పద్మవ్యూహం – కవిత

పద్మవ్యూహం లోనికి అడుగు పెడుతూన్నప్పుడు తెలియదు,

లోనికి వెళ్లడమే తప్ప తిరిగి వచ్చే అవకాశం లేదని!

కాళ్ళు నొప్పి పుట్టేలా తిరిగి, విసిగి, వేసారి

అనుభవం నేర్పిన పాఠాలతో,

బయట పడే మార్గం కోసం అన్వేషించాను. కానీ,

అది పద్మవ్యూహమని,

ముందుగానే దారి తెలియనివారు,

వెలుపలికి రాలేరని తెలుసుకున్నాను.

నిరాశతో, నిసృహతో,

భగవంతుని ప్రార్ధించాను.

అప్పుడు గుర్తుకు వచ్చింది,

అభిమన్యుడిని, శ్రీకృష్ణుడు కూడా రక్షించలేకపోయాడని,

అంతే,

నా తలరాతని, తెలివితక్కువతనాన్ని, తిట్టుకుంటూ,

విధి లేక మరణమనే విముక్తికై ఎదురు చూడడం తప్ప వేరే దారి లేదని తెలుసుకున్నాను.