ఉపాధ్యాయుడంటే వెలుగుతున్న దీపము లాంటివాడు. వెలుగుతున్న దీపమే ఎన్నో దీపాలను వెలిగించగలదు. ఆ దీపాలు లోకానికి వెలుగునివ్వగలవు. అటువంటి దీపమే మనము ప్రస్తుతం తెలుసుకోబోయే “ఆన్ సులివాన్” అనే మహోన్నత అధ్యాపకురాలు. విధి వక్రించటము వలన కంటి చూపును, వినికిడి శక్తిని కోల్పోయినా, అంగవైకల్యాన్ని జయించి జీవించి లోకానికి తనలాంటి వారికి ఎంతమందికో వెలుగు చూపిన మహత్తర మహిళా “హెలెన్ కెల్లర్” గురించి వినని వారు తెలియని వారు ఉండరు. కానీ హెలెన్ కెల్లర్ పురోగమించాలి అన్న ఏకైక లక్ష్యముతో తన జీవితాన్నే త్యాగము చేసిన కెల్లర్ అధ్యాపకురాలు ఆన్ సులివాన్ అనే మహిళారత్నము గురించి తెలిసినవారు బహు కొద్దిమంది. ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా అటువంటి గొప్ప ఉపాధ్యాయురాలు ఆవిడ తన శిష్యురాలు హెలెన్ కెల్లర్ ను ఏవిధముగా తీర్చి దిద్దిందో తెలుసుకుందాము. అమెరికాలోని మసాచూసెట్స్ నగరానికి సమీపాన గల గ్రామములోని ఒక నిరుపేద కుటుంబములో ఏప్రిల్ 16, 1886లో ఆన్ సులివాన్ జన్మించింది, ఈవిడ జీవితము బాధలకు అద్దము వంటిది. తండ్రి తాగుబోతు పరమ సోమరి, తల్లి క్షయ వ్యాధి గ్రస్తురాలు వీటికి తోడు అన్ కు ఐదవ ఏట ట్రకోమా అనే కంటి జబ్బు వచ్చింది. తల్లి మరణించింది. తమ్ముడికి క్షయ వ్యాధి సంక్రమించింది. ఐదేళ్ల తమ్ముడిని ఏడేళ్ల ఆన్ ను వదిలి తండ్రి ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ పరిస్థితులలో ఆదరించే వారు లేక తమ్ముడితో ఒక ప్రభుత్వ అనాధ శరణాలయములో జేరి పట్టెడు మెతుకుల కోసము ఛీత్కారాలు, తన్నులతో దుర్భర జీవితాన్ని ఆన్, ఆన్ తమ్ముడు గడుపుతుండగా దేవుడు కరుణించి తమ్ముడికి చావు ద్వారా విముక్తి కలిగించాడు. ఉన్న ఏకైక బంధము తెగిపోవటముతో ఆన్ ఏకాంతములో కుమిలిపోతూ రెండేళ్లు గడిపింది. ఈ రెండేళ్లలో ఆన్ చూపు మందగించటము జరిగింది.
ఈ నిరాశా, నిస్పృహలలో ఒక రోజు చూపు లేని వారికి ప్రత్యేకముగా కొన్ని స్కూళ్ళు ఉన్నాయని తెలుసుకుంది. ఇది ఆమెకు ఒక ఆశాకిరణము. అమాయకముగా తానూ చదువుకుంటానని చెపితే గ్రుడ్డిదానివి నీకు చదువు ఎందుకని హేళన చేసేవారే తప్ప ఎవ్వరు సానుభూతితో ప్రోత్సాహము ఇవ్వలేదు. కానీ పదేళ్ల బాలిక ఆన్ లో చదివి తీరాలి అన్న తపన బలంగా నాటుకుపోయింది. ఒక రోజు ఆ విడిది గృహాన్నిసందర్శించటానికి వచ్చిన పెద్దమనిషి వెళ్లిపోతుంటే ఆయనకు అడ్డము పడి తన కోరికను ఆయనకు వెళ్ళబుచ్చుకుంది. ఆయన ఈ కోరిక విని ఆశ్చర్యపోయి సానుభూతితో సహాయము చేయటానికి ముందుకు వచ్చాడు కానీ ఆన్ కోరిక నెరవేరటానికి నాలుగేళ్లు