ఎవరు… గ్రహాంతరవాసులా? – ఐదవ భాగం

నల్లమలలో రెండు రోజుల క్రితం సంభవించిన ఘటనతో దాదాపు దక్షిణ భారత దేశం మొత్తం విద్యుత్తు నిలిచిపోయింది. సెల్ఫోన్లు, రేడియో, టీవీలు ఇలా సిగ్నల్, శాటిలైట్ తో పనిచేసే యే యంత్రాలు పనిచేయడం లేదు. దీంతో ఆదునిక కాలానికి అలవాటు పడ్డ జనం విలవిలలాడిపోసాగారు.

“మొన్నటి దాక రాహుల్ ఎక్కడ ఉన్నా బ్రతికే ఉన్నాడు అన్న నమ్మకంతో ఉన్న. కానీ ఇపుడు ఆ నమ్మకం కూడా పోయింది. అడవిలో ఆరోజు అంత పెద్ద అగ్ని గోళం పడ్డది. అది అక్కడ పడితే దక్షిణ భారత దేశం మొత్తం ఇంత ప్రభావం చూపించింది. ఇక అడవిలోనే ఉన్న నా రాహుల్ ఎలా ప్రాణాలతో ఉంటాడు” ఏడుస్తూ అంది ప్రియాంక.

నల్లమల పక్కనున్న గ్రామంలోని లాడ్జిలో కాత్యాయని, ప్రియాంక దిగి రెండు రోజులైంది. వచ్చి రెండు రోజులైనా వారికి అడవికి వెళ్లేందుకు వీలుపడలేదు. అందుకు కారణం అడవిలోకి ఎవరు వెళ్ళకుండా అడవి చుట్టూ పటిష్టమైన ఆర్మీ ఫోర్స్ కాపలా కాస్తున్నారు.

“అసలు ఇంత అవుతున్నా గవర్నమెంటు ఏం చేయడం లేదేంటే? అడవిలో ఏం జరుగుతుందో అని  తెలుసుకోవడం కోసం ఇంకా టీం లని పంపిచచ్చు కదా” అంది ప్రియాంక.

“వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తున్నార? ఒక్కరు కూడా రావడం లేదు. అయినా ఆర్మీని ఇక్కడ దింపారు అంటే ఎదో ఒక ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. దిగులు పడకు. రాహుల్ ఒక్కడే  కాదు కదా అడవిలోకి వెళ్లి మాయం అయింది, పోలీసులు, ఉన్నతాధికారులు చాలానే ఉన్నారు. వారి కోసమైనా ప్రభుత్వం లోపలికి వెళ్లి అందరిని  కాపాడుతుంది” అంది కాత్యాయని.

“అదే ఎప్పుడు వెళుతుంది?” దీనంగా అడిగింది ప్రియాంక.

ఆ ప్రశ్నకు కాత్యాయని దగ్గర మౌనమే తప్ప సమాధానం లేదు.

‘ఏం చేయాలి అసలు. నల్లమల దగ్గరకు రానైతే వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేయగలుగుతాం? ఒకసారి అడవిలోకి వెళదాం అన్నా ఆర్మీ ఉంది అక్కడ.  ఎలా వెళ్ళడం. వెళ్లి కూడా తిరిగి వస్తాం అన్న నమ్మకం లేదు. అలా అని ఏమి చేయకుండా కూర్చోలేము.  నా మీద నమ్మకంతో ఇక్కడిదాకా వచ్చింది ప్రియాంక. ఎలాగైనా సరే ఎదో ఒకటి చేయాలి’ అనుకుంది కాత్యాయని.

“నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ప్రియ”

ఆ మాటతో ప్రియాంక కళ్ళలో ఒక్కసారిగా వెలుగు వచ్చింది. “ఏంటది” ఆత్రుతగా అడిగింది.

“ఈరోజు రాత్రి నేను అడవిలోకి వెళతాను”

“ఆర్మీ చూస్తుండగా ఎలా  వెళ్తావు?”

“వాళ్ళు చూస్తుండగా వెళ్ళడం అసాద్యం. వాళ్లకు కనిపించకుండా వెళత” అంది.

“వెళతావా? అంటే నేను రావద్దా?”

