మాతృవేదన – కథ

          కోర్ట్ హాలంతా క్రిక్కిరిసి ఉంది.  అందరూ ఊపిరి బిగబట్టి ఆ అమ్మాయి ఏమి చెబుతుందోనని ఎదురుచూస్తున్నారు.

          అందరిలోనూ టెన్షన్.   గోడ గడియారం చప్పుడు తప్ప అంతా నిశ్శబ్దం. గాలి కూడా ఆగిపోయిందేమోనని ఉత్కంఠ.

          ఒక ప్రక్క అరుణ  …మరో ప్రక్క శ్రవణ్.

          టిక్….టిక్…టిక్…

          ఆ అమ్మాయి నోరువిప్పింది. కళ్ళల్లో ఉబికిన కన్నీటిని తుడుచుకుంటూ తల పైకెత్తింది.

          “నేను మా నాన్నతోనే ఉంటాను” మెల్లగానే అయినా దృఢంగా చెప్పింది.  ఆమె మాటలకు అక్కడున్న అందరూ ఆశ్చర్యపోయారు.   ఎదురుచూసిందేనన్నట్లు శ్రవణ్ పెదాలపై చిరునవ్వు విరిసింది.

          ఎదురుచూడని అరుణకు ఆ మాటలు బుల్లెట్ నుంచి వదిలిన తూటాల్లా చెవినుండి దూసుకుపోయింది.

          “ఆలోచించమ్మా! ఈ వయసులో నీకు మీ అమ్మ అవసరం ఎంతైనా ఉంటుంది.” జడ్జిగారు మరోసారి గుర్తు చేశారు.

          “నో. జడ్జిగారూ! నాకు ఈ అమ్మకన్నా  నాన్నే కావాలి.” నిశ్చలంగా చెప్పింది.

          ఆ మాటలతో అరుణ కుప్పకూలిపోయింది.

          చిన్న ఆశ….చివరి ఆశ.  అది కూడా కూలిపోయింది. ఏ ఆశతో పదేళ్ళు బతికిందో అది ఆవిరయిపోయింది.   కళ్ళ వెంట  ధారాపాతంగా కన్నీళ్ళు ఉబికి వస్తుంటే – “అమ్మా! ఆశా!” అంది ఆర్తిగా. 

           ఛీత్కారంగా చూసింది ఆశ.

           చివరిసారిగా కూతురు చూసిన ఆ చూపులకు భూమి అమాంతం కృంగి అందులో సజీవ సమాధి అయిపోతే బాగుణ్ణనిపించింది అరుణకి.

           ఇక చెప్పేదేదీ లేనట్లు తండ్రి చేతులు పట్టుకొని బయటికి నడిచింది ఆశ.

          చేసేదేమీ లేక జడ్జిగారు తీర్పు చెప్పకతప్పలేదు.

          పదేళ్ళ క్రితం భర్తతో విడాకులు – భర్తతో సంబంధం తెగిపోయింది. అప్పట్లో కూడా ఇదే సమాధానం ఇచ్చింది ఆశ.

          “ఎవరితో ఉంటావమ్మా! అమ్మతో ఉంటావా? నాన్నతో ఉంటావా?” జడ్జిగారు అడిగారు.

          “నాన్నతో ఉంటాను.” అంది ఎనిమిదేళ్ళ ఆశ.

          చిన్న వయస్సనుకుంది. మారుతుంది అనుకుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మ అవసరం తెలిసొస్తుంది అనుకుంది. కానీ వయసు పెరిగి మేజర్ అయినా ఆ నిర్ణయంలో మార్పు లేదు. అదే కఠిన వైఖరి. అదే ఛీత్కారం.   అరుణ గుండెలు బ్రద్దలయింది. మాటలు రాక నిశ్చేష్టురాలయింది. నాన్న చేతుల్లో చేతులూపుతూ నిర్లక్ష్యంగా  అలా వెళ్ళిపోతుంటే  చూస్తూ ఉండిపోయింది – అదే  ఆఖరి చూపన్నట్టు.

          పదేళ్ళ క్రితం వరకు తన చేతిని పట్టుకొని నడిచిన ఆశ ఎందుకు ఇంత కఠినంగా వుందో వూహించుకోవడానికి మెల్లమెల్లగా వెనక్కి వెళ్ళి అద్దంలో తన జీవితాన్ని చూసుకోవడానికి ప్రయత్నిస్తోంది అరుణ.