పట్టింది. పద్నాలుగు ఏళ్ల వయస్సులో ఆన్ పెర్కిన్స్ అంధుల పాఠశాలలో మొదటి తరగతిలో చేరింది. ఆమె సహాధ్యాయులందరు ఐదు ఆరు ఏళ్ల వయస్సు వాళ్ళు పైగా బాగా వసతి గల కుటుంబాల నుండి వచ్చినవారు. ఈ విధముగా దారిద్ర్యపు భాధ, తోటి విద్యార్థినుల అధ్యాపకుల ఛీత్కారాలు, పరిహాసాల మధ్య ఎంతో ఓర్పుతో దృఢ సంకల్పముతో అన్ని అడ్డంకులను అవరోధాలను అధిగమించి ఆ పాఠశాలలో ప్రప్రథమ విద్యార్ధినిగా ఉత్తీర్ణురాలు అయింది. కానీ అంగవైకల్యము కలవారిని అంత సులభముగా ఈ సమాజము స్వీకరించి ఆదరించదు అన్నసత్యము ఆన్ కు ఉద్యోగ ప్రయత్నాల వల్ల తెలిసింది. దృఢ సంకల్పము భగవంతుని పట్ల ప్రగాఢ విశ్వాసము ఉన్నవారికి ఆలస్యముగానైనా అవకాశాలు వస్తాయన్న నిజము ఆన్ విషయములో ఋజువైంది. ఆన్ కు ఉద్యోగ అవకాశము హెలెన్ కెల్లర్ రూపములో వచ్చింది. హెలెన్ కెల్లర్ బాగా డబ్బున్న ఇంటిలో పుట్టింది కానీ ఆమెకు కంటిచూపుగాని వినికిడి శక్తి గాని లేవు పైపెచ్చు తల్లిదండ్రుల గారాబము, అంగవైకల్యము కలిగించిన మానసిక క్షోభ వల్ల కెల్లర్ ఆరేళ్ళ వయస్సుకే పరమ మొండి ఘటముగా తయారైంది ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు కెల్లర్ కు దాది(ఆయా) గా ఉండటానికి ముందుకు రాలేదు. పెర్కిన్స్ అంధుల పాఠశాల వారిని కెల్లర్ తల్లిదండ్రులు దాది కోసము సంప్రదించినపుడు ఇరవై ఏళ్ల ఆన్ కు ఆ దాది ఉద్యోగము దొరికే అవకాశము వచ్చింది.
కెల్లర్ తల్లిదండ్రులు ఈ చూపు మందగించిన ఆన్ ఎక్కువ కాలము పనిచేయక పోవచ్చు అన్న నమ్మకముతో ఆన్ ను ఆహ్వానించారు. ఆన్ అంతవరకు అంత పెద్ద ఇంటిని అన్ని వసతులతో చూడలేదు. ఇంట్లోకి అడుగుపెట్టిన ఆన్ “కెల్లర్ ఎక్కడ” అని అడిగి పెరట్లో ఒక పందిరి నీడలో మురికి బట్టల్లో ఉన్న కెల్లర్ ను చూసి ఆశ్చర్య పోయింది. శ్రీమంతుల కూతురు అయిఉండి కూడా చింపిరి జుట్టుతో మురికి బట్టలతో ముఖము దుమ్ము కొట్టుకొని ఏడుస్తూ కూర్చుని ఉంది. హెలెన్ కెల్లర్ తన అంగవైకల్యము గురించి ఆలోచిస్తూ మానసిక బాధకు లోనైనప్పుడు ఆవిధముగా ప్రవర్తిస్తున్నదని కెల్లర్ తల్లిదండ్రులు ఆన్ కు చెప్పారు. హెలెన్ ను అక్కున జేర్చుకొని బుజ్జగించటానికి ఆన్ ప్రయత్నించింది కానీ తనకు పరిచయము లేని ఆ చేతులను ఉక్రోషముతో విదిలించింది. ఆన్ చేతిలో సంచిని లాక్కొని ఆ సంచిలో ఏముందో వెతకనారంభించింది. కెల్లర్ వెతుకులాట చాకోలెట్ల కోసము కానీ ఆ సంచిలో కెల్లర్ కు ఆన్ చేతి గడియారము దొరికింది. ఆ గడియారాన్ని పెర్కిన్స్ పాఠశాల ఉపాధ్యాయులు ఆన్ కు బహుమతిగా ఇచ్చినది అయినా ఆన్ ఆ గడియారాన్ని నిస్సంకోచముగా కెల్లర్ కు ఇచ్చింది. అప్పుడు