“వద్దు. ఒక్కరం వెళితే ఏ ప్రాబ్ వచ్చిన త్వరగా అక్కడినుంచి వచ్చేయడానికి ఉంటది. నువ్వు నాతొ వస్తే నిన్ను చూస్తూ అక్కడ వై ఏం జరుగుతుందో చూడటం కష్టం. నువ్వు వద్దు”

“మిస్ అయింది నా రాహుల్. నా రాహుల్ కోసం నన్ను రావద్దావెంటసలు నువ్వు”

“నీ రాహులే. అయినా వద్దు. నా మాట విను. ఎక్కువ గోల చేయకు”

మౌనం  వహించింది ప్రియాంక. కాని  మనసులో ‘నువ్వు రావద్దు అన్నా నేను రాకుండా ఎలా ఉంటా. నీ వెనకే నీకు తెలియకుండా వస్తా’ అనుకుంది.

*        *        *        *        *        *

రాత్రి 12 గంటలు దాటింది.

బల్లమీద ఉన్న కొవ్వొత్తి కిటికీలో నుండి వచ్చే బలమైన గాలికి ఒక్కసారిగా  ఆరిపోయింది. దాంతో గదంతా ఒక్కసారిగా చిమ్మని చీకటి అలుముకుంది.

పడక మీద పడుకున్నదన్న మాటే కానీ కాత్యాయని మేలుకునే  ఉంది. బెడ్ దిగి వెళ్లి బల్ల మీద ఉన్న అగ్గిపుల్ల గీసి కొవ్వొత్తి వెలిగించింది. ఆ వెలుగులో బెడ్ వైపు తల తిప్పి చూసింది, ప్రియాంక పడుకుని ఉంది. టైం చూసి “ఇదే సరైన సమయం. బయట అంత ఎలాగో చీకటి ఉంటుంది” అనుకుని బెడ్ కింద ఉన్న బ్యాగు బయటకు లాగి అందులో ఆరోజు ఉదయం కొనుక్కొచ్చి పెట్టిన నల్లని బుర్ఖని బయటకు తీసి ధరించింది. కళ్ళకు కూడా నల్లని జాలి వస్త్రాన్ని కట్టుకుంది. ఎందుకంటే నల్లని దుస్తులలో చీకట్లో కలిసిపోయి అడవిలోకి వెళ్లాలనేది ఆమె ప్లాన్.

చప్పుడు చేయకుండా చిన్న బ్యాగులో తనకు కావలిసినవి అన్ని వేసుకుని భుజాన వేస్కుని మెల్లగా గదిలోంచి బయటకు వచ్చింది. తలుపులు అడ్డమేసి గబగబా మెట్లవైపు రెండు అడుగులు వేసి ఎదో జ్ఞాపకం వచ్చినదానిలా టక్కున ఆగి వెనక్కి వెళ్లి తలుపులకు బయటనుండి గడియ పెట్టింది ‘నా వెనకాలే ఇది వచ్చినా రాగాలదు’ అని మనసులో అనుకుంటూ.

గడియ పెట్టేసి మెట్లవైపు వేగంగా వెళ్ళింది. మెయిన్ డోర్ దగ్గర ఎవ్వరు ఉండకపోతే బాగుండేది అనుకుంటూ వెళ్ళిన ఆమెకి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుని గుమ్మం దగ్గరకు వెళ్ళింది. తలుపు గడియ తీద్దామని పట్టుకోగానే తలుపులు తెరచుకున్నాయి. ఆశ్చర్యపోయింది కాత్యాయని. ‘అదేంటి తలుపులకు గడియ వేయలేదా?’, ‘ఎలా అయితే నాకేంటి.. అంతా నా మంచికే’ అనుకుని వీధిలోకి వచ్చింది. బయట అంతటా చిమ్మ చీకటి.

‘అసలు కరంటు లేకుండా అప్పటి కాలంలో జనాలు ఎలా ఉన్నారో’ అనుకుంది అడవి వైపు నడుస్తూ.

అడవి దగ్గర అంతా పట్టపగల్ల ఉంది ఎక్కడికక్కడ మండుతున్న కాగడాల వెలుగులో. ఆర్మీ ఫోర్సు అటూ ఇటూ తిరుగుతూ పహారా కాస్తుంది.

టక్కున నడుస్తున్నదల్లా రోడ్డును వదిలి చెట్టు వెనక్కి వెళ్లి దాక్కుంది కాత్యాయని.

‘ఎలా వెళ్ళాలి?’ అనుకుంటూ యధాలాపకంగా పక్కకు చూసిన ఆమెకి ఓ నల్లని ఆకారం తన దగ్గరకు రావడం చూసి గుండె ఆగినంత పనయింది. కెవ్వున అరవబోయింది కానీ ఆ అవకాశం ఆమెకు రాలేదు ఆ నల్లని ఆకారం అప్పటికే ఆమెని సమీపించి ఆమె నోరును బలంగా నొక్కేసింది.

కాత్యాయని గింజుకోసాగింది.

అప్పుడు ఆమె చెవులకు ‘ష్…… అరవకండి’ అని చిన్న మగ గొంతులో మాటలు వినిపించాయి.

“నేను కూడా మీలాగా మనిషినే” అంటూ ఆమెని వదిలి కాస్త దూరంగా నిలబడింది ఆ ఆకారం.

ఆ మాటలతో తేరుకున్న కాత్యాయని ఆ ఆకారాన్ని పరికించి చూసింది. నల్లని దుస్తుల్లో ముఖానికి,  చేతులకి  నల్ల రంగు పుసుకున్న మనిషి  కనిపించాడు. “మీరేంటి ఒంటికి ఇలా నల్ల రంగు వేసుకున్నారు? అయినా ఇంత రాత్రి ఇక్కడ  ఏం చేస్తున్నారు?” అడిగింది కాత్యాయని.

“వెయిట్ వెయిట్… ఈ  ప్రశ్నలు నేను  అడగాల్సినవి. ఇక్కడికి ముందు నేను వచ్చాను. నేను వచ్చాక మీరు వచ్చారు. అసలు ఎవరు మీరు? ఈ రాత్రి  బురఖాలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? వచ్చి నేను దాక్కున్న చెట్టు దగ్గరే మీరెందుకు దాక్కున్నారు?” అడిగాడు వినీత్.

“ఈ చెట్టు నీదా?”

“కాదు”

“మరి.. పెద్ద ఇది నీ చెట్టు అన్నట్టు మాట్లాడతావు. రోడ్డు పక్కన ఉంది వచ్చా. ఏం తప్పా?” దబాయింపుగా మాట్లాడింది.

“అలా అనట్లే.  సరే ఇది వదిలేయండి. ఎందుకు ఈ టైం లో వచ్చారు. వచ్చి ఇలా ఆర్మీ ని చూడగానే ఎందుకు దాక్కున్నారు?”

“నేను అడుగుతే నువ్వు చెప్పావా? నువ్వు చెప్పనప్పుడు నేనెందుకు చెప్పాలి”

“ప్చ్.. నేను ఈ అడవిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను” చెప్పాడు వినీత్.

“అవునా…”

“ఎస్”

“నిజం చెప్పాలంటే నేను అందుకే వచ్చాను”

“ఛ”

“అరె.. నిజం”

“ఈ కాలం అమ్మాయిలలో ఇంత  ధైర్యం ఉందని నేననుకోవట్లే” అన్నాడు కాస్త వ్యంగ్యంగా.

“కళ్ళు  కనిపించట్లా? నీ  ఎదురుగానే ఉన్నా గా. ఇంకా అనుకోవట్లే ఏంటి, పిచ్చా?” అని విసురుగా అక్కడ నించి కదిలి చిన్నగా అడవి వైపు తొంగి చూసింది.

అక్కడ పెద్దగా ఏ మార్పు కనిపించలేదు ఆమెకు. ఆర్మీ అలాగే ఉంది ఇంకా. అసహనంగా “వీళ్ళు ఇక్కడే ఉంటారా ఇక?  కాసేపయిన పడుకోరా” అంది లోలోన అనుకున్నట్టు పైకే.

“వాళ్ళు పిక్నిక్  కి రాలేదుగా. పాడుకోడానికి. ఒకరు పడుకున్నా ఇంకొకరు డ్యూటి చేస్తారు”

“మరి ఇది తెలిసే ఎందుకు వచ్చావు?” అంది కాత్యాయని.

“నువ్వు రాలేదా అలాగే నేనూ వచ్చా”

“ఛి అసలు మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతున్నాడు. కొత్త వ్యక్తులతో ఇదేనా మాట్లాడే తీరు” అతనికి వినపడేట్టు లోలోన అనుకున్నట్టు పైకి అంది.

