ఎవరు… గ్రహాంతరవాసులా? – భాగం: 2

          సాయంత్రం… వరంగల్లో రైల్ దిగి, స్టేషన్ నుండి నేరుగా ప్రియాంక ఇంటికి వెళ్ళిన కాత్యాయని ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ప్రియాంక తన ఇంట్లోనే ఉంది.

          “ఏంటే ఇంట్లోనే ఉన్నావ్, మరి వచ్చేప్పుడు ఆంటి కి కాల్ చేస్తే లేవన్నారు?” టీ తాగి కప్పు టేబుల్ కింద పెడుతూ అంది.

          “నేనూ నీలానే ఆశ్చర్యపోయ అమ్మాయ్, నువ్వు చేసినప్పుడు ఇది ఇంట్లో లేదమ్మా, కనీసం నాకు ఇంటికి వస్తున్నా అని కూడా చెప్పి తగలడలా. ఇదిగో నువ్వు వచ్చే గంట ముందు ఇంటికి వచ్చింది. ఇంత  సడన్ గా చెప్పాపెట్టకుండా రావాల్సిన అవసరం ఎమోచ్చిందే అని అడుగుతే ఏమీ చెప్పడం లేదు. వచ్చినదగ్గరనుండి అలా మూగ నోము ఏస్కుని కూర్చుంది” అంది అపుడే మేడమీంచి హాల్లోకి వచ్చిన ప్రియాంక తల్లి వందన.

          ‘అవునా’ అన్నట్టు ప్రియాంక ముఖం చూసింది కాత్యాయని.

          ప్రియాంక మాత్రం తల వంచుకుని మౌనంగా కూర్చుంది.

          “చూసావా.. అది దాని వరస. నువ్వయిన కాస్త కనుక్కో” అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వందన.

          “ఏంటే ప్రియ ఇది?”

          బదులు ఇవ్వకుండా కాత్యాయని చేయి పట్టుకుని తన గదిలోకి తీసుకుపోయింది ప్రియాంక. గది తలుపు మూసి గడియవేసింది.

          అది చూసిన కాత్యాయని “ఏంటే ఇది?” ఆశ్చర్యపోతూ అడిగింది. మళ్ళీ తనే “ఏమయిందే అసలు?” అంది.

          “అంతా అయిపోయింది కాత్యా” అంటూ బెడ్ మీద కూలబడి బోరుమంది ప్రియాంక.

          “అసలేమయిందే” ఓపిక నశిస్తుంటే అడిగింది కాత్యాయని.

          “ఇంకేం కావలే అంతా అయిపోయింది” మళ్ళీ అదే మాట అని ఏడుస్తోంది.

          “అంతా అయిపోయిందా. మరి నన్నెందుకు పిలిచావ్? సరే మరి నేను వెళ్ళిపోత” కోపంగా అంటూ డోర్ దగ్గరికి నడిచింది కాత్యాయని.

          “నేను ప్రేమించిన రాహుల్తోనే నాకు ఎంగేజ్మెంట్ అయింది. నీకు తెలుసుగా…” అంటూ చెప్పడం ప్రారంభించింది ప్రియాంక.

          నడుస్తున్నదల్లా ఆగిపోయి “అవును. ఇంకో నెలలో మీ ఇద్దరికీ పెళ్లి కూడా అని మొన్నేగా ఇంటికి వచ్చి మీ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చావ్” వెనుదిరిగి ప్రియాంక దగ్గరికొస్తూ అంది.

          అవునన్నట్టు తలూపి, “రాహుల్… రాహుల్….” అంటూ మళ్ళీ ఏడుపందుకుంది ప్రియాంక.

          “రాహుల్? ఏమయింది రాహుల్ కి?” తన పక్కన కూర్చుంటూ అడిగింది కాత్యాయని.

          “రాహుల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు” అంది.