కెల్లర్ స్తిమితపడింది. ఆ తర్వాత ఆన్ తన గదిలోకి వెళితే కెల్లర్ కూడా ఆన్ వెంటే వెళ్ళింది. అది చూసిన కెల్లర్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆన్ పెట్టె తెరచి అన్ని వస్తువులను కెల్లర్ అమితాసక్తితో తడమనారంభించింది. చాకొలెట్ల కోసమే ఈ వెతుకులాట అని గ్రహించిన ఆన్, చాకోలెట్లు ఉన్న పెట్టె దగ్గరకు కెల్లర్ ను తీసుకువెళ్ళింది కానీ ఆ పెట్టెలో చాకోలెట్లు ఉన్న విషయము వినికిడి శక్తి లేని కెల్లర్ కు ఎలా తెలియజేయాలి? పెట్టె మీద కెల్లర్ చేతులు ఉంచి ఆ చేతులతో తన వేళ్ళను జేర్చి సంకేత భాషలో కెల్లర్ కు విషయము తెలియ జేసింది ఆన్. ఈ విధముగా ఇద్దరు భాషకు అతీతమైన ఒక ప్రత్యేక పద్ధతిలో అవగతము చేసుకోవటం మొదలు పెట్టారు. ప్రేమతో హెలెన్ కెల్లర్ లో పరివర్తన తీసుకురాగలను అన్న ఆన్ నమ్మకము ఎక్కువకాలం నిలవలేదు. అకారణముగా హెలెన్ కెల్లర్ ఆన్ మీద రెచ్చిపోయి ఒక సారి ముఖము మీద గుద్దటం వల్ల ఆన్ రెండు పళ్ళు ఊడి నెత్తురు ధార కట్టింది. అప్పుడు హెలెన్ కెల్లర్ కు క్రమశిక్షణ లోపించింది కాబట్టి సామ దాన దండోపాయాలను ఉపయోగించి అయినా, కెల్లర్ తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకముగా అయినా కెల్లర్ ను క్రమశిక్షణ లో ఉంచాలి అని ఆన్ నిర్ణయించుకుంది. ఈ విషయములో కెల్లర్ తల్లిదండ్రులకు ఆన్ కు అభిప్రాయభేదాలు నివురు గప్పిన నిప్పులా తయారైనాయి.
ఒక రోజు అందరు ఉదయము ఉపాహారానికి కూర్చున్నారు. కుర్చీలో కూర్చుని పళ్లెములోని ఆహారాన్ని చెంచాతో తీసుకొని తినాలి. అది పద్ధతి. కానీ కెల్లర్ తల్లిదండ్రులు కెల్లర్ అంగవైకల్యము, మొండితనం వల్ల పద్ధతులు నేర్పలేదు. అందువల్ల కెల్లర్ డైనింగ్ టేబుల్ చుట్టూ తిరుగుతు ఇతరుల ప్లేట్లలోని ఆహారాన్ని తీసుకుంటూ చిందర వందరగా పడేస్తూ నానా యాగీ చేస్తుండేది. ఈ సంస్కార రహిత పద్ధతులకు స్వస్తి పలకాలని ఆన్ నిర్ణయించుకుంది. ఇతరుల పళ్ళేలలో చేతులు పెడితే ముందు చిన్నగా కొట్టింది. తరువాత చెంప చెళ్లుమనిపించింది. ఇంకేముంది కెల్లర్ నేలమీద పడి శోకాలు మొదలుపెట్టింది. ఆన్, కెల్లర్ ను ఎత్తుకొని కుర్చీలో కూర్చోబెట్టి చెమ్చాతో తినిపించటానికి ప్రయత్నించింది. కెల్లెర్ పదే పదే నేలకేసి కొట్టటాలు చేసింది. కూతురు బాధ చూడలేక కెల్లర్ తల్లిదండ్రులు ఆ గదిలోంచి వెళ్లిపోయారు. కెల్లర్ బయటికి పోకుండా ఆన్ తలుపులు మూసివేసింది. కెల్లర్ ఆన్ ను కొట్టింది అయినా ఆన్ సహనంతో అన్ని భరించింది. చివరికి తన మొండితనం ఆన్ దగ్గర సాగదని తెలుసుకొని ఆన్ తనకు తినిపించటానికి ఒప్పుకున్నది. తినటము అయినాక