పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్

          భారతీయ స్వాతంత్ర సంగ్రామములో ప్రముఖ పాత్ర వహించిన త్రయము “లాల్, బాల్పాల్” వీరిలో మొదిటివాడైన లాలా లజపతిరాయ్ గురించి తెలుసుకుందాము. ఈయన జనవరి 28వ తారీఖు, 1865 వ సంవత్సరములో పంజాబ్ రాష్ట్రములోని దుఢీకె గ్రామములో మున్షి రాధాకృష్ణ ఆజాద్, గులాబీ దేవి దంపతులకు జన్మించాడు. తండ్రి మున్షి ఆజాద్ పర్షియన్, ఉర్దూ భాషలలో మంచి పాండిత్యము ఉన్నవాడు. తల్లి మతపరమైన సిద్ధాంతాలను నమ్ముచూ పిల్లలలో నైతిక విలువలను ప్రేరేపించటంలో కృషి చేసేది. ఆ విలువలే లాలా  లజపతి రాయ్ ని భావి జీవితములో స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేటట్లు చేశాయి. తండ్రి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రెవారి లోని ప్రభుత్వ హైయర్ సెకండరీ పాఠశాలలో స్కూల్ విద్యను పూర్తి చేసి 1880లో లాహోర్ లోని ప్రభుత్వ కాలేజీలో న్యాయ శాస్త్రము చదవటానికి చేరాడు. 

          కాలేజీలో చదువుతున్న రోజులలోనే ఈయనకు లాలా హన్స్ రాజ్, పండిట్ గురుదత్ వంటి ప్రముఖ స్వాతంత్ర సమారా యోధులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ తరువాత హిస్సారులో న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. చిన్నప్పటి నుండి దేశానికి సేవ చేయాలి అన్న దృఢమైన కోరిక ఉండేది అందువల్ల విదేశీయుల పాలన నుండి భారతదేశానికి విముక్తి కలుగజేయాలని ప్రతీన పూనాడు తండ్రికి రోహ్ టక్ బదిలీ అవటం వల్ల లజపతి రాయ్ కూడా లాహోర్ నుండి రోహ్ టక్ కు మకాము మార్చాడు. 1877 లో లాలా లజపతి రాయ్ రాధా దేవిని వివాహమాడాడు. మళ్ళా తన కుటుంబాన్ని హిస్సార్ కు మార్చి అక్కడ న్యాయవాద వృత్తి ప్రారంభించాడు. 1888, 89 జరిగిన నేషనల్ కాంగ్రెస్ వార్షిక సభలకు డెలిగేట్ గా హాజరు అయినాడు. 1892లో లాహోర్ హైకోర్టు లో ప్రాక్టీస్ చేయటానికి లాహోర్ లో మకాము పెట్టాడు.  లాలా లజపతిరాయ్ కి గ్రంథ పఠనము బాగా ఆసక్తి ఉండేది ఈ గ్రంథ పఠనము ఈయనలో  జాతీయ భావాలను, దేశభక్తిని పెంపొందించాయి ఇటాలియన్ విప్లవ వాద నాయకుడు గ్లుసెప్పే మాజ్జిని భోధనలతో ప్రభావితమైన లజపతిరాయ్ స్వాతంత్రము సంపాదించుకోవటానికి విప్లవమే మార్గమని నమ్మాడు. బాల గంగాధర తిలక్బిపిన్ చంద్ర పాల్, అరబిందో ఘోష్ వంటి నాయకులతో కలిసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లోని మితవాద నాయకుల విధానాలను వాటి వల్ల  కలిగే అనర్ధాలను గురించి సభలలో తీవ్రముగా ప్రతిఘటించేవాడు. ఆ విధముగా నేషనల్ కాంగ్రెస్ లో అతివాద వర్గమును ఏర్పాటు చేశారు. వీరి నినాదము “పూర్ణ స్వరాజు”  అంటే  పూర్తి స్వాతంత్రము అంతే తప్ప స్వపరిపాలన, సాంఘిక సంస్కరణలు లాంటిది కాదు. లజపతిరాయ్ స్వయముగా వివిధ మతాల మధ్య సుహృద్బావ వాతావరణము ఉండాలని నమ్మేవాడు. అయినా కాంగ్రెస్ లోని కొంత మంది నాయకులు ముస్లింల ప్రాపకాన్ని సంపాదించటం కోసము హిందువుల అభీష్టాలను అవసరాలను త్యాగము చేయాలనీ చెప్పటాన్ని పూర్తిగా వ్యతిరేకించేవారు. రాబోయే రోజుల్లో హిందూ, ముస్లింల విభేదాలు ఎక్కువ అవుతాయి కాబట్టి ఇద్దరు కలిసి స్వాతంత్ర పోరాటం సాగించటం కష్టమని నమ్మేవాడు అందుచేతనే భారతదేశాన్ని ముస్లిం ఇండియా నాన్ ముస్లిం ఇండియా గా విభజించాలి అని 1923, డిశంబర్ 14 న ఏర్పాటు చేసిన ట్రిబ్యూన్  ముందు వాదించి పెద్ద వివాదానికి తెర దీశాడు. లాలా లజపతి రాయ్ తన న్యాయ వాద వృత్తిని పూర్తిగా వదిలి మాతృ భూమిని బ్రిటిష్ సామ్రాజ్య వాద సంకెళ్లనుండి విముక్తి చేయాలి అని కృషి, పట్టుదలతో పోరాటము  చేశాడు భారత దేశానికి స్వాతంత్రము అవసరము అన్న అంశాన్ని స్వాతంత్రము కోసము జరిపే పోరాటం గురించి ఇతర దేశాల వారికి తెలియజేయవల్సిన అవసరాన్ని గుర్తించి, బ్రిటిష్ దమన నీతిని తెలియజేయటానికి 1914 లో ఇంగ్లండ్ కి, 1917లో అమెరికాకు వెళ్ళాడు. అమెరికాలో 1920 వరకు ఉండి ఇండియన్ హోమ్ రూల్ లీగ్ అఫ్ అమెరికా అనే సంస్థను న్యూ యార్క్ లో స్థాపించాడు. అమెరికా నుండి  తిరిగి వచ్చినాక  కలకత్తా లో జరిగే కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించటానికి ఆయనకు ఆహ్వానము అందింది. ఈయన నాయకత్వము లో జలియన్ వాలా బాగ్ హాత్యాకాండకు నిరసనగా అనేక ప్రదర్సనలు పంజాబ్ అంతటా జరిగినాయి. గాంధీ 1920  సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించినపుడే లాలా  చాలా చురుకుగా తన  పంధాలో  బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలకు నాయకత్వము వహించాడు. చౌరీచౌరా సంఘటన తరువాత గాంధీ ఉద్యమాన్నినిలిపి వేయాలని నిర్ణయించినప్పుడు లజపతి రాయ్ గాంధీతో తీవ్రముగా విభేదించి తన  సొంతముగా కాంగ్రెస్ ఇండిపెండెన్స్ పార్టీని స్థాపించాడు.

