“అరేయ్… మా ఏరియా మొత్తం ఎ.టి.ఎంలు తిరిగారా ఒక్కదాంట్లో డబ్బుల్లేవు… అక్కడ ఏమైనా వస్తున్నాయారా?” అడిగాను నా ఫ్రెండ్ ని.
వాడు ఓ ఎ.టి.ఎం అడ్రస్ చెప్పాడు. అక్కడ ఎప్పుడూ డబ్బులు ఉంటాయన్నాడు. ఆటోలో ఆ అడ్రెస్స్ కి వెళ్లాను. ఎ.టి.ఎంలో డబ్బులు డ్రా చేసుకుని అలా రోడ్డు మీద వెళుతున్నాను. రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద గేట్లు, ప్రహరీ గోడలతో విశాలమైన స్థలాల్లో కోటల్లా ఉన్నాయి బంగళాలు.
ఉన్నట్టుండి ఓ బంగాళాలో నుండి పెద్ద అరుపు వినపడింది. ఆ బంగాళా దగ్గరికి వెళ్లాను. గేటు తెరిచి ఉంది. గేటు బయటే నిలబడి లోపలికి చూశా. ఆ ఇంటి గుమ్మం కూడా తెరిచే ఉంది. గుమ్మంలో నుండి ధోతి కట్టుకున్న ఓ ముసలాయన బయటికి వచ్చాడు గాభరాగా. బహుహా ఆయనే అరిచి ఉంటాడు. నన్ను చూసి-
“బాబు…” అంటూ పరుగెత్తుకొచ్చాడు. నేను ‘ఏంట’న్నట్టు చూసాను.
దగ్గరికి వచ్చి “మా అయ్యగారికి గుండెపోటు వచ్చింది బాబు” దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు. వణుకుతున్న గొంతుతో.
నాకు చేపగానే సందేహం వచ్చి “ఇంట్లో ఎవరూ లేరా” అని అడిగా.
“అయ్యగారు, ఆయన్ను చూసుకోడానికి నేను. ఇద్దరమే ఉంటాం, సాయం సెయ్ బాబూ, నీకు పుణ్యముండుద్ది… అయ్యగారిని తొందర్గా ఆసుపత్రికి తీస్కెళ్ళాలి”
నాకు ఏమి చేయాలో తోచలేదు. సహాయం చెద్దామనిపించింది.
“ఎక్కడ మీ అయ్యగారు?”
లోపలి తీసుకెళ్ళాడు. విశాలమైన పడకగదిలో పెద్ద మంచం పైన ఓ పెద్దాయన గుండెను రెండు చేతుల్తో అదుముకుంటూ బాధపడుతూ ఉన్నాడు.
“ఆలస్యం అయితే ప్రాణాలు మిగలవు బాబు”
“సరే, సరే టాక్సీ తీసుకొస్తాను” అంటూ కాల్ చేయడానికి బయటికి వచ్చాను. సిగ్నల్ లేకపోవడంతో గేటు దాటి రోడ్డు మీదకు వచ్చేసాను. చాలా సేపటికి కాల్ రింగ్ అయింది. టాక్సీవాడికి అడ్రెస్స్ చెప్పి ఇంట్లోకి వెళ్దామని వెనక్కి తిరిగి చూసాను. అంతే… ఒక్క సారిగా షాక్ కి గురయ్యాను. బంగాళా ఉన్న స్థలం అంతా ఇపుడు పూర్తిగా నేలమట్టమైన భావన శితిలాలు, పిచ్చి మొక్కలు, ముళ్ళ కంపలతో నిండి ఉంది. ఇదంతా కలా నిజమా అని తేల్చుకోలేక ఎంత సేపు అలా అక్కడే నిలబడిపోయానో నాకు తెలీదు…
“హలో సార్” అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. నా మొబైల్ మోగుతూ ఉంది. టాక్సీ డ్రైవర్ నుండి కాల్. పక్కనే టాక్సీ ఆగి ఉంది.
నా మొబైల్ మోగడంతో కాల్ కట్ చేసి కన్ఫర్మ్ చేసుకుని “ఈ అడ్రెస్స్ కి టాక్సీ బుక్ చేసారు. అది మీరే కద సార్?” అన్నాడు టాక్సీ డ్రైవర్.
