ఎవరు… గ్రహాంతరవాసులా? – మూడవ భాగం

          పిచ్చి మొక్కలు, ఊరి వాళ్ళు వేసే చెత్త చెదారం, కుళ్ళిన పదార్థాల వాసనతో ఆ ప్రదేశం అంతా దుర్భరంగా ఉంది. ఆ కంపు కొట్టే చోటే, ఆ ఊరికీ అడవికి అడ్డుకట్టలా ఉండే ప్రదేశం.

          ఊర్లోంచి నడుచుకుంటూ అక్కడికి వచ్చాడు వినీత్. దుర్వాసన ముక్కుపుటాలు అదిరేలా చేస్తోంది. అది భరించలేక ముక్కుకు కర్చిఫ్ అడ్డు పెట్టుకుని అందులోంచి అడవిలోకి వెళ్లేందుకున్న సన్నని కాలి బాటలోకి నడిచాడు.

          గుబురు పొదలు, పెద్ద పెద్ద చెట్లతో చిమ్మ చీకటిగా ఉంది ఆ అడవి అదీ కాక అవి అమావాస్య దగ్గరి రోజులు కావడంతో కన్ను పొడుచుకు చూసిన ఏదీ స్పష్టంగా కనిపించని కటిక చీకటి. గాలికి వృక్షాలు జుట్టు విరబోసుకున్న కొరివి దేయ్యల్లా లయలా క్రమబద్దంగా అటూ ఇటూ ఊగుతున్నాయి. ఎవరైనా అదాటున ఆ దృశ్యం చుస్తే వారి గుండెల్లో గుబులు పుట్టాక మానదు. దానికి తోడు అడవిలోంచి ఉండుండి వినిపించే కౄరమృగాల అరుపులు అక్కడి వాతావరణాన్ని ఇంకా భయం గొల్పెలా చేస్తున్నాయి.

          కాలిబాట వీడి అడవిలోకి అడుగుపెట్టాడు వినీత్. నిలబడి చుట్టూ పరికించి చూసాడు టార్చి వెలుగులో. చెట్లు, పొదలు, చిమ్మ చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు అతనికి.

          ఎందుకో తెలియదు కాని అడవిలోకి వచ్చిన క్షణం నుండి అతని తలంతా ఒక మాదిరిగా తయారవడం గమినించాడు వినీత్. ‘ఏమైంది నాకు సడన్ గా?’ అనుకుంటూ టార్చి వెలుగులో అలాగే ఎక్కడా ఆగకుండా ముందుకు అడుగులేసాడు.

          అలా లోపలికి ఓ పదడుగుల దూరం పోయాడో లేదో, అతని తలంతా విపరీతంగ భారంగా అవుతున్న భావనకు లోనయ్యాడు. నడుస్తున్నవాడల్లా అక్కడే ఆగిపోయాడు తలపట్టుకుంటూ. అతనికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతని కళ్ళు మసకబారుతూంటే స్పృహ తప్పి ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు.

*     *     *     *     *     *

          సాయంత్రం…

          “అడవికి వెళదాం అంటే ఏంతో సంతోషపడ్డ. కాని ఈ కంపులోంచి అడవిలోకి వెళ్ళాలంటే అసహ్యంగా ఉంది. అడవిలో ప్రకృతి అందాలూ, చెట్లు, సువాసన ఇలా ఏదేదో అనుకున్న, కాని అక్కడికి వెళ్ళకముందే ఈ వాసనతో నా ఊహలన్ని చెల్లాచెదురు అయ్యాయి. అయినా అడవికి వెళ్ళే ఇంకో మార్గమే లేదారా?” ముక్కుకి స్కార్ఫ్ కట్టుకుంటూ అంది ప్రియాంక రాహుల్ తో.

          “ఉన్నదట. కాని దాన్ని మూసేసారట. అందుకే ఇలా వెళుతున్నాం” ముందు నడుస్తున్న రాహుల్ అన్నాడు.

