-అంబడిపూడి శ్యామసుందర రావు
సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తాజా అధ్యాయనము లో తెలియజేసిన దానిని బట్టి అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో 9% స్త్రీలు ఐరన్ లోపముతో బాధపడుతున్నారు ఈ సంఖ్య అంత పెద్దది కాక పోయినప్పటికీ దీనివల్ల ఏర్పడే దుష్ఫలితాలు మటుకు చాలా తీవ్రముగా ఉంటాయి అని ఆ సంస్థ తెలియజేస్తుంది. మన దేశములో ఈ శాతము ఇంకా అధికముగా ఉంటుంది. ఈ ఐరన్ లోపము వల్ల ఏర్పడే వ్యాధులు అంత సులభముగా నయము కావు. కాబట్టి ఐరన్ లోపాన్ని తెలియజేసే లక్షణాలను తెలుసుకొని ముందుస్తుగా జాగ్రత్త పడితే తీవ్ర పరిణామాలు తప్పించుకోవచ్చు కాబట్టి ముందుగా ఐరన్ లోపాన్ని తెలియజేసే కొన్నిలక్షణాలను తెలుసు కుందాము.
1 పెళుసుగా ఉండే గోళ్లు:- చెంచా ఆకారము లోని గోళ్లు, లేదా గోళ్లపై పుటాకార నొక్కులు కనిపించి గోళ్లు పెళుసుగా ఉంటె వారికి ఐరన్ లోపము ఉన్నట్లుగా భావించవచ్చు.
2. కండరాల నొప్పులు:- ఎక్కువ సేపు కండరాలలో మంటలుగా ఉండటము శ్రమ పడిన తరువాత త్వరగా కండరాలు సాధారణ స్థితికి రాలేకపోవటం ఐరన్ లోపాన్ని సూచిస్తాయి.
3. రోజు చేసే పనులు అంటే మెట్లు ఎక్కలేకపోవటము లేదా ఈత కొట్టలేకపోవటం, బస్సును అందుకోలేకపోవటము వంటి పనులను చేయటము లో ఇబ్బంది పడుతుంటే ఈ లక్షణాలు ఐరన్ లోపాన్ని సూచిస్తాయి.
4. చర్మము లో మెరుపు తగ్గి కాంతి విహీనంగా మారుతుంటే అంటే పేల్ గా అవుతుంటే రక్త ప్రసరణ తగ్గి RBC కౌంట్ తగ్గుతున్నట్లు గా ఉన్నప్పుడు ఐరన్ లోపాన్ని సూచిస్తుంది.
5. శరీరానికి సరిపడినంత ఐరన్ లభ్యముకానప్పుడు శరీరములో ఆక్సిజన్ సప్లై తగ్గి శ్వాస ఇబ్బందులు మొదలు అవుతాయి. శ్వాస తీసుకోవటం కష్టము అవుతుంది
6. ఐరన్ లోపము ఉన్నవారు తరచుగా న్యూరోట్రాన్స్ మీటర్ల సింథసిస్ విషయములో మార్పు సక్రమముగా ఉండదు ఫలితముగా ఏ పని మీద శ్రద్ద పెట్టలేరు అంటే ఏకాగ్రత లోపిస్తుంది దీనివలన చాలా విషయాల పట్ల విరక్తి ఏర్పడి సంతోషముగా ఉండలేరు.
7. మన అంతర్గత వ్యవస్థలు ఐరన్ ను హీమోగ్లోబిన్ ఉత్పత్తికి ఉపయోగించుకుంటాయి. ఈ హీమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాలలో ముఖ్యమైన భాగము దీనివలన ఆక్సిజన్ రవాణా అన్ని భాగాలకు జరుగుతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ రవాణా సక్రమముగా సరిపడినంత జరగక పొతే త్వరగా అలసిపోతారు, ఎక్కువ శ్రమ చేయలేరు, మందకొడిగా తయారు అవుతారు.
ఇటువంటి లోపాలను గమనించినప్పుడు వారు ఐరన్ లోపిస్తుంది అని తెలుసుకొని ఐరన్ అధికముగా కలిగిన ఆహారమును తీసుకుంటూ లోపాన్ని సరిచేసుకోవాలి లేని పక్షంలో తీవ్రమైన అనారోగ్యము పాలు అవుతారు