నేటి యువతకు బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించిన స్వాతంత్ర సమర యోధుల గురించి చాలా తక్కువ తెలుసు. క్రికెటర్లు సినిమా యాక్టర్ల గురించి తెలుసుకోవటానికి చూపించినంత ఉత్సాహము స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకొని వారిజీవిత చరిత్రల ద్వారా స్ఫూర్తి పొందే ప్రయత్నము చేయకపోవటము దురదృష్టకరము. హైస్కూల్ స్థాయివరకు కొంతమంది జాతీయ నాయకుల జీవిత చరిత్రలను చరిత్ర అనే పాఠ్య అంశములో చదువుకుంటారు ఆ తరువాత మరచి పోతారు. అటువంటి స్వాతంత్ర సమరయోధుల గురించి తెలియజేయాలనే ఈ ప్రయత్నములో స్వాతంత్ర్యోద్యమములో ప్రముఖ పాత్ర వహించిన త్రయము “లాల్, బాల్, పాల్ (లాలాలజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్). వీరిలో ఒకరైన లోకమాన్య బాల గంగాధర తిలక్ గురించి తెలుసుకుందాము.
బాలా గంగాధర తిలక్ 1856లో మహారాష్ట్ర లోని రత్నగిరి అనే చిన్న పట్టణములో జన్మించాడు బాల్యము నుండి భారతీయులకు విద్యను అందివ్వటంలో బ్రిటిష్ పాలకులు చూపించే నిర్ల్యక్షాన్ని చూసి బాధపడేవాడు. ప్రజలతో మమేకమై అక్షరాస్యత మాత్రమే బ్రిటీషర్ల దమన నీతిని గుర్తించటానికి ఉపయోగపడుతుందని తెలుసుకున్నాడు. బ్రిటిష్ వారితో పోరాడటానికి విద్య మంచి ఆయుధమని భావించాడు. అందువల్ల తిలక్ తన గ్రాడుయేషన్ పూర్తి అయిన వెంటనే 1880లో పూణే లో న్యూ ఇంగ్లిష్ స్కూల్ ను ప్రారంభించాడు 1885లో మహాదేవ్ గోవింద్ రానడే, తెలాంగ్, జేమ్స్పఫెర్గుసన్ మరియు అగార్కర్ వంటి ప్రముఖుల సహాయ సహకారాలతో దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ప్రారంభించటం విద్య విషయములో తిలక్ తీసుకున్న ఒక గొప్ప ముందడుగు. ఈవిధముగా విదేశీయుల అధిపత్యాము పై జరిపే పోరాటంలో తిలక్ ప్రజల సంఘీభావాన్ని కూడగట్టటములో సఫలీకృతుడైనాడు.
ప్రజలను స్వాతంత్ర్యోద్యమమువైపు నడిపించటానికి కేసరి అనే పత్రికను మరాఠీలోను, మరాఠా అనే పత్రికను ఇంగ్లీషులోను 1881లో ప్రారంభించాడు కానీ ఇంటి యజమాని ప్రింటింగ్ మెషీన్ ను తన ఉండటానికి ఒప్పుకోకపోతే తన స్కూల్ లో పెట్టి రాత్రికి పేపర్ ముద్రణ పూర్తిచేసి ఉదయానికల్లా కేసరి పత్రికను స్వయముగా ఇంటింటికి తిరిగి పంచాడు. 1889 నుండి కేసరి పత్రికకు ఎడిటర్ గా భాద్యత తీసుకొని తన సంపాదకీయాలద్వారా జాతీయ ఉద్యమాన్ని ప్రజలలోకి తీసుకొని వెళ్లగలిగాడు. తిలక్ హిందూ వారసత్వపు సంపదలను పునరుద్దరించాలన్న తలంపుతో 1890లో ప్రజల భాగస్వామ్యముతో గణపతి ఉత్సవాలను, శివాజీ జయంతి ఉత్సవాలను ప్రారంభించాడు. ఈనాటికి ఊరువాడా ప్రతి ఏటా గణేష్ చతుర్థి ఉత్సవాలు బ్రహ్మాండముగా జరుగుతున్నాయి అంటే ఆనాడు తిలక్ వేసిన బీజమే కారణము. ప్రజలలో అయన నింపిన ఉత్సాహము అటువంటిది.