“నేను మర్యాద ఇచ్చే మాట్లాడా. నువ్వు ఏకవచనంలోకి వచ్చావు నేను కూడా వచ్చా. మళ్ళి ఇంకా మర్యాద అంటావు” ఈసారి కాస్త కోపంగా అన్నాడు.

“ఓకే సారీ. ఇద్దరం లోపలి వెళ్ళాలనే వచ్చాం కదా. చెప్పు నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా” అని అడిగింది కాత్యాయని.

“ఉంటె నేనెందుకు  చెబుతా. ఒకేలే… అడిగావు కదా. చెబుత. కానీ నాదగ్గర ఇపుడు అయితే ఏ ప్లాన్ లేదు. ఆలోచిస్తున్న” అన్నాడు.

‘ఇతన్ని నా బుద్ది తక్కువై అడిగా’ అనుకుని లోపలికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించ సాగింది. వెంటనే ఓ ఆలోచన తట్టింది ఆమెకు. వెంటనే నేల మీద తనకు కావాల్సిన దాని కోసం వెతకసాగింది.

“ఏం చేస్తున్నావు?” అడిగాడు వినీత్.

“అడవిలోకి వెళ్లేందుకు నా ప్లాన్ అమలు పరుస్తున్న”

“నాకు చెప్పచ్చు కదా ఇద్దరం కలిసి చేయొచ్చు”  అన్నాడు ఆమె దగ్గరికి వెళుతూ.

తను వెతుకుతున్నది దొరకగానే “అయితే నేను చెప్పింది చేస్తావా”

“చెప్పు చేస్తా”

“ఈ రాయిని బలంగా అడవిలోకి విసురు. ఆ చప్పుడు విని, అడవిలో అక్కడకి ఏదో వచ్చిందని ఆర్మీ వళ్ళంతా అక్కడికి వెళతారు. అపుడు మనం లోపలికి సులభంగా వెళ్ళొచ్చు”

“పాత ఆలోచనే అయినా వినడానికి బాగుంది. కాని అందరు వెళతారు అంటావా?. ఇది మనలాంటి వాళ్ళ  ప్లాను అని వాళ్ళకు తెలియదంటావా. చిన్నప్పటి నుండి సినిమాల్లో ఇలాంటి ట్రిక్స్ మనమే ఎన్నో చూసాం ఆర్మీకి తెలియదంటావా” అంటూ తన సందేహాన్ని వెలిబుచ్చాడు.

“నిజమే. కానీ ఇప్పటివరకు ఈ ఊళ్ళో ఆర్మితో మనం చేసినట్టు చేసుండకపోవచ్చు కదా. అడవిలో చప్పుడు అవ్వగానే నిజమే అని వాళ్ళు వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైతే అవని. ప్రయత్నం అయితే చేద్దాం. కాని ఈ రాయి మాత్రం కచ్చితంగా అడవి లోపల పడాలి. అప్పుడే  ఏమైనా ఫలితం ఉంటుంది. అంత దూరం విసరగలవా”

“విసరగలవా అంటే… ఏమో. విసిరి చూస్తా…” అంటూ ఆమె ఇచ్చిన పెద్ద రాయి తీసుకుని వెనక్కి వెళ్ళాడు. కొంచం దూరం వెళ్లి క్రికెట్  లో బంతి విసిరే ఆటగాడిలా అక్కడి నుండి పరిగెత్తు కొచ్చి బలంగా అడవిలోకి రాయి విసిరాడు.

రాయి నేరుగా వెళ్లి అడవిలో పెద్ద చప్పుడు చేస్తూ పడింది.

కాత్యాయని అన్నట్టుగానే అక్కడ ఉన్న జవాన్లు ఒక్కసారిగా అలర్ట్ అయి అడవిలోకి పరిగెత్తారు.

“మన ప్లాన్ పని చేసింది. త్వరగా పద లోపలికి వెళదాం” అంది కాపలాగా ఇపుడు అక్కడ ఎవరు లేకపోవడంతో.

ఇద్దరు వేగంగా పరిగెత్తుకెళ్ళారు అడవి వైపు.

ఇంకా ఉంది