మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, భారతప్రభుత్వ తొలి విద్యాశాఖామంత్రి, అన్నిటికి మించి అయన అ కాలంనాటి ప్రముఖ మతపరమైన మేధావి. ఆయన భారతదేశము వచ్చి భారతీయ సంస్కృతిలో విలీనము అయిన విభిన్న సంస్కృతులకు నిదర్శనము. ఆయన అసలుపేరు ‘మొహియుద్దీన్ అహ్మద్’, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలంపేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న ముస్లిములకు పరమపవిత్రమైన మక్కాలో జన్మించాడు. భారతీయ స్వాతంత్ర సంగ్రామములో పాల్గొన్న మొదటిశ్రేణి నాయకులలో ఒకడు. సనాతన ముస్లిం కుటుంబములో జన్మించినప్పటికీ ఆనాటి చాందస ముస్లిం సాంప్రదాయాలను వ్యతిరేకించిన ధైర్యశాలి. గిరి గీసుకొని సాంప్రదాయాల మధ్యే ఉండకుండా తానంతట తానె స్వయముగా పరిశోధించి నిజాలను తెలుసుకోవాలని ప్రయత్నించేవాడు. ముస్లిములలో ఉన్న భిన్న తెగలగురించి వారి మధ్య ఉన్న అనైక్యత గురించి భాదపడుతూ, “ఆజాద్ (స్వేచ్ఛ)” అనే పెన్ నేమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇండియా విన్స్ ఫ్రీడమ్, గుభర్- ఏ-ఖాతిర్. తజకిరః,తర్జుమానుల్ ఖురాన్ అనే గ్రంథాలను రచించాడు. ఇండియా విన్స్ ఫ్రీడమ్ అనేది ఆయన స్వీయ చరిత్ర. ఆయన ఆ పుస్తకంలోని కొన్ని భాగాలను తాను చనిపోయిన 20 ఏళ్ల తరువాత ప్రచురించవలసినదిగా ఆయన తన వీలునామాలో పేర్కొన్నాడు. ఆభాగాలలో గాంధీజీకి, నెహ్రూకు తనకు మధ్య ఏర్పడ్డ అభిప్రాయం భేదాలను వివరించాడని కొందరి అభిప్రాయము. ఆయన మరణానంతరము ఇందిరాగాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు అనవసరమైన చర్చ ప్రారంభమవుతుందని సమస్యలు ఉత్పత్తన్నమవుతాయని భావించి ఆ భాగాలను ప్రచురించలేదు. హిందూ ముస్లిం లను విడదీయాలనే తలంపుతోనే లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ ప్రాంతాన్ని విభజించారు. ఆ పరిస్తుతులలో ఆజాద్ బెంగాల్ హిందువులు చేస్తున్న రాజకీయ ఉద్యమములో చేరి ఆనాటి ప్రముఖ విప్లవ వాది అయినా శ్యామ సుందర్ చక్రవర్తిని కలిసి ఆయన ద్వారా ఇతర ప్రముఖులైన అరబిందో ఘోష్ వంటి వారితో పరిచయాలు పెంచుకున్నాడు. బ్రిటిష్ ప్రభుత్వము ముస్లిమ్స్ ను రాజకీయ పోరాటంలో హిందువులకు వ్యతిరేకముగా వాడు కోవటము వ్యతిరేకించేవారు. ప్రభుత్వము చాలామంది ముస్లిం అధికారులను ఇంటలిజెన్స్ విభాగములో తీసుకోవటం వల్ల హిందువులు స్వాతంత్ర పోరాటంలో ముస్లిములు అడ్డు అని భావించేవారు. అటువంటి పరిస్తుతులలో ఆజాద్ ముస్లిములు స్వాతంత్రానికి వ్యతిరేకులు కాదు, ముస్లిములు అందరిని శత్రువులుగా భావించవద్దు