          “ఎందుకు మూసేశారు” వెనక అతని అడుగులో అడుగులేసి వస్తూ అంది.

          “తెలీదురా. ఆ ఊరి ఆయన ఎదో చెప్పాడు. ఆ టైమ్లో నాన్న కాల్ చేసాడు. సరిగ్గా వినలేదు. మధ్యలోనే వచ్చేసా”

          అలా మాట్లాడుతూ మురికి ప్రదేశంలోంచి అడవిలోకి ప్రవేశించారు ఇద్దరు.

          పక్షులన్నీ కిలకిలరావాలతో తమతమ గూటికి చేరుకుంటున్నాయి.

          చుట్టూ పచ్చని చెట్లు, పచ్చని రకరకాల పొదలు, పాదాల కింద పచ్చని గడ్డి… దానికి తోడూ పక్షుల కిలకిల పలుకులు… వీటన్నింటికి ప్రియాంక పులకరించిపోతూ “వావ్…” అంది.

          అడ్డు వచ్చిన కొమ్మను పక్కకు తోసి ముందుకు నడుస్తూ “ఇంకా లోపలికి వెళితే సూపర్ గా ఉంటదట. వెబ్ లో చూసా” అని ఇంటర్నెట్ లో వెతికినా ఓ ఫోటోని మొబైల్ లో ప్రియాంకకు చూపించాడు రాహుల్. చిన్న నీటి పాయ పక్కనే పచ్చిక బయళ్ళు, రకరకాల పూల మొక్కలు, హంసలు, కాస్త దూరంలో కొండమీదినించి జలజలా పారుతున్న జలపాతం… ఆ ఫోటోలోని దృశ్యం చూసి “అబ్బ ఎంత బాగుంది లొకేషన్. నాకు ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది  త్వరగా వెళ్దాం రా రాహుల్” అంది ఆత్రుతగా.

          ఇద్దరు ఆ దిశగా నడుస్తున్నారు.

          రాహుల్ కి ప్రకృతిలో నడుచుకుంటూ వెళుతూ పాటలు వినడం బహు ఇష్టం. అందుకే తన మొబైల్ లో పాటలు పెట్టుకుని చెవులకు హెడ్ సెట్ పెట్టుకుని నడుస్తున్నాడు మోకాలు ఎత్తు వరకు ఏపుగా పెరిగున్న గడ్డిలోంచి. పాటకు అనుగుణంగా చిన్నగా కూనిరాగాలు తీస్తూ అతను ముందు నడుస్తూంటే చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని చూస్తూ తన వెనకే వస్తోంది ప్రియాంక.

          అలా కొంత దూరం నడిచారు. ఇంతలో ప్రియాంక అడుగు రాయి మీద పడడంతో కాలు కాస్త మడత పడి కింద పడిపోయింది కీచుమని అరుస్తూ. కానీ పాటలు వింటూ వెళుతున్న రాహుల్ కి ప్రియాంక అరుపు వినిపించలేదు. వెనక నుండి ప్రియాంక “రాహుల్… రాహుల్….” అని పిలుస్తోంది. అయినా పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్ళిపోయాడు అతను.