          “వ్వాట్!” నిర్ఘాంతపోయింది. భూమి ఆకాశం విడిపోయినా ప్రియాంక, రాహుల్ ప్రేమ మాత్రం విడిపోదు ఎప్పుడూ అనే తన మాటలు జ్ఞాపకం వచ్చాయి. “అసలు అలా ఎలా విడిపోయారు? ఇంత దాక వచ్చాక రాహుల్ ఎందుకు నీకు బ్రేకప్ చెప్పాడు?” అడిగింది కాత్యాయని.

          కాత్యాయని మాట పూర్తీ ఇలా అయిందో లేదో ఆమె చెంప చెళ్ళు మనిపించింది ప్రియాంక.

          బిత్తరపోయింది కాత్యాయని. చిమచిమలాడుతున్న బుగ్గ మీద చెయ్యితో రుద్దుకుంటూ “నేనేమన్నానే? నన్నెందుకు కొట్టావ్?” అంది.  

          “రాహుల్ నేను విడిపోయాము అని అంటావా? నాకు రాహుల్ ఎందుకు బ్రేకప్ చెప్తాడు?” అంటూ కోపంగా ఎదురు ప్రశ్న వేసింది ప్రియాంక.

          “నువ్వే కదే రాహుల్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నావ్” అమాయకంగా అంది కాత్యాయని.

          అంతే.. తన మాట పూర్తయిందో లేదో మళ్ళీ ఏడుపు అందుకుంది ప్రియాంక.

          బిక్క ముఖం వేస్కుని చూస్తుండిపోయింది కాత్యాయని. ఆమెకి ప్రియాంక ప్రవర్తన అంతుబట్టడం లేదు. మళ్ళీ ఏమంటే ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయంతో తనంతట తానూ చెప్పేంత వరకు సైలెంట్ గా ఉండటం కరక్ట్ అని అనుకుని మౌనంగా ఉండిపోయింది.

          అలా ఓ అరగంట గడిచిపోయింది…

          క్షణక్షణానికి కాత్యాయనిలో ఓపిక నశిస్తోంది. ఏమన్నా అందామంటే తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియాంక… అసలే ఏడుస్తోంది ఇంకా ఏదన్న అని దాన్ని ఎందుకు బాధపెట్టడం అని భరిస్తోంది.

          మరో పది నిమిషాల తరువాత ఖర్చిఫ్ కి ముక్కు బలంగా చీదుతూ “సారి కాత్య” అంది.

          “ఇపుడు సారి దేనికి?” చిరాగ్గా అంది కాత్యాయని.

          “నిన్ను కొట్టాగా”

          గుర్రుగా చూసింది ప్రియాంకని.

          వాడిపోయిన ముఖం, ఎర్రబడ్డ కళ్ళతో జాలి గొల్పేలా ఉన్న తనని చూడగానే అన్ని మర్చిపోయి  “అసలు ఏమైందే? ఎందుకిలా అయిపోయావ్?” అని అడిగింది కాత్యాయని.

          కళ్ళు తుడ్చుకుని “వారం క్రితం హన్మకొండలో ఉంటున్న నా దగ్గరకి రాహుల్ వచ్చాడు. సరదాగా ఎక్కడికైనా వెళదామా అన్నాడు. నేను ఎక్కడికి అన్నా. నువ్వు ఎక్కడికంటే అక్కడికి అన్నాడు. మళ్ళీ తనే నీకు ఫారెస్ట్ అంటే ఇష్టం కదా మనం అడవికి వెళదామా? అన్నాడు. నేను ఆనందంగా సరే అన్నా. అలా ఇద్దరం బయల్దేరాము. ఈ విషయాన్ని ఇద్దరం మా ఇళ్ళల్లో చెప్పలేదు….” అంటూ చెప్పడం ఆపింది.

          అందుకు కారణం… సరిగ్గా అప్పుడే గది తలుపులని తడుతూ ప్రియంకని వాళ్ళమ్మ పిలవడమే.

*        *        *        *        *        *

          సాయంత్రం…

          ఇంకాసేపయితే మసక చీకట్లు మాయమయ్యి అంతటా చీకటి పడేలా ఉంది.

