భారతీయ విద్యావేత్త స్వాతంత్ర ఉద్యమములో పాల్గొన్న ప్రముఖ సమరయోధుడు, కర్మ యోగి, భగవద్గీతను పూర్తిగా అర్ధముచేసుకొని పాటించిన వ్యక్తి మదన్ మోహన్ మాలవ్య. ఆయనను ప్రజలు గౌరవసూచకంగా “పండిట్ మదన్ మోహన్ మాలవ్య” అనియు, మాహాత్మ అనికూడా సంభోదించే వారు. ఆయన మహాత్మగా కూడా గౌరవింపబడ్డారు. ఆసియాలోనే అతిపెద్దదైన రెసిడెన్షియల్ విశ్వ విద్యాలయాన్ని వారణాసిలో స్థాపించిన వ్యక్తి ఈయనే. ప్రస్తుతము సుమారు 12,000 మంది విద్యార్థులు వివిధ రంగాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మాలవ్య 1919 నుండి 1938 వరకు ఈ విశ్వ విద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు. మాలవ్య 1861లో అలహాబాద్ లో బ్రీజ్ నాధ్, మునాదేవి అనే సనాతన హిందూ దంపతులకు జన్మించాడు. వీరి పూర్వికులు మధ్య ప్రదేశ్ లోని మాల్వా నుండి వచ్చారు కాబట్టి వీరిని మాలవ్యాలుగా పిలిచేవారు. వీరు బెనారస్ లోని అగర్వాల్ అనే వర్తకుల కుటుంబాలకు పురోహితులుగా ఉండేవారు. తండ్రి పురాణా ప్రవచనాలు చెపుతూ డబ్బు గడించేవాడు. మాలవ్య మొదట సంస్కృత పాఠాశాలలో తరువాత ఆంగ్ల పాఠాశాలలో విద్యాభ్యాసము చేశాడు. అలహాబాద్ జిల్లా పాఠాశాలలో చదువుతున్నప్పుడే మకరంద అనే కలము పేరుతొ కవిత్వము వ్రాసేవాడు.
మాలవ్య 1879లో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. అప్పట్లో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ మాలవ్యకు నెలసరి ఉపకార వేతనాన్ని ఇచ్చారు. ఆ తరువాత కలకత్తా విశ్వ విద్యాలయము నుండి బి.ఏ డిగ్రీని పొందాడు. కుటుంబ పరిస్థితులు అనుకూలించక పోవటం వల్ల సంస్కృతములో ఎమ్. ఏ చేద్దామనుకున్నా చేయలేక పోయినాడు. జులై 1884లో అలహాబాద్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. ఆ తరువాత న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి న్యాయవాదిగా తన కేరీరును ప్రారంభించాడు. అప్పటికే జాతీయ భావాలు ఉండటంవల్ల స్వాతంత్ర ఉద్యమములో పాల్గొనేవాడు. మాలవ్య భారతీయ జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షునిగా నాలుగుసార్లు (1909, 1913, 1919, 1932) పనిచేశారు సహాయ నిరాకరణ ఉద్యమములో చురుకుగా పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఖిలాఫత్ ఉద్యమములో పాల్గొనటాన్ని తీవ్రముగా వ్యతిరేకించాడు. విదేశ వస్తువుల బహిష్కరణ ఉద్యమములో పాల్గొని 1932లో జైలుకి వెళ్ళాడు. సైమన్ కమీషన్ ను వ్యతిరేకించటానికి లాలా లజపతిరాయ్, జవహర్ లాల్ నెహ్రు వంటి నాయకులతో కలిసి పనిచేశారు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీతో కలిసి పాల్గొన్నారు. 1932లో కాంగ్రస్ ను వీడి 1934లో జరిగిన ఎన్నికలలో 1స్వతంత్రముగా 2 సీట్లను గెలుచుకున్నాడు.
