రోజూలాగే ఆరాత్రి పోతన గారి పద్యమొకటి చదువుకుని పడుకున్నాను. మళ్ళీ డోర్ బెల్ శబ్దానికే మెలకువ రావడం. గోడ గడియారం అయిదు కొడుతోంది. ఇంత పొద్దున్నే ఎవరా అనుకుంటూ తలుపు తీసి చూసే సరికి ఎదురుగా ఒక వయో వృద్ధుడు.
నేను ఎవరూ ఏమిటి అని అడిగే లోపే తోసుకుంటూ వచ్చేసి ఆయనే అన్నాడు “నన్ను పోతన గారు పంపారు. చావు బతుకుల్లో ఉన్నాను. నువ్వు కాపాడతావేమోనని వచ్చా”
“పోతన గారు పంపడమేవిటి? ఆయన కాలం చేసి ఎన్నో ఏళ్ళయితేనూ” అన్నాన్నేను.
ఆయన ఒక నవ్వు నవ్వి, “పోతనగారు ఇంకా బతికే వున్నారు నాయనా” అన్నాడు.
ఇదేదో తిరకాసు వ్యవహారంలా ఉందనిపించింది నాకు. నా పరిస్థితి గ్రహించి ఆయనే మళ్ళీ, ఏదీ ఒక పద్యం చెప్పు అన్నాడు.
నేను “అడిగెదనని కడువడి జను” అంటూ గజేంద్ర మోక్షంలోని పద్యం అందుకున్నాను.
అంతే, ఆయన, “చూశావా? నీలాంటి వాళ్ళు ఆ మహానుభావుడి పద్యాలు పాడుకుంటున్నన్నాళ్ళూ ఆయన బతికి ఉన్నట్లే కాదంటావా?” అన్నాడు.
“నిజమే. మీరు ఎవరునుకుని ఎవరింటికి వచ్చారో? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి నేనేమీ గొప్పవాణ్ణి కాదు” అన్నాను.
“కానీ సాహిత్యమన్నా భాషన్నా ఇష్టం ఉంది కదూ” అన్నడాయన.
“అవును ఇష్టం వుంది అయితే?”
“ఆయన పద్యాలు పాడుకుంటూ ఉంటావుగా అందుకని వారి మాటని తీసేయ్యవని వారి నమ్మకం.”
“విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు” లో విష్ణు శర్మ విశ్వనాథ వారింటికి వచ్చినట్లు ఇప్పుడు తమరు నా యింటికి వెంచేశారా?” వ్యంగ్యంగా అన్నాన్నేను.
“చూశావూ!! విశ్వనాథ వారి పేరు తలచి మళ్ళీ నిరూపించావోయీ” అన్నాడాయన.
నేను నిరూపించిన ఆ జీవిత సత్యం ఏమిటో అర్థం కాలేదు నాకు.
“అవన్నీ నాకు తెలియవోయీ నన్ను నువ్వు కాపాడాలి అంతే” అన్నాడాయన.
“మిమ్మల్ని చూస్తే బానే ఉన్నట్లున్నారు, మీకేమిటి సమస్య?”
“అద్గది అల్లా అడిగావు చూడూ, నచ్చావోయీ” అన్నాడాయన.
“ఇంతకీ వచ్చిన పని చెప్పండి, అంతకు ముందు మీ వివరాలు కూడానూ”
సరే అయితే చెబుతా విను,
“మేము యాభయ్యారు మందిమి. పుట్టి వేల యేళ్ళయ్యింది.
కొంత మంది ఉన్నారు, కొంత మందిని జనం చంపేశారు, ఇదిగో మిగిలిన వాళ్ళలో కొంతమందికి బానే ఉంది.
నేను నాలాంటి కొంత మంది ఇప్పుడు బ్రతికున్నామో లేదో తెలియని మీమాంసలో ఉన్నాం.”