          అవును… ఆ వయసులో తనేం చేసింది? స్వయంకృతాపరాధమే కదా!

          “అవును. నేను తప్పు చేశాను. సరిదిద్దుకోలేని తప్పులు చేశాను. అంతే కాదు. తప్పులమీద తప్పులు చేస్తూ పోయాను.”- వెక్కి వెక్కి ఏడుస్తూ రోడ్లోకి వచ్చింది అరుణ.

          “ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి?  ఎటు వెళ్ళాలి? ఎవరికోసం బతకాలి? అసలు నేనెందుకు బతకాలి? నా అన్నవాళ్ళు “ఛీ” కొట్టాక  ఇంకెవరి కోసం బతకాలి?      ఇన్నాళ్ళు “ఈరోజు” కోసం బతికాను. ఆశ మనసు మార్చుకుని నాతో వస్తుందని బతికాను. తన కోసమే బతికాను. తనే వద్దని వెళ్ళిపోయింది. భర్త – శ్రవణ్ ఎప్పుడో కాదన్నాడు. “ అరుణ మనసులో సుడిగుండాలు. అంతులేని ప్రశ్నలు …జవాబులేని ప్రశ్నలు. సుళ్ళు తిరుగుతున్నాయి. కాళ్ళు ఎటుపోతున్నాయో… నడక ఎటుపోతుందో… గమ్యం లేని ప్రయాణం… అంతులేని ఒంటరి నడక. నడుస్తూనే ఉంది. ముందుకు నడుస్తూనే ఉంది. మనసు మాత్రం వెనక్కి లాగుతోంది.

          పుట్టగానే తల్లిని మింగేసిందని బంధువులు శాపనార్థాలు పెట్టినా తల్లిని పుణికి పుచ్చుకుని అచ్చం అమ్మలాగే పుట్టిన అరుణ అంటే తండ్రికి ఎనలేని ప్రేమ. వాత్సల్యం.  ఎలాంటి లోటు రాకూడదని  అల్లారుముద్దుగా పెంచాడు వీరయ్య. సవతి తల్లి బాధ ఉండకూడదని రెండో పెళ్ళి కూడా వద్దనుకున్నాడు. చిన్నారి అరుణ ఆటలతో; పాటలతో అతనికి కాలక్షేపం. అరుణకు తండ్రంటే దైవం. తండ్రికి అరుణంటే ప్రాణం.

          కాలంతో పాటు వయసు అద్దిన అందాలతో  అరుణ మిసమిసలాడేది. తనలాంటి పేదకుటుంబంలో పుట్టాల్సిన అందం కాదని ఉప్పొంగిపోయేవాడు వీరయ్య. అంతటి అందాలరాశిని ఏ రాకుమారుడికో ఇచ్చి పెళ్ళి చేయాలని వూహించుకునేవాడు. అందుకు పగలు;రాత్రి కష్టపడి డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు.

          వయసు పొంగుతో విరిసిన గులాబీలా అలా రోడ్డుపై నడిచి వెళ్తుంటే ఎన్నో కళ్ళూ ఆమెవైపు ఆర్తిగా చూస్తుంటే ఆమె ఎద పొంగిపోయేది. ఆ నడకలోని ఠీవి ఆమెకి మరింత అందాన్ని జోడించేది. ఎందరికళ్ళో ఆ అందంవైపు పొద్దుతిరుగుడు పువ్వుల్లా నాట్యం చేసేవి.  

          అందమయిన ఆ నీలి కళ్ళల్లో అనంతమయిన ఆశలు. రంగు రంగుల కలలు. ఆ కలల్లో ఎన్నో అందమయిన వూహలు. ఆ వూహల్లో అందమయిన భవిష్యత్ …సప్తవర్ణాల హరివిల్లులు. ప్రతి ఆడపిల్ల పదిహేనేళ్ళ ప్రాయంలో కాంచే స్వప్నాలే. ఏ రాకుమారుడో తనకోసం పంచకళ్యాణిపై వచ్చి వరిస్తాడని; స్వర్గసౌఖ్యాలలో ఓలలాడిస్తాడని ఎన్నో వూహలు… మరెన్నో కలలు… వూహల్లో వూగుతూ; కలల్లో తేలుతూ –. వూహలకి అంతం ఉండదు. కలలకు ఎల్లలుండవు. మనసుకి కళ్ళెం ఉండదు.