స్వాతంత్ర ఉద్యమములో చురుకుగా పాల్గొని నాయకత్వము వహించిన ప్రముఖులలో తిలక్ ముఖ్యుడు.”స్వాతంత్రమే నా జన్మ హక్కు. నేను దానిని పొందితీరుతాను ” అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు తిలక్. 1896లో జరిగిన జాతీయ ఉద్యమమునకు నాయకత్వము వహించి విదేశ వస్తు బహిష్కరణ ఉద్యమాన్ని నడిపించాడు. స్వరాజ్యము ఆనే చెట్టుకు స్వదేశీయ ఉద్యమాలు శాఖలు వంటివి అని నమ్మి పూణేలో విదేశ వస్త్రాలను తగులబెట్టించాడు అంతేకాకుండా బొంబాయిలోని నూలు మిల్లు యజమానులకు భారతీయులకు సరిపడా నూలు బట్టలను ఉత్పత్తిచేసి సరసమైన ధరలకు అందించవలసినదిగా విజ్ఞప్తిచేశారు. తిలక్ పూణే లోస్వదేశీ వీవింగ్ కంపెనీని ప్రారంభించాడు.
ఈ స్వదేశీయ ఉద్యమము బాగా సాగుతున్నప్పుడు మహారాష్ట్రలో తీవ్రమైన కరువు 1896లో ఏర్పడింది. బ్రిటిష్ ప్రభుత్వము తీవ్రమైన కరువు కాటకాలు ఎదుర్కోవటానికి చర్యలు చేపట్టకపోగా ప్రజలపై అదనపు పన్నులు విధించటం మొదలు పెట్టింది. అటువంటి పరిస్థితులలో తిలక్ ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ తీవ్రమయిన కరువును ఎదుర్కొనేటట్లు చేసాడు. ఇదంతా పూర్తిగా న్యాయబద్ధముగా చేసాడు. గోరుచుట్టుపై రోకటిపోటులా మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయినారు. తిలక్ సహాయక కేంద్రాలను ప్రారంభించి ప్రజలకు వైద్య సహాయము అందేటట్లు చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వము నియమించిన రాండ్ అనే ప్లేగు కమీషనర్ ఏవిధమైన సహాయక చర్యలు చేపట్టకపోగా సైనికులను ఇండ్లలోకి తనిఖీల పేరుతొ పంపి ఇబ్బంది పెట్టేవాడు తిలక్ తన సంపాదకీయాలతో ప్రజలను చైతన్యవంతులు గాచేస్తూ రాండ్ చర్యలను ఘాటుగా విమర్శించేవాడు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయములో రాండ్ బ్రిటిష్ రాణి డైమండ్ జూబిలీ ఉత్సవాలను జూన్ 22, 1897న ఘనముగా విందు ఏర్పాటు చేస్తాడు. ఇది ప్రజల ఆగ్రహానికి కారణమయింది. ఆగ్రహముతో రగిలిపోతున్న చాపేకర్ సోదరులు రాండ్ ను ఒక సైనికాధికారిని కాల్చి చంపారు.
చాపేకర్ సోదరులు తిలక్ ప్రసంగాలవల్ల ఈ హత్యకు పాలపడ్డారని తిలక్ ను దేశద్రోహ నేరము క్రింద జులై 1987 లో అరెస్ట్ చేసి 18 నెలలు కఠిన కారాగార శిక్ష విధించారు. కానీ ఆరోగ్య కారణాల వల్ల 1898 సెప్టెంబర్ 6న విడుదల చేయగా ప్రజలు ఘానా స్వాగతము పలికారు ఈ సమయములోనే స్వాతంత్ర ఉద్యమము లో అతివాదులు మితవాదులు అన్న భేదము ఏర్పడింది. తిలక్ అతివాదులకు నాయకత్వము వహించాడు. తిలక్ 1906 స్వాతంత్ర ఉద్యమాన్ని వేగవంతము చేయటానికి నేషనలిస్ట్ పార్టీ ని స్థాపించాడు స్వదేశీ ఉద్యమానికి సపోర్టుగా “పైసా ఫండ్” అనే నిధిని పోగుచేసి భారతీయ పరిశ్రమలకు అందించేవాడు. ఈ విధముగా భారతీయ వస్తువుల ఉత్పత్తులను పెంచుతూ విదేశ వస్తు బహిష్కరణ చేయించేవాడు.
ప్రభుత్వము కొత్త చట్టాల ద్వారా తిలక్ ప్రెస్, ఆస్తులను జప్తు చేస్తామని బెదిరించినా స్వాతంత్రానికి తన పోరాటాన్ని ఆపలేదు.