అని హిందువులకు హితబోధ చేసేవాడు. తన భావాలను ప్రజలందరికి తెలియజేయటానికి, ముస్లిములను విద్యావంతులుగా చేయటానికి ఒక పత్రిక అవసరము అని భావించి 1912లో కలకత్తాలో “అల్ -హిలాల్” పత్రికను ప్రారంభించాడు ఉర్దూ జర్నలిజము లో ఈ పత్రిక ప్ర ప్రథమము. అనతికాలంలోనే ప్రజాదరణ పొంది వారానికి 20,000 వేల ప్రతులు అమ్ముడు అయ్యేవి ఈ విజయాన్ని చూసిన ప్రభుత్వము ఓర్చుకోలేక పత్రికకు పదివేల రూపాయలు డిపాజిట్ కట్టమని తాఖీదులు ఇచ్చింది. 1914 లో మొదటి ప్రపంచ యుద్ధము మొదలవగానే అల్ హిలాల్ ప్రెస్ ను జప్తు చేసింది. వెంటనే ఆజాద్ అల్ -బలాగ్ అనే మరో పత్రికను ప్రారంభించాడు కక్ష సాధింపు చర్యగా ఆజాద్ ను కలకత్తా నుండి రాంచికి తెచ్చి డిశంబర్ 1919 వరకు రిమాండ్ లో ఉంచి జనవరి మొదటి తారీఖు 1920, న బ్రిటిష్ రాజు గారి ప్రకటన ద్వార విడుదల చేశారు.
కలకత్తాలో విక్టోరియా మెమోరియల్ హాల్ ప్రారంభోత్సవానికి ఇంగ్లాండ్ రాకుమారుడు ప్రిన్స్ అఫ్ వేల్స్ 1921లో రావటాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బహిష్కరించింది ఫలితముగా ప్రిన్స్ కు ప్రభుత్వమూ అనుకున్నస్థాయిలో స్వాగతము చెప్పలేకపోయింది. ప్రభుత్వము ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులను అల్లీపూర్ సెంట్రల్ జైలు లో ఖైదీలుగా ఉంచింది. పండిట్ మదన్ మోహన్ మాలవ్య వైస్ రాయి కి కాంగ్రెస్ నాయకులకు మధ్య రాయబారము నడిపి జైలులోని చిత్తరంజన్ దాస్, ఆజాద్ లతో చర్చలు జరిపి ఇంగ్లండ్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ముందే నాయకులను విడుదల చేయటానికి ప్రభుత్వము ఒప్పుకున్నదని నాయకులుకూడా ప్రిన్స్ రాకను బహిష్కరించ కూడదని మాలవ్య సలహా ఇచ్చాడు ఈ ప్రతిపాదనకు అందరు ఒప్పుకున్నా గాంధీజీ ఒప్పుకోలేదు. ఈ సందర్భములో గాంధీజీ పెట్టిన షరతులు ఆజాద్ కు నచ్చలేదు ఆ విధముగా మొదటిసారి ఆజాద్ గాంధీజీతో విభేదించాడు. ఫలితముగా వైస్ రాయ్ తన ప్రతిపాదనను విరమించుకున్నాడు. గాంధీజీ వైఖరి వల్ల రాజకీయ పరిష్కారానికి అవకాశము పోయిందని చిత్తరంజన్ దాస్ వంటి ప్రముఖులు గాంధీజీని తప్పు పట్టారు. ఈ విభేదాల ఫలితము 1922 లో గయ లోజరిగిన కాంగ్రెస్ సభలో చిత్తరంజన్ దాస్, మోతిలాల్ నెహ్రు, హకీమ్ అజ్మల్ ఖాన్ లు కాంగ్రస్ నుండి విడిపోయి స్వరాజ్ పార్టీని స్థాపించారు అప్పుడు 1923లో ఆజాద్ నాయకత్వములో రాంఘర్ లో ప్రత్యేక సమావేశము ఏర్పాటుచేయబడింది. 35 ఏళ్ల వయస్సులోనే నాయకత్వము వహించిన ఆజాద్ రెండు వర్గాలను సమన్వయ పరచటంలో సఫలీకృతుడైనాడు. ఇది ఆయన రాజకీయ దక్షతకు నిదర్శనము.
