భారతీయుడిగా, ఆసియా ఖండము నుండి భౌతిక శాస్త్రములో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి సర్ చంద్రశేఖర వెంకట రామన్. 1928లో భౌతిక శాస్త్రములో “రామన్ ఎఫెక్ట్” అనే అంశాన్ని కనుగొని ప్రపంచానికి తెలియజేసి 1930లో ఆ అంశానికి నోబెల్ బహుమతి పొంది భారతీయులు గర్వపడేలా చేసిన వ్యక్తి రామన్. ఈయన నవంబర్ 7, 1888లో మద్రాసు రాష్ట్రములోని తిరుచిరాపల్లి లో చంద్రశేఖర అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు జన్మించాడు. వీరి తండ్రి విశాఖపట్నము లోని Mrs.AVN కాలేజీలో అధ్యాపకుడిగా ఉండటము వల్ల విశాఖపట్నము సెయింట్ అలోయిసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ లో 11ఏళ్ల కే మెట్రిక్యులేషన్ పాస్ అయి 13 ఏళ్లకే FA(ప్రస్తుత ఇంటర్ తో సమానమైన పరీక్ష) పరీక్ష పాస్ అయి స్కాలర్ షిప్ పొందాడు. ఈ విధముగా విద్యాభ్యసములో ఎప్పుడు టాపర్ గా ఉండేవాడు. మొదటినుంచి పరిశోధనల పట్ల బాగా ఆసక్తి కలిగి ఉండేవాడు. తన పరిశోధనలలో మునిగి రాత్రి అంతా మేలుకొనేవాడు. చదువుకొనే రోజుల్లోనే సముద్రపు నీరు ఎందుకు నీలంగా కనిపిస్తుంది అన్నఆలోచన తో విషయాన్ని తెలుసుకోవటానికి అనేక ప్రయోగాలు చేసేవాడు చిన్నతనానే ఆ విధమైన జిజ్ఞాస అతనికి నోబెల్ ప్రయిజ్ రావటానికి ఉపయోగ పడింది. అనేక వరుస ప్రయోగాలను కాంతి పరిక్షేపణ అనే అంశముపై జరిపి చివరకు నోబెల్ బహుమతి గెలుచుకోవటానికి “రామన్ ఎఫెక్ట్” ను కనుగొన్నాడు.
FA పరీక్ష పాస్ అయినాక 1902లో మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో చేరి BA ఫిజిక్స్ డిగ్రీని బంగారు పతకంతో పొందాడు. 1907లో ఫిజిక్స్ లో MA డిగ్రీని కూడా సంపాదించాడు. గవర్నమెంట్ లోడిప్యూటీ అకౌంటెంట్ జనరల్ గా చేరి, ఆ ఉద్యోగాన్ని వదలి, ఉపాద్యయ వృత్తి, పరిశోధనల పట్ల ఉన్న అభిమానము వల్ల 1917లో కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరాడు. ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు భోదిస్తూ తన ప్రయోగాలను కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ అఫ్ సైన్స్ (IACS )లో కొన సాగించే వాడు. ఆ సంస్థలోనే తనకు నోబెల్ బహుమతి గడించి పెట్టిన అద్భుతమైన ప్రయోగాన్ని ఫిబ్రవరి, 28, 1928లో నిర్వహించి జాతికి అంకితము చేశాడు. అందుచేత మనకు స్వాతంత్రము వచ్చినాక భారత ప్రభుత్వము ప్రతి యేటా ఫిబ్రవరి 28 న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుతున్నారు.
రామన్ ప్రయోగాలలో సహాయకారిగా KS కృష్ణన్ అనే శాస్త్రవేత్త ఎల్లపుడు రామన్ కు తోడుగా ఉండేవాడు. నిజానికి రామన్ తో పాటు ఆయన కూడా నోబెల్ బహుమతిని పంచుకోవలసింది కానీ రాజకీయాల వల్ల ఆ అదృష్టము కృష్ణన్ కు దక్కలేదు కానీ రామన్ నోబెల్ బహుమతి అందుకొనేటప్పుడు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అణువులోని ప్రోటాన్, కేంద్రకాల ను కనుగొన్న రూథర్ ఫర్డ్ అనే శాస్త్రవేత్త రాయల్ సొసైటీలో తన అధ్యక్ష ప్రసంగము లో రామన్ స్పెక్ట్రోస్కోపీ ప్రయోగాన్నిమెచ్చుకుంటూ ఉటంకిస్తాడు ఫలితముగా రాయల్ సొసైటీ వారు అయన కృషిని మెచ్చుకొని ఆయనను సర్ బిరుదు తో సత్కరిస్తారు అప్పటినుండి సర్ సివి రామన్ గా పిలవబడ్డాడు. కానీ 1928లో ఆయనకు నోబెల్ బహుమతి లభించలేదు 1930లో నోబెల్ బహుమతి లభించింది. ఆ విధముగా రామన్ సైన్స్ లో నోబెల్ బహుమతి అందుకున్న మొదటి ఆసియా వాసి అంటే తెల్లవాడు కాని మొదటి వ్యక్తి రామనే.