మళ్ళీ గొడవ ప్రారంభించింది. ఈ విధముగా ఎంతో ఓర్పుతో ఆన్ కెల్లర్ ను తన దారిలోకి తెచ్చుకున్నది. కెల్లర్ తండ్రి ఆన్ తన కుమార్తెను ఆ విధముగా క్రమశిక్షణ పేరుతో కష్టపెట్టడము ఓర్చుకోలేకపోయాడు. ఆన్, కెల్లర్ మొండితనాన్ని వదిలించకపోతే పురోగతిని సాధించలేమని ఖారాఖంఢిగా చెప్పింది. ఆన్ ను వెళ్లిపొమ్మంటే ఇంకో దాది దొరకడము కష్టము కాబట్టి కెల్లర్ ను ఆన్ సంరక్షణలో వదిలి పక్కనే ఉన్నమరో ఇంటికి మకాం మార్చుకున్నారు. క్రమముగా ఆన్ చూపుతున్న ప్రేమాదరణల వల్ల కెల్లర్ లో గూడు కట్టుకున్నమొండితనము క్రమమముగా తగ్గసాగింది. ఇంక కెల్లర్ విద్యాభ్యాసము మొదలుపెట్టాలని ఆన్ నిర్ణయించుకుంది. ఆన్ చూపులేని వారి కోసము గల బ్రెయిలీ ఆంగ్ల వర్ణమాలను అధ్యయనము చేసి కెల్లర్ కు భోధన మొదలుపెట్టింది. ఆన్ ఒక బొమ్మను కెల్లర్ చేతిలో ఉంచి కెల్లర్ అరచేతిలో D-O-L-L అక్షరాలను పదే పదే వ్రాయగా ఆన్ కృషి ఫలించి కెల్లర్ స్వయముగా DOLL అనే అక్షరాలను వ్రాయగలిగింది. ఆ విధముగా రెట్టించిన ఉత్సాహముతో ఆన్ ఆ రోజంతా కొత్త పదాలను కెల్లర్ కు నేర్పింది. ఈ ఆట కెల్లర్ కు ముందు సంతోషముగా ఉన్నా క్రమముగా విసుగనిపించింది. కాబట్టి DOLL అనేది కేవలము ఒక పదము కాదు అది ఒక వస్తువు అన్న విషయము కెల్లర్ మనసుకు అవగతము అయేటట్లు చేయగలిగితే తానూ పూర్తిగా సఫలీకృతురాలైనట్లు భావించింది. ఆ ప్రయత్నములో కెల్లర్ ను నీటి కుళాయి దగ్గరకు తీసుకొనివెళ్ళి పంపు తిప్పి కెల్లర్ చేతుల మీదుగా ఆ నీరు పడేటట్లు చేస్తూ W-A-T-E-R అనే పదాన్ని పదే పదే వ్రాయించింది. ఆ విధముగా ఒక్కొక్క వస్తువును తాకించి ఆ పదాన్ని పదే పదే వ్రాయించి ఎన్నో వస్తువులను స్పర్శ ద్వారా గుర్తించగలిగేటట్లు చేసింది. జ్ఞానాన్వేషణ అనే ఆసక్తి నిప్పురవ్వను ఆన్, కెల్లర్ లో ప్రజ్వలింపజేసింది. ఈ విధముగా కెల్లర్ ప్రతి ముందడుగులోను ఆన్ అలుపెరగని విశేష కృషి నమోదు అయ్యాయి.
కెల్లర్ రాడ్ క్లిప్ కళాశాలలో చేరినప్పుడు తోడుగా ఆన్ కూడా వెళ్ళింది. విద్యాభ్యాసము తరువాత కెల్లర్ వికలాంగులకు సేవ చేయాలనీ నిర్ణయించుకున్నప్పుడు ఆమె ప్రయత్నాలన్నిటిలో చేదోడు వాదోడు గా బాసటగా ఆన్ నిలిచింది. తనకంటూ ఒక జీవితాన్ని, కుటుంబాన్ని ఏర్పరచుకోకుండా కెల్లర్ ను శిఖరాగ్రానికి చేర్చాలన్న ఏకైక లక్ష్యముతో ఏ మాత్రము పేరు ప్రతిష్ఠలను ఆశించకుండా కృషి సల్పిన మహోన్నత వ్యక్తి ఆన్ 1936, అక్టోబర్ 20న పరమపదించింది. అన్ని సక్రమముగా ఉన్న ఉపాధ్యాయులు అన్ని సక్రమముగా ఉన్న విద్యార్థులను తీర్చిదిద్దలేరా? ఆలోచించండి. ప్రయత్నించండి సఫలీకృతులు కండి.