పరవశించిన, రమ్య రమణీయమైన “పచ్చని ప్రకృతే”… ఈ “స్త్రీ”
ఎగిరే పక్షుల్లా స్వతంత్రం అనే “హక్కు ఉన్నదే” .. ఈ “స్త్రీ”
విత్తుగా మొదలై, మొక్కగా మారి, చెట్టై చిగురించి ..
పూలు అనే ఆనందాన్ని, పండ్లు అనే అవసరాన్ని కుటుంబం కోసం ఇవ్వ గలిగే “ఒకే ఒక నిస్వార్థ జీవి” .. ఈ “స్త్రీ”
భావి భవితకు, నవ సమాజ నిర్మాణానికి సీతాకోక చిలుక లో వున్నరంగులన్ని కళలను సంతానానికి అందించ గలిగే “ఆది గురువు”… ఈ “స్త్రీ”
ఎంత మంచి చేసినా, వెనుకే వుండిపోయి.. తన గుర్తింపు కోరుకోని ఒకే ఒక నిఘూడ నిజమే … ఈ “స్త్రీ”
వెన్నంటి వుండి, “అపజయాలను ఎదిరించే నీడ”.. ఈ “స్త్రీ”
ఆశలకు పోక, అందరి అవసరాలను తీరుస్తూ, తనకున్న అవధిలో
వింతలు, అద్భుతాలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న ఈ “స్త్రీ” ని …
ఈ సభ్య సమాజం వల వేసి పడుతున్నా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాఒక చిరునవ్వునవ్వి ..
భూమాత లాంటి సహనం తో ఇంకా ఓర్పు వహిస్తున్న ఒక గొప్ప స్వభావం కలదే .. ఈ “స్త్రీ”
లోపల వున్న తన బాధను, పైకి కనిపించే ఒక చిరునవ్వుతో దాచి …
ఇంకా తన వాళ్లకి సంతోషాన్ని కలిగించాలని తాపత్రయ పడే సున్నితమైన, సరళమైన, నిష్కల్మషమైన మనసే .. ఈ “స్త్రీ” ..
అంతటి అద్భుతమైన ప్రతి “స్త్రీ” కి పాదాభివందనం చేస్తూ మీ జిష్ణుశ్రీ ..