1932లో సూరి భగవంతము అనే మరో శాస్త్రవేత్తతో కలిసి క్వాంటమ్ ఫోటాన్ స్పిన్ ను కనుగొన్నాడు ఈ ప్రయోగము వల్ల కాంతి యొక్క క్వాంటము స్వభావాన్ని తెలుసుకోవటం మిగిలిన శాస్త్రవేత్తలకు సులువైంది. నోబెల్ బహుమతి అందుకున్నప్పుడు అయన భావాలను గురించి విలేకరులు అడిగినప్పుడు వ్యక్తిగతముగా ఇది నేను సాధించిన విజయము అని చెపుతూ 1921లో యూరోప్ వెళుతున్నప్పుడు నీలి రంగులో ఉండే మెడిటరేనియన్ సముద్రము ను చూసి సముద్రజలాలు నీలి రంగులో ఉండటానికి గల కారణాన్ని తెలుసుకోవటానికి తనకు ఏడు సంవత్సరాలు పట్టింది అని చెపుతాడు. బహుమతి అందుకొనేటప్పుడు అందరు తెల్లవాళ్ళ మధ్య ఒకే ఒక్క భారతీయుడిగా తలపాగాతో కూర్చుని భారతదేము, భారతీయుల తరుఫున స్వీడన్ రాజు నుండి బహుమతి అందుకోవటము గర్వకారణము అయిన ప్పటికీ భారతదేశానికి స్వతంత్ర జెండా లేకపోవటం వల్ల బ్రిటిష్ వారి జెండా నీడన బహుమతి అందుకోవటం బాధాకర మని చెప్పి రామన్ తన దేశ భక్తిని చాటుకున్నాడు. ఈ మాటలు చెప్పేటప్పుడు ఆయనకు ఒక ప్రక్క ఆనందము మరొక పక్క దేశానికి స్వాతంత్రము లేదే అన్న బాధతో కళ్ళవెంబడి నీళ్లు కారాయి. ఆ విధముగా 42 ఏళ్ల వయస్సులో నోబెల్ బహుమతి అందుకొని భారతీయుల ఖ్యాతిని ఇనుమడింప జేసాడు.
నోబెల్ బహుమతి తరువాత రామన్ కు 1954 లో భారత ప్రభుత్వము భారత రత్న బిరుదును బహుకరించింది. ఆ విధముగా భారత రత్న అందుకున్న మొదటి శాస్త్రవేత్తగా ఖ్యాతి గడించాడు. రామన్ తన కృషి తో భారతదేశాన్ని నవీన శాస్త్రవేత్తల జాబితాలో చేర్చాడు. రామన్ కాంతి గురించేకాకుండా, తబలా, మృదంగము వంటి భారతీయ సంగీత సాధనల మధురమైన ధ్వనులపై న కూడా పరిశోధనలు చేసిన మొదటి శాస్త్రవేత్త రామనే. నవంబర్ 21, 1970లో స్వల్ప అస్వస్థత తరువాత బెంగుళూరులో పరమపదించారు. ఆయన గౌరవవార్ధము ప్రభుత్వము రామన్ పటము తో పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశారు. దురదృష్టము ఏమిటిఅంటే 1930లో అయన నోబెల్ బహుమతి అందుకున్న తరువాత నేటి వరకు ఏ భారతీయ శాస్త్రవేత్త నోబెల్ బహుమతి అందుకోలేదు పుట్టుకతో భారతీయులైనప్పటికీ అమెరికాలో సెటిల్ అయి అమెరికా పౌరులుగా డాక్టర్ చంద్రశేఖర్ ,డాక్టర్ హరగోబింద్ ఖోరానా నోబెల్ బహుమతులను అందుకున్నారు.