శాపగ్రస్త – కవిత

విధి వంచితను కాను,

శాపగ్రస్తను నేను.

దివి నుంచి భువికి జారిపడిన

గాంధర్వ స్త్రీని నేను.

దైవత్వము ఆపాదించిన అతిశయముతొ ఏ మునికి తపోభంగము కావించినానో,

ఆ ముని క్రోధాగ్నికి సమిధనై,

శలభాన్నైనాను నేను.

విధివంచితను కాను,

శాపగ్రస్తను నేను

విహంగినై పై కెగిరే శక్తితో

ఏ వికలాంగిని అగౌరవ పరిచినానో

ఆ అభిమానవతి కోపాగ్నికి కారణమై

పంజరంలో బందీ ఐనాను నేను.

విధి వంచితను కాను,

శాపగ్రస్తను నేను

దివినుంచి భువికి

జారి పడిన గాంధర్వ స్త్రీని నేను.

రూపసిననే అహంభావముతో

ఏ కురూపిని అవహేళన చేసిననో

ఆమె అవమానాగ్నిలో దహించబడి

శార్వరములోనికి త్రోయబడ్డాను నేను

విధి వంచితను కాను

శాపగ్రస్తను నేను

దివినుంచి భువికి

జారిపడిన గాంధర్వ స్త్రీని నేను.

దర్భను శరముగ చేయగలిగే శక్తితో

ఏ జీవి ప్రాణమును హరించినానో

ఆ ప్రాణి ఆక్రందనల ఘోషములో

పరిభ్రమించి శతపర్వికనైనాను నేను.

విధివంచితను కాను

శాపగ్రస్తను నేను

తల రాతలను మార్చే పాటవముతో

ఏ ప్రేమికులను విడదీశినానో ఆ జంట ఆవేదన శాపమై దయితునికి దూరమైనాను నేను.

విధి వంచితను కాను,

శాపగ్రస్తను నేను. దివినుంచి భువికి

జారిపడిన గాంధర్వ స్త్రీని నేను.

అధికారమిచ్చిన గర్వాతిశయముతో

ఎందరు సేవకులను దండించినానో

వారి హృదయాక్రోశ

ఖేదనముతో

కట్టు బానిస నైనాను నేను.

విధి వంచితను కాను

శాపగ్రస్తను నేను.

దివి నుంచి భువికి జారిపడిన

గాంధర్వ స్త్రీని నేను.

విద్యుల్లత వలే మెరిసి ఆ మెరుపు

ఉష్ణముతో ఏ వనాన్ని కాల్చినానో

ఆ వన్య జీవుల ప్రాణ భయాగ్ని లో

దగ్ధమై బూడిద నైనాను నేను.

విధి వంచితను కాను

శాపగ్రస్తను నేను.

దివి నుంచి జారి పడిన

గాంధర్వ స్త్రీని నేను.

శ్రీ రాముని పాదధూళి తో రూపము

పొందిన అహల్య లా,

శ్రీ కృష్ణుని కర స్పర్శతో సుందరాకృతి పొందిన కుబ్జలా,

శాప విముక్తికై శ్రీ రామ కృష్ణ కొరకై

ఎదురు చూస్తున్నాను నేను.