ప్రపంచ వ్యాప్తముగా ఉన్న కొన్ని మూఢ నమ్మకాలు

Mudanammakalu – World Top 20 Superstitions in Telugu

Mudanammakalu
Mudanammakalu – World Top 20 Superstitions in Telugu

మనము ఏదైనా పని మీద బయలుదేరినప్పుడు ఎవరైనా తుమ్మితే ఆగిపోతాము అలాగే గుమ్మములో పిల్లి ఎదురైతే ఆగిపోతాము వీటి వల్ల పని అవ్వదేమో అన్న నమ్మకము ఇలాంటి నమ్మకాలను మూఢ  నమ్మకాలు అంటారు. మూఢ నమ్మకాలు వివిధ దేశాల సంస్కృతులలో ప్రబలంగా విస్తరించిన నమ్మకాలు. ప్రాచీన కాలం నుండి కొన్ని నమ్మకాలు మంచిని పెంచితే, మరికొన్ని శాస్త్రీయంగా నిరూపణ కానివిగా కనిపిస్తున్నాయి. ఈ రెండవ తరగతికి చెందిన నమ్మకాల్ని “మూఢ నమ్మకాలు” అంటారు. ఈ మూఢ నమ్మకాలు ఎక్కువగా చదువుకోనివారిలో, గ్రామాలలోను, ఆదివాసీ గిరిజన సమూహాలలో కనిపిస్తాయి.

ఒత్తిడి కారణంగా మనలో మూఢ నమ్మకాలు ప్రబలుతాయని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఈ రుగ్మత వల్ల ఆచార వ్యవహారాలపై నమ్మకం పెరుగుతుంది. ఫలితంగా అవాస్తవమైన అంశాలు కూడా నిజంగానే ఉన్నట్లుగానే భ్రమపడతారని పరిశోధకులు తెలిపారు. ఇటువంటివి మనకు చాలా ఉన్నాయి. విదేశీయులకు ఇలాంటివి ఉండవు. వాళ్ళు మనకన్నాగొప్ప నాగరికులు. ఆధునిక భావ జాలము కలవాళ్ళు అని మనము అనుకుంటాము కానీ ఈ మూఢనమ్మకాల విషయములో వాళ్ళు మనకు ఏమాత్రము తీసిపోరు. వాళ్లకు ఉండే మూఢనమ్మకాలు వాళ్ళవి టోటల్ గా ప్రపంచవ్యాప్తముగా ఏ దేశస్తులైన వీటికి అతీతము కారు అని నిరూపిస్తున్నాయి.

మూఢనమ్మకం అంటే పేరులోనే ఉంది వీటికి ఏవిధమైన లాజిక్ గాని సైన్టిఫిక్ రీజనింగ్ కానీ ఉండదు. ఎదో పెద్దవాళ్ళు చెపుతారు ఇంక అందరు తరతరాలుగా నమ్ముతారు. ఎవరు ప్రశ్నించారు ఎవరు వీటిని బ్రేక్ చేయటానికి ప్రయత్నించరు. ఎవరి భయం వాళ్లదే. ఎవరు మాత్రము చెడును ఆశిస్తారు? ప్రపంచ వ్యాప్తముగా ఉన్న అటువంటి కొన్ని మూఢ నమ్మకాలను మీముందు ఉంచుతాను చదివి కాసేపు నవ్వుకోండి.

1. హుషారుగా ఉన్నప్పుడు లేదా షవర్ బాత్ చేస్తున్నప్పుడు సాధారణముగా చాలా మందికి ఈల వేస్తుండటం అలవాటు అది సంతోషాన్ని తెలియ జేసే ఒక ప్రక్రియ అన్ని చోట్లా అది పనిచేస్తుంది కానీ లిథువేనియా లో మాత్రము ఇండోర్ లో అంటే బాత్ రూములలో స్నానాలు చేసేటప్పుడు లేదా గదులలో ఈలవేయకూడదు అలాచేస్తే వాళ్ళు దయ్యాలను ఆహ్వానించినట్లే అని వారి మూఢ నమ్మకము. పోనీ లెండి ఆరుబయట ప్రదేశాలలో ఈల వేసుకొనిస్తున్నారు.

2. సిరియాలో యోయో బొమ్మలను 1933లోనే నిషేదించారు. ఎందుకో తెలుసా? అక్కడి స్థానికులు ఈ యోయో బొమ్మలు కరువు కాటకాలకు కారణమని నమ్ముతారు అందుచేత ప్రభుత్వము  వారి మూఢ నమ్మకాన్ని గౌరవిస్తూ ఆ బొమ్మలను నిషేదించింది.