          “ఈడియట్. హెడ్ సెట్ తీసి అవతల పారేయాలి. గంగిరెద్దులా అది తగిలించుకుంటే ఏది పట్టించుకోడు” అని తిట్టుకుంది. నేలకి చేతులు పెట్టి కాలు నొప్పి పెడుతున్నా బలవంతంగా లేచింది. లేచి నిలబడనైతే నిలబడగలిగింది కానీ అడుగు తీసి అడుగు వేయలేకపోతోంది. కాలు మడమ దగ్గర తీవ్రమైన నొప్పి కలుగుతోంది ఆమెకు. రాహుల్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంటూ కుంటుతూ ఆ గడ్డిలోంచి నెమ్మదిగా రాహుల్ వెళ్ళిన వైపు అడుగులు వేయసాగింది. అలా ముందుకు వెళ్ళిన ప్రియాంకకి రాహుల్ ఎక్కడా కనిపించలేదు. “ఎక్కడికి పోయాడు? కనీసం నేను వెనక ఉన్నానా లేదా అన్నది కూడా చూడలేదా” అనుకుంటూ నడక ఆపి తన బ్యాగులోంచి మొబైల్ తీసింది రాహుల్ కి కాల్ చేద్దామని. కాని నెట్వర్క్ లేదు. “ఛ! ఇపుడు ఏం చేయాలి. ఇలాగే ముందుకు వెళదాం. అయినా ఎక్కడికి పోతాడు.. ఆ ఫోటోలో చూపించిన చోటే ఉంటాడుగా” అనుకుని నెమ్మదిగా అక్కడి నుండి కదిలింది ముందుకు.

          ఈ విషయాన్నంతా సడన్ గా చెప్పడం ఆపేసింది ప్రియాంక.

          “ఏమైంది ఆగిపోయావ్? ఆ తరువాత ఏమయింది?” అడిగింది కాత్యాయని.

          వెక్కి వెక్కి ఏడవడం మొదలు పెట్టింది ప్రియాంక.

          “చెప్పు ప్రియాంక. ఏమయింది?”

          ఏడుపు తప్ప తన నుండి బదులు లేదు.

          “నువ్వు ఇలా మాటిమాట్కి ఏడిస్తే నా సహనం కాస్త పోయి కోపంతో నిన్ను కొట్టినా కొట్టేస్త. మర్యాదగా చెప్తావ లేదా చెప్పు?” అసహనంతో కూడిన కోపంతో, అనునయంగా ప్రియాన్కని ఆర్దించింది కాత్యాయని.

          కళ్ళు తుడుచుకుని చెప్పడం ప్రారంభించింది ప్రియాంక.

          మెల్లిగా కుంటుతూ వెళ్ళిన ప్రియాంకకి కొంచం దూరం వెళ్లేసరికి అక్కడ నేలమీద పడున్న ఓ ష్యూ కనిపించింది. “ఈ ష్యూ ఏంటి అచ్చు రాహుల్ ష్యూ లా ఉంది” అనుకుని దగ్గరికెళ్ళి వంగి దాన్ని చూసింది. “లా ఉండటమేంటి. రాహుల్ దే. ష్యూ ఇక్కడ విప్పి ఎక్కడికి వెళ్ళాడు?” అనుకుంటూ చుట్టూ చూసింది ఎక్కడైనా కనిపిస్తాడేమోనని. ఎటు చూసిన చెట్లే తప్ప రాహుల్ కనిపించలేదు. అంతలో ఆమెకు మరో విషయం స్ఫురించింది.

          “రాహులే ఇక్కడ ష్యూస్ విప్పితే రెండు ఉండాలి కదా? మరి ఇక్కడేంటి ఒక్కటే ఉంది? ఇంకోటి ఎక్కడుంది?” అని కింద అంతటా తేరిపార చూసింది. కనిపించలేదు. పక్కనే ఎత్తుగా ఉన్న గడ్డిలో, పొదల్లో వెతికింది. ఊహూ లేదు. ఎక్కడా లేదు ఇంకో షూ. “రాహుల్… రాహుల్….” గట్టిగా పిలుస్తూ ష్యూ ని అలాగే పట్టుకుని ఇంకాస్త ముందుకు నడిచింది. ఎక్కడ చూసినా ఆమెకు రాహుల్ కనపడలేదు, ఆ ఇంకో ష్యూ కూడా కనపడలేదు.

          రాహుల్ కనిపించకపోగానే ఆమెను ఎక్కడలేని నిస్సత్తువ ఆవహించింది. ఆమె మనసు ఎందుకో అదే పనిగా కీడుని శంకించసాగింది.

          ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. మనసులో ఎదో జరగకూడనిది జరుగుతోంది అనిపించసాగింది. కాలు విపరీతంగా నొప్పెడుతున్నా లెక్కచేయకుండా ముందుకు వేగంగా నడిచింది. అలా పదడుగులు వేయగానే ఆమెకి నేలమీద రక్తం కనిపించింది. దగ్గరికెళ్ళి తేరిపార చూసి, మునివేళ్ళతో దాన్ని తాకింది. ఆ రక్తం వెచ్చగా తగిలింది వేళ్ళకి. అంతే!

          ఒక్కసారిగా కెవ్వున కేకేస్తూ దూరం జరిగి కింద కూలబడింది. కారణం… అది పచ్చి నెత్తురు.

          ప్రియాంక గుండె ఆగినంత పనయింది.

          రక్తం పక్కనే కిందపడున్న రాహుల్ హెడ్ సెట్ కనిపించింది. దాంతో ఆ రక్తం ఎవరిదీ అయుంటుంది అని ఊహించుకోగానే ఆమెకు భూమి, ఆకాశం బద్దలైనట్లు అనిపించింది.

          ఒళ్ళంతా కంపిస్తూంటే “రాహుల్” అంటూ గుండె పగిలేల గట్టిగా అరిచింది. నొప్పెడుతున్న కాలుని లెక్కచేయకుండా కిందనుంచి పైకి లేచి పిచ్చిదానిలా అటూ ఇటూ పరిగెడుతూ పొదల్లో, చెట్లలో, నడుం వరకున్న గడ్డిలో వెతికింది. కాని రాహుల్ జాడ మాత్రం కనిపించించలేదు. క్షణాలు వేగంగా గడిచిపోతున్నాయి. చూస్తుండగానే నలుదిక్కులా చీకటి అలుముకుంది.

          ఎంత వెతికినా ఎక్కడా రహుల్ జాడ కనపడలేదు. ఆమె ఒళ్ళు, బట్టలు అంతటా బురద, మట్టి అంటుకుని పిచ్చిదానిలా తయారైంది.

          ప్రియాంకకి ఏం చేయాలో ఎటు వెళ్ళాలో తోచలేదు. రాహుల్ ఫోటోలో చూపించిన ప్రదేశం కి వెళ్ళింది. అక్కడ కూడా రాహుల్ లేడు. వగరుస్తూ వచ్చి కింద కూర్చుంది. గుండె బద్దలు అయ్యేలా ఎడ్వసాగింది. సరిగ్గా అప్పుడే ఆమెకి పోలీసులు జ్ఞాపకం వచ్చారు. అంతే! క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడవిలో పరుగు అందుకుంది. ఊర్లోకి వెళ్లి పోలీసులకి ఈ విషయం చెప్పి వారి సహాయంతో రాహుల్ ని వెతికి పట్టుకోవలనేది ఆమె ఆలోచన. వేగంగా ఊరి దిశగా పరిగెట్టసాగింది.

          అలా అడవి లోంచి బయటకి వచ్చిన ప్రియాంక, ఊర్లో కనిపించిన వాళ్ళని అడిగి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అడవిలో జరిగినదంతా ఆగకుండా పోలీసులకు చెప్పింది. వాళ్ళు ఆమె చెప్పిందంతా విన్నారు. పిచ్చిదానిలా మాసిపోయిన బట్టలు, వికారంగా తయారైన ఆమెని చూడగానే ఇన్స్పెక్టర్, అక్కడున్న వారందరికీ జాలి కలిగింది. కానిస్టేబుల్ మంచి నీళ్ళిచ్చాడు తాగమని.

          నీళ్ళు తాగి, “ప్లీజ్ నా రాహుల్ ని వెతకండి. ప్లీజ్” అంది ప్రియాంక ఏడుస్తూ.

          ఆమె, రాహుల్ ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? లాంటి వివరాలు అన్ని తెలుసుకుని ఆమె దగ్గర కంప్లైంట్ తీస్కున్నారు.