“సత్యమేవ జయతే” అనే నినాదాన్నిముండక ఉపనిషద్ నుండి గ్రహించి వ్యాప్తి చేసిన ఘనత మాలవ్యాధే స్వాతంత్రము తరువాత ఆ వాక్యము మన జాతీయ ఎంబ్లమ్ లో చేర్చబడింది మాలవ్య గొప్ప విద్యావేత్త 1905లో బెనారస్ హిందూ విశ్వ విద్యాలయము స్థాపించాలి అన్న తలంపుతో దాదాపు 10ఏళ్లపాటు అవిరళ కృషి చేసి 1915లో విశ్వ విద్యాలయాన్ని ప్రారంభించాడు. ఈ విశ్వవిద్యాలయానికి చందాలు పోగుచేయాటానికి తాను న్యాయవాద వృత్తిని వదిలి దేశము అంతటా తిరిగి ఎవరిని వదలకుండా చందాలు వసులు చేశాడు. న్యాయవాదిగా అలహాబాద్ హైకోర్టు లో ప్రాక్ టీస్ చేస్తున్నప్పుడు1922లో గోరాఖ్పూర్, చౌరి చౌరా అల్లర్లు లోని 153 మంది నిందితుల తరుఫున వాదించి వారందరికీ మరణ శిక్షను తప్పించాడు. ఈ క్రమములో నైజాము నవాబును చందా కోసము అడిగితె నైజాం నవాబు ఉగ్రుడై, “హిందూ విశ్వ విద్యాలయము స్థాపించటానికి ముస్లిం అయినా నన్ను చందా అడుగుతావా?” అని మాలవ్య పై తన చెప్పు విసురుతాడు. మాలవ్య ఆ చెప్పును బయటకు వచ్చి వేలం పాట పెడతాడు. ఈ విషయము తెలిసిన నవాబు మాలవ్యకు అధికమొత్తము డబ్బు ఇచ్చి వేలం అపిస్తాడు. ఆ విధముగా పోగుచేసిన మొత్తాలతో ఫిబ్రవరి 4, 1916న అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ హార్డింజ్ తో విశ్వ విద్యాలయానికి శంఖుస్థాపన చేయించాడు
అఖిల భారతీయ హిందూ మహాసభ ముఖ్య నాయకులలో ఒకడైనప్పటికీ హిందూ ముస్లిం ఐక్యతకు గట్టిగా కృషి చేసిన నాయకులలో ముఖ్యుడు 1913లో కలకత్తా కాంగ్రస్ సమావేశములో భారతదేశము హిందువులు, ముస్లిములు, సిక్కులు, పార్సీలు అందరికి చెందినది చేతిలోని ఐదు వేళ్ళు ఎలాగో అలాగే భారతదేశములోని అన్ని మతాలు అని అన్ని వేళ్ళు కలిపి పిడికిలి బిగిస్తేనే శక్తి అని నొక్కి వక్కాణించారు. మాలవ్య రాజకీయనాయకుడు విద్యావేత్త మాత్రమే కాకుండా ప్రముఖ పాత్రికేయుడు. 1909లో లీడర్ అనే ఆంగ్ల మాస పత్రిక, 1910లో మర్యాద అనే హిందీ మాస పత్రికను ప్రారంభించాడు, 1907లో అభ్యుదయ అనే హిందీ వార పత్రికను కూడా నడిపించారు. 1924 నుండి 1946 వరకు ప్రముఖ పత్రిక హిందుస్తాన్ టైమ్స్ బోర్డు చైర్మన్ గా వ్యవహరించాడు. ఆ కాలములోనే (1936లో) హిందుస్తాన్ టైమ్స్ హిందీ ఎడిషన్ ప్రారంభము అయింది.
రవీంద్రనాధ్ టాగోర్ మాలవ్యాకు “మహామాన “అనే బిరుదు ఇచ్చాడు, మహాత్మా గాంధీ మాలవ్యాను “ప్రాతః స్మరణీయహ్, దేవత పురుష్”అని సంభోదించేవాడు, అంతేకాకుండా ఈయనను ధర్మాత్మా అని కర్మయోగి అని ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ అని కూడా పిలిచేవారు. భారత దేశములో స్కౌట్స్ అండ్ గైడ్స్ స్థాపనకు కృషి చేసిన మొదటివ్యక్తి మాలవ్య. 1917లో అలహాబాద్ లో సేవ సమితి స్కౌట్ అసోషియేషన్ ను స్థాపించాడు. ఇంత ఘనత కలిగిన నాయకుడికి మన భారత ప్రభుత్వమూ 2014లో భారత రత్న బిరుదును మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి తో పాటు ఇచ్చింది 12 నవంబర్, 1946 న కాశీలో ఈ మహానుభావుడు స్వాతంత్రము ను చూడకుండానే పరమపదించారు. భారతదేశములో ఆయన జ్ఞాపిక “బెనారస్ హిందూ విశ్వ విద్యాలయము”.