          అసలు పదిహేనేళ్ళ ప్రాయం ఎంతో చిత్రమయింది. ఆ ప్రాయంలో ఉన్నవారికి ఏమీ  కనిపించదు. ఏమీ వినిపించదు. మనసు అదుపులో ఉండదు. విచక్షణ వుండదు. ఆలోచన మసకేస్తుంది. కళ్ళు ఎటు పోతే అటు …  కాళ్ళు ఎటు లాగితే అటు…కళ్ళెం లేని గుర్రంలా ఎటుబడితే అటు ప్రయాణం.

          అప్పుడే విచక్షణ కావాలి. ఆలోచన రావాలి. ఆపి తట్టి మార్గనిర్దేశానికి తల్లిదండ్రుల అవసరం ఎంతైనా ఉంటుంది. బలహీన క్షణంలో వివేకాన్ని మేల్కొల్పడానికి ముఖ్యంగా తల్లి మార్గదర్శకం కావాలి. ప్రతి తల్లిదండ్రులు కనిపెట్టుకుని ఉండాలి. ఋజుమార్గంలో దారి చూపాలి. ఒకవేళ దారితప్పితే మళ్ళీ జీవితాన్ని పట్టాలెక్కించాలి. ముందుండి నడిపించాలి. దురదృష్టవశాత్తు ఇక్కడే చాలామంది తప్పటడుగు వేస్తుంటారు.

          ఈ ఆధునిక యుగంలో అంతా బిజీ… బిజీ.  లేచినప్పటి నుంచి ఉరుకులు… పరుగులు. ఒకర్ని మరొకరు పట్టించుకునే తీరుబాటే ఉండదు. ఈ ఉరుకులు పరుగులెందుకంటే పిల్లల భవిష్యత్ కోసమే అంటారు తలిదండ్రులు. తలిదండ్రులు పట్టించుకోకపోవడం… వయసు ప్రభావం… సినిమాలు, సెల్ పోన్లు, ఇంటర్నెట్లు, చేతినిండా డబ్బు, విచ్చలవిడితనం, అన్నిటిని అనుభవించాలనే వయసు ఉబలాటం… అందుకు అనుకూలించే పరిస్థితులు, నిఘా లేకపోవడం, బలహీన క్షణాల్లో తప్పుచేసి తీరిగ్గా జీవితాంతం విచారించడం… అదే దౌర్భాగ్యం?     

          ఇక్కడ కూడా అదే జరిగింది. రాకుమారున్ని తేవడానికి తండ్రి రేయింపగళ్ళు కష్టపడుతున్నాడు. తల్లి లేదు. ఇంట్లో తను ఒక్కర్తే.  అన్ని అనుకూలించిన ఒక బలహీన క్షణాన – 

          పక్కింటి కుర్రాడు అవినాష్ — తన క్లాస్ మేటే. పదిహేనేళ్ళ కుర్రాడే. చిన్నప్పట్నుంచి తెలిసినవాడే. మంచి కుర్రాడే. ఇద్దరూ  కలిసిమెలిసి ఆడుకున్నవాళ్ళే. 

          ఆరోజు ‘అరుణా!” పిలుస్తూ ఇంటి లోపలికి వచ్చాడు.

          “ఏమిటి అవినాష్!” వంటింట్లో నుంచి హాల్లోకి వచ్చింది.

          “లెక్కలు హోం వర్క్ చేశావా?”

          “చేశాను.”

          “నాకు నాల్గో లెక్క రాలేదు. కొంచెం చెప్తావా?”

          “అలాగే. నా నోట్స్ తెస్తాను. కూర్చో!”

          అవినాష్ మంచంపై కూర్చున్నాడు.