          “అడవిలోకి ఎవ్వరూ వెళ్ళవద్దని మీకు ఊరివాళ్ళు చెప్పలేదా? ఎందుకు వెళ్ళారు? అడవిలోకి వెళ్ళే దారిని మూసేసినా ఎలా వెళ్ళారు?” అడిగాడు ఇన్స్పెక్టర్.

          “తెలియదు. రాహుల్ అడవిలోకి వెళ్ళే దారి మూసేసాడు అని చెప్పాడు. బట్ తనకి కూడా తెలియదు ఎందుకు మూసేశారో. ప్లీజ్. ఈ విషయాలన్నీ తరవాత మాట్లాడుకుందాం. ముందు రాహుల్ ని వెతకండి ప్లీజ్” అంది.

          “వెతుకుతాం అమ్మ. ఇప్పుడేగా కంప్లైంట్ ఇచ్చావు. ఊరి జనాలు అడవికి వెళ్ళే దారిలో బోర్డు కూడా పెట్టారు. లోపలి వెళ్ళద్దు ప్రమాదమని. అయినా వెళ్లి ఇప్పుడు ఇలా జరిగాక వచ్చి మమ్మల్ని అంటే?” అంటూ అనడం ఆపేసాడు ఇన్స్పెక్టర్.

          తిరిగి తనే “అడవిలోకి ఆవులు, గొర్లు, బర్రెలను, మేతకి తీస్కేల్లెందుకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు ఇంకా తిరిగి రాలేదు. వారు తీస్కేల్లిన జంతువులూ కూడా. అప్పటి నుండి అడవిలోకి వెళ్ళడం బంద్ చేసి ఆ బోర్డు పెట్టారు  ఊరివాళ్ళు. మేము కూడా అడవికి వెళ్లి వాళ్ళని వెతికాము. కాని వాళ్ళ ఆచూకి ఇప్పటి దాక దొరకలేదు. ఇపుడు మీ కాబోయే భర్త. ఆ దేవుణ్ణి బాగా వేడుకోండి. మా ప్రయత్నం మేము చేస్తాం” అని ఆమెని స్టేషన్ లోనే ఉండమని చెప్పి నలుగురు కానిస్టేబుల్స్ తో జీపులో అడవికి బయలుదేరాడు ఇన్స్పెక్టర్.

          వాళ్ళు ఎప్పుడెప్పుడు రాహుల్ తో తిరిగొస్తారా అని వేయి కళ్ళతో స్టేషన్ లో ఎదురు చూడసాగింది ప్రియాంక.

          కానీ పోలీసులు రాలేదు, రాహుల్ రాలేదు.

          రాత్రి గడిచిపోయింది….

          తెల్లవారింది….

          అయినా…. పోలీసులు రాలేదు.

          ఊర్లో మొబైల్ నెట్వర్క్ ఉన్నా, రాహుల్ కి, పోలీసులకి ఎన్ని సార్లు ఫోన్ చేసినా కవరేజ్ ఏరియ లో లేరు అనే వస్తోంది తప్ప కలవడం లేదు.

          స్టేషన్ లో ఉన్న స్టాఫ్ లో ఇంకొంత మంది అడవికి వెళ్ళారు. కానీ వాళ్ళు కూడా సాయంత్రం అయినా తిరిగి రాలేదు. దాంతో స్టేషన్లో మిగిలిపోయిన ఇద్దరు కానిస్టేబుల్స్ భయపడిపోయారు. ఈ విషయం తమ పై అధికారులకు చెప్పారు.

          సమయం చూస్తుండగానే గడిచిపోతోంది.

          మసక చీకట్లు నలుదిక్కులనుండి కమ్ముకోసాగాయి.

