మునిమాణిక్యం నరసింహారావుగారు బహుముఖ ప్రజ్ఞులు, మితభాషి, అయినా మాట కలిస్తే అమితముగా మాట్లాడే సంభాషణా చతురులు. ఆయన నవలలు, కథలు, పద్యాలు, నాటకాలు వ్రాసారు కానీ కాంతం కదలముందు అవన్నీ దిగదుడుపే వీరికి అత్యంత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినవి అయన వ్రాసిన కాంతం కథలే. కారణము వాటిల్లో హాస్య రసము గుప్పించటమే. ఈ రోజుకు మనకు హాస్య రచన అనగానే మొదట గుర్తుకు వచ్చేది అయన కాంతం కథలే. ఈ కథల ద్వారా నరసింహారావు గారు కాంతం కథకుడుగా అవతరించి కాంతం మొగుడుగా స్థిరపడటం జరిగింది. ఆయన వ్రాసినవి సంఖ్యలో గాని, వాసిలో గాని తక్కువేమి కాదు. ఆయనను తెలుగు పాఠకులు, విమర్శకులు హాస్య రచయితగానే పరిగణించారు. హాస్యము రాయటం ఎంతో కష్టము రాసి మెప్పించటము మరీ కష్టము.
మునిమాణిక్యం రచనలు అధిక భాగము ప్రధానముగా ఆత్మకథ సదృశ్యమయినవి. అంటే తన వాస్తవానుభవాలను, మానసిక అనుభూతులను కథలుగా, వ్యాసాలుగా, నవలలుగా మలచారు నిండైన గృహస్థ జీవితాన్ని అనుభవించేటందుకు, జీవితము పట్ల సమరస భావాన్ని పెంచుకొనేందుకు అవసరమైన మనోధైర్యాన్ని పాఠకులలో పెంచేందుకు తన రచనల ద్వారా కృషి చేసిన వ్యక్తి అని ప్రముఖల చేత ప్రశంసలు పొందిన వ్యక్తి మునిమాణిక్యం నరసింహారావుగారు. మునిమాణిక్యం గారు తన కథలలో తన వృత్తిని ప్రవృత్తిని జోడించి రంగరించి, తన జీవితాన్ని, ఉపాధ్యాయవృత్తిని, మధ్య తరగతి కుటుంబాల పరిస్థితిని కథా వస్తువుగా తీసుకొని తన భార్యామణి కాంతాన్ని హీరోయిన్ గా జేసి అతి సున్నితమైన చిన్న విషయాలను కూడా ఎంతో ఉదాత్తముగా హాస్యాన్ని జోడిస్తూ అమృత గుళికలు లాంటి కథలను తెలుగు పాఠకులకు శాశ్వతమైన అపురూప కానుకలుగా అందించారు. వీరు తెనాలి తాలూకా సంగము జాగర్లమూడిలో మార్చి 15, 1898లో సూర్యనారాయణ, వెంకాయమ్మ దంపతులకు జన్మించారు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వీరు ఫిబ్రవరి 4, 1973లో పరమపదించారు.
ఈ సందర్భముగా మనము కొంచము కాంతము గురించి కూడా కొంత తెలుసుకోవాలి. మునిమాణిక్యం గారు హీరోయిన్ కాంతంను అణుకువ, మక్కువ, గడుసుతనం, చలాకీతనం, ఓర్పు, నేర్పు, అన్నీ మేళవించిన ఒక ముగ్ధమనోహరమైన ఇల్లాలిగా, పిల్లల ఆలనా పాలనా కోసము అనుక్షణము ఆరాటపడే బాధ్యత గల తల్లిగా కాంతం ను చిరంజీవిని చేశారు. ప్రస్తుతము నరసింహారావుగారి ఒక కథ, “బద్ నసీహత్”అనే కథను గురించి ముచ్చటించుకుందాము. ఈ కథ పేరు ఉర్దూ పేరు అయినా కథాంశము పాత్రలు పూర్తిగా తెలుగు వారివే ఈ కథలో కాంతము, కాంతము మొగుడు(రచయిత) ఇద్దరు(బ్రాహ్మణ దంపతుల) పాత్రలు ఉంటాయి. పూర్తిగా సున్నితమైన హాస్యాన్ని అందించే కథ ఇది. కథ ఇతివృత్తము ఏమిటి అంటే అస్తమానము తగువులాడుకొనే ఒక వృద్ధ జంటలోని భర్త కాంతము కథలు చదివి అన్యోన్య దాంపత్యానికి రచయిత ఏమైనా సలహాలు ఇస్తాడేమోనని రచయిత దగ్గరకు రావటము అయన ఇచ్చిన సలహాలు పాటించి వ్యవహారము బెడిసికొట్టి ఆయన భార్య విరుగుడు కోసము రచయితను ఆశ్రయించటము. ఈకథ 1941లో ప్రచురించబడింది.
