- 1. 2025 లో ఆన్‌లైన్ స్కామ్‌లు ఎందుకు పెద్ద ముప్పుగా మారాయి
- 2. మిమ్మల్ని మోసం చేయడానికి మోసగాళ్లు ఉపయోగించే తెలివైన ట్రిక్స్
- 3. మోసానికి మీరు గురవకుండా దాన్ని ఎలా గుర్తించాలి
- 4. ఆన్‌లైన్ మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి 10 సులభమైన అలవాట్లు
- 5. మీరు స్కామ్‌కు గురైన వెంటనే ఏమి చేయాలి
- 6. తుది ఆలోచనలు - అవగాహన మీ నిజమైన రక్షణ.
1. 2025 లో ఆన్‌లైన్ స్కామ్‌లు ఎందుకు పెద్ద ముప్పుగా మారాయి
స్కామ్‌లు పాత వార్తలని మీరు అనుకోవచ్చు, కానీ 2025లో అది ఎంత పెద్ద సమస్య అయిందో మీరు గుర్తించాలి. స్కామర్లు ఇకపై పేలవంగా వ్రాసిన ఇమెయిల్‌లను పంపే అజాగ్రత్త వ్యక్తులు కాదు. వారు ఇప్పుడు AI సాధనాలు, డీప్‌ఫేక్ వీడియోలు మరియు అద్భుతంగా రూపొందించిన నకిలీ వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తున్నారు, అవి చాలా వాస్తవంగా కనిపిస్తాయి, మీరు తేడాను గుర్తించలేరు.
ఒక్క క్షణం ఆలోచించండి. ఒక సందేశం ఎంత వాస్తవంగా కనిపిస్తుందంటే, అత్యంత తెలివైన వ్యక్తి కూడా మోసపోవచ్చు. దీనికి ఒక్క తప్పు ట్యాప్ చాలు, క్షణాల్లో మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు లేదా మీ వ్యక్తిగత వివరాలు తప్పుడు చేతుల్లోకి వెళ్లవచ్చు.
మంచి విషయం ఏమిటంటే, చాలా మోసాలను నివారించవచ్చు. మీరు కాస్త నెమ్మదిగా చూసి, జాగ్రత్తగా గమనించి, కొన్ని సులభమైన ప్రాథమిక భద్రతా అలవాట్లను పాటిస్తే దాదాపు 90% మోసాలు విఫలమవుతాయి.
2. మిమ్మల్ని మోసం చేయడానికి మోసగాళ్లు ఉపయోగించే తెలివైన ట్రిక్స్
మోసపూరిత ఇమెయిల్లు మరియు నకిలీ హెచ్చరికలు
మీకు ఒక ఇమెయిల్ రావచ్చు. అందులో, "మీ బ్యాంక్ ఖాతా ఇరవై నాలుగు గంటల్లో బ్లాక్ అవుతుంది, వెంటనే వెరిఫై చేయండి" అని ఉంటుంది. అది పూర్తిగా అధికారికంగా కనిపిస్తుంది. లోగో నిజమైనట్లే ఉంటుంది, మాటల తీరు ప్రొఫెషనల్‌గా ఉంటుంది, సంతకం కూడా నిజమైనదే అనిపిస్తుంది. కానీ మీరు ఆ లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే అది నకిలీ పేజీకి తీసుకెళ్తుంది, మీ లాగిన్ వివరాలు దోచుకోవడమే దాని అసలైన ఉద్దేశ్యం.
నకిలీ ఉద్యోగ ఆఫర్లు మరియు త్వరగా డబ్బు సంపాదించే ఉచ్చులు
ప్రజల దృష్టిని ఆకర్షించడానికి స్కామర్లు ఉపయోగించే సులభమైన ఉపాయాలలో ఇది ఒకటి. మీకు "ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం" లేదా "పది రోజుల్లోనే డబ్బు రెట్టింపు అయ్యే పెట్టుబడి అవకాశం" అని హామీ ఇచ్చే సందేశం రావచ్చు. కానీ ఇందులో ఎప్పుడూ ఒక మోసం దాగి ఉంటుంది. వారు చిన్న రిజిస్ట్రేషన్ ఫీజు అడుగుతారు లేదా స్టార్టర్ కిట్ కొనమని చెబుతారు. మరియు మీరు డబ్బు చెల్లించిన వెంటనే వారు ఎలాంటి జాడ లేకుండా మాయమైపోతారు.
నిజమనిపించే ఆన్‌లైన్ షాపింగ్ మోసాలు
ఈ రోజుల్లో నకిలీ ఇ-కామర్స్ సైట్‌లను గుర్తించడం చాలా కష్టమవుతోంది. వారు నిజమైన ఉత్పత్తుల ఫోటోలు వాడుతూ, నమ్మశక్యంకాని తగ్గింపులు ఇస్తారు. ఉదాహరణకు, బ్రాండెడ్ గడియారాలు తొంభై శాతం తగ్గింపు అని లేదా ఐఫోన్‌ను సగం ధరకే ఇస్తామని చెబుతారు. మీరు చెల్లింపు చేసిన తర్వాత, ఉత్పత్తి ఎప్పుడూ రాదు లేదా బదులుగా మీకు చౌకైన నకిలీ వస్తువే వస్తుంది.
ఓటీపీలు మరియు రిమోట్ యాప్‌లతో జరిగే బ్యాంకింగ్ మోసాలు
ఇలాంటి మోసాలు ఎక్కువ భయంకరంగా అనిపిస్తాయి, ఎందుకంటే మోసగాళ్లు చాలా ప్రొఫెషనల్‌గానే మాట్లాడుతారు. వారు మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నట్టు నటిస్తూ, "భద్రత సమస్య ఉంది, వెంటనే మీ ఓటీపీ చెప్పండి" అని అడుగుతారు. కొన్ని సార్లు "సపోర్ట్ యాప్" ఇన్‌స్టాల్ చేయమని చెబుతారు. కానీ ఆ యాప్ మీకు తెలియకుండా మీ ఫోన్‌పై వారు పూర్తి నియంత్రణ తీసుకునేలా తయారు చేసి ఉంటారు.
3. మోసానికి మీరు గురవకుండా దాన్ని ఎలా గుర్తించాలి
మీరు జాగ్రత్తగా గమనిస్తే స్కామర్లు తరచుగా చిన్న చిన్న ఆధారాలను వదిలివేస్తారు. ఉదాహరణకు, వెబ్‌సైట్ చిరునామా నిజమైన “amazon.com” కు బదులుగా “amaz0n.com” లాగా కొద్దిగా భిన్నంగా కనిపించవచ్చు. సందేశాల్లో ఎప్పుడూ ఆత్రం కలిగించే మాటలు ఉంటాయి, ఉదాహరణకు “మీ ఖాతా రెండు గంటల్లో బ్లాక్ అవుతుంది” అని భయపెట్టడం. ఒక ఆఫర్ అసాధారణంగా బాగుంది అనిపిస్తే, అది నిజం కాకపోవడానికి ఎక్కువ అవకాశముంది. కొన్నిసార్లు వాక్య నిర్మాణం లేదా మాటల తీరు కొంచెం అస్పష్టంగా లేదా అసాధారణంగా అనిపిస్తుంది.
ఎప్పుడైనా కాస్త అనుమానంగా అనిపిస్తే వెంటనే ఆగి ఒక్కసారి ధృవీకరించుకోండి. మీ బ్యాంక్‌కు ఫోన్ చేయడం లేదా ఆ కంపెనీ పేరును ఇంటర్నెట్‌లో వెతకడం వంటి చిన్న జాగ్రత్త పెద్ద సమస్యల నుండి మిమ్మల్ని కాపాడగలదు.
4. ఆన్‌లైన్ మోసాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి 10 సులభమైన అలవాట్లు
- ఎవరైనా మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నారని చెప్పినా, మీ ఓటీపీ, పిన్ లేదా పాస్‌వర్డ్ ఎప్పుడూ ఎవరికీ చెప్పకండి.
- మీ ముఖ్యమైన ఖాతాల్లో అదనపు భద్రత కోసం టూ–ఫాక్టర్ ఆథెంటికేషన్ లేదా 2FAని తప్పనిసరిగా ఆన్ చేయండి.
- మీ ఫోన్ మరియు యాప్‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి ఎందుకంటే సెక్యూరిటీ ప్యాచ్‌లు మిమ్మల్ని కొత్త ప్రమాదాల నుండి కాపాడతాయి.