          ఆమె లెక్కల నోట్స్ తెచ్చింది. పక్కనే కూర్చుని చెప్పుకుపోతోంది.  అతను తదేకంగా చూస్తున్నాడు. చేతులు యధాలాపంగా తగిలాయి. ఇంతవరకు ఎన్నో సార్లు తగిలాయి కానీ… అప్పటికీ ఇప్పటికీ ఏదో తేడా. ఆ స్పర్శలో విద్యుత్. ఆ చూపులో తమకం.  ఇంతవరకు ఎప్పుడూ లేని అనుభూతి. మళ్ళీ మళ్ళీ పొందాలనే ఆరాటం. మనసులో ఏదో  అలజడి. కొత్త అనుభవం. సరికొత్త   ఉబలాటం.

          అంతలోనే చటుక్కున వాటేసుకుని పెదాలపైన గాఢ ముద్ర వేశాడు అవినాష్ తమకం ఆపుకోలేక. అనుకోని అనుభవం. సరికొత్త అనుభవం ఎగబాగి ఒళ్ళంతా జిల్లుమంది. ఒక్కసారిగా విద్యుత్  ప్రవహించింది. ఆ అనుభవం చాలా బాగుంది. ఒక్క క్షణం పరవశించి కళ్ళు మూసుకుంది అరుణ.

          అంతే! మరో క్షణంలోనే వివేకం వెన్ను తట్టింది.

          “ఏయ్! ఏం చేస్తున్నావు?” దూరంగా జరిగి చెంప పగలగొట్టింది. అవినాష్ బిత్తరపోయి తలొంచుకుని చరచర వెళ్ళిపోయాడు. సిగ్గుతో బిక్కచచ్చిపోయింది అరుణ.  

          “ఏమ్మా? బతకాలనిలేదా?” ఎవరో పక్కకు లాగారు. లారీ సర్రున దూసుకుపోయింది. ఎవరో పుణ్యాత్ముడు. పక్కకు లాగి బతికించాడు. అయినా తను బతికి ఎవర్ని ఉద్దరించాలి?

          “నా మానాన నన్ను వదిలేసి ఉంటే ఈపాటికి లారీ వాడు పుణ్యం కట్టుకునే వాడేమో? అయినా చావుకు కూడా నేనంటే భయమేమో? ఇలాంటి బలహీన క్షణాల్లో ఎక్కడ ఆశ  నాలాగా బలయిపోతుందో అని  నా ఆరాటం.  రక్షణ కవచంలా నిలబడి ఎలాంటి తప్పటడుగు వేయకుండా వేయి కళ్ళతో కనిపెట్టుకోవాలని నా పోరాటం. నా లాగా ఆశ జీవితం కాకూడదని గుండెల్లో పెట్టుకుని కాపాడాలని ఈ అమ్మ ఆవేదన. కానీ నా బాధ ఆశకు అర్థం కావడంలేదు. అదే  నా బాధ. “మనస్సులోనే గొణుక్కుంది అరుణ. అంతలో గుండెల్లో సన్నగా మంట ప్రారంభమయింది. గుండెని అదిమి పట్టి రుద్దుకుంటూ  రోడ్డు వారగా నిలబడింది కొన్ని క్షణాలు. అయినా తను మాత్రం ఏం చేసింది?

          ఆ రోజు వివేకాన్ని ప్రదర్శించింది కాని… ఆ తర్వాత? ఆ విఙ్ఞతను ప్రదర్శించలేకపోయింది. రాత్రంతా ఘర్షణ… మానసికంగా తీవ్ర ఘర్షణ. కొత్త అనుభవానికి… విఙ్ఞతకి.

          వయసు పోరుకు… మనసు హోరుకు.

          మంచికి… చెడుకి

          క్షణికావేశం… నూరేళ్ళ జీవితం.

          ఒకే ఒక బలహీన క్షణం …ఒకే ఒక తప్పటడుగు జీవితాన్ని తారుమారు చేసేసింది. బురదలో పడిపోయింది విలువయిన జీవితం. కాళ్ళు పడితే కడుక్కోవచ్చు. కానీ పడింది జీవితం. తిరిగిరాని జీవితం. తిరిగిరాకుండానే పోయింది. హెచ్చరించడానికి ఎవరూ లేకపోయారు. కడుపులో దాచుకోవడానికి అమ్మలేక పోయింది.

          రోడ్డంతా మసక మసగ్గా ఉంది. కొంగుతో కళ్ళు తుడుచుకుని, పైటని భుజాలనిండా కప్పుకుని నడక జోరు పెంచింది.

          ఆ మర్నాడు అవినాష్ మళ్ళీ వచ్చాడు. వాడికి తెలుసు ఇంట్లో ఎవరూ ఉండరని…అరుణ ఒక్కటే ఉంటుందని.

మాటా మాటా కలిపాడు. “సారీ అరుణా!” చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు. భుజం తట్టాడు. అరుణకు ఒళ్ళంతా వణుకు పుట్టింది. తలపై చేయి వేసి నిమురుతూ దగ్గరికి తీసుకున్నాడు. ఆ స్పర్శ; ఆ అనుభవం కొత్త కొత్తగా ఉంది. కావాలనీ ఉంది. వద్దనీ ఉంది.

          తలపై నుండి చేయి మెల్ల మెల్లగా వీపు మీదుగా పాకి గట్టిగా కౌగిలించుకుని పెదాలపై చుంభించాడు.

          శరీరమంతా ఒక్కసారిగా విద్యుత్ తగిలింది. పెదాలు జివ్వుమన్నాయి. ఎదిగీ ఎదగని ఎదపొంగులు గట్టిగా ఒత్తుకొని వింతైన అనుభవానికి లోనై మత్తుగా; హాయిని గొలిపింది. వద్దు వద్దంటూనే అరుణ అల్లుకుపోయింది.

          ఇద్దరికీ కొత్త అనుభవాలు. లోకాన్ని మరిచిపోయారు. గుర్తు చేయడానికి; దండించడానికి ఎవరూ లేరు.

          అలా మొదలయింది అవినాష్ తో అనుబంధం.     

          “ఫ్రీమెచూర్డ్ లవ్” గొణుక్కుంది అరుణ.

          అది లవ్ అంటారో …ఫ్రీమెచూర్డ్ అంటారో లేక మెచూర్డ్ అంటారో ఆ వయసులో ఆలోచించే అవకాశమే లేదు.

          పరస్పర  శరీర ఆకర్షణ … క్లాసులెగ్గొట్టి  సినిమాలు; షికార్లు అడ్డు అదుపు లేకుండా ఎంజాయ్ చేశారు.  ఫలితంగా పరీక్ష తప్పారు.  ఆడపిల్ల పరీక్ష తప్పితే కొంపలేవీ మునగవు కానీ … అరుణ పరీక్షతో పాటు నెలకూడా తప్పింది. 

          విషయం తెలిసిన వీరయ్య కుప్పకూలిపోయాడు. ఎన్నెన్ని కలలు కన్నాడు. రాకుమారుడ్ని వెతికి పెట్టాలని అందుకు కట్నకానుకలు భారీగా ఇవ్వాలని రెక్కలు ముక్కలు చేసుకుంటూ డబ్బులు కూడబెట్టాడు. ఒక్కసారిగా దారుణం వినేసరికి కాళ్ళు చేతులు ఆడక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అల్లారుముద్దుగా పెంచిన కూతుర్ని తిట్టడానికి కూడా నోరు రాక మ్రాన్ పడికూలపడిపోయాడు.  

          “ఎంతపని చేశావే?” కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఆ రాత్రంతా గడిపాడు.

          ఈ వార్త అందరికీ తెలిస్తే  ఇంకేమయినా ఉందా? పిల్లకు పెళ్ళవ్వుద్దా? 

          తెల్లారక ముందే కూతుర్ని లేవదీసి పట్నం బయలుదేరాడు.   అక్కడ ఎవరికి తెలియకుండా కడుపు తీయించి బంధువుల ఇంట్లో కొన్నిరోజులు వుంచి మేనేజ్ చేశాడు.

          అరుణ ఇంటికి తిరిగి వచ్చి అవినాష్ గురించి వాకబు చేసింది. పరీక్ష తప్పిన వాణ్ణి పట్నంలో హాస్టల్లో వేశారని వింది. కలవాలని ప్రయత్నించింది కానీ వీలు పడలేదు. పడలేదు అనేకన్నా…  పడనివ్వలేదన్నది సబబుగా ఉంటుంది. పైగా వాడి పేరంట్స్ వార్నింగిచ్చారు. 

          ఇప్పుడు వీరయ్యకి ఒకటే దిగులు. వీలయినంత తొందరగా కూతురి పెళ్ళి చేసేయాలని.