ఒక్కక్షణం ఊపిరి పీల్చుకోవడానికన్నట్లు ఆగి, మళ్ళీ ప్రారంభించాడు.
ఈయన వరస నాకు అంతుబట్టడం లేదు, పిచ్చి వాడిలానూ లేడు. మహా యోగులూ, దేవతలూ దర్శనమిచ్చెంత ఉన్నతమైన కర్మ బలమూ నాకు లేదు.
మరి ఎవరై ఉండొచ్చు? అని అనుకుంటూండగా
మళ్ళీ ఆయనే అన్నాడు, “ఏమిటీ పిచ్చి వాడిననుకుంటున్నావా?
లేదోయీ, పూర్తిగా నా బాధ విను.
చనిపోయిన వాళ్ళని జనం మరిచిపోయారు, ఇప్పుడు నన్నూ మరిచి పోతున్నారు.
అల్లా మమ్మల్ని జనం మరచి పోకుండా నువ్వే ఏదో చెయ్యాలోయీ.”
“నేనేమి చెయ్యగలను, అసలు మీ వరసే వింతగా ఉంటేనూ. నేను నమ్మినా, ఇది ఎవ్వరూ నమ్మరు, ఖచ్చితంగా పిచ్చే అనుకుంటారు”.
“నేనెవర్నో సూటిగా నీకు చెప్పక పోవడమెందుకు, ఇదుగో నా పేరు ళ.”
“ళా నా ఇది కూడా పేరే?”
“ఆ వెటకారమే వద్దు, నేను అక్షరాన్ని.”
“అక్షరమా? అక్షరాల్లో కూడా ఆడా మగా ఉంటాయా?”
“నీకెందుకా సందేహం వచ్చిందోయీ? ఆడా మగా వుండవు.”
“మరి నాకు మగ వారిలా కనపడుతున్నారు?”
“ఓహో అదా, నువ్వు మగ కదా అందుకు నీకు మగ లా కనపడుతున్నా, ఆడ వారికి ఆడ లా కనపడతా.”
“ఇప్పుడు నా జీవన్మరణ సమస్య చెప్పేదా? ఇంకా ఏమైనా అడగాలా?”
“లేదు చెప్పండి”
“ఈ రోజుల్లో చాలా మంది నన్ను సరిగ్గా పలకడం లేదోయీ.
వ్రాసేటప్పుడు బాగానే వ్రాస్తారు, పలికేటప్పుడు ల అని పలుకుతారు”.
“దానికి నేనేమి చెయ్యగలను? నేను సరిగ్గా పలుకుతాను, ఎవరైనా తప్పుగా పలికినప్పుడు బాధ పడతాను.
ఇంతకుమించి నేనేమి చెయ్యగలను?”
“నీవు బ్లాగో ఏదో వ్రాస్తావుటా కదూ, దానిలో నా గురించి వ్రాయి. పదిమందికీ తెలుస్తుంది. అల్లా అయినా అక్షరాల్ని సరిగ్గా పలికి మా ప్రాణాలు నిలబెడతారు.”
నాకు నవ్వాగలేదు. “స్వామీ! నా బ్లాగుని పట్టుమని పది మంది కూడా చదువుతారనుకోను. చదివినా అంత ప్రభావం ఉంటుందనుకోను.
నా కంటే గొప్పగా వ్రాసేవాళ్ళూ, ఎక్కువ పాఠకులు ఉన్న వాళ్ళూ చాలామందే వున్నారు, వారి వద్దకి వెళితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో” అన్నాను.
“ఆ పనీ జరుగుతుందోయీ, నా తోటి వాళ్ళు ణ, శ, ఖ, ఘ, ఝ ఇల్లా కొంతమంది అల్లాంటి వారి దగ్గరకూ వెళ్ళారు”
Rachana bagundi aksharalu ila ghoshapedutunne mari. Andaru vatini palakaleka varnamalanundi teesivasaru. NEE PRAYANAM BAGA JARAGALANI KORUTUNNAMU.