గోపాలకృష్ణ గోఖలే మే తొమ్మిది, 1866లో అంటే మొదటి స్వాతంత్ర సమరముగా భావించే సిపాయిల తిరుగుబాటు జరిగిన తొమ్మిది సంవత్సరాలకు బొంబాయి ప్రెసిడెన్సీ లోని రత్నగిరి జిల్లా గుహాగర్ తాలూకా కొట్లాక్ గ్రామములో సాధారణ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. గోఖలే తల్లిదండ్రులు అంత స్థితిమంతులు కాకపోయినా గోఖలే కు ఇంగ్లిష్ మీడియం విద్యను చెప్పించారు. ఫలితముగా ఆ విద్య వల్ల బ్రిటిష్ ప్రభుత్వములో ఉద్యోగిగా చేరాడు. ఆ రోజుల్లో యూనివర్సిటీ స్థాయి వరకు విద్యను అభ్యసించిన కొద్దిమందిలో గోఖలే ఒకడు. గోఖలే ఎల్ఫిన్ స్టోన్ కాలేజీ నుండి పట్టా పుచ్చుకున్నాడు. ఆ సమయము లోనే ఇంగ్లీష్ విద్య వలన పాశ్చాత్య రాజకీయ ఆలోచనలకూ ప్రభావితుడై ఎడ్మన్డ్ బార్క్ జాన్ స్టార్ట్ మిల్ వంటి సిద్ధాంతకర్తల అభిమాని అయినాడు.
జస్టిస్ మహాదేవ్ రానడే తన పదవి వల్ల నేరుగా రాజకీయాలలో పాల్గొనటానికి అవకాశములేక నమ్మకమైన అనుచరుడి కోసము చూస్తుండగా న్యూ ఇంగ్లిష్ స్కూల్ లో 1885లో జరిగే కార్యక్రమములో మొదటిసారిగా రానడే గోఖలే పరిచయము అయింది ఎస్ ఎచ్ సాథే అనే ప్రముఖుడు గోఖలేను రానడేకు పరిచయము చేసాడు. రానడే తానూ 1870లో స్థాపించిన పూనా సార్వజనిక్ సభను గోఖలే సమర్థుడని భావించి గోఖలేను రానడే శిష్యుడిగా చేసుకొని చిన్నవయస్సులోనే గోఖలే రాజకీయ జీవితము, ప్రారంభింపజేసి సభ నిర్వహించే పత్రిక సంపాదకుడిగా బాధ్యతలు అప్పగించాడు. అప్పట్లో భారతీయులు కొందరు బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీని అరికట్టి భారత దేశానికి జరిగేటట్లు చూడాలంటే ఒక రాజకీయ పార్టీ అవసరమని భావించారు కానీ ఏ భారతీయుడైన అటువంటి రాజకీయ పార్టీ స్థాపిస్తే ప్రభుత్వమునుండి అనేక అడ్డంకులు వస్తాయని సందేహించేవారు. ఎవరు ధైర్యము చేయలేక పోయారు అటువంటి పరిస్థితులలో ఏ.ఓ.హ్యూమ్స్ అనే ఆంగ్లేయుడు 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనే రాజకీయ పార్టీ స్థాపించాడు. భారత దేశానికి మంచి జరగాలని ఆశించే ప్రముఖులందరు ఆ పార్టీలో చేరారు.