          చెల్లెల్ని బతిమాలి దాని కొడుకు శ్రవణ్ కిచ్చి పెళ్ళి చేశాడు ఘనంగా. 

          శ్రవణ్ పట్నంలో  లారీ  డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. సొంతిల్లు ఉంది. పైకి రావాలని మధ్యలో ఆగిపోయిన చదువును ప్రైవేట్ గా కొనసాగిస్తున్నాడు. మంచి కుర్రాడు. పెళ్ళాన్ని బాగా చూసుకుంటున్నాడు. అంతటి అందాలరాశి పెళ్ళామయినందుకు మురిసిపోయాడు. కొంత కాలం బాగానే జరిగింది. ఆశ పుట్టింది. శ్రవణ్ మరింత మురిసిపోయాడు.  తన అదృష్టానికి అరుణ కూడా ఆనందపడింది.

          కూతురి జీవితం గాడిన పడినందుకు వీరయ్య ఆనందపడ్డాడు. ఇక మనవరాలి పుట్టుకతో మరింత సంబరపడ్డాడు.

          అయితే…!  అలా సాఫీగా సాగిపోతే దాన్ని జీవితమని ఎందుకంటారు? మళ్ళీ అరుణ జీవితంలో తుఫాను స్టార్టయి అది సునామీగా మారి అల్లకల్లోలం సృష్టించింది. అరుణ జీవితాన్నే తలక్రిందులు చేసింది. ఆమె కోరికలకు కళ్ళెం వేయలేకపోయింది. ఆమె కలల జీవితానికి ..నిజ జీవితానికి పొంతన కుదరకపోయింది. తన అందచందాలకి ఏ రాకుమారుడో రాకుండా శ్రవణ్ వచ్చేసరికి కొంత కాలం అణగిమణగి ఉన్న కోరికలు పురివిప్పాయి. మెల్ల మెల్లగా శ్రవణ్ తనకు తగిన వరుడు కాదు అన్న భావన మనసంతా వ్యాపించి దినదినమూ పెరిగి  వటవృక్షమయిపోయింది. క్రమేణా ఆమెలో మార్పు రాసాగింది. బిత్తెడు సంపాదనతో తన కోరికలు తీరేవి కావు. కోరికలు గుర్రాలయ్యాయి. మనసు అదుపు తప్పింది.  కొందరు అవకాశం కోసం  ఎదురుచూస్తుంటారు. వచ్చినప్పుడు వదులుకోరు. మరికొందరు అవకాశాన్ని తామే సృష్టించుకుంటారు. ఆ రెండోకోవకు చెందినవాడే నాగభూషణం –  శ్రవణ్ లారీ యజమాని.

          అరుణలాంటి అందాలరాశి శ్రవణ్ కి దొరకడం అతడు భరించలేకపోయాడు. అవకాశాన్ని   దొరకబుచ్చుకున్నాడు. అరుణ అసంతృప్తిని క్యాష్ చేసుకున్నాడు.

          నడచి నడచి అరుణకు అలసటగా ఉంది. దాహం వేసింది. పక్కనే ఉన్న పార్క్ లోకి పోయి కుళాయి నీళ్ళు తాగింది. ఆ చెట్ల నీడలో ఒక బల్లపైన కూర్చొంది.

          డ్యూటీ కి వెళ్ళిన శ్రవణ్ వారమైనా రాకపోయేసరికి కనుక్కుందామని నాగభూషణం ఇంటికెళ్ళింది అరుణ. ఇంట్లో ఆడది వూరెళ్ళితే; పనివాడితో బిరియాని తెప్పించుకుని  తిని త్రేంచుతూ తూగుటుయాల్లో తీరుబడిగా కూర్చుని పందెం కోడిపుంజుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని జీడిపప్పు తినిపిస్తున్నాడు నాగభూషణం. అంతపెద్ద ఇంటిని చూసి కళ్ళు తేలేసింది అరుణ. కళ్ళు పెదవి చేసుకుని ఆశ్చర్యంగా అక్కడే నిలబడిన అరుణను దూరం నుంచి చూసి గుర్తుపట్టేశాడు నాగభూషణం.  పెదవులమీద చిరుదరహాసం మొలిచింది. కోరమీసం దువ్వుకుంటూ “ఎవరక్కడా?” అన్నాడు గుర్తుపట్టనట్టు.