ప్రజలు తిలక్ ను “లోకమాన్య”అనే బిరుదుతో సత్కరింహారు. నాలుగు ముఖ్యమైన సూత్రాలద్వారా ప్రజలలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కలుగజేసాడు అవి విదేశ వస్తువుల బహిష్కరణ, జాతీయ విద్య విధానము, స్వపరిపాలన, స్వదేశీ ఉద్యమము. ఈ నాలుగు సూత్రాల ద్వారా మనము మన హక్కులను బ్రిటిష్ ప్రభుత్వము నుండి సాధించుకోవచ్చు అని ప్రజలకు ఉద్భోధించారు. బెంగాల్ విభజనను(1905) వ్యతిరేకిస్తూ తన పత్రికలలో ఘాటైన పదజాలంతో సంపాదకీయాలు వ్రాసి బ్రిటిష్ ప్రభుత్వ ఆగ్రహానికి గురైనాడు. ఫలితముగా జైలు పాలు అయినాడు. చరిత్రలో మొదటిసారిగా మాక్స్ ముల్లర్ లాంటి మేధావులు ప్రభుత్వ చర్యను ఖండించగా 1908లో మళ్ళీ విచారణ జరిపి బొంబాయి హైకోర్టు తిలక్ కు 6ఏళ్ళు ఖఠిన కారాగారా శిక్ష విధించారు. ఆ తీర్పు ఇచ్చింది దావర్ అనే భారతీయ జడ్జి. కానీ ఈ తీర్పుకు నిరసనగా తిలక్ కు అనుకూలముగా బొంబాయిలో అల్లరులు మొదలైనాయి. తిలక్ కోర్టులో అపీల్ చేసుకుంటే మహమ్మద్ అలీ జిన్నా తిలక్ తరుఫున వాదించి కేసును తిలక్ కు అనుకూలముగా గెలిపించాడు. ప్రజలంతా సంతోషించారు. తిలక్ కు జైలు శిక్ష విధించిన జడ్జి దావార్ ను బ్రిటిష్ ప్రభుత్వమూ “సర్” బిరుదుతో సత్కరించింది. ఆ సందర్భముగా బార్ కౌన్సిల్ విందు ఏర్పాటు చేస్తే జిన్నాతీవ్రముగా విభేదించాడు. తిలక్ లాంటి దేశభక్తుడికి శిక్ష వేసిన వ్యక్తికి విందు ఇవ్వటం చాలా దుర్మార్గము అని నేరుగా జడ్జి దావర్ కు నిర్మొహమాటముగా లెటర్ వ్రాసాడు. ఈ సంఘటన జిన్నాకు తిలక్ పట్ల గల గౌరవాన్ని అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆనాటి బొంబాయి సెషన్స్ కోర్ట్ స్వాతంత్రము తరువాత బొంబాయి హైకోర్టు గా ఏర్పడ్డప్పుడు ఆనాటి ప్రధాన న్యాయమూర్తి కోర్ట్ ప్రాంగణములో తిలక్ అప్పటి తీర్పు గురించి తన నిర్దోషిత్వాన్ని వివరిస్తూ చేసిన ప్రసంగమును శిలాఫలక పై చెక్కించినది అవిష్కరిస్తూ అది మాహాభాగ్యముగా తన ఆత్మకథలో పేర్కొన్నాడు. తిలక్ ను ఛాగ్ల భారతమాత గొప్ప పుత్రులలో ఒకడుగా కొనియాడారు.
మహాత్మా గాంధీ సిద్ధాంతపరంగా కొన్ని అంశాలపై తిలక్ తో విభేదించినప్పటికీ తిలక్ ను అయన తన ముగ్గురి గురువులలో ఒకడిగా పేర్కొనేవాడు. ఆయన తిలక్, ఫిరోజ్ షా, గోపాలకృష్ణ గోఖలే తన రాజకీయ గురువులు అంటుండేవారు. తిలక్ కూడా మహాత్మా గాంధీ అంటే ఎనలేని గౌరవాన్నీ కలిగి ఉండేవారు. గాంధీకి దేశముపట్ల గల ప్రేమ ఆయన చేసిన త్యాగాలు, కృషి ఆయనను భారతదెశ చరిత్రలో ప్రజలు గౌరవించే నాయకుడిగా నిలుపుతాయని తిలక్ విశ్వసించే వాడు. భారత దేశము స్వాతంత్రము సంపాదించు కోకుండా ఆభివృద్ది చెందదు. మన దేశ భవిష్యత్తు, సంస్కృతుల మనుగడ కోసము స్వాతంత్రము చాలా అవసరమని నమ్మి ఆ ఆశయ సాధనకు తన జీవితమంతా పోరాటం సాగిస్తూ ప్రజలను తోటి నాయకులను ఉత్తేజపరుస్తూ దురదృష్టవశాత్తు స్వాతంత్రాన్ని చూడకుండానే 1920లో పరమపదించాడు. కానీ అయన పేరు స్వాతంత్ర ఉద్యమములో సువర్ణాక్షరాలతో లిఖియింప బడింది Recommended Article: