ఈ రోజుల్లో పిల్లల పెళ్లిళ్లు కుదరడం ఒక ఎత్తైతే పెళ్లి పనులు చక్కపెట్టడం ఎవరెస్టు ఎక్కినంత కష్టమే !మునుపటి రోజుల్లో చుట్టాల్లో పెద్దవారు పది పదిహేను రోజుల ముందే వచ్చి అన్నింటికీ సహాయంగా ఉంటూ సలహాలు చెప్తూ పెళ్లి పనులు శ్రమ లేకుండా జరిగేలా చూసేవారు. ఇక దగ్గర బంధువులు వారం రోజుల ముందే వచ్చేవారు. అందరితో కలిసి సందడిగా పెళ్లి జరిగిపోయేది. మరి ఇప్పుడు చిన్న కుటుంబాలు పిల్లల చదువులు అంటూ పెళ్లి సమయానికి వస్తున్నారు.ఇక దగ్గర బంధువులు వారం రోజుల ముందే వచ్చేవారు. అందరితో కలిసి సందడిగా పెళ్లి జరిగిపోయేది. మరి ఇప్పుడు చిన్న కుటుంబాలు పిల్లల చదువులు అంటూ పెళ్లి సమయానికి వస్తున్నారు.
ఇంక పెళ్లిళ్ల పేరయ్యలు దాదాపు అంతరించి పోయారని చెప్పవచ్చు. కొంతమంది పిల్లలు వాళ్ల జీవిత భాగాస్వాములని వాళ్లే ఎంచుకుంటే చాలా మంది మ్యారేజ్ బ్యూరో లపై ఆధార పడుతున్నారు.
అదిగో అలాంటి వేలాది మంది తల్లితంద్రులలో బాల భాస్కర్, గిరిజ దంపతులు కూడా ఉన్నారు. వాళ్ళ అమ్మాయి స్వప్న ఇంజనీరింగ్ లో చేరిన దగ్గర నుంచి స్వప్నకు తెలిసి కొన్ని, తెలియకుండా కొన్ని అన్ని మ్యారేజి బ్యూరో లలో అప్లికేషన్లు పెట్టారు.
ఇప్పుడే ఎందుకు నాన్నా , చదువు పూర్తి చేసి ఉద్యోగం లో చేరితే కానీ పెళ్లి చేసుకోను, అని మారాం చేసేది స్వప్న.
అలాగే తల్లీ నీ ఇష్ట ప్రకారమే చేద్దాం. ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే అప్పటికి కుదరవచ్చు. అని సర్ది చెప్పేవాడు భాస్కర్.
అలా మూడు సంవత్సరాలు గడిచి పోయాయి .ఎప్పటికప్పుడు బ్యూరో ల వాళ్ళు వరుడి ఫోటోలు పంపడం వాళ్ళని కలవడం ఒక క్రతువు గా మారింది .కొన్ని సంబంధాలు వీళ్ళకి నచ్చక కొన్ని వాళ్ళకు నచ్చక ఎలా అయితేనేం ఇప్పటి వరకు ఏదీ కుదర లేదు.
చాలా మంది అబ్బాయిలు ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలనే ఇష్టపడుతున్నారు. ఇంకా చదువుకుంటుంది అనగానే వెనక్కి తగ్గుతున్నారు. ఇంకా కొంతమంది గొంతెమ్మ కోరికలను వింటుంటే భాస్కర్ తల తిరిగేది. మా అబ్బాయి పై చదువులు అమెరికా లో చదువుతానంటున్నాడు. ఆ ఖర్చులు మీరు భరించాలి. అనేవారు. దాంతో మా అమ్మాయి కూడా అమెరికా లో చదువుదాం అనుకుంటుంది. ఆ ఖర్చులు మీరు భరిస్తారా? అని అడిగి వచ్చేవాడు. ఛీ ఛీ వీళ్లకు బొత్తిగా సిగ్గు లేదా వాళ్ళ అబ్బాయికి వాళ్ళెంత ఖర్చు పెడుతున్నారో తమ అమ్మాయికి కూడా అంతే ఖర్చు పెట్టి చదివిస్తున్నాము కదా ! కేవలము అమ్మాయి తండ్రి అయినంత మాత్రాన వాళ్ళబ్బాయి పై చదువుల ఖర్చు భరించాలా? ఇదెక్కడి న్యాయం?