          అక్టోబర్, 30, 1928 న సైమన్ కమీషన్ లాహోర్ వస్తుంటే లాలా లజపతిరాయ్ సైమన రాకను నిరసిస్తూ సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో భారీగా నిరసన ప్రదర్శనను శాంతియుతముగా నిర్వహిస్తుంటే ఆ ఉద్యమాన్ని అడ్డుకోవటానికి  జేమ్స్ స్కాట్  అనే పోలీస్ అధికారి లాలా లజపతి రాయ్ ని  లక్ష్యముగా చేస్తూ లాఠీ ఛార్జ్ కు ఆదేశాలు ఇచ్చాడు కానీ లజపతి రాయ్ పోలీస్ లాఠీలకు భయపడకుండా ఉద్యామానికి ముందు నిలిచి తన అనుచరులకు స్పూర్తి నిస్తూ ముందు నిలబడి ప్రాణాలకు లెక్క చేయకుండా లాఠీ దెబ్బలు తిన్నాడు. అందుకనే ఆయనను “పంజాబ్ కేసరి ” అని భారతీయులు అభిమానంతో పిలుస్తారు కానీ దురదృష్ట వశాత్తు ఛాతీ మీద బలమైన లాఠీ దెబ్బలు తగలటం వల్ల తీవ్రమైన  నొప్పితో నవంబర్ 17,1928 వ తేదీన స్వర్గస్తులైనాడు. ఆ విధముగా బ్రిటిష్ వారి కుయుక్తులకు దమన నీతి కి పంజాబ్ కేసరి స్వాతంత్ర పోరాటంలో నేలకొరిగాడు. లాలా లజపతిరాయ్ మృత్యువుకు కారణమైన బ్రిటిష్ అధికారిని చంపి పగ తీర్చు కోవాలని చంద్రశేఖర ఆజాద్, భగత్ సింగ్ వంటి విప్లవ యోధులు వారి అనుచరులు స్కాట్ అనుకోని మరో బ్రిటిష్ అధికారి జెపి శాండర్స్ ను కాల్చి చంపి ఉరి కంబము ఎక్కారు. లాలా లజపతిరాయ్ ఒక్క స్వాతంత్ర్యోద్యమము లోనే కాకుండా ఇతర రంగాలలో కూడా తన ప్రాముఖ్యతను చాటుకున్నాడు. ఎందరో యువకులను స్వాతంత్ర ఉద్యమము వైపు నడిపించాడు. వారి హృదయాలలో స్వాతంత్ర సమరస్ఫూర్తిని రగిలించాడు. తానూ వారందరికీ మార్గదర్శకుడిగా ఉండి స్వాతంత్ర పోరాటం ముందుకు నడిపించాడు. ఆయన స్ఫూర్తితోనే మద్రాస్ లో సైమన్ కమీషన్ గోబ్యాక్ ఉద్యమములో పాల్గొన్న టంగుటూరి ప్రకాశము గారు బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి ఆంధ్ర కేసరిగా గుర్తింపు పొందాడు. లాలా లజపతి రాయ్ దయానంద సరస్వతి బోధనలకు ప్రేరితుడై ఆయన అనుచరుడిగా మారి నేషనలిస్టిక్ దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్ ను ప్రారంభించాడు. ఆర్ధిక రంగములో కూడా ప్రవేశించి ఒక బ్యాంక్ ను స్థాపించాడు. ఆయన స్థాపించిన బ్యాంక్ తరువాతి రోజులలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పేరుతో నేటికీ సేవలనందిస్తుంది. ఆ స్ఫూర్తితోనే భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు మన తెలుగు నాట ఆంధ్ర బ్యాంక్ స్థాపించారు. ఆయన తన తల్లి గారైన గులాబీ దేవి పేరిట 1927లో ఆడవారికి వైద్య సేవలందించటానికి గులాబీ దేవి  చెస్ట్ హాస్పిటల్ ను ప్రారంభించాడు. ఈ  విధముగా లాలా లజపతిరాయ్ ఒక్క  స్వాతంత్ర  పోరాటంలోనే కాకుండా విద్యా, బ్యాంకింగ్ ,వైద్యము వంటి రంగాల  ద్వారా ప్రజా సేవ చేసి భారతీయుల మనస్సుల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకొని అమరుడైనాడు.

Recommended Article: