శ్రీ శిష్ ట్లా ఉమామహేశ్వరరావుగారి “సిపాయి కథలు ” సంకలనము నుండి అపోహ కథ సమీక్ష

గ్రామీణులైన సిపాయిల జీవనవిధానాన్ని ఇతివృత్తముగా తీసుకొని వారి నోటి నుండి వచ్చిన మాటలను తడారకుండా కథలలో చొప్పించిన రచయిత శ్రీ శిష్ ట్లా ఉమామహేశ్వరరావు గారు, కాబట్టి వాళ్ళ మాటలుమొరటువి, జోకులు నేలబారువి, చేష్టలు కొంటెవి. కథలగురించి తెలుసుకోబోయే ముందు ముఖ్యముగా ప్రస్తుత తెలుగు పాఠకులకు అంతగా పరిచయములేని ఉమామహేశ్వరరావు గురించి ముందు తెలుసుకుంటే ఆ కథలలోని సారాన్ని, విషయాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు.

ఈయన బ్రతికింది కొద్దికాలమే (1909-1953). పుట్టింది గుంటూరు జిల్లా మంచాళ గ్రామములో సనాతన బ్రాహ్మణ వైదిక కుటుంబములో. ఆందువల్లే తన్నుతాను “అగ్రహారపు బడితే” గా చెప్పుకున్నాడు.  కవితా రంగములో ఈయనది రౌడీ వేషము. స్థిరమైన ఉద్యోగము, క్రమమైన జీవితము లేకుండా ఎత్తుడి సంసారిగా బ్రతికిన అనార్కిస్టు – సుడోమిస్టు. “అతి నవీనుల్లో కడు ప్రాచీనుడు” అని శ్రీ రంగము నారాయణబాబు గారి చేత, “వచన కవిత్వము ఆదిమ దశ  కవి” గా శ్రీశ్రీ చేత పొగిడించుకొని తను మాత్రము ఎవరికీ పూర్తిగా అర్ధము కాకుండా నిష్క్రమించిన తొలి తెలుగు వచన కవన రచయిత ఉమామహేశ్వరరావు గారు. శిష్ ట్లా మేధావుల దృష్టిలో జీనియస్ గాని వారన్నట్లు “ఎర్రటిక్ జీనియస్” అంటే ఎన్నో దారులు తొక్కాడు, మరెన్నో పోకడలు పోయినాడు ఏ ఒక్కటి స్థిరము  లేకపోవటమే ఆయన విశేషము. ఆంగ్ల సామెత “a rolling stone gathers no mass” ఈయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. ఏకాగ్రత ఒక్కటే శిష్ ట్లా లోపము. ఎందుకంటే సాహిత్యములో కథలు, గేయాలు, నాటికలు బాలల సాహిత్యము, వ్యాసాలు మొదలైనవి అన్ని ప్రక్రియలో చేయి పెట్టాడు, ప్రతి ప్రక్రియలో విభిన్నముగా కనిపిస్తాడు మూడు ముక్కల్లో చెప్పలాంటే శిష్ ట్లా ఏ సాహితి ప్రక్రియలోనయినా స్వతంత్ర ప్రతిభావంతుడు. శ్రీశ్రీకి  సహచరుడే గాక కొన్ని ముఖ్యాంశాల్లో మార్గదర్శకుడు, ఉత్తేజకర్త కూడా సిపాయి కథలు తెలుగు సాహిత్యానికి ఒక నూతన అలంకారము అని భారతి పత్రికలో శ్రీ రంగము నారాయణ బాబు గారు ప్రశంసించారు. వస్తువులోను, కధనములోను, ఈ సిపాయి కథలు నవ్య మార్గానికి చెందినవై ఆంధ్ర కథానికా సాహిత్య విచార సందర్భాన మంచి స్థానము గడించి పెట్టేవిగా ఉన్నాయని శ్రీ కురుగంటి సీతారామ భట్టాచార్యులు, శ్రీ  పిల్లలమఱ్ఱి వెంకట హనుమంతరావు గారు ఉమ్మడిగా వ్యాఖ్యానించారు. ఏదేశానికైనా యుద్ధము వస్తే ఆ యుద్ధము నుంచి సాహిత్యము లో కొన్ని నూతన మార్గాలు రావటము యుద్దానికి ఉండే ఒక ప్రత్యేకత. ఆ విధముగా వచ్చినవే ఈ సిపాయి కథలు. మన దేశము ప్రత్యక్షంగా ప్రపంచ యుద్దానికి సంబంధము లేకపోయిన బ్రిటిష్ పాలకుల పుణ్యామా అని మన సిపాయిలు బ్రిటిష్ వారి  తరుఫున పోరాడవలసి వచ్చింది.

తెలుగువాడు ప్రధానముగా “ఇంటి పట్టు మనిషి” అని పేరున్న రోజుల్లో అది నిజముకాదు అని ఈ కథలు నిరూపిస్తాయి. రెండవ ప్రపంచ యుద్ధము వల్ల ఏర్పడ్డ ఆర్ధిక మాంద్యము వల్ల బ్రతుకుల నడ్డి విరిగిన మధ్యతరగతి విద్యావంతులు సైతము ఉదర పోషణార్ధము సైన్యములో నానా  నౌకరీలకు ఎగబడవలసి వచ్చింది అటువంటి వేలాది మందిలో శిష్ ట్లా కూడా ఒకడు. ఆవిధముగా సైన్యములో చేరిన తెలుగువాళ్లు నేపాల్, చైనా, బర్మా, చివరకు ప్రాన్స్, మధ్య ప్రాచ్యము వంటి ప్రాంతాలకు వెళ్లి అక్కడి మట్టిలో కలిసిపోయారు. ప్రాన్స్ దేశపు బయళ్లన్నీ మన సైనికుల ఎముకలతో తెలుపెక్కాయని శ్రీమతి సరోజినీ నాయుడు గారు ఒక గీతములో వర్ణించారు. ఏ  యుద్దములోనైనా ఎక్కువగా చనిపోయేది సాదా సిపాయిలే అందుకనే వాళ్ళను “ఫిరంగుల దాణా” అని అంటారు. భారతీయ సైనికులు దాడులను తిప్పికొట్టే సన్నాహాలలో భాగముగా శిబిరాలను ఏర్పరచుకొని కాలక్షేపము చేసే సమయములో సిపాయిల మధ్య జరిగిన సంభాషణలు వాళ్ళు వేసుకొనే ముతక జోకులే ఈ కథలకు మూలము.  శిష్ ట్లా ఈ కథల్లో ప్రధానముగా వర్ణించిన ప్రాంతము ఇండో-బర్మా సరిహద్దు. ఈ కథలలో “క్యాప్టె న్ తులసి” తప్ప మిగిలిన సిపాయి కథలన్నీ నాటు  భాషలో రాయబడ్డాయి. ఈ రకము భాష రాయడము కష్టము చదివి అర్ధము చేసుకోవటం కూడా బహు కష్టమే. ఈ కథలలో పాత్రల పేర్లు కూడా తమాషాగా ఉంటాయి. గురకానందము, మూడు మొగాల నరసి గాడు, పెద బొండాము గాడు,  నక్కాయి గాడు, గూబ గోపాయిగాడు, గన్నరు గురుమూర్తి, గుంయి గుంయి గురివి మొదలైన తమాషా పేర్లు సిపాయి కథల్లో మచ్చుకు.

ఒక కథ గురించి మీకు చెపుతాను ఆ కథ పేరు “అపోహ” ఈ కథ 1946లో భారతి పత్రికలో ఆకాశవాణి కథలు అనే శీర్షిక క్రింద ప్రచురించబడింది. కథా విషయానికి వస్తే ఈ కథలో బ్రతికి చెడిన కుటుంబము, భర్తలేని సుందరమ్మ నలుగురు సంతానంతో కష్టాలు పడుతూ ఉంటుంది. ఆ కుటుంబానికి ఆధారము పెద్దకొడుకు రాధాకృష్ణమూర్తి. ముప్పై అయిదు రూపాయల జీతమే ఆ జీతంతోనే తల్లి సుందరమ్మ చాలా జాగ్రత్తగా సంసారాన్ని గడుపుకొస్తుంది. భర్త పోయిన మొదట్లో అవి ఇవి అమ్ముకొని ఉన్న ఇంట్లోనే చాలా కాలము ఉన్నారు. ఇంక అద్దె భరించలేక ట్రిప్లికేన్ (చెన్నైలో ఒక ప్రాం తము)లో  రెండు భాగాలు ఉన్న ఒక చిన్న ఇంటిలోఅద్దెకు దిగారు. ఇల్లు చిన్నది అయినా గాలి బాగా వస్తుంది బాగుంది, సర్దుకుందాము తనకు వచ్చే అయిదు రూపాయల అదనపు ఆదాయము ఉన్నది కాబట్టి ఇబ్బంది ఏమిలేదు అని పెద్దకొడుకు తల్లికి నచ్చచెపుతాడు. మిగిలిన పిల్లలు శేషు పదేళ్లవాడు, సరస్వతి ఏడేళ్లది, చిన్నవాడు రేండేళ్ల వాడు పనిమనిషిని పెట్టుకొనే శక్తిలేక సుందరమ్మ  అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది.

రెండవకొడుకు శేషును ఏదైనా పనికి పంపిద్దామని ఆలోచన వచ్చినా అది మానుకొని తానె కష్టపడాలని నిర్ణయించుకొని పెద్దకొడుకును కుట్టు మెషీన్ తెమ్మని అడుగుతుంది. ఆ విధముగా శేషూను స్కూల్ ఫైనల్ దాకా చదివిద్దామని తల్లి పెద్దకొడుకు నిర్ణయించుకొని, పెద్దకొడుకు తల్లికి కుట్టు మెషీన్ తెచ్చి ఇస్తాడు అది అదనపు ఆదాయాన్ని ఇస్తుంటుంది. పెద్దకొడుకు బుద్దిమంతుడు కావడమే సుందరమ్మకు బీదరికంలో మిగిలిన అదృష్టము. కానీ గోరుచుట్టు మీద రోకలిపోటులా కష్టాలు ఒకటి తరువాత ఒకటి వచ్చినాయి. మొదటిపిల్లలకు స్ఫోటకము(మశుచి), సుందరమ్మకు పక్షవాతము వచ్చి ఒక చేయి పడిపోయింది. దానితో ఖర్చు పెరిగింది ఆదాయము తగ్గింది. కాబట్టి తల్లి కొడుకులు పొదుపు మార్గాలు వెదకసాగారు. ఆ రోజుల్లో అన్నింటికీ కట్టెలు ఆధారము రెండవ ప్రపంచ యుద్ధము తరువాత ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినటం వల్ల అన్ని రేట్లు పెరిగాయి అదేరోజుల్లో కట్టెల ధర పెరగటంతో కట్టెలను జాగ్రత్తగా వాడాలని తల్లితో పెద్దకొడుకు చెపుతాడు. పూర్వము ఉన్న ఇంట్లో కట్టెలు తరచూగా పోతుండేవి కానీ ఇక్కడ పోవటం లేదు నెలకు తెచ్చుకున్న కట్టెలు ఎక్కువ రోజులు రావటము సుందరమ్మ గమనించింది. కట్టెలు దొంగతనము చేస్తే పక్క పోర్షన్లో వాళ్ళు చేయాలి.  పక్క పోర్షన్లో ఉండేది ఎవరని కొడుకును సుందరమ్మ అడుగుతుంది పక్క పొర్షన్లొ రంగారావు అనే వ్యక్తి ఉంటున్నాడని, యేమి ఉద్యోగముచేస్తాడో తెలియదని, బాగా డబ్బున్న పిసినారి ఎవరికీ సహాయము చేయడని కొడుకు తాను విన్న విషయాలను తల్లితో చెపుతాడు.”మన దొడ్డికి అయన దొడ్డికి మధ్య చిన్న పిట్టా గోడే అడ్డము, పిసినారి వాళ్లకు దొంగ బుద్దులు కూడా ఉంటాయని అంటారు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి కట్టెలను జాగ్ర త్తగా కనిపెట్టుకుండాలి”, అని తల్లి కొడుకుతో చెబుతుంది. రాత్రిపూట దొడ్లో ఏమైనా చప్పుడు అయితే రంగారావే కట్టెల దొంగతనము చేస్తున్నాడని అనుమానము. ఒకరోజు అర్ధరాత్రి సుందరమ్మకు మెలకువ వచ్చింది  దొడ్లో కట్టెలుకదులుతున్నట్లు చప్పుడు అవుతుంది. ఇంకేముంది రంగారావే కట్టెల దొంగతనము చేస్తున్నాడని అనుకోని కొడుకును లేపి దొడ్లొకిపోయి చూసి రమ్మనింది. కొంచెముసేపటికి తిరిగివచ్చిన కొడుకు,”అమ్మా మన కట్టెలు రంగారావు దొంగిలిస్తున్నాడని మనము అపోహ పడ్డాము. కానీ నిజానికి అయన తన కట్టెల నుంచి కొద్ది కొద్దిగా మన కట్టెల్లోకి చేర వేస్తున్నాడు పాపము, చూడు”, అని తల్లితో చెపుతాడు అప్పుడు సుందరమ్మకు ఈ ఇంట్లోకి వచ్చినాక కట్టెలు ఎక్కువ రోజులు ఎలా వస్తున్నాయో అర్ధము అయింది. ధర్మముగా ఇచ్చినట్లనిపిస్తే ఏమనుకొంటారో అని అర్ధరాత్రి వాళ్లకు తెలియకుండా తనకట్టెల్లోనుంచి తీసి ఆ బీద సంసారానికి సహాయము చేస్తున్నాడు రంగారావు. కానీ ఇది తెలియని తల్లీకొడుకులు ముందు రంగారావు గురించి అపోహ పడ్డారు. కాబట్టి కంటి తో చూడందే ఎవరి గురించి ఏమి అనుకోకూడదు అని తల్లి కొడుకులు తీర్మానించుకున్నారు. మర్నాడు తల్లీకొడుకులు రంగారావు తో పరిచయము చేసుకున్నారు. పాపము ఆయనేమి పిసినారికాడు, పెద్ద ఆస్తిపరుడు కాదు. వచ్చేది స్వల్పం అయినా అందులోనుంచే ఆడంబరాలు లేకుండా దాన ధర్మాలు చేస్తాడు. తనకు పిల్లలు లేరు కాబట్టి సుందరమ్మ రెండవకొడుకు శేషు చదువుకు ఆర్ధిక సహాయము చేస్తానని చెపుతాడు. ఆవిధముగా సుందరమ్మ సంసారానికి హృదయ పరివర్తనముతో ఆర్ధిక పరివర్తనము కూడా వచ్చింది.