నడి వయస్సు దాటి మలి వయస్సులోకి ప్రవేశించినవారు, వృద్ధాప్యములోకి అడుగుపెట్టేవారు వారి జీవితము సుఖముగా సాగాలంటే కొన్ని సలహాలు పాటించాలి. ఈ సలహాలు చాలా మంది అనుభవపూర్వకంగా చెప్పినవి కాబట్టి ఇతరులకు చాలా మటుకు ఉపయోగపడతాయి. ఇవి చాలామందికి కొత్తగా అనిపించకపోవచ్చు తెలిసినట్లు అనిపించవచ్చు అయినా జాగ్రత్తగా చదివి వీలైనంతవరకు పాటించటానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలామందికి వృద్ధాప్యము ఒక శాపముగా తయారై భాదిస్తుంది. చాలా రకాల ఇబ్బందులతో బ్రతుకు దుర్భరం అవుతుంది. వీటన్నింటికి కారణము సరిఅయిన అవగాహన, ముందుచూపు లేకపోవటమే. అందువల్ల వృద్ధాప్యానికి చేరకముందే ఇటువంటి విషయాలు తెలుసుకొని జాగ్రత్త పడటము మంచిది.
1. దాచుకున్న డబ్బు మీ అవసరాలకు ఖర్చుపెట్టుకోండి:- ప్రతివారు వారి భవిష్యత్తులోని అవసరాలకు ఎంతో కొంత దాచుకుంటారు. ఈ డబ్బును మీరు ఎంతకష్టపడి సంపాదించి దాచుకున్నారో మీకు తెలుసు ఇతరులకు తెలియదు. ముఖ్యముగా పిల్లలకు. అందువల్ల వాళ్ళ అవసరాలకు కాకుండా మీ వ్యక్తిగత అవసరాలకు ఖర్చుపెట్టుకోండి. పిల్లల అవసరాలకు ఆ డబ్బు ఖర్చుపెట్టి మీ అవసరాలకు పిల్లలను అడిగితే వాళ్ళు ఏమి ఇవ్వరు. పైపెచ్చు మీ డబ్బును మీరు వృధాగా పాడుచేశారు అని నిందలు వేస్తారు. అందువల్ల వయస్సులో ఉన్నప్పుడు మీ కోసము డబ్బు దాచుకోవాలి. వృద్దాప్యములో డబ్బు మీకోసమే ఖర్చు పెట్టుకోవాలి.
2. పిల్లల, వాళ్ళ పిల్లల ఆర్ధిక ఇబ్బందుల గురించి మీరు వర్రీ అవకండి:- పిల్లలకు చదువులు చెప్పిస్తారు. ఇంకా జీవితములో వాళ్ళు స్థిరపడాలి. మీరు ఎల్లకాలం వారికి అండగా ఉండి వాళ్లకు ఆర్ధికంగా సపోర్ట్ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు వాళ్ళ తంటాలు వాళ్ళు పడి జీవితములో నిలదొక్కుకోవాలి. వారి గురించి మీరు(వృద్ధాప్యములో) అలోచించి మీరు చేయగలిగింది ఏమిలేదు.
3. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి:- ఆరోగ్యమే మహాభాగ్యము ముఖ్యముగా మలివయసులో, కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కోసము అవసరమయిన చర్యలు అన్ని తీసుకోవాలి. రోజూ మితాహారం తీసుకోవటం, నడకలాంటి పరిమితమైయినా ఎక్సర్సైజులు చేయటము, వేళ కు నిద్రపోవటం లాంటి పనులు చేస్తుండాలి. ఈ వయస్సులోనే త్వరగా జబ్బుపడే అవకాశాలు ఎక్కువ. క్రమము తప్పకుండా కనీసము ఏడాదికి ఒకసారి అయినా మెడికల్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. డాక్టరు సలహామేరకు మందులు వాడుతూ ఉండాలి.
4. కోనే వస్తువులు మంచి నాణ్యమైనవిగా ఉండాలి:- మన అవసరాలకు కొనే గృహోపకరణాలు చౌకవి నాణ్యత లేనివి కాకుండా మంచి నాణ్యమైనవి కొంటే వాటిని అనుభవించవచ్చు లేక పొతే రిపేర్ల కని కాలాన్ని డబ్బును వృధాచేయాలి.
5. చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దు:- వృద్ధాప్యానికి వచ్చామంటే మన జీవనయానంలో చాలా దూరము ప్రయాణించినట్లే. ఈ ప్రయాణములో కష్టాలు సుఖాలు, సంతోషాలు దుఃఖాలు అన్ని అనుభవించి ఉంటారు. పాతవి జరిగిపోయిన సంఘటనలను మంచివియైతే జ్ఞాపకము చేసుకోండి, భాధాకరమయినవి అయితే మరచిపోండి. వాటిగురించి ఆలోచించవద్దు. ఎందుకంటే పాతవాటిగురించి ఇప్పుడు అలోచించి ప్రయోజనము లేదు.