“అవును”
“రండి సార్… త్వరగా ఎక్కండి. ముందే ఈ చోటు అంత మంచిది కాదు”
అతని మాటలు నాకు బుర్రకు ఎక్కడం లేదు. మస్తిష్కం నిండా ఆ బంగళా, ధోతి ముసలాయన, పెద్దాయన ఆలోచనలే. “ఇక్కడ… బంగ్లా కనపడుతోందా నీకు?” నేను చూస్తున్న నేలమట్టమైన బంగాళా నిజమా కాదా అన్న అనుమానంతో అడిగాను టాక్సీలో కూర్చుంటూ.
“బంగ్లానా? ఎక్కడ సార్?”
అతనికి చేత్తో చూపించాను.
అతను ఈ ఏరియా మంచిది కాదు అని ఎందుకు అన్నాడో దానికి వత్తాసుగా నేను అడగటమే తడవుగా అన్నట్టు “మొత్తం కూలిపోయిన బంగళా ఉంది కదా సార్. దాన్నే అడుగుతున్నారా? ఇప్పుడు కాదు గానీ ఒకప్పుడు ఉండేది అక్కడ బంగళా. అప్పట్లో… ఆ ఇంటి యజమాని గుండెపోటుతో చనిపోయాడు. ఒక పనివాడుండేవాడు ఆయనకి. యజమాని పోగానే పనివాడు కూడా ఆయన మీద బెంగతో చనిపోయాడు వారం రోజుల్లోనే. యజమాని పిల్లలు ఫారిన్ లో ఉంటారు. ఎవరు ఆ బంగళాని పట్టించుకోకపోవడంతో అది కూలిపోయింది” చెప్పి “ఎందుకు సార్ ఆ బంగళా గురించి అడుగుతున్నారు?” అన్నాడు టాక్సీ డ్రైవర్.
“ఏంలేదు” పరధ్యానంగా అన్నాను.
“మీక్కూడా ఆ బంగళా… ముసలాళ్ళు… కాన్పించలేదు కదా?” అన్నాడు. బహుశా నా వాలకం చూసేమో.
“నీకెలా తెల్సు”
“నాకే కాదు సార్ ఈ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఆ బంగళా, ఆ పనివాడు, అతని అయ్యగారి గురించి”
అయోమయంగా డ్రైవర్ వాపు చూశాను.
“అవును సార్… మిట్ట మధ్యాహ్నం ఈ దారిన ఒంటరిగా వెళ్ళే వాళ్లకి ఆ బంగళా కనపడటం… అందులో నుండి పనివాడు పరుగేట్టుకురావడం… వాళ్ళ అయ్యగారి గురించి చెప్పడం… లోపల ఇంకో దెయ్యం గుండెపోటుతో బాధపడుతూండటం… వెళ్ళిన వాళ్ళు బయటికి రాగానే బంగ్లా మాయమైపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఎవరూ కాలినడకన ఈ రోడ్డులో వెళ్ళరు ఈ టైంలో. మీరు ఈ అడ్రెస్ చెప్తే నేను కూడా అనుమానంతోనే వచ్చాను మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పరా లేదా అని”
ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యింది నాకు. ‘ఇప్పటి దాకా నేను ఉన్నది దెయ్యాల్తోనా … దెయ్యాల బంగ్లాలోకి వెళ్ళానా..!!’ కళ్ళు బైర్లు కమ్మాయి. స్పృహ తప్పిపోయాను.
“సార్… సార్…” అంటూ మొహం మీద చల్లని నీళ్ళు చల్లి లేపాడు డ్రైవర్.
నేను కళ్ళు తెరవగానే “భయపడకండి సార్… ఆ ఆత్మలు ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు… భయపడకండి” అన్నాడు. మళ్ళీ తనే-
“ఆత్మలు కోరిక తీరకపోతే అలా తిరుగుతూ మనుషులకు కనపడుతుంటాయి” అన్నాడు.
మౌనంగా ఉండిపోయాను.
“ఎవరైనా ఉండి ఉంటే వాళ్ళ అయ్యగారు బ్రతికేవారని పనివాడి ఆత్మ, నా వాళ్ళు ఉంటే బ్రతికి ఉండేవాడినని అయ్యగారి ఆత్మ కోరికతో ఉన్నాయట. ఆ కోరికతోనే అలా అందరికీ కన్పించి సహాయాన్ని అడుగుతుందట ఆ పనివాడి ఆత్మ, అలా గుండెపోటుతో బాధపడుతుందట ఆ అయ్యగారి ఆత్మ” అన్నాడు.
ఆ సంఘటన జరిగిన రోజు నుండి నెల రోజుల వరకు నేను జ్వరంతో ఇంటి నుండి బయటికి వెళ్ళలేదు.