి ఇంట్లోకి వెళ్ళాడు వరుణ్. వరుణ్ నీకు చాలా తెలివి ఉంది. బయటకి వెళ్ళేప్పుడు ఏం అడ్డం పెట్టించావు’ అనుకుంటూ చూడసాగింది. కాసేపటికి ఇందాకటి పాల వ్యానే మళ్ళీ వచ్చి ఆగింది. మళ్ళీ అలాగే వెళ్ళిపోయింది.
తలుపు తెరిచే ఉంది. ‘అంటే హత్య చేసి వెళ్ళిపోయాడు’ దుఖం ముంచుకొచ్చింది కాత్యాయనికి.
ఆమె దృష్టి అపూర్వ ఇంటి పక్కనున్న ఇంటి కిటికీ ఆకర్షించింది. ‘ఇది మూసి ఉండాలి కదా?’ అనుకుని వెనక్కి తిప్పింది. ఫస్ట్ సారి వ్యాన్ ఆగక ముందు ఆ ఇంటి కిటికీ మూసుంది. వ్యాను వెళ్ళగానే అపూర్వ ఇంటి తలుపు తెరిచుంది దాంతో పాటు సుజాత వాళ్ళింటి కిటికీ తెరిచుంది.
‘అదేంటి ఆ సమయంలో ఇంట్లో సుజాత లేనంది కదా? మరి కిటికీ? అబద్దం చెప్పిందా నాతో? ఛఛ! అయినా తను అలాంటిది కాదే? ఒకవేళ వరుణ్ ఆ ఇంట్లో ఎవరు లేరని దొంగతనంగా ఆ ఇంట్లో దాక్కుని ఉండి, వ్యాను వచ్చి ఆగగానే కిటికీ తీసుకుని బయటకు వచ్చి అపూర్వ దగ్గరకు వెళ్ళుంటాడా? కానీ వరుణ్ ఉదయం కారులో వెళ్ళాక తను మళ్ళీ రాలేదుగా. ఎలా దాక్కుంటాడు? ఆ ఇంటికి వెనక నుండి గానీ దారుందా?’ అనుకుంటూనే తన పక్కన సుజాత ఉందేమోనన్న భ్రమలో పక్కకు చూసింది. కానీ తను వెళ్లిపోయిందన్న విషయం గుర్తొచ్చి ‘ఛ.. అనవసరంగా వెళ్ళమన్నాను’ అనుకుంది. టైం చూసింది. పదకొండు దాటింది. ‘ఈ టైమ్‌లో వెళ్లి మాట్లాడితే బాగుండదేమో. రేపు మాట్లాడాతా’ అనుకుని లేచింది. బ్యాగులో తీసుకొచ్చిన యుఎస్‌బిని తీసి ల్యాపి పోర్టులో పెట్టి, సీడిలో ఉన్న ఆ విడియోని దాంట్లోకి కాపీ చేసుకుంది. తిరిగి బ్యాగులో పెట్టేసి, వీడియో క్లోజ్ చేసి వాళ్ళింట్లో చెప్పి బయటకు వచ్చేసింది.
రోడ్డు మీద నిలబడి అపూర్వ ఇంటినీ, సుజాత ఇంటి కిటికినీ కాసేపు చూసి ‘ఏమైనా అవని’ అనుకోని సుజాత ఇంటి వైపు నడిచింది. గేటుకు తాళముంది. పడుకున్నట్టున్నారు తలుపు మూసి లైట్లు ఆర్పేసి ఉన్నాయి. చెప్పులు విప్పి ఇంటి ప్రహరీ గోడను అతి కష్టం మీద ఎక్కి లోపలికి దూకింది. కుక్క గానీ ఏమైనా ఉందేమోనని అంతా కలియజూసింది. ఏమీ లేదు. ఆ ఇంటికి వెనుకవైపు నుండి కానీ పక్కకు కానీ తలుపుందేమోనని ఇంటి పక్క నుండి నడుచుకుంటూ పరికించి చూస్తూ ఇంటి వెనకవైపు వెళ్ళింది. ఆమె అనుమానం నిజమైంది. సుజాతది చాలా పెద్ద ఇల్లు ముందు వీధి నుండి వెనక వీధి వరకు ఉంది వాళ్ళిల్లు. మరో గుమ్మం ఉంది.
‘అంటే అపూర్వకి వెళ్తున్నానని చెప్పి వెళ్లి వెనక వీధిలో నుండి వచ్చి ఈ ఇంట్లో దాక్కున్నాడన్నమాట. ప్లాన్ ప్రకారం వ్యానును సీసీ కెమేరాకు అడ్డంగా చేసుకుని కిటికీలోంచి బయటకు వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు. అపూర్వ తలుపు తీయగానే వెళ్లి చంపేసుంటాడు’ ముక్కు పుటలు అదురుతూంటే విపరీత కోపంతో ఆ ఇంటి ఆవరణలోంచి బయటకు వచ్చి తన స్కూటీ పై ఇంటికి బయల్దేరింది మనసులో ‘రేపుంది వరుణ్‌కి…!’ అనుకుంటూ.
(ఇంకా ఉంది)