Gangaa – Part 45

గంగా

(గంగా అని పిలవబడే అనాధ యొక్క నిజ జీవితంలోని కొన్ని సంఘటనలు)

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45

రాసినవారు: గంగా

బయటకు పోయి, ఎండలో బండల మీద కూర్చున్న.

మడికెట్ల నరుసువాయి అవతలికి(బయటకి) వచ్చి, ‘గంగా బిందెడు నీళ్ళు బాయిలకెళ్ళి నింపుకద్దురా, ఇగో బిందె. కడిగి నింపుకురా’ అన్నది.

బాయి దగ్గరికి పోయి, నీళ్ళు చేది బిందె కడిగి, బిందెలో నీళ్ళు నింపిన. ఆ బిందెను రెండు చేతులతో లేపి, మోకాళ్ళకు ఆనించి, మెల్లగా నడుచుకుంటూ పోయి, బిందెలు పెట్టె గడెంచె మీద పెట్టిన.

ఆమె, ‘ఇగో బగోని తీసుకుపోయి, బంగ్లా మీద అర్రల మూలకున్న బానలకెళ్ళి శేగలు తీసుకురా’ అన్నది.

నేను బంగ్లా మీదికి పోయి, బానల నుండి శేగలను బగోనిల తీస్కచ్చి ఆమెకు ఇచ్చిన. మళ్ళీ ఇంకొక బగోని ఇచ్చి, దాంట్లో నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి, మంట పెట్టుమన్నది. అది కట్టెల పొయ్యి. దాంట్లో కట్టెలు పెట్టి కొంచం కిరోసిన్ పోసి, అగ్గి పుల్లతో మంట పెట్టిన. నీళ్ళు వేడిగా అయి మరిగినయ్. ఆమె ఆ శేగల్ని మరిగే నీళ్ళల్ల వేయుమన్నది. నేను నీళ్లల్ల వేసేటప్పుడు, వేడినీళ్ళు నా చేతులకు, కాళ్ళకు చిత్తుతున్నయ్. మంటలేస్తున్నయ్. నిల్చున్న.

ఆమె, ‘ఏమాయే, నిలవడ్డవ్. ఎయ్యు’ అన్నది.

‘వేడి నీళ్ళు చేతులకు, కాళ్ళకు చిత్తుతున్నయ్. మంటలేస్తున్నయ్’ అన్న.

ఆమె నా చేతిలోని శేగల బగోని తీసుకొని, శేగలను వేడి నీళ్ళలో వేసింది.

కొంచం సేపు అయినంక, శేగల బగోని మీద మూత పెట్టి నీళ్ళు అంపేసింది.

రాత్రి అయింది.

ఆమె, ఆమె భర్తకు, పిల్లలకు శేగలను పెద్ద గిన్నెల్లో వేసి, పాలు, నెయ్యి, చక్కెర వేసి ఇచ్చింది. నాకేమో ఒక ప్లేట్ల శేగలు వేసి, రెండు చెంచాల చక్కెర వేసి, తిను అని ఇచ్చింది. అవి తింటే పిండి రుచి ఉన్నయ్. నాకు తినబుద్ది కాలేదు. వాటిని తీసుకుపోయి, బర్లు తాగే కుడిదిలా పడేసిన.

పార్ట్స్
1 , 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 , 18, 19, 20,
21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45