          “నేను దొరా?” అంది దగ్గరికొచ్చి వినయంగా నిలబడి అరుణ.

          “నేనంటే…ఎవరూ?” రెట్టించాడు.

          “మా ఆయన శ్రవణ్…” మధ్యలోనే ఆగిపోయింది.

          “ఆ! వాడి పెళ్ళామా నువ్వు….”

          “అవును. ఆయన వచ్చి వారమయింది. కనుక్కుందామని…” గొణిగింది.

          “వాడు ఇంకొక  డ్యూటీకి వెళ్ళాడులే. ఇంకో వారం పడుతుంది రావడానికి.”    

          ‘సరే దొరా! వస్తాను.” వెనుతిరిగింది.

          “అరే! అప్పుడే వెళ్తావా?”అన్నాడు ఓరగా చూస్తూ.

          “ఉ!”

          “ఆ ప్లేట్ లో బిరియాని ఉంది. తిని పో.”

          “వద్దు దొరా!”

          “ఏంటే..తిను” గద్దించాడు; అందాల్ని కళ్ళతో జుర్రుకుంటూ.

          భయంతో బిగుసుకుపోయి ప్లేట్ అందుకుంది.   గబగబా తినేసి ప్లేట్ కడిగేసి ఇంట్లో పెట్టేసింది.

          “డబ్బేమయినా కావాలా?” అడిగాడు నాగభూషణం.

          భయంతో బిగుసుకుపోయి అవును కాదు అన్నట్లు తలను అడ్డదిడ్డంగా వూపింది.

          నాగభూషణం బీరువా తెరిచి అందులో నుంచి పదివేలు తీసి “ఇంద తీసుకో” అన్నాడు.

          తీసుకోవడానికి దగ్గరికి వచ్చిన అరుణ- తెరిచిన బీరువాను చూసి అవాక్కయింది.

          కట్టలు …కట్టలుగా నోట్లు

          అరలు నిండుగా బంగారం

          కళ్ళు తిప్పుకోలేకపోయింది.

          అలాగే నిలబడిపోయింది. డబ్బునిస్తూ చేతులు పట్టుకున్నాడు.  

          ఆమె ఆశను పసిగట్టేశాడు నాగభూషణం. వాడి ఆకలిని  పసిగట్టేసింది అరుణ.

          మళ్ళీ ఘర్షణ. ఈ సారి పెద్దగా ఆలోచించలేదు.

          అతని కౌగిలిలో ఆమె…స్వర్గసీమలో ఇద్దరూ.

          ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే లేదు. అతనికి కావల్సింది ఆమె; ఆమెకి కావలసింది అతను.  ఎవరికి ఏ లోటు లేకుండా జరుగుతుండగా…. “ప్చ్…”

          ఒకరోజు అకస్మాత్తుగా ఇంటికొచ్చిన ఆశ కళ్ళపడింది – పడకూడని దృశ్యం.

          సిగ్గుతో చచ్చిపోయింది అమ్మగా-

          పైనుంచి లేచి కోరమీసాలు దువ్వుకుంటూ వెళ్ళిపోయాడు నాగభూషణం.

          బిత్తరపోయింది ఆశ.

          “ఆశా!” దగ్గరికి తీసుకోపోయింది అమ్మ.

          “ఛీ!” ఛీ కొట్టింది చిన్నారి ఆశ.

          ఏ తల్లికీ రాకూడని దుర్దశ.

          అప్పుడు ఛీ కొట్టిన చిన్నారి ఆశ …ఇప్పటికీ పదేళ్ళ తర్వాత కూడా మళ్ళీ ఛీ కొట్టింది. మార్పేమీ లేదు. విషయం శ్రవణ్ కి తెలిసి పెద్ద గొడవే అయింది. చివరికి విడాకుల దాకా వచ్చింది. తన గత చరిత్ర చూసి కోర్ట్ పాపను తండ్రికే అప్పచెప్పింది. తను జడ్జిగారి కాళ్ళావేళ్ళా పడింది. పాపను తనకిమ్మని ఎంతగానో వేడుకొంది.  పాప నడిగారు ఎవరిదగ్గర ఉంటావని. తనకి నాన్నే కావాలంది.