పెళ్లికొడుకుల తల్లులు వాళ్ళ పెళ్లిళ్లు జరిగినప్పుడు వాళ్ళ తండ్రులు అనుభవించిన క్షోభ ఎలా మర్చి పోతున్నారు? లేక తమ తండ్రి అనుభవించిన బాధ వేరొక తండ్రి అనుభావించాలనే కసితో అలా ప్రవర్తిస్తారా? అన్ని జవాబు లేని ప్రశ్నలలాగే మిగిలాయి.
మీరు అంతగా ఆలోచించ కండి. మనకి అన్ని విధాలా సరిపోయే సంబంధమే వస్తుంది లెండి అని నచ్చచెప్పేది గిరిజ. చూస్తుండగానే స్వప్న ఫైనల్ ఇయర్ కు వచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం కూడా సంపాదించింది.
ఆ రోజు హోటల్ లో పార్టీ చేసుకుంటుండగా “నాన్నా ఇంక నాకు స్కూటీ కొనివ్వాల్సిందే” అన్న స్వప్నతో యధాలాపంగా అలాగే అన్నాడు కానీ కొనడని అతనికి తెలుసు స్వప్నకు తెలుసు.
ఫ్రెండ్స్ అందరూ స్కూటీ ల మీద తిరుగుతున్నారని తనకి కూడా కావాలని స్వప్న ఇంటర్ లో చేరిన దగ్గర నుంచి మారాం మొదలు పెట్టింది. గిరిజ కూడా కొనమనే సలహా ఇచ్చింది . కానీ ఆ సాహసం చెయ్యలేక పోయాడు భాస్కర్. రోడ్డు మీద ట్రాఫిక్ చూస్తే తనకే భయం వేస్తుంది. ఇక స్వప్నకి అసలే కంగారు ఎక్కువ. ఆ కంగారులో ఏ ప్రమాదమైనా జరగవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం ఏముంది అసలు చేతులే కాలకుండా చూడాలి అనేది భాస్కర్ ఫిలాసఫీ.
స్వప్నని ఎప్పుడు చూసినా భాస్కర్ కు స్వప్నని మొదటిసారి తన చేతులలోకి తీసుకున్న అనుభూతి పునరావృతం అవుతుంది. తన రక్త మాంసాలు కలబోసుకుని పుట్టిన ఈ పాప తనకు దేవుడిచ్చిన అపురూపమైన వరం అనిపించింది . ఇది కలా నిజమా? అన్న సంశయం కలిగింది. అందుకే స్వప్న అన్న పేరు పెట్టాడు.
అప్పుడు కూతురిపై పుట్టిన ప్రేమ భాస్కర్ లో రోజు రోజుకూ వట వృక్షం లా పెరుగు తూనే వచ్చింది. స్కూల్ లో ఉన్నప్పుడు ఏ ఆటా ఆడనిచ్చేవాడు కాదు. నా చిన్నారి తల్లి ఎండలో మాడిపోదూ అనిపించేది. ఇంటి పట్టున ఉండి చదువుకో తల్లీ! మనకీ ఆటలవీ ఎందుకు? అనేవాడు. నన్నేం చేయనివ్వవు నాన్నా , అన్నా స్వప్నకి చిన్నప్పటినుంచి తండ్రికి తనపై ఉన్న ప్రేమ గురించి బాగా తెలుసు.
స్వప్నకి అవసరం అనిపిస్తే ఎంత డబ్బు ఖర్చు చేయడానికైనా వెనుకాడేవాడు కాదు. అందరూ లైబ్రరీ నుంచి తెచ్చుకుని చదువుకునే పుస్తకాలు స్వప్న స్టడీ టేబుల్ పై అందుబాటులో ఉండేవి. “ఎందుకు నాన్నా కొన్నావు? నేను లైబ్రరీ నుంచి తెచ్చుకుని కాపీ తీయించుకుందును కదా” అనేది. ఎందుకు టైము వేస్ట్ ఐనా అలా చదివితే చదివినట్టు ఉండదు. అనేవాడు.
స్వప్న చిన్నతనం నుంచి తెలిసిన వాళ్ళ బంధువుల ఇళ్లల్లో పెళ్లిళ్లు జరిగినప్పుడు, దేనికి ఎంత ఖర్చు అవుతుందో, వాళ్ళ కన్నా ఎక్కువగా గమనించి, పట్టిక తయారు చేసుకునే వాడు. అలా స్వప్న పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుందని అంచనా వేశాడో అంతకు రెట్టింపు డబ్బు, రకరకాల బాండ్లు, డిపాజిట్ ల రూపంలో పొదుపు చేసి ఉంచాడు.
స్వప్నకు ఉద్యోగం రాగానే ఇంక స్వప్నకు సీరియస్ గా సంబంధాలు చూసే సమయం వచ్చిందని గ్రహించాడు. ఎవరో తన శరీరం నుంచి ఒక బాగం కోసి వేరుచేస్తున్న భావన కలిగింది. “పెళ్ళైన తర్వాత ఆడపిల్లలు ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి ? అలాంటి నియమం మన పూర్వీకులు ఎందుకు పెట్టారు ?” అంటూ తెగ బాధ పడేవాడు , భాస్కర్ . “నేను రాలేదూ మా వాళ్ళని వదిలి ? అప్పుడు మీకేమీ అనిపించలేదు కదా , ఇది జీవితంలో ఒక భాగము” అనేది గిరిజ.
ఒక రోజు మ్యారేజ్ బ్యూరో కు బయలు దేరాడు భాస్కర్. మీకు ఏ సంబంధాలూ నచ్చడం లేదు అంటూనే కొన్ని సంబంధాల గురించి సమాచారం ఇచ్చారు . అమ్మాయికి క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వచ్చిందనే అర్హత కూడా చేర్చమని చెప్పాడు. “ఇక చూడండి ఈ నెలలోనే మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిరిపోతుంది” తమ కూతురికే పెళ్లి కుదిరినంత ఆనందంగా చెప్పారు బ్యూరో వాళ్ళు.
బయటకు వస్తుండగా, లోపలకు వెళ్తూ ఒకబ్బాయి కనిపించాడు. ఎక్కడో చూసిన ముఖం లా అనిపించడంతో కొద్దిగా తేరి పార చూసాడు. ఎవరో తనను పరికించి చూడడం తో ఆ అబ్బాయి కూడా ఆగాడు. “బాబూ నువ్వు మహేష్ కొడుకు కిరణ్ వేనా ?” అని అడిగాడు. “అవునంకుల్. మీరు భాస్కర్ అంకుల్ కదా” అన్నాడు. “మా ఇల్లు ఇక్కడికి దగ్గరే” అన్నాడు. “పద పద త్వరగా అమ్మా నాన్నలను కలుస్తాను” అన్నాడు భాస్కర్.
ఆ మాటకు ఆ అబ్బాయి ముఖం మ్లానమయ్యింది. “అమ్మ, నాన్నగారు పోయిన సంవత్సరం ఆక్సిడెంట్ లో పోయారంకుల్” అన్నాడు . అయ్యో అనిపించింది. పది సంవత్సరాల క్రితం ఒకే ఆఫీస్ లో పనిచేసారు. ఆ రెండు కుటుంబాలు ఎంతగానో కలిసిపోయాయి. బదిలీల కారణంగా దూరమై పోయారు. నెమ్మదిగా నడుస్తూ ఇంటికి చేరారు ఇద్దరూ. దారిలో ఆ అబ్బాయి ఎక్కువగా మాట్లాడలేదు. వీళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి స్వప్న ఇంట్లోనే ఉంది. ఆ అబ్బయిని చూడగానే,”ఓ , రే” అంటూ పగలబడి నవ్వింది.
ఆ జోక్ ఏంటో అర్ధం కాక, గిరిజ , భాస్కర్ లు ప్రశ్నర్ధకంగా చూసారు. నవ్వు ఆపిన స్వప్న, “ఇతను సూర్య కిరణ్ కదా, ‘ఐ ఆమ్ సన్స్ రే’ అని గొప్పగా చెప్పుకునే వాడు. అందుకే మేము ‘ఓ , రే’ అనేవాళ్ళం. అంటే మా ఉద్దేశం ‘ఒరేయ్’ అని కానీ సీనియర్ ని మామూలుగా అయితే అలా అనలేము కదా !” స్వప్న మాటలకు వాతావరణం తేలిక పడింది.
కొంత సేపు వాళ్ళ స్కూలు గురించి తెలిసిన పిల్లల గురించి మాట్లాడుకున్నారు. కిరణ్ అతని చదువు, ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం గురించి చెప్పాడు. “అరే అదే కంపెనీ లో స్వప్నకు క్యాంపస్ ఇంటర్వ్యూ లో ఉద్యోగం వచ్చింది” అంటే , “అలాగా” ఆంటూ, ఆ కంపెనీ లో పని వాతావరణం, అక్కడి జీతాల గురించి వివరంగా చెప్పాడు. అతను వెళ్లే టప్పుడు ఇద్దరూ ఫోన్ నంబర్ లు మార్చుకోవడం గమనించాడు భాస్కర్. తండ్రి కళ్ళల్లోని ప్రశ్నను చదివిన స్వప్న, ‘రే యే కదా నాన్నగారూ’ అంటే సరేలే అని సర్ది చెప్పుకున్నాడు.
ఆ తర్వాత ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు కిరణ్ సలహాల కోసం స్వప్న అతనికి తరచూ ఫోన్ చెయ్యడం గమనించాడు, భాస్కర్. ఆ పని అయిపోయినా ఇద్దరూ ఎప్పుడూ ఫోన్ లో మాట్లాడుకోవడంతో మందలించే వాడు.
ఒక రోజు రాత్రి భోజన సమయంలో, “నాన్నగారూ , రే నాకు ప్రొపోజ్ చేశాడు. నేను మిమ్మల్ని అడగమన్నాను. రేపు సాయంత్రం వస్తానన్నాడు” అంటూ చెప్పింది స్వప్న. విషయం ఇంత వరకూ వస్తుందని ముందే ఊహించినా, ఎందుకో భాస్కర్ మనసు స్థబ్దుగా అయ్యింది.
స్వప్నకు పెళ్ళైతే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇదే ఆలోచన ముందు వచ్చింది. కానీ , ఎవరికో ఒకరికి ఇచ్చి చెయ్యక తప్పదు కదా !
భోజనాలయ్యాక స్వప్నను పక్కన కూర్చోపెట్టుకుని “అతనికి నీతో పరిచయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయం లోనే పెళ్లి చేసుకోవాలని ఎలా అనుకొంటున్నారు ? అయినా మీ ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి ఏం తెలుసు ? పెళ్లి విషయంలో చాలా జాగర్తగా ఉండాలి. ఒక్కసారి అడుగు ముందుకు వేశాక వెనక్కి తీసుకోలేము. నువ్వు బాగా ఆలోచించుకుని రేపు అతను రాక ముందే నాకు ఏ సంగతి చెప్పు” అన్నాడు భాస్కర్.
మర్నాడు పొద్దున్న “రే తో పెళ్లి నా కిష్టమే నాన్నగారూ, కానీ మీకు అమ్మ కు ఇష్టమైతేనే” అంటూ మనసులో మాట చెప్పింది స్వప్న. సాయంత్రం కిరణ్ రాక కోసం స్వప్న చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు అనిపించింది. ఇంతలో అతను రానే వచ్చాడు. ఇన్నాళ్లూ అతను కేవలం తెలిసిన వాళ్ల అబ్బాయి. కానీ ఇప్పుడు అన్నీ కలిసి వస్తే కాబోయే అల్లుడు. అందువల్లే అతని పట్ల వారి ప్రవర్తన కూడా మారింది. కాఫీ టిఫిన్ అయ్యాక, అసలు విషయం లోకి వచ్చాడు సూర్య కిరణ్.
“మీకు ఇష్టమైతే, స్వప్న, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, అంకుల్” అన్నాడు .
స్వప్న దగ్గర వ్యక్తం చేసిన అనుమానాలే అతని కి కూడా ఎత్తి చూపాడు, భాస్కర్.
“మీరు సంభంధం చూసినా ఆ అబ్బాయితో అయితే స్వప్నకు అస్సలు పరిచయం ఉండదు కదా అంకుల్ ! అంతకంటే నేనే నయం కదా !అయినా మేము ఫోన్ లోనే మా అభిప్రాయాలూ ఇష్టాయిష్టాలు పంచుకున్నాము. స్వప్నతో నా జీవితము సాఫీగా సాగుతుందని నమ్మకము కుదిరిన తర్వాతే స్వప్నను అడిగాను. ఇక నుంచి అంతా స్వప్న ఇష్టం ప్రకారమే జరుగుతుందని మాట ఇస్తున్నానంకుల్. నా మీద ఒక్క ఫిర్యాదు కూడా మీకు స్వప్న దగ్గరనుంచి రాకుండా చూసుకుంటాను” అన్నాడు. ఇంక అభ్యంతరం ఏమి చెప్పాలో అర్ధం కాలేదు భాస్కర్ కి . “సరే ! ఆలోచిస్తాను” అన్నాడు. అనడమైతే అన్నాడు కానీ, ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాడు. నా చిన్నారి తల్లి, ప్రాణంలో ప్రాణం పరాయిదైపోయిందా అనిపించేది. అలా అని ఎన్నాళ్ళు స్వప్నను ఇంట్లో ఉంచుకుంటారు? ఇంకా కొన్నాళ్ళు పోతే కూతురి జీతం కోసం పెళ్లి చేయలేదనే అపవాదు ఎదుర్కోవలసి వస్తుంది.
ఆలోచనలో ఉన్న భాస్కర్ తో “ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు ? అబ్బాయి మంచి ఉద్యోగం లో ఉన్నాడు. ముందు వెనకా ఎవ్వరూ లేరు. ఇంకా మీరింతగా మధన పడడమేంటో నాకైతే అర్ధం అవ్వడం లేదు” అన్న గిరిజ మాటలకు, “నేను అదే ఆలోచిస్తున్నాను. మనకి స్వప్న ఒక్కతే ! రేప్పొద్దున్న కిరణ్ తో పెళ్లి జరిగితే, ఏదయినా సమస్య వస్తే ఎవరికి చెప్పుకుంటుంది ? వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటె బాగుండేది” అన్నాడు. “బాగుంది మీ వరస. అందరూ పిల్లలకి బాదరబందీ లేని సంబంధాల కోసం వెతుకుతారు. మీరేమో కాళ్ళ దగ్గరకు వచ్చినదాని గురించి తెగ ఆలోచిస్తున్నారు. అయినా ఈ రోజుల్లో అందరికీ ఒకళ్ళిద్దరే పిల్లలు ఉంటున్నారు. ఎక్కడ ఉద్యోగాలు వస్తే అక్కడికే వెళ్లిపోతున్నారు. ఏవైనా సమస్యలు వస్తే వాళ్ళంతట వాళ్లే పరిష్కరించుకుంటున్నారు. లేదా స్నేహితుల సలహా తీసుకుంటారు. ఈ రోజుల్లో చుట్టాలు స్నేహితులు అన్న బేధమే లేదు undefined అన్న గిరిజ మాటలతో ఏకీభవించక తప్పలేదు భాస్కర్‌కి.
ఎలా అయితే పెళ్లి నిశ్చయం అయ్యింది. ముహుర్తాలు కూడా పెట్టు కున్నారు. ఎవరెవరిని పిలవాలో పట్టిక తయారు చేసుకున్నారు.
ఒక రోజు స్వప్న కిరణ్ తో వచ్చి, “నాన్నా ! శుభలేఖల సంగతి”, అంటూ బిడియంగా అడిగింది. “అదే, కిరణ్ వాళ్ళ చుట్టాలకు స్నేహితులకూ పంచాలి కదా ! నేను కూడా నా ఫ్రెండ్సకి”, అంటూ ఆగిపోయింది.
చూద్దాం, ఇంకా టైం ఉంది కదా ! ఈ లోగా నీ ఫ్రెండ్స్ అందరి ఫోన్ నెంబర్ లు ఇమెయిల్ ఐడి లు ఇవ్వు, అన్నాడు.
అలాగే అన్నట్టు తల ఊపింది కానీ, ఆ అమ్మాయికి ఏమీ అర్ధం కాలేదు. మర్నాడు భాస్కర్ మళ్ళీ ఈమెయిలు, ఫోన్ నెంబర్ ల కోసం అడిగినప్పుడు అన్నీ ఇచ్చింది.
గిరిజకు కూడా అయోమయంగా అనిపించింది. ఏంటో ఈ మనిషి, పెళ్లి పదిహేను రోజులలోకి వచ్చింది. ఇప్పటికైనా శుభలేఖలు పంపకపోతే వచ్చే వాళ్ళు టిక్కెట్లు కొనుక్కొవద్దా ? అనుకుంది. ఆ రోజే భాస్కర్ తెలిసిన వాళ్లందరికీ ఫోన్ చెయ్యడం మొదలుపెట్టాడు.
ఫలానా తారీఖున పెళ్లి ముహూర్తం ఖరారు చేసామని, అందరి అడ్రస్సులు తీసుకున్నాడు. శుభలేఖలు రాగానే పంపిస్తానని, వీలైనంత త్వరగా పెళ్ళికి రావాలని, టికెట్స్ వెంటనే తీసుకోమని చెప్పాడు.
వీలయితే తప్పక వచ్చి పిలుస్తామని, లేదంటే ఇదే పెళ్లి పిలుపని భావించాలని చెప్పాడు. దగ్గర వాళ్ళని, ఊర్లో ఉన్న వాళ్ళని ఇళ్ళకి వెళ్లి పిలవాలని నిర్ణయించుకున్నారు. అప్పటికీ శుభలేఖలు సిద్ధం కాలేదు. ఇంక లాభం లేదని కిరణ్, స్వప్న వాళ్ళ ఫ్రెండ్స్ కోసం విడిగా చిన్న కార్డులు వేయించు కున్నారు. అవి తెచ్చి చూపించినా, భాస్కర్ పెద్దగా ఆసక్తి చూపించలేదు.
పిలుపులకు వెళ్లే రోజు మాత్రం కార్డుల కట్ట ఒకటి తెచ్చాడు. “ఇదేంటి , నా అభిప్రాయమైనా కనుక్కోలేదు , నాన్న” అనుకుంది స్వప్న. బాక్స్ తీసిన తర్వాత అందరూ ఆశ్చర్య పోయారు.
అందులో శుభలేఖలు లేవు. కేవలం విసిటింగ్ కార్డు సైజు లో కాగితాలు, వాటిపైన వివాహ ముహూర్తము, విందు సమయము, వివాహ వేదికకు చేరుకునే వివరాలు ఉన్నాయి.
“ఇదేంటండి ఇవా శుభలేఖలు ?” నిరాశగా అడిగింది, గిరిజ. “కాదోయ్ అవీ ఉన్నాయి” అంటూ, అందరి నీ కంప్యూటర్ దగ్గరకు తీసికొని వెళ్ళాడు. ఈ కార్డులు వేయించాను చూడండి, అన్నాడు . ఎంతో అందమైన రంగులతో సీతా రాముల చిత్రంతో చూడ ముచ్చటగా ఉన్నాయి ఆ కార్డులు.
“ఇందుకే అందరి ఫోన్ నంబర్లు ఈ మెయిల్ ఐడీలు అడిగాను. నేనివే అందరికి మెయిల్ ద్వారా, వాట్స్ ఆప్ ద్వారా పంపుతున్నాను. మీకు నచ్చితే మీరు కూడా పంపించండి” అన్నాడు భాస్కర్ . “మీ దంతా చోద్యం ! శుభలేఖలు లేని పెళ్లేంటి ? అందరూ నవ్వుతారు. అయినా నాకే ఎలాగో ఉంది”.
భార్య మాటలకు “ఎవరు నవ్వినా నా కూతురి పెళ్ళికి శుభలేఖలు ఉండవు” అంటూ లెగిసి వెళ్లి పోయాడు, భాస్కర్. “పోన్లే అమ్మా, ఈ కార్డులు పంపుతున్నారు కదా ! అంటూ సర్ది చెప్పింది” కానీ స్వప్న మనసులో కూడా వెలితి గానే ఉంది.
పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్ళికి వచ్చిన ఆహూతులలో ఒకరు, “ఎలాగైనా భాస్కర్ ను మెచ్చులోవాలి. ఖర్చుకు ఖర్చు తగ్గించు కున్నాడు. కాగితం వాడకుండా పర్యావరణానికీ మేలు చేశాడు” అన్నాడు.
వచ్చిన వారిలో ఒక టీవీ జర్నలిస్టు కూడా ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడూ కొత్త వార్తల కోసం వెతుకుతూ ఉంటారు కదా ! అందుకే వెంటనే తాను పనిచేసే ఛానల్ వాళ్లకు వార్త అందించాడు. అంతే వివాహం ముగిసే సమయానికి ఆ ఛానల్ వాళ్ళు ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లతో వచ్చేసారు.
ఇదంతా చూసి భాస్కర్ కంగారు పడ్డాడు. వివాహం ముగిసిన తర్వాత తామే మాట్లాడతామని చెప్పాడు. దాంతో వాళ్లు కొన్ని ఫోటోలు తీసుకొని వార్త ప్రసారం చేసారు.