- చెల్లింపులు లేదా బ్యాంకింగ్ కోసం పబ్లిక్ వై–ఫై వాడకండి, ఎందుకంటే ఈ నెట్‌వర్క్‌లు అంత సురక్షితమైనవి కావు.
- తెలియని కాల్‌లు లేదా లింక్‌ల ప్రామాణికతను ధృవీకరించకుండా వాటిని నమ్మవద్దు.
- భద్రమైన చెల్లింపు పద్ధతులు అయిన క్రెడిట్ కార్డులు లేదా యూపీఐని ఉపయోగించండి. తెలియని వారికి నేరుగా బ్యాంక్ ట్రాన్స్‌ఫర్‌లు చేయడం నివారించండి.
- తెలియని వెబ్‌సైట్‌లలో కొనుగోలు చేసే ముందు ఎప్పుడూ రివ్యూలు చెక్ చేయండి, అవి నమ్మదగినవేనా అని చూసుకోండి.
- అదనపు రక్షణ కోసం మీ పరికరాల్లో యాంటీ–వైరస్ లేదా యాంటీ–ఫిషింగ్ టూల్స్ వాడండి.
- మీ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా పిల్లలు మరియు వృద్ధులకు, ఈ భద్రతా నియమాలను వివరించండి. వారు మోసాలకు సులభంగా గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- ఎలాంటి అనుమానాస్పద సందేశాలు లేదా కాల్స్ వచ్చిన వెంటనే అధికారిక సైబర్‌క్రైమ్ వెబ్‌సైట్ cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
5. మీరు స్కామ్‌కు గురైన వెంటనే ఏమి చేయాలి
మీరు ఎప్పుడైనా స్కామ్‌లో చిక్కుకుంటే, ఇబ్బందిగా భావించి సమయాన్ని వృధా చేసుకోకండి. త్వరగా చర్య తీసుకోవడం చాలా ముఖ్యం. ముందుగా, మరింత నష్టాన్ని నివారించడానికి మీ బ్యాంక్ కార్డులు లేదా UPIని వెంటనే బ్లాక్ చేయండి తర్వాత మీ బ్యాంక్‌కు కాల్ చేసి పరిస్థితిని వివరించండి, వారు మీ ఖాతాను రక్షించడంలో సహాయం చేస్తారు. ఆ తర్వాత అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి, తద్వారా విచారణ మొదలవుతుంది. అన్ని స్క్రీన్‌షాట్‌లు మరియు చెల్లింపు రుజువులను సేవ్ చేసుకోండి, ఎందుకంటే ఇవి విచారణలో చాలా ఉపయోగపడతాయి. చివరగా, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులను హెచ్చరించండి, తద్వారా మరెవ్వరూ ఇలాంటి మోసానికి గురవకుండా జాగ్రత్త పడండి.
6. తుది ఆలోచనలు - అవగాహన మీ నిజమైన రక్షణ.
నిజం చెప్పాలంటే, ఏ వ్యవస్థ కూడా పూర్తిగా సురక్షితంగా ఉండదు మరియు స్కామర్లు ప్రతి సంవత్సరం మరింత తెలివిగా మారిపోతున్నారు. కానీ మీకు ఉన్న అత్యుత్తమ రక్షణ మీ స్వంత అవగాహన మరియు అప్రమత్తతే.
ఎప్పుడైనా ఏదైనా ఆఫర్ చాలా బాగున్నట్టు అనిపిస్తే, లేదా ఒత్తిడికి లోనై, తొందరలో నిర్ణయం తీసుకోవాలని అనిపిస్తే, కాస్త ఆగి ఆలోచించండి. ఆ చిన్న సందేహమే మీ డబ్బు లేదా వ్యక్తిగత వివరాలు కోల్పోకుండా మిమ్మల్ని కాపాడుతుంది.
ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి, ఈ భద్రతా సూచనలను మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోండి. 2025లో ఆన్‌లైన్ సేఫ్టీ అంటే భయపడటం కాదు, తెలివిగా ఉండటం అనే విషయం గుర్తుంచుకోండి.
రాసినవారు: పద్మశ్రీ
పద్మశ్రీ రాసిన ఇంకొన్ని ఆలోచనాత్మక వ్యాసాలను చూడండి: click here