1935లో బ్రిటిష్ ప్రభుత్వము చట్టముద్వారా ప్రొవిన్షియల్ అటానమీని ఇవ్వటానికి ఒప్పుకుంది కానీ గవర్నర్లను నియమించి వారికి ప్రత్యేక అధికారాలను కట్టబెట్టి ఎన్నికైన చట్ట సభలను రద్దుచేసే అధికారాన్ని కూడా కల్పించింది. ఇటువంటి పరిస్తుతులలో ఎన్నికలో పాల్గొనటానికి కాంగ్రెస్ ఒప్పుకోలేదు. కానీ ఈ విషయములో కూడా ఆజాద్ ఇతర కాంగ్రెస్ నాయకులతో విభేదించాడు. ఆయన ఉద్దేశ్యము ఏమిటి అంటే కాంగ్రెస్ ఎన్నికలలో పాల్గొనకపోతే బ్రిటిష్ ప్రభుత్వ తొత్తులుగా పనిచేస్తున్నవారు, సంస్థానాధీశులు ఎన్నికలలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలముగా పనిచేసే ప్రభుత్వాలను ఏర్పరచి స్వాతంత్ర ఉద్యమాన్ని పూర్తిగా నీరుగారుస్తారు. చివరికి కాంగ్రెస్ నాయకులు కూడా ఆజాద్ వాదనకు అంగీకరించి ఎన్నికలలో పాల్గొనటానికి ఒప్పుకున్నారు. ఎన్నికల తరువాత మళ్ళా కాంగ్రెస్ లో వర్గపోరు ప్రారంభమయింది. ఎన్నికలలో గెలిచినప్పటికీ గవర్నర్లకు ఉండే విశేష అధికారాలను బట్టి కాంగ్రెస్ నాయకులు పదవులను చేపట్టటానికి ఒప్పుకోలేదు. మళ్ళా వైస్ రాయ్ తో జరిపిన చర్చలలో కాంగ్రెస్ నాయకులు గవర్నర్లు ప్రభుత్వవ్యవహారాలలో జోక్యం చేసుకోకూడదన్న షరతుపై పట్టుబట్టారు. ఆజాద్ కృషి వలన కాంగ్రెస్ నాయకులు పదవులను చేపట్టటానికి ఒప్పుకున్నారు కానీ నెహ్రు ఒప్పుకోలేదు తరువాత గాంధీజీ కూడా ఆజాద్ అభిప్రాయాలను సమర్ధించాడు. ఆ విధముగా కాంగ్రెస్ మొదటిసారిగా ప్రభుత్వాన్ని నడిపేందుకు ముందుకు వచ్చింది.
రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమైన తరుణములో భారతీయ సైనికులు బ్రిటన్ తరుఫున పోరాడటానికి గాంధీజీ అంగీకరించ లేదు. ఈ విషయములో కూడా ఆజాద్ గాంధీజీతో విభేదించాడు. యూరోపియన్ సమాజము నాజీయిజం, ఫాసిజమ్ ల నాయకత్వములో ఒక వైపు ప్రజాస్వామ్య దేశాలు ఒకవైపు ఉండి యుద్ధము చేస్తున్నప్పుడు మన సైనికులు బ్రిటన్ తరఫున పోరాడకపోతే నాజీలను సమర్ధించినట్లు అవుతుంది ఫలితముగా మనము స్వాతంత్రాన్ని పొందే అవకాశాలు తగ్గుతాయని ఆజాద్ ఉద్దేశ్యము. సెప్టెంబర్ 1939లో రెండవ ప్రపంచ యుద్ధము ప్రారంభమయినప్పుడు గాంధీజీ కోరిక మేర ఆజాద్ కాంగ్రెస్ అధ్యక్ష చేపట్టి 1946 వరకు కొనసాగాడు ఈ కాలము భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చాలా క్లిష్టమైనది.ఈ టైములోనే అంటే క్రీప్స్ ఇండియాకు రావటము 1942లోనే కాంగ్రెస్ పార్టీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపు ఇవ్వటం జరిగింది. ఆ మరునాడే ఆజాద్ తో సహా నాయకులందరిని బొంబాయి లో అరెస్ట్ చేసి పాత అహమ్మద్ నగర్ కోటాలో గల జైలులో ఉంచారు. ఈ విధముగా స్వాతంత్ర పోరాటములో ఆజాద్ 1916 నుండి ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకర ణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని మొత్తము మీద 10 సంవత్సరాలపాటు జైలుశిక్ష అనుభవించాడు. రెండు ప్రపంచయుద్ధాల సమయములో జైలు జీవితమూ గడిపిన ప్రముఖ నాయకుడు ఈయన ఒక్కడే.