కొన్ని రోజులకే ఒక స్వచ్ఛంద సంస్థ భాస్కర్ ను సన్మానిస్తామంటూ వచ్చారు. ఎంత వద్దన్నా వినిపించుకోలేదు. “పర్యావరణము కోసం మీరు చేసిన సాహసం చిన్నదేమీకాదు. మిమ్మల్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటే అడవులను చాలా మట్టుకు రక్షించవచ్చు” అన్నారు. ఎలా ఆయితేనేమి, భాస్కర్ చేత “సరే” అనిపించుకునే వెళ్లారు.
వాళ్ళు చెప్పిన తేదీ కి భార్యతో, నూతన వధూవరులతో కలిసి సన్మాన సభకు వచ్చాడు భాస్కర్. సభకు వచ్చిన వాళ్ళందరూ అతను చేసిన పనిని గొప్పగా పొగిడారు. ఒక విప్లవము తెచ్చారంటూ మెచ్చుకున్నారు. ఆదర్శపురుషుడంటూ అంబరానికి ఎత్తారు. చివరలో భాస్కర్ని సభనుద్దేశించి మాట్లాడమన్నారు.
మొహమాటంగా లెగిసి మైక్ ముందుకు వచ్చాడు భాస్కర్. “సభకు సభికులకు నా నమస్కారములు. నేను చేసిన పనికి ఇలాంటి స్పందన వస్తుందని నేనస్సలు ఊహించలేదు. నిజానికి మీరందరూ భావిస్తున్నట్టు నేను పర్యావరణం గురించి ఆలోచించలేదు. నా నిర్ణయం చాలా స్వార్ధంతో కూడుకున్నది. అంటే అది ఖర్చు తగ్గించుకుందాం అని కాదు. మనందరికీ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు శుభలేఖలు వస్తాయి. వాటిని అందరూ ఏం చేస్తారు ? చాలా మంది పెళ్లి జరిగే వరకూ వేదిక చిరునామా కోసమైనా ఉంచుతారు. తరువాత ఎవ్వరూ వేరొకరి శుభలేఖను ఇంట్లో దాచి ఉంచరు. వాటి మీద ఎన్ని దేవుళ్ళ ఫోటో లు ముద్రించినా చివరకు చిత్తు బుట్ట లోకి వెళ్లాల్సిందే. మనమందరం ఎన్నిసార్లు శుభలేఖలు రోడ్డు మీద చూడడం లేదు ? అడ్డం వస్తే కాలితో పక్కకు తోసి వెళ్తుంటాము. మా అమ్మాయి పెళ్ళికి శుభలేఖలు వేయించకపోవడానికి ముఖ్య కారణం ఇదే. అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చిట్టితల్లి వివాహ ఆహ్వాన పత్రిక, అలా అందరి కాళ్ళ కిందా పడి లేదా చించబడి, చిత్తు బుట్ట దాఖలవుతుందనే ఆలోచనే భరించలేక పోయాను. అందుకే నా కూతురి పెళ్ళికి శుభలేఖలు వేయించలేదు. ఇలా ఈ కార్డులు పంపిస్తే ఇష్టం లేకపోతే డిలీట్ చేసేస్తారు. అంతేకాని నలిపి బయట పారెయ్యలేరు కదా ? మీరందరూ నన్ను ఆదర్శపురుషుడు అన్నారు. కానీ, నేను కేవలం నా కూతుర్ని ప్రేమించే ఒక సగటు తండ్రిని మాత్రమే. నేను మీ కందరికీ చేసే మనవి ఒక్కటే. వీలైతే వధూవరులను చేయెత్తి ఆశీర్వదించండి. కానీ వాళ్ళ పెళ్లిపత్రికను మాత్రం కాలి కింద వేసి తొక్కకండి. నాలా మరికొందరు ఆలోచిస్తే నేను ధన్యుడిని అయినట్టు మీరు అనుకున్న ఆదర్శం నాలో లేనందుకు ఛంతవ్యుడను” అంటూ ముగించాడు. సభ చప్పట్లతో హోరెత్తింది. సభ నిశ్శబ్దమైన తర్వాత, సభాపతి లెగిసి, “భాస్కర్ గారు చెప్పిన విషయం మనమందరం ఆలోచించి అర్ధం చేసుకుని పాటించ తగ్గది. నేను కూడా మా పిల్లల పెళ్ళిళ్ళకి ఈ కార్డులే పంపిస్తాను. వాళ్ళ శుభ లేఖలను ఎవ్వరూ కాళ్ళ కింద వేసి తొక్కలేరు” అంటుంటే సభంతా నవ్వులతో నిండిపోయింది.