          పై అధికారులు తమ బలగంతో వచ్చారు స్టేషన్ కి. పోలీసులని, ప్రియాంకని అడిగి జరిగిన విషయాలని మళ్ళీ కనుక్కుని ఈసారి మనుషులు వెళ్ళకుండా కెమెరాలతో ఉన్న డ్రోన్లను అడవికి పంపించారు. డ్రోన్ల కెమెరాల ద్వారా అడవిలో జరిగేదంతా స్టేషన్ లో ఉన్న ఎల్ ఈడి తెరల మీద వీక్షించే విధంగా ఏర్పాటు చేయించారు.

          ఆ డ్రోన్లు అడవిలోకి వెళ్ళాయి. అడవిలోకి ఎంటర్ అవడం స్క్రీన్ లపై అందరూ చూస్తున్నారు ప్రియాంకతో సహా. ఉన్నట్టుండి స్క్రీన్ లమీద బొమ్మ మాయమయ్యి ‘No camera’ అని వచ్చింది. దాంతో అందరు ఆశ్చర్యపోయారు.

          మర బొమ్మలా ఇదంతా చెబుతోంది ప్రియాంక.

          “రెండు రోజులకి నన్ను ఇంటికి పంపించేసారు. ఏ విషయం మేమే తెలియజేస్తామన్నారు. వారం గడిచింది … ఇంకా వారి నుండి సమాధానం లేదు. రాహుల్ జాడ లేదు. రాహుల్ లేకుండా నేను ఉండలేను కాత్య” అని కాత్యాయని భుజాలపై పడి భోరుమని రోదించింది ప్రియాంక.

          “ఈ విషయాలన్నీ మీ అమ్మానాన్నలకు చెప్పలేదా?”

          “ఊహూ” ఏడుస్తూనే బదులిచ్చింది.

          “కనీసం రాహుల్ పేరెంట్స్ కి అయినా ఈ విషయం తెలుసా.. తను అడవిలో కనిపించకుండా పోయాడని”

          “తెలుసు పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు”

          “మీ పేరెంట్స్ కి పోలీసులు కూడా చెప్పలేద ఈ విషయం?”

          “ఏమో తెలియదు. నేను చెప్పేశారు అనుకున్న. కానీ అమ్మ ఎప్పటిలా ఉందిగా. అమ్మకు ఏమి తెలియదని అర్థమైంది. అమ్మానాన్నకు పోలీసులు చెప్పకున్నా, రాహుల్ పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పేస్తారు. అయినా నాకేం భయం లేదు. నాకు రాహుల్ కావాలి అంతే” ఏడుస్తూనే అంది.

          “నా వల్లే రాహుల్ నేను అడవికి వెళ్ళాము. నేను అడవికి వెళ్ళడం వద్దని ఉంటే, అక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు. ఇలా జరిగేది కాదు. అంతా నా వల్లే” అంటూ తనని తానె నిందించుకుంటూ కుమిలి కుమిలి పోసాగింది ప్రియాంక.

          “ఇపుడు ఏం చేయాలనుకుంటున్నావ్?” అడిగింది కాత్యాయని.

          “అది తెలియకే కదే నిన్ను పిలిచింది. నువ్వే ఎదో ఒకటి చేసి నా రాహుల్ ని నా దగ్గరకు తీస్కురా. నా ఆశలన్నీ నీ మీదే. ప్లీజ్ కాత్యా”

          ‘నేనా!’ ఏమనాలో అర్థం కాలేదు కాత్యాయానికి.

          “తప్పకుండ ప్రియాంక. నువ్వు ఏడవకు” అని మాత్రం అననైతే అనగలిగింది కాని ‘నేను ఎలా హెల్ప్ చేయగలుగుతా ప్రియాంకకి. దాని తృప్తి కోసం అనడం అయితే అన్నాను కానీ, అసలు నేనేం హెల్ప్ చేయగలను?’ తన నిస్సహాయతను తలచుకోగానే ఎక్కడలేని నిస్సత్తువ ఆమెను ఆవరించింది.

(ఇంకా ఉంది)