6. వయస్సుతో నిమిత్తము లేకుండ ప్రేమిస్తుండండి:- మీ జీవిత భాగస్వామిని, కుటుంబసభ్యులను ప్రేమిస్తూ ఉండండి. వారితో ప్రేమానురాగాలను పంచుకోండి. అది వృద్దాప్యములో మంచి టానిక్ లాగా పనిచేస్తుంది.
7. వయస్సు అయిపోతుంది ఇంకా మనకెందుకు అని శరీరా పోషణను అశ్రద్ధచేయకండి:- మీరు మీ శరీర నిర్వహణ విషయములో తగిన శ్రద్ధ తీసుకొని నలుగురిలో అందముగా కనిపించటానికి ప్రయత్నించండి.
8. మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఉండండి:- మారుతున్న సాంకేతికతకు అనుగుణముగా కొత్త పరికరాలను కంప్యూటర్ వంటివి వాడటం నేర్చుకోండి. సోషల్ నెట్ వర్క్ లో యాక్టివ్ గా ఉండండి. ఇంటర్ నెట్ ద్వారా ప్రపంచాన్ని తెలుసుకొనే ప్రయత్నమూ చేయండి.
9. యువత అభిప్రాయాలకు విలువ ఇవ్వండి:- యువత ఆలోచనలకూ మీ ఆలోచనలకూ వ్యత్యాసము ఉండవచ్చు అది సహజము కానీ వారి అభిప్రాయాలను తెలుసుకొని వాటిని గౌరవించండి అప్పుడు వాళ్లకు దగ్గర అవుతారు వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు.
10. ఎప్పుడు కూడా “మారోజుల్లో”అనే మాట వాడకండి:- సాధారణముగా యువత పెద్దవారితో మాట్లాడటానికి ఇష్టపడరు. ఎందుచేతనంటే వాళ్ళు తరచుగా ఏ విషయము గురించి మాటలాడిన మారోజుల్లో అంటూ పాత విషయాలను చెపుతుంటారు. అది వినటానికి యువత ఇష్ట పడరు అందువల్ల యువతతో మాట్లడేటప్పుడు మారోజుల్లో అనే మాట వాడకండి. వర్తమానంలోనే ఉండండి.
11. ప్రైవసీని కోరుకోండి:- పిల్లలతో, మనుమలతో కాలాన్ని గడిపినా, కొంత కాలము మీకోసము కేటాయించుకోండి. మీకు కూడా కొంత ప్రైవసి అవసరము. మీ జీవితము మీది, పూర్తిగా పిల్లకు మనుమళ్లకు సరెండర్ అవకండి.
12. మీ హాబీస్ ను మానుకోకండి:- మీరు వృద్ధాప్యములోకి అడుగు పెట్టిన వెంటనే మీకు ఉన్న హాబీస్ ను వదులు కోవలసిన పనిలేదు. హాబీ అనేది మీ వ్యక్తిగత ఆనందం కోసము మీరు అలవాటు చేసుకున్నది కాబట్టి మీరు వాటిని మానుకోవలసిన పనిలేదు.
13. తక్కువ మాట్లాడండి ఎక్కువ వినండి:- మనము నలుగురిలో ఉన్నప్పుడు ఇతరులు ఏమి మాట్లాడుతున్నారో వినాలి. మనము తక్కువ మాట్లాడితేనే వినటానికి అవకాశము వస్తుంది.
14. మిమ్మల్ని ఎవరైనా బాధపెడితే వారిని క్షమించండి:- మిమ్మల్ని బాధ పెట్టిన వారిపై కోపాన్ని అసహనాన్ని పెంచుకొని మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి, వారిని క్షమించండి. వారి పాపానికి వారే పోతారు అన్న సిద్ధాంతాన్ని పాటించండి.
15. నవ్వు పరమ ఔషదము:- వీలైనంతవరకు నవ్వుతూ కాలము గడపండి. నవ్వు మంచి టానిక్. మీరు నవ్వుతూ ఉండటమే కాకుండా ప్రక్కవారిని కూడా నవ్వించండి. అటువంటి వాతావరణాన్ని కలుగజేసుకొని ఆ వాతావరణములో కాలము గడపండి. జీవితము చాలా చిన్నది నవ్వుకోవటానికి సమయము కేటాయించండీ.
16. నేను పెద్దవాడిని అయిపోయాను అనే భావన రానియ్యకండి. వయస్సు రావటము అనేది సహజము. అందువల్ల మీరు ఒక్కరే పెద్దవాళ్ళు కాదు చాలా మంది ఉన్నారు అందరు బ్రతుకుతున్నారు అందువల్ల మనం కూడా సంతోషముగా బ్రతకాలి.
17. ఏదో ఒక రకమైన రిక్రియేషన్ ఏర్పాటు చేసుకోండి. కాలాన్ని వృధాగా అనవసరమైన ఆలోచనలతో పాడుచేసు కోకుండా మంచి హాబీస్ తో కాలాన్ని సద్వినియోగము చేయండి.
18. చివరిగా చచ్చిపోతాము అన్న భయముతో బ్రతకకండి. మనిషికి చావు తధ్యము అది ఎప్పుడు ఏరూపములో వస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి చావుగురించి ఆలోచించకుండా జీవితాన్ని బ్రతికేయాలి.