ఇంకా కథలోకి వెళదాము. మన రచయిత అంటే ప్రస్తుతము కాంతము మొగుడు ఆ రోజు స్కూల్ నుంచి పెందరాళే ఇంటికి వస్తాడు. భార్యామణి కాంతము, “మీకోసము ఒక పెద్దమనిషి వచ్చి మిమ్మల్నికలవాలని ఎదురుచూస్తున్నాడు”అని చెబుతుంది. సరే అని డ్రెస్ మార్చుకొని ఆయనను కలవటానికి మేడ మీదకు వెళతాడు. ఆ వచ్చిన పెద్దమనిషి కాస్త వయస్సు మళ్లిన వాడుగాను అమాయకుడు లాగా చాలా సౌమ్యుడిలాగా కనిపించాడు ఆ వ్యక్తిని ఇంతకు ముందు ఎప్పుడు చూసినట్లు లేదు ఆ విషయమే ఆ వ్యక్తితో రచయిత చెపుతాడు. “అయ్యా నాపేరు సన్యాసిరాజు, మాది విజయ నగరము మేము రాజు పేటలో కాపురము ఉంటాము తమ దర్శనార్ధము వచ్చాను”, అని వచ్చిన వ్యక్తి సవినయముగా చెపుతాడు. ఆ వ్యక్తికీ తరచుగా సంభాషణలలో “మహా చెడ్డ” అనే ఊతపదము వాడటం అలవాటు ఆ అలవాటుగానే, “మీ రచనలకు మాప్రాంతములో మహాచెడ్డ పేరుందండోయ్”, అని అంటాడు రచయితకు మొదట అర్ధముకాక కంగారు పడతాడు. దానికి ఆ వ్యక్తి, ” తమరు వేరేగా అర్ధముచేసుకోవద్దు మాప్రాంతములో మాచెడ్డ పేరు అంటే మీకు చాలా మంచి పేరు ఉంది అని నా ఉద్దేశ్యము”, అని సర్దిచెపుతాడు.
“ఇంతకీ మీరు వచ్చిన పని ఏమిటో చెప్పారుకాదు” అని రచయిత ఆవ్యక్తిని అడగగా, “తమర్ని, తమ కాంతాన్ని తమ సంతానాన్నిచూచి ఆనందించి పోదామని వచ్చాను” అని జవాబిస్తాడు. ఇంతలో కాంతము అతిథికి భర్తకి రెండు ప్లేట్లలో టిఫిన్ ఆ తరువాత కాఫీ ఇస్తుంది ఆవిడను చూసిన వ్యక్తి, “తమరేనా అమ్మకాంతము అంటే, సీతా, అనసూయ కోవలోకి చెందినవారు తమరు”, అని కాంతమును పొగడటం ప్రారంభిస్తాడు. ఆవిడా నమస్కారము పెట్టి, “ఏదో మీ అభిమానములెండి” అనిక్లుప్తముగా జవాబిచ్చి క్రిందకు వస్తుంది. టిఫిన్లు అయినాయి. ఇంతకు వచ్చిన పెద్దమనిషి అసలు విషయము ఒక పట్టాన చెప్పడు రచయితగారికి. బయటకు వెళ్లాలని ఉంది అందువల్ల పెద్దమనిషితో, “తమరు ఏదైనా పనిమీద వచ్చారేమో అసలు విషయము చెప్పండి” అని సూటిగా అడుగుతాడు. ఎందుకంటే రచయిత దగ్గరకు వచ్చేవాళ్ళు ఏదైనా కథ వ్రాసి ఇవ్వండి అని అడిగేవాళ్ళు లేదా రచయిత స్కూల్ మాస్టారు కాబట్టి మాపిల్లవాడికి మంచి మార్కులు వేసి పాస్ చేయించండి(పాతరోజుల్లో మార్కుల బట్టి పాస్ చేసేవారు) అని అడిగేవాళ్ళు ఉంటారు. ఇంతసేపు నీళ్లు నములుతున్నాడు కాబట్టి ఆ వచ్చిన పెద్దమనిషి రెండవ రకము అని రచయిత ఊహించి పిల్లల గురించి రచయిత అడుగుతాడు. “నాకు ఐదుగురు ఆడపిల్లలు” అని సమాధానము చెపుతాడు. ఈ జవాబు విన్నాక ఆయన ఎందుకు వచ్చాడా అన్న ప్రశ్న మరీ క్లిష్టమైంది. మరి పెళ్ళి సంబంధాల విషయమై వచ్చాడేమో అనుకుంటే లేదని చెప్పాడు “ఇంతకీ తమరు దేనికి వచ్చారు?” అని సూటిగా రచయిత పెద్దమనిషిని అడుగుతాడు. “మరేంలేదండి తమరి కథల్లో సంసారాన్నిస్వర్గధామముగా వర్ణిస్తారు, ఘోటక బ్రహ్మచారికైనా మీ కథలు చదివితే వెంటనే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. ఈ మాటలు నేను ముఖప్రీతికి అంటున్నవి కావు నిజము నా సమస్య ఏమిటి అంటే నాకు పెండ్లాము, పిల్లలు ఉన్నారు ఇల్లు చూస్తే నరకములా ఉంటుంది, పెళ్ళాము గయ్యాళి, పిల్లలు అల్లరి, నేను మాఆవిడ పోట్లాడుకోని రోజులేదు’, అని బాధను చెప్పుకున్నాడు. విన్న రచయిత ‘అయితే నన్నేమి చేయమంటారు?” అని ప్రశ్నిస్తాడు. “తమరు సాంసారిక జీవనము సుఖప్రదము కావటానికి ఒక తరుణోపాయము చూపెట్టాలి, తమదగ్గరకు కొండంత ఆశతో వచ్చాను, ఈ విషయం, లో మీరు నాకు ఉపదేశము చేయాలి”, అని ప్రాధేయపడ్డాడు. “ఇదేమన్నా వేదాంతమాలిక మంత్రశాస్త్రమా ఉపదేశము చేయడానికి”, అని నవ్వుతూ రచయిత సమాధానము ఇస్తాడు కానీ ఆ పెద్దమనిషి మీరు ఎలాగైనా నాకు ఏదో ఒక మార్గము చూపాలి అని మళ్ళా ప్రాధేయపడ్డాడు. ఇంకా చేసేది ఏమిలేక తనకు తోచిన నాలుగు ముక్కలు చెబుదామని నిశ్చయించుకొని, “మీరు మీ భార్యను ప్రేమిస్తున్నారని చెపుతున్నారు మరి తగవులు ఎందుకొస్తున్నాయి” అని ప్రశ్నించాడు రచయిత, “ఇది కారణము అని చెప్పలేను నేను అవును అన్నదానికి తాను కాదంటుంది” అని పెద్దమనిషి చెపుతాడు “అలాగయితే ముందే మీరు కాదని అనండి” అని వేళాకోళముగా రచయిత అంటాడు. “డబ్బు గట్రా విషయాల్లో ఆవిడా చెప్పినదానికల్లా తల ఊపితే కొంప మీదికి వస్తుంది కదండీ” అని పెద్దమనిషి అంటే రచయిత భార్యను ఎలా లొంగదీసుకోవాలో మీకు చిన్న రహస్యము చెపుతాను అని అంటాడు. “ఏమిలేదు మీరు మీభార్య అందాన్ని పొగడాలి భార్యను కనీసము మూడుసార్లు అయినా ముద్దు పెట్టుకోవాలి” అని రొమాంటిక్ సలహాలు ఇచ్చి భార్యను ఎలా లొంగదీసుకోవాలో రచయిత చెపుతాడు. “నాకు ఇలాంటివి అలవాటులేవే” అని పెద్దమనిషి తన నిస్సహాయతను తెలియజేస్తాడు. తప్పదు అలవాటు చేసుకోవాలి అని సలహా ఇస్తే ఆ పెద్దమనిషి ఈ మాటలన్నీ విని కొన్ని కాగితము మీద వ్రాసుకొని బిక్క మొహముతో సెలవు తీసుకొని ఇంటికి వెళతాడు. ఇది విన్న భార్య కాంతము, “పెద్దమనిషితో వేళాకోళాలు ఏమిటీ అండి” అని నిష్ఠురమాడుతుంది. “నీకు తెలియదు కాంతము నేను ఆ పెద్దమనిషికి చాలా సిన్సియర్ గా చెప్పాను పరమ రహస్యాలు భోధించాను చూస్తూ ఉండు, వారము కల్లా అయన మళ్లా నాదగ్గరకు వచ్చి మా భార్య భర్తలము తగువులు లేకుండా సుఖముగా ఉన్నాము అని చెపుతాడు” అని ధీమాగా కాంతముతో రచయిత చెపుతాడు.
రోజు సాయంత్రము స్కూలు నుంచి వచ్చిన వెంటనే ఆ పెద్దమనిషి వచ్చాడా అని భార్యను వాకబు చేసేవాడు రచయిత “ఆ ఇంక రావలసినదే” అని కాంతము ఎక్కిరింపుగా మాట్లాడేది. నాలుగురోజుల తరువాత ఐదవ రోజు ఉదయము నిద్రపోతున్న రచయితను కాంతము లేపి, “మీకోసము ఒక పెద్దావిడ వచ్చింది”, అని చెప్పగా ఎవరా అని చూస్తే ఒక పెద్ద బ్రాహ్మణ ముత్తైదువా సలక్షణముగా జరీ చీర కట్టుకొని సాంప్రదాయ బద్దముగా ఉన్న ఒక యాభై ఏళ్ల ఆవిడ తనకోసము ఎదురు చూస్తూ ఉంది. ఆవిడను చూస్తే రచయితకు వాళ్ళ అమ్మ గుర్తుకు వస్తుంది. “ఈవిడే మీకోసము వచ్చింది”, అని కాంతము పరిచయము చేస్తుంది. “ఏం నాయనా నీవేనా కాంతము మొగుడివి” అని సూటిగా పెద్దావిడ ప్రశ్నిస్తుంది. అవునని జవాబిస్తాడు. “నీవు మా ఆయనకు ఏదో ఉపదేశము చేసావుట కదా? అని మళ్ళీ ప్రశ్నిస్తుంది. “నేను ఇంగ్లిష్ చదువులు చదువుకున్నాను నాకు ఉపదేశము చేయటానికి మంత్రాలు ఏమిరావు పిన్నిగారు” అని రచయిత జవాబిచ్చాడు. “ఆ ఇంగ్లిష్ మంత్రాలు ఉపదేశించాడు కాంతము మొగుడు అని మాఆయన చెప్పాడులే, కాదంటావు ఏమిటి” అని రచయితను నిలదీస్తుంది. “ఆ మధ్య మీదగ్గరకు వచ్చిన పెద్దాయన” అని కాంతము గుర్తుచేస్తుంది. “ఓహో అదా సంగతి ఆయనకు భార్య భర్తలు ఎలా సుఖముగా ఉండాలి అని కొన్ని మాటలు చెప్పాను అంతే తప్ప పెద్ద ఉపదేశాలు ఏమీలేవు” అని రచయిత ఆవిడకు వివరిస్తాడు. “నీవు చెప్పిన మంత్రము బెడిసి కొట్టింది నాయనా” అని రహస్యము చెప్పినట్లు చెప్పింది. “పిన్నిగారు ఇంగ్లీషులో మంత్రాలు ఉండవు” అంటాడు. “నాకు అన్ని తెలుసు నాయనా కోయ మంత్రాలూ ఉండగా లేనిది ఇంగ్లిష్ మంత్రాలు ఉండవా?” అని ఎదురు ప్రశ్నిస్తుంది. కాంతము ఊరుకోకుండా పెద్దావిడ పక్షము చేరి మాయనకు ఇంగ్లిష్ మంత్రాలు వచ్చులెండి అని కళ్ళు ఎగరేస్తూ చెపుతుంది. ఇంతకీ ఏమి జరిగింది అని రచయిత అడుగుతాడు. “నీతో మాట్లాడి వచ్చిన రాత్రి నుండి పిచ్చిచూపులు, పిచ్చిమాటలు నాయనా” అన్నది విచారంగా. “ఇంతకీ ఏమిటండి ఆ పిచ్చిమాటలు” అని కాంతము చనువుగా అడుగుతుంది. “ఏమి చెప్పనే తల్లి ఇంత బ్రతుకు బ్రతికి ఇంటి వెనకాల చచ్చినట్లు ఆ మాటలు నానోటితో చెప్పలేనే తల్లి” అని భాధపడుతూ, “కొడుకు లాంటి వాడివి కాబట్టి చెపుతున్నాను ఎలాగైనా నీవు ఆ ఇంగ్లిష్ విరుగుడు మంత్రము చెప్పాలి నాయనా” అని ప్రాధేయపడింది. కాంతము పెద్దావిడ పక్షాన చేరి తమాషా చేస్తుంది. ఒక పక్క పెద్దావిడ అమాయకత్వానికి జాలి, భార్య అల్లరి మాటలకు రచయితకు కోపం వస్తుంది. “ఇంతకీ ఆ పిచ్చిమాటలు ఏమిటండి” అని రచయిత అడుగుతాడు. “చెబుతాను నాయనా, నా వంక ఎగాదిగా చూస్తాడు, మడికట్టుకున్నా అన్నా ఆలోచన లేకుండా నన్ను వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. నీ శరీరము కోమలము ఇంకా ఏమిటో మాట్లాడుతారు. ముప్పై ఏళ్ళు కాపురము చేసాము ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. కిరస్తానీ వాళ్ళ పద్ధతులట కదా ఇవన్నీ అయినా అవన్నీ మనకెందుకు తల్లి, ఎలాగైనా మీ ఆయనతో చెప్పి ఆ ఇంగ్లిష్ మంత్రానికి విరుగుడు మంత్రము చెప్పించమ్మ” అని ఆవిడ కాంతాన్ని నన్ను బ్రతిమాలటం మొదలుపెట్టింది. “ఏ భూత వైద్యుడి దగ్గరకు వెళదామా అంటే ఈ ఇంగ్లిష్ మంత్రాలకు అవి పనిచేయవని చెప్పారు. అందువల్ల మీ దగ్గరకు వచ్చాను. మీరు విరుగుడు మంత్రము చెప్పి పుణ్యము కట్టుకోండి అని ప్రాధేయపూర్వకముగా అడిగేటప్పటికీ కాంతము కరిగిపోయి, “మీకేమి భయము వద్దు మాయన విరుగుడు మంత్రము చెపుతారు” అని రచయిత తరుఫున చెప్పేసింది. రచయిత కూడా, “పిన్ని గారు ఏదో పొరపాటు జరిగింది నేను ఇంగ్లిష్ లో ఉచ్చాటన చేసి అదంతా పోగొడతాను మీరేమి భయపడకండి” అని చెప్పగా ఆవిడా సంతృప్తి చెంది భార్య భర్తలను దీవించి వెళుతుంది. ఆవిడా వెళ్ళిపోయినాక కాంతము, “మీరు పొరపాటు చేసారు ఈమె గారికి కూడా ఆయనకు చెప్పినట్లుగా ఉపదేశము అంటే మొగుడి సౌందర్యాన్ని గుణగణాలను మెచ్చుకోమని చెప్పాల్సింది” అని నవ్వుతూ అంటుంది. “ఇక చాలు నీ వేళాకోళాలు నేను జరిగినదానికి విచారిస్తున్నాను ఇలా అవుతందని నేను అనుకోలేదు” అంటూ మేడ మీది గదిలోకి రచయిత వెళతాడు. ఈ విధముగా ఈ కథలో సాంప్రదాయానికి నవీనతకు మధ్య గల తేడాను సున్నితమైన హాస్యాన్ని మేళవించి రచయిత పాఠకులకు అందిస్తారు.