Ammante Amme Poem by K. Raghavan
అమ్మంటే అమ్మే
ప్రేమ పంచడానికి, అర్హత చూడదు,
ప్రేమించలేదని, ప్రేమించడం మానదు, అమ్మంటే అమ్మే
బాధ్యతలను బరువుగా చూడదు,
తనవారి బాగు కోసం, దేనికి వెనుకాడదు, అమ్మంటే అమ్మే
తప్పును సరిచేసేటప్పుడు నిప్పులు కురిపించినా
అక్కున చేర్చుకుని లాలించకుండా ఉండలేదు, అమ్మంటే అమ్మే
తృప్తిని కలిగించే ప్రేమను అందించేది ఎవరైనా
వారిలో అమ్మను చూసుకుంటాము అంటే అతిశయోక్తి కాదు, అమ్మంటే అమ్మే
అమ్మని సృష్టించిన దేవుడే అమ్మ కడుపులో మనిషిగా పుట్టింది ఎందుకు?
అమ్మ ప్రేమను రుచి చూడడానికేనేమో!!! ఎందుకంటే, అమ్మంటే అమ్మే
అమ్మకి ఏమిచ్చి మన ఋణం తీర్చుకోగలం
అమ్మ ప్రేమకి ప్రతిఫలంగా ప్రేమనే యిద్దాం, ఎందుకంటే అమ్మంటే అమ్మే
మర్చిపోయిన అమ్మని గుర్తుచేసుకోవడానికి జరుపుకొనే ఉత్సవం కాదీ “మాతృ దినోత్సవం”
ఎలాగైతే భగవంతుని జయంతి ఉత్సవం జరుపుకుని, మనందరినీ కాపాడమని వేడుకుంటామో
అలాగే ఈ అమ్మ పండుగ నాడు అమ్మ ని అమ్మలాగా చూసుకునే అదృష్టాన్ని ఇవ్వమని ఆ భగవంతుణ్ణి వేడుకుందాం, ఎందుకంటే అమ్మంటే అమ్మే