1889 లో గోఖలే ఇండియన్ నేషనల్ కాంగ్రెసులో చేరి అప్పటి నాయకులైన బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతిరాయ్ వంటి ప్రముఖులతో కలిసి పనిచేశాడు. కాంగ్రెస్ లోని మితవాద వర్గానికి నాయకత్వము వహించేవాడు. ఆ విధముగా గాంధీజీ కి రాజకీయ గురువుగా గుర్తింపు పొందాడు. మన జాతీయ ఉద్యమానికి విదేశీయుల సహకారము కావాలి అనే ఉద్దేశ్యముతో గోఖలే 1894లో ఐర్లండ్ వెళ్లి ఐర్లండ్ దేశస్తుడైన ఆల్ ఫ్రెడ్ వెబ్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒప్పించాడు. మరుసటి సంవత్సరము గోఖలే కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా నియమించబడ్డాడు. గోఖలేతో విభేదించిన మొదటి వ్యక్తి తిలక్. ఇద్దరు ఒకే ప్రాంతము, ఒకే సామాజిక వర్గము, ఒకే కాలేజీ విద్యార్థులైనా సిద్ధాంత పరముగా విభేదాలు ఉండేవి. మొదటి సారిగా 1891-92 లో బ్రిటిషు ఇంపీరియల్ ప్రభుత్వము వివాహ వయస్సు గురించి (బాల్య వివాహాలు తగ్గించటానికి)ఏజ్ అఫ్ కాన్సెన్ట్ బిల్ ప్రవేశపెట్టినప్పుడు గోఖలే వర్గము ఆ బిల్ ను సమర్ధించారు కానీ అతివాద తిలక్ వర్గము మన హిందూ సంసృతి లో విదేశీయుల జోక్యాన్ని నిరసిస్తూ ఆ బిల్ ను వ్యతిరేకించారు. మాకు స్వాతంత్రము వచ్చినాక అటువంటి సంస్కరణలు మేమె చేసుకుంటాము అని తిలక్ వాదన. చివరకు ఆ బిల్ బొంబాయి ప్రెసిడెన్సీలో చట్టముగా తయారు అయింది. ఈ ఇద్దరు నాయకులు పూర్వసర్వజనిక్ సభ పూనా పై అధిపత్యానికి ప్రయత్నించేవారు. ఈ క్రమమములో గోఖలే 1896లో దక్కన్ సభను, సర్వెంట్స్ అఫ్ ఇండియా సంస్థను స్థాపించి భారత దేశములో విద్యావ్యాప్తికి కృషిచేశాడు. విద్య ద్వారానే భారతీయులు అభివృద్ధి చెందగలరని ఆశించాడు.
ఆ విధముగా తిలక్ కాంగ్రెస్ లోని అతి వాద వర్గానికి నాయకుడైనాడు తిలక్ విప్లవం ద్వారానైనా స్వాతంత్ర్యము రావాలి అని వాదించే వాడు కానీ గోఖలే సాంఘీక సంస్కరణల ద్వారా ప్రజలలో చైతన్యము రావాలి అని తన ఉపన్యాసాల ద్వారా వాదించేవాడు. తన వాగ్దాటితో గోఖలే అందరిని మెప్పించేవాడు. అవతలి వ్యక్తిని మెచ్చుకోవటం అనే పని చాలా అరుదుగా చేసే లార్డ్ కర్జన్ కూడా గోఖలే ఉపన్యాసాలను మెచ్చుకొనేవాడు. ఇరవై వ శతాబ్దము ఆరంభములో జాతీయవాదులు చిన్న చిన్నసంస్కరణలతో సరిపెట్టుకోకుండా స్వపరిపాలన ఉద్యమానికి 1904లో నౌరోజి పిలుపు నిచ్చారు. 1905లో జరిగిన కాంగ్రెస్ సమావేశములో గోఖలే తన అధ్యక్ష ఉపన్యాసము లో స్వపరిపాలన ను డిమాండ్ చేశారు ఆ విధముగా మొదటిసారి “స్వరాజ్ ” అనే పదము వాడారు. ప్రజలను చైతన్యవంతులను చేయటానికి వాడవాడలా మేధావులతో ప్రసంగాలు ఇప్పించేవారు. పత్రికలలో ప్రభుత్వ దమన నీతిని విమర్శిస్తు పత్రికలలో సంపాదకీయాలు వ్రాసేవారు. వాడవాడలా జరిగిన సభలు సమావేశాల తీర్మానాల ప్రతులను ప్రభుత్వానికి అందేటట్లు చేశారు దాదాభాయి నౌరోజీ ఇగ్లాండ్ లో ఉండి బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులకు అక్కడి పెద్దలకు భారతీయుల వాణిని వినిపించేవారు అయన తన సమయాన్ని డబ్బును ఈ పనికే ఖర్చు పెట్టేవాడు ఈ విధముగా స్వదేశములో గోఖలే ఇంగ్లండ్ లో నౌరోజీ విశేషముగా కృషి చేసేవారు.కానీ భారతదేశములో గోఖలే వంటి మితవాద నాయకత్వనికి పెద్ద లోపము ఏమిటి అంటే ఈ నాయకులు చదువుకున్న వర్గాన్ని ప్రభావితము చేయగలిగారు కానీ వీరి వాణి సమాజములో అట్టడుగు ప్రజలకు అంటే చదువు లేని నిరుపేదలదాకా వెళ్ళలేదు
దాదాభాయి నౌరోజీ బ్రిటిష్ పార్లమెంట్ లో మెంబరుగా ఉండి లార్డ వెల్బీ అధ్యక్షతన గల రాయల్ కమీషన్ ఏర్పాటుకు కృషి చేశాడు ఆ కమిషన్ ఇండియా వచ్చినప్పుడు ఆ కమీషన్ ముందు హాజరు అయి భారతీయుల వాణిని వినిపించ టానికి ఎన్నుకున్న వారిలో గోఖలే అతి చిన్న వయస్సు వాడు అప్పుడు ఆయన వయస్సు 31 సంవత్సరాలు. గోఖలే కమీషన్ ముందు యుద్ధము లేని రోజుల్లోకూడా యూరోపియన్ సైన్యానికి ఎంత పన్నుల రూపములో కడుతున్నారో లెక్కలతో సహా సవివరముగా తెలియజేశాడు. భారత దేశములో రైల్వేల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని బ్రిటిష్ ప్రభుత్వము చెపుతూ భారతదేశాన్ని దేశ సంపదను కొల్లగొడుతుందని కమీషన్ ముందు ఆధారాలతో గోఖలే వివరించాడు. కొత్త రైల్వే లైనులు వేయటము ద్వారా కరువు ప్రాంతాలకు ఆహారము పశుగ్రాసము తరలించవచ్చు అని చెపుతూ రైళ్ల ద్వారా సరుకులైన టీ, కాఫీ, ఇతర సుగంధ ద్రవ్యాలు ఇంగ్లండ్ కు ఎగుమతి చేసుకునేవారు తద్వారా భారతదేశ ఆదాయము తగ్గి దేశ పరిశ్రమలు నష్ట పోతున్నాయన్న విషయాన్ని కమీషనుకు వివరించాడు. లార్డ్ లిట్టన్ హయాములో అదనపు పన్నులు వేసి కరువు భీమా నిధి కోసము బ్రిటిష్ ప్రభుత్వమూ వసూలు చేసింది కానీ ఆ డబ్బును బెంగాల్ నాగపూర్ రైల్వే మరియు ఇండియన్ మిడ్ ల్యాన్డ్ రైల్వేస్ పెట్టుబడులకు వడ్డీ కట్టటానికి వినియోగించారు. ఈ లెక్కలన్నియిని వ్రాతపూర్వకంగా కమీషన్ ముందు ఉంచాడు. వీటన్నిటిని కమీషన్ కు వివరించటానికి గోఖలే కు రెండు రోజులు పట్టింది. ఈ విధముగా బ్రిటిష్ ప్రభుత్వమూ భారతీయులకు చేస్తున్న అన్యాయాన్ని సవివరముగా వివరించాడు. కమీషన్ సభ్యులు గోఖలే కృషికి ఆయన వివరించిన విధానానికి గోఖలేను ప్రశంసించారు. అప్పుడు గోఖలే ఆ గొప్పతనము అంతా తన గురువుగారైన రానడేదని సవినయముగా ఒప్పుకున్నాడు. అది అయన వ్యక్తిత్వము.
ఆ విధముగా సాంఘీక రాజకీయ వాతావరణములో మెలగిన గోఖలే తన కెరీర్ ను విద్యతో ప్రారంభించి రాజ్యాంగపరమైన ఆందోళనల చదరంగములో ముగించాడు. ఆయన ధైర్యము నిజాయితీ, భారత దేశ స్వాతంత్రము పట్ల బలమైన కోరిక, స్వాతంత్ర పోరాటంలో అయన పోషించిన పాత్ర , ఆయన తాను నమ్మిన సిద్ధాంతాల పట్ల గల ప్రఘాఢ నమ్మకము అన్నిటికి మించి మాతృదేశము పట్ల గల అంకిత భావము తో కూడిన దేశ భక్తి ఆయనను ఒక కర్మ యోగిగా నిలబెట్టాయి 19, ఫిబ్రవరి 1915 న పరమపదించారు. కానీ భారతీయుల మనస్సుల్లో చిరస్థాయిగా ఉండిపోయే పేరు గోపాల కృష్ణ గోఖలే.