3. జర్మనీలో చేయకూడని పెద్ద తప్పు ఏమిటి అంటే ముఖ్యముగా నావికుడు అయితే, సిగరెట్ ను కొవ్వొత్తితో వెలిగించు కోకూడదు ఈ విధమైన మూఢ నమ్మకానికి కారణము జర్మనీలో నావికులు అగ్గిపెట్టల మీద సంపాదించేవారట. అగ్గిపెట్టల అమ్మకానికి ఈవిధమైన మూఢ నమ్మకాన్నిప్రజలలో వ్యాప్తి చేశారని అంటారు.

4. మీకు కుట్లు అల్లికలు ఇష్టమయితే ఇళ్లలోనే ఆ పనులు చేసుకోండి ఐస్ ల్యాండ్ లో మీరు కుట్లు అల్లికలు బయట చేస్తే వసంత ఋతువు ఆలస్యముగా ప్రారంభమవుతుంది అంటే చలికాలము పొడిగింపబడుతుంది అని అక్కడి స్థానికుల (మూఢ) నమ్మకము.

5. దక్షిణ కొరియా వాసులకు ఉన్న మూఢ నమ్మకము ఏమిటి అంటే కూర్చున్నప్పుడు కాళ్ల ను ఊపటము చేస్తే అరిష్టము దరిద్రము దాపురిస్తుంది అని మనలో కూడా పెద్దవాళ్ళు అలా కాళ్ళు ఊపరాదు అని అంటారు.

6. పెన్సిల్వేనియా జర్మన్ క్రిస్టియన్స్ క్రిస్టమస్ న్యూ ఇయర్ ల మధ్య కాలములో బట్టలు మార్చటం లేదా షవర్ బాత్ చేయటము మంచిది కాదు అటువంటి పని దురదృష్టాన్ని తెచ్చి పెడుతుంది అని వారి నమ్మకము.

7. తూర్పు యూరోప్ అంతటా ఉప్పు లేదా మిరియాల పొడి (పెప్పర్) ను క్రింద చల్లకూడదు ఈ మూఢ నమ్మకానికి కొంత చారిత్రాత్మక కారణము ఉంది. ఏమిటి అంటే పూర్వము ఈ రెండు చాలా ఖరీదైనవి కాబట్టి వీటిని క్రిందపడేసి వృధా చేయకూడదు అని వారి ఉద్దేశ్యము జర్మన్ నావికులకు కూడా ఇటువంటి నమ్మకము ఉంది. అజర్బైజాన్ ప్రజలు ఒక అడుగు ముందుకు వెళ్లి ఆ విధముగా ఉప్పు లేదా మిరియాల పొడిని క్రింద పారబోస్తే చెడు ఫలితాలు దాపరిస్తాయని నమ్ముతారు.

8. సెర్బియాలో మీకు తారసపడిన అప్పుడే పుట్టిన నెలల శిశువులను అందవిహీనంగా ఉన్నారని అనాలి(బాగున్నాకూడా) ఆలా చేస్తే ఆ తల్లి దండ్రులు మీకు ధన్యవాదాలు చెపుతారు. వినటానికి కొద్దిగా ఆశ్చర్యముగాను  వింతగానూ ఉంటుంది. శిశువులను అందముగా ఉన్నారంటే వాళ్ళు బాగా ఎదగరని వాళ్ళ నమ్మకము మనకు కూడా ఇంచుమించు అదే అభిప్రాయము దిష్టి తగులుతుందని అంటాము కానీ మనము మన పిల్లలను బాగా లేరు అని అనిపించుకోము ఎందుకంటే కాకి పిల్ల కాకికి ముద్దు కదా.

9. రష్యన్లకు పూల గుచ్చాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా సరీ సంఖ్యలో పూలు ఇవ్వకూడదు అలా ఇచ్చేది అంత్యక్రియలప్పుడే  అలాగే ఇచ్చే పూల గుచ్ఛములో పసుపు రంగు పూలు ఉండకుండా జాగ్రత్త పడాలి.

10. రష్యాలో ఎవరినైనా ఇబ్బంది పెట్టాలంటే వారికి పసుపు రంగు పూలు ఇస్తే సరిపోతుంది అంతటితో వారికి మనకు మధ్య ఉన్న రొమాంటిక్ రిలేషన్ షిప్ అంతమవుతుంది ఎందుకంటే రష్యాలో పసుపు రంగు పూలు వంధ్యత్వాన్నికి (పిల్లలు పుట్టక పోవటం)గుర్తు కాబట్టి రష్యాలో ఆడవాళ్లకు ఎప్పుడు పసుపు రంగు పూలు ఇవ్వకూడదు.