1944జైలు నుండి విడుదల అయినాక గాంధీజీ బ్రిటిష్ ప్రభుత్వ వైఖరిలో మార్పు వచ్చిస్వాతంత్రము వస్తుందని ఆశించాడు. కానీ ఆజాద్ గాంధీజీ ఉద్దేశ్యాలు సరికావు అని అభిప్రాయపడ్డాడు. జైలులో 21రోజులపాటు నిరాహార దీక్ష గాంధీజీ చేయటంవల్ల ఆనారోగ్యము చెందటంవల్ల గాంధీజీ జైలులో ఉండగా చనిపోతే గొడవలు అవుతాయి అని విడుదల చేశారు. ఆ తరువాత పరిణామాలలో మొదటిది గాంధీజీ జిన్నా ను కలిసి ముస్లిం లీగ్ తో అవగాహన ఏర్పరచుకోవటము తరువాత ప్రభుత్వముతో మంతనాలు జరిపి భారత దేశానికి స్వాతంత్రము ఇస్తే భారత సైనికులు బ్రిటన్ తరుఫున ప్రపంచ యుద్దములో పాల్గొంటారు అని గాంధీజీ ప్రకటించాడు ఈ చర్యలను ఆజాద్ సమర్ధించలేదు ఫలితముగా గాంధీజీ జిన్నాను సమర్ధిస్తూ జిన్నాకు ఎక్కువప్రాధాన్యము ఇవ్వటం మొదలుపెట్టి, జిన్నాను “Qaid -I-azam (గొప్పనాయకుడు) అనే బిరుదు ఇచ్చాడు. ఆ గొప్పనాయకుడే భారత దేశము విడిపోవటానికి కారణమయ్యాడు. ఫలితముగా భారతదేశములోని ముస్లిములు జిన్నాయే వారి నాయకుడు అని భావించసాగారు. జిన్నా తన ప్రాబల్యాన్ని గాంధీజీ సహకారముతో పెంచుకోసాగాడు.
ఆజాద్, నెహ్రు సీఎంలా సమావేశానికి హాజరు కావలసి వచ్చినప్పుడు ఆజాద్ ఆరోగ్యము దెబ్బతింది. డాక్టర్లు సమావేశాన్ని పోస్ట్ ఫోన్ చేసుకోమని సలహా ఇచ్చారు కాని తన విధుల పట్ల భాద్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆ సలహాకు అంగీకరించలేదు అప్పటి వైస్ రాయ్ ఆజాద్ ను వైస్ రీగల్ ఎస్టేట్ లో ఉంచి వైద్య సదుపాయాన్ని అందించాడు. ఈ సందర్బంగా ఆజాద్,”సైనికుడు యుద్దభూమి నుండి పారిపోవటం మరణానికి మించిన శిక్ష” అని అన్నాడు. ఆ విధముగా భారత స్వాతంత్ర సంగ్రామములో పాల్గొన్న ధైర్యశాలి అయిన సైనికుడు ఆజాద్. గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ మరియు నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్-ఎ-కారవాన్ అని పిలిచేవారు. స్వతంత్ర భారతదేశములో మొదటి విద్యాశాఖ మంత్రిగా 11 సంవత్సరాలు పనిచేశాడు ఆ సమయములోనే అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ స్థాపనకు కృషి చేశాడు.
1958 ఫిబ్రవరి 22 న మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ మరణించాడు.1992లో భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న ఇచ్చి గౌరవించింది. ఇతడి జన్మదినమైన నవంబరు 11 ను జాతీయ విద్యా దినోత్సవం గా జరుపుకుంటారు.