          నల్లమల అడవిని ఆనుకుని ఉన్న చిన్న గ్రామం అది.

          పైకప్పులు కూడా లేని శిథిలావస్తలో ఉన్న చిన్న బస్టాపు దగ్గర హారన్ వేస్తూ ఆగింది ఆ ఊరికి వచ్చే లాస్ట్ బస్సు. రోజులో రెండు సార్లు మాత్రమె ఉదయం, సాయంత్రం ఆ ఊరికి బస్సులు వచ్చి వెళుతుంటాయి.

          భుజాన పెద్ద బ్యాగుతో అక్కడ బస్సు దిగాడు వినీత్. సుమారు పాతికేళ్ళ వయస్సు ఆకర్షిణీయ రూపం, దృడమైన దేహంతో ఆరడుగుల ఎత్తున్నాడు అతను.

          బస్టాపు దగ్గర నుండి దాదాపు అరకిలోమీటర్ నడిచి ఊర్లోకి వెళ్ళాలి. దారికి ఇరువైపులా పచ్చని పొలాలు. చుట్టూ చూస్తూ ఊరి వైపు నడుస్తున్నాడు వినీత్.

          వినీత్ ఊర్లోకి చేరుకునేసరికి మొత్తం చీకటిపడిపోయింది.

          కనిపించిన ఓ పెద్దాయన దగ్గరకెళ్ళి “నేను పని మీద సిటీ నుండి ఈ ఊరికి వచ్చాను. ఉండడానికి ఇక్కడేమైన లాడ్జ్, హోటల్.. లాంటిది ఏమైనా ఉన్నాయా” అడిగాడు వినీత్.

          “అలా నేరుగా వెళ్లి పక్కకు మలిగితే ఒక లాడ్జ్ ఉంది. వెళ్ళు” చెప్పాడు పెద్దాయన.

          ‘ఈ ఊర్లో బస చేసేందుకు లాడ్జ్ ఉందా?’ ఆశ్చర్యపోయాడు వినీత్. అంతలోనే ఓ విషయం జ్ఞాపకం వచ్చింది. ఒకప్పుడు అడవిని చూడటానికి ఈ ఊరికి చాలా మంది వచ్చే వారని, వాళ్ళ కోసం లాడ్జ్ కూడా కట్టించారని, అడవిలో జరిగే సంఘటనల వల్ల ఇపుడు పర్యాటకుల రాక మొత్తంగా పడిపోయిందని.

          ఆయన చెప్పిన లాడ్జ్ కి వెళ్లి ఒక రూమ్ బుక్ చేసుకున్నాడు వినీత్. వచ్చిపోయేవాళ్ళు లేక లాడ్జ్ దుస్థితిలో ఉంది. అంత పెద్దదేమీ కాకున్నా ఓ మోస్తరుగున్న రెండంతస్తుల లాడ్జ్ అది. కింద రూమ్ లలో పని జరుగుతుంది అనడంతో మేడమీద గది తీసుకున్నాడు. మెట్లెక్కి తన గదికి వెళ్ళాడు.

          అప్పటివరకూ ఉన్న ప్రయానబడలిక స్నానం చేస్తే కాస్త పోయినట్టు అనిపించింది వినీత్ కి. నైట్ ప్యాంట్, టి-షర్ట్ వేస్కుని బెడ్ మీద వచ్చి కూర్చున్నాడు తీరిగ్గా. తలతిప్పి కిటికీ వైపు చూసాడు దట్టమైన నల్లమల అడవి అందులోంచి కనిపిస్తోంది.

          ‘బయటికి పచ్చటి చెట్లతో ఆహ్లాదంగా కనబడుతున్న ఈ అడవి, లోపలికి వెళ్ళిన వాళ్ళని మాత్రం కబళించేస్తోంది’ అనుకున్నాడు.

          ‘అసలు అడవిలో ఏం జరుగుతోంది? ఎన్నడూ లేనిది ఇదేంటి కొత్తగా?’ అనుకుంటూ బ్యాగులోంచి తన డైరీ తీసుకున్నాడు.