11. అర్జెంటీనాలో ప్రజలు ఎప్పుడు వైన్ (సారా) ను పుచ్చకాయ(వాటర్ మిలన్) తో కలపరు అలా కలిపితే చావు సంభవిస్తుంది లేకపోతె కనీసము కడుపులో గడబిడ ప్రారంభ మవుతుంది అని వారి నమ్మకము. .

12. యూరోపియన్ ప్రపంచములో నల్ల పిల్లిని చెడుకు గుర్తుగా పరిగణిస్తారు మనకైతే ఏ పిల్లి అయినా చెడుకు గుర్తు అందుకని పని మీద వెళ్ళేటప్పుడు పిల్లి ఎదురైతే అపశకునము అంటారు. అలాగే కీన్యా లో గుడ్లగూబ అరుపు విన్న
గుడ్ల గూబను చూసిన అది చావుకు సంకేతము లేదా కష్టాలకు మూలము అని నమ్ముతారు

13. కొరియాలో స్త్రీలు సక్రమముగా ఆకారము లేని పండ్లను తినరు అలా తింటే పుట్టే పిల్లలు కుడా వంకర టింకరగా పుడతారని నమ్ముతారు. మనవాళ్లు కూడా అతుక్కుపోయిన అరటి పండ్లను తినరు అలాచేస్తే  కవలలు పుడతారని అంటారు.

14. టర్కీ లోని సాంస్కృతిక శాఖ వారు ఆ దేశములోని పౌరులను చంద్రబింబము పడిన నీటిని త్రాగ కూడదని నిషేదిస్తారు అటువంటి నీరు అశుభాలను తెస్తుందని సాక్షాత్తు ప్రభుత్వ శాఖ చెపుతుంది.

15. వెల్ష్ స్త్రీలు వారి శిశువులకు గోళ్లు కత్తిరించరు ఆ విధముగా చేస్తే ఆ శిశువు దొంగగా మారతాడని నమ్మకము. కాబట్టి తల్లి శిశువుకు ఆరు నెలల వయస్సు వచ్చేదాకా గోళ్ళను ట్రిమ్ చేస్తారు లేదా తల్లి తన నోటితో గోళ్లను
కొరుకుతుంది.

16. జపాన్ లో తెల్లపాము ఎదురుపడితే అదృష్ట దేవత కనిపించిందంటారు. ఉత్తర దిశలో తల ఉంచి నిద్రిస్తే అది శాశ్వత నిద్రేనట. మరణించిన వారి తలలను ఉత్తర దిశలో ఉంచి అంత్యక్రియలు  నిర్వహిస్తారు. నాలుగు అంకెను అశుభ
సూచకంగా పరిగణిస్తారు.

17. ఇండోనేసియా-జకార్తా-తొమ్మిది అంకెను దురదృష్టకరమైనదిగా పరిగణిస్తుంటారు. ఈ అధ్యక్షుడు నష్టజాతకుడు, సునామీ భూకంపానికి దేశ అధ్యక్షుని ‘దురదృష్ట’ జాతకమే కారణమని అంటున్నారు.

18. గ్రీకు దేశస్థులు రక్షగా ఎర్రరాతి తాయెత్తును ధరించేవారు. పాండు రోగానికి స్ఫటిక రక్షలు ఉపయోగించేవారు. తెల్లగా ఉండి సప్త వర్ణాలను ప్రసరించే ఓపల్ చెట్టు ఆకులో పెట్టి పట్టుకుంటే మనిషి ఇతరులకు కనిపించకుండా సంచరించవచ్చని నమ్మేవారు.

19. చైనాలో పుట్టిన ఆడపిల్లల పాదాలు పెద్దవిగా ఉంటే అరిష్టము దరిద్రము అని నమ్ముతారు మనకు కూడా ఆ నమ్మకము ఉన్నది పుట్టుకతో అలా ఉంటే మనము ఏమి చేయము కానీ చైనా వాళ్ళు పుట్టిన ఆడపిల్లల పాదాలకు పెద్దవి కాకుండా గట్టిగ గుడ్డలు చుడతారు.

20. ప్రపంచవ్యాప్తముగా  క్రైస్తవులకు 13 అంకె అశుభము ఎందుకంటే క్రీస్తును 13 మందితో కలిపి డిన్నర్ తీసుకుంటున్నప్పుడు సైనికులు బందీ చేసి సిలువ వేస్తారు.

ఇవండీ ప్రపంచము నలుమూలల ఉండే కొన్ని మూఢ నమ్మకాలు మనదేశములో వస్తే ప్రాంతానికి ఒక్కొక్క రకమైన నమ్మకాలు ఉన్నాయి అవి మరోసారి చర్చిండుకుందాము.