          తను శ్రవణ్ కాళ్ళపై పడింది. క్షమించమంది. ఇకమీదట అలా జరగదని; ఇక తప్పు చేయనని ఎన్నో ఒట్లు వేసింది. అయినా అతని మనసు కరగలేదు. కాళ్ళ దగ్గర పడుంటానని వేడుకుంది. అయినా ఎవరి మనసు కరగలేదు.  తన బాధను; ఆవేదనను చూసి కోర్ట్ ఒక అవకాశం ఇచ్చింది.

          ‘చూడమ్మా! నీకొక అవకాశం ఇస్తున్నాను. కనీసం ఇకపైనైనా ఒక అమ్మగా బతుకు. నీతిగా; న్యాయబద్దంగా జీవించు. ఆదర్శంగా జీవించు. మీ పాపకు పద్దెనిమిదో ఏట మరో అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ నీలో మార్పు వచ్చి మీ పాప అప్పుడు కోరుకుంటే పాపను నీకివ్వడానికి అవకాశమిస్తున్నాను. ఆలోపల మీ పాప మనసును గెలవడానికి ప్రయత్నించు.” అన్నారు జడ్జి గారు.    

          విడాకుల వార్త విని నాన్న గుండె ఆగిపోయింది. ఉన్న ఒక్క అధారమూ పోయింది.

          “అందుకే మారాను. పూర్తిగా మారాను. ఎన్ని కష్టాలొచ్చినా నీతిగా; నిజాయితిగా బతికాను. కేవలం పాప కోసం బతికాను. ఒక మంచి కూతురిగా బతకలేకపోయాను. ఒక మంచి భార్యగా బతకలేకపోయాను. కనీసం ఒక మంచి అమ్మగా బతకాలని …ఇన్నాళ్ళు; ఇన్నేళ్ళు పంటి బిగువున బతికాను. అప్పటి నుంచి ఈ జనారణ్యంలో పులులు; సింహాలు; గుంటనక్కలు; తోడేళ్ళు వంటి కౄర మృగాల మధ్య ఒంటరి ఆడది  నిప్పులా బతికాను. అమ్మగా గెలవాలని బతికాను.  ఆశలో  మార్పొస్తుందని ఇన్నాళ్ళు వేచి చూశాను.  ఈ రోజుతో అదికూడా అడియాసే అయింది. ఇంకెవరికోసం బతకాలి . నా  బ్రతుక్కి అర్థముందా? నిజమే. తప్పులు చేశాను. తెలుసుకుని మారాను. అయినా నా వెనకటి జీవితం రాలేదు. భర్తతో; కూతురితో హాయిగా బతకాలని కలలు కన్నాను. ఒక్కసారిగా జీవితం వెనక్కి వెళ్ళి శ్రవణ్; ఆశలతో కలిసి అందరిలాగా బతకాలని ఆశ. అది నెరవేరదని తెలిశాక ఇక నా జీవితానికి అర్థం ఉందా?” అరుణ అంతరంగంలో అంతులేని ఆలోచనలు.

          ఆకలితో కళ్ళు తూలిపోతున్నాయి. శరీరం వశంతప్పుతోంది. నడక దారితప్పుతోంది. అయినా లేని ఓపిక తెచ్చుకుని రైలు పట్టాలవైపు భారంగా  నడక సాగించింది ఏ దిక్కూ లేని అరుణ పశ్చాతాపంతో; బరువైన హృదయంతో. నడక ఒంటరిగా సాగుతోంది. గమ్యంలేని నడక ఒంటరిగానే సాగుతోంది.  సా…గు…తోం…ది.. ఒంటరి నడక. *

1 thought on “మాతృవేదన – కథ”

  1. sir, memu telugu bhasha parirakshna ku ganu writers vari vari abhiprayala nu A4 paper pai 150 padalanu mincha kunda rasi ( vari photo, 3 lines lo vari biography) rasi pampandi. a pege lo reight side photo. photo ki left side biograpy) rasi diguvana 150 padalu mincha kunda telugu bhasha pai vari abhiprayam rasi pampithe as it is 200 pages 1/8 size books 1000 print chesi state lo unna anni librarys,schools, ki supply chestam. please send..leda variki ee message nu papmandi.. address… lalithasai charitable trust.(r) 12.15.21, ranigai poola thota, gavarapalem, anakapalli. vizag dt. andhra pradesh.

Comments are closed.