          ‘మొత్తానికి నల్లమలని ఆనుకునున్న ఈ ఊరికి వచ్చాను. ఈరోజు నుండే నా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతున్న. ఎంత విచిత్రం. ఇప్పటివరకు సినిమాలలో డిటెక్టివ్ లు, పోలీసులు, ఇన్వెస్టిగేటింగ్ చేస్తుంటే బోర్ గా చూసేవాడిని. ఇవ్వాళ నేను కూడా ఇన్వెస్టిగేషన్ కి పూనుకుని ఈ ఊరికి వచ్చానంటే ఆశ్చర్యంగా ఉంది. నేను చేసేది సాఫ్ట్ వేర్ జాబ్. కానీ ఇపుడు నేను పూనుకున్న పని చాలా రిస్క్ తో కూడుకున్నది. అయినా పరవాలేదు… తప్పదు!

          ఆ సంఘటన జరగకపోయుంటే నేను నీకోసం ఈ అడవుల్లోకి ఇలా ఇన్వెస్టిగేషన్ కోసం రాకపోయేవాడిని రా… మిస్సింగ్ యు!

          ఏదేమైనా అవని. నేను ఈరోజు రాత్రే ఆ అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా’ అని డైరీ లో రాసి పక్కనపెట్టాడు. బెడ్ దిగి గదిలోంచి బయటకు వచ్చి మేడదిగి కిందికి వెళ్ళాడు తినడానికి.

          హోటల్ మామూలుగా ఉన్నా భోజనం మాత్రం చాలా బాగుంది అనుకున్నాడు వినీత్. పుష్టిగా భోంచేసి తన గదికి వచ్చేసాడు. రాత్రి అందరు పడుకున్నాక బయలుదేరడానికి కావలసిన అన్ని వస్తువులని సిద్ధం చేసుకున్నాడు.

          రాత్రి 11…

          కిటికీలోంచి బయటకి చూసాడు. ఊరంతా ప్రశాంతంగా ఉంది. జనాలు అందరు ఘాడ నిద్రలోఉన్నారు. చిన్న బ్యాగుని భుజాన వేసుకుని మేడ దిగి కిందికి వచ్చాడు. కింద ఓ కుర్రాడు ఉన్నాడు రిసెప్షన్ లో.

          “సార్ ఈ టైం లో ఎక్కడికి బయల్దేరారు”

          “చిన్న పనుంది. వెళ్ళాలి” అని అతన్ని దాటుకు వెళ్లి పోదాం అనుకున్నాడు కానీ ఆ కుర్రాడు-

          “ఈ టైమ్లో బయటకి వెళ్ళడం అంత మంచిది కాదు సర్. అదీ కాక ఈ ఊరు అడవిని ఆనుకుని ఉంది. ఈ అడవి గురించి మీకు తెలియదు సర్…” అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు.

          “నాకు అడవి గురించి అన్ని తెలుసు.  జాగ్రత్తలు చెప్పినందుకు థాంక్స్. ఇంతకీ నీ పేరేంటి?”

          “రంగ సర్”

          “ఏంటి నువ్వు ఇంకా పడుకోలేదా?”

          “లేదు సార్ నా డ్యూటి ఇక్కడే. రాత్రి పూట ఎవరికన్నా ఎమన్నా అవసరం ఉంటే చూస్తుంట”

          “సరే” అని బయటకి నడిచాడు వినీత్.

          చెప్పినా వినకుండా వెళుతున్న వినీత్ ని చూస్తూ “ఈ పట్నమోల్లు ఇంతే, ఏది చెప్పినా నమ్మరు” అనుకుని తన కుర్చీలో వెళ్లి కూర్చున్నాడు రంగ.

          వీధుల్ని నిశితంగా గమనిస్తూ అడవి దిశగా నడవసాగాడు వినీత్.

(ఇంకా ఉంది)

ప్రణయమా.. స్వార్థమా? 2 – భాగాలు: 12

ప్రణయమా… స్వార్థమా? 1  భాగాలు: 1234567