రీల్స్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్‌ నుంచి బయటపడటానికి 9 చక్కటి మార్గాలు

విషయ సూచిక
  1. రీల్స్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్‌ నుంచి బయటపడటానికి 9 చక్కటి మార్గాలు
  2. 1. రీల్స్ కి, మనం ఎందుకు బానిసలా మారిపోతున్నాం?
  3. 2. రీల్స్‌ను పూర్తిగా ఆపేయాలన్న తాపత్రయం వద్దు… దానికి బదులుగా అలవాట్లను మార్చండి
  4. 3. ఫోన్‌ను మనమే నియంత్రించాలి, అది మనల్ని కాదు
  5. 4. రీల్స్ చూడటం అంత ఈజీగా కాకుండా చేయండి
  6. 5. మీ ఫీడ్‌లో ఎవరు ఉన్నారో ఒక్కసారి గమనించండి
  7. 6. రోజులో కొన్ని “రీల్స్-రహిత” సమయాలను నిర్దేశించండి
  8. 7. ప్రతిరోజూ మీరు రీల్స్ ఎంతగా వాడుతున్నారో గమనించండి
  9. 8. శ్రద్ధ పెట్టడానికి సహాయపడే టూల్స్ ను ఉపయోగించండి
  10. 9. “నేను రీల్స్ ను చూడటం ఎందుకు తగ్గించాలనుకుంటున్నాను?” అన్న ప్రశ్నను మీకు మీరే వేసుకోండి
  11. చివరగా…

రీల్స్ వల్ల వచ్చే డిస్ట్రాక్షన్‌ నుంచి బయటపడటానికి 9 చక్కటి మార్గాలు

ఇప్పుడు ఎక్కువగా Instagram Reels, YouTube Shorts లాంటి చిన్న వీడియోలను మన ఫోన్లలో ఎక్కువగా చూస్తుంటాం. వాటిని చూస్తుంటే చాలా ఆసక్తిగా అనిపిస్తుంది. కానీ ఒకసారి చూడటం మొదలుపెడితే, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది సమయమే మిగలదు. అలా చూస్తూ చూస్తూ సమయం ఎలా గడిచిపోతుందో కూడా మనకి అర్థం కాదు. “ఇంకో ఒక్కటి చూసిన తర్వాత ఆపేస్తా” అనుకుంటూ, గంటలు గంటలు దాంట్లోనే గడిపేస్తాం.

ఒకవేళ “రీల్స్ ను చూడటం ఎలా మానేయలి లేదా ఎలా తగ్గించుకోవాలి?” అనే ఆలోచన మీ మనసులో కి వచ్చింది అంటే మీరు మీ కోసం ఆలోచిస్తున్నారు అని అర్థం. మీ ఆలోచనను ఆచరణలో పెట్టడానికి ఇది మొదటి పెద్ద అడుగు అని చెప్పవచ్చు.

ఈ ఆర్టికల్‌లో మనం రీల్స్ కి బానిసలుగా మారకుండా, మన శ్రద్ద ను మన పని పైనే ఎలా ఉంచాలో చూద్దాం.

1. రీల్స్ కి, మనం ఎందుకు బానిసలా మారిపోతున్నాం?

రీల్స్ ఎందుకు ఇంత addictive గా ఉంటాయంటే, దాని వెనుక algorithm ఉంటుంది. ఆ algorithm మనం చూసత్తున్న వీడియోలను గమనించి, మన ఇష్టాలకు అనుగుణంగా మరిన్ని వీడియోలను చూపిస్తుంది. దీని వల్ల మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదల అవుతుంది.

డోపమైన్ అనేది మన మెదడ్లో ఉండే ఒక రసాయనము. దీన్ని న్యూరోట్రాన్స్‌మీటర్ అంటారు, అంటే మెదడులో నాడీసంకేతాలను పంపే ఒక రసాయనమని అర్థం. మనం ఏదైనా ఆనందదాయకమైన విషయం చేస్తే, ఉదాహరణకి ఏదైనా పాట విని సంతోషించటం లేదా మనకు ఇష్టం అయిన వీడియోలు చూసేటప్పుడు ఈ డోపమైన్ విడుదల అవుతుంది.

ఈ డోపమైన్ మనకి “బాగా ఉంది” అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. అంతే కాకుండా ఆ పని మళ్లీ మళ్లీ చేయాలనే కోరికను కూడా పెంచుతుంది.

అందుకే, Instagram Reels, YouTube Shorts లాంటి ప్లాట్‌ఫారమ్‌లు మనకు నచ్చిన వాటిని చూపిస్తూ, మన మెదడులో మరింత డోపమైన్ విడుదల అయ్యేలా చేస్తాయి. దాంతో మనం వాటిపట్ల మరింత ఆకర్షితులం అవుతాం. “ఇప్పుడే ఆపేస్తా” అనుకున్నా, మనమే మళ్లీ మళ్లీ స్క్రోల్ చేయడం ఆపలేకపోతాం. కొంచెం సేపు చూస్తానన్న ప్లాన్‌తో మొదలుపెట్టి, గంటలూ గడిపేస్తాం.

2. రీల్స్‌ను పూర్తిగా ఆపేయాలన్న తాపత్రయం వద్దు… దానికి బదులుగా అలవాట్లను మార్చండి

“ఇది చేయకూడదు” అని చెప్పడం తేలిక. కానీ అసలైన మార్పు ఎప్పుడొస్తుందంటే, దానికి బదులుగా వేరే మంచి పని ఏదైనా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు.

ఉదాహరణకి:

  • ఒక్క పేజీ పుస్తకం చదవండి
  • అయిదు నిమిషాలు బయట నడవండి
  • ఫోన్ తీసుకుని ఒక మంచి స్నేహితుడికి కాల్ చేయండి
  • లేదా కాసేపు మౌనంగా కూర్చుని మెల్లగా శ్వాస పీల్చుతూ సంగీతం వినండి

ఇవి రీల్స్‌ను పూర్తిగా మర్చిపోవడానికి కాదు.. కానీ వాటిలో మనం చిక్కుకుపోకుండా ఉండటానికి, మన మెదడుకు కొంచెం విరామం ఇవ్వడానికి ఇవి మంచి మార్గాలు.

3. ఫోన్‌ను మనమే నియంత్రించాలి, అది మనల్ని కాదు

మనకు ఎంత స్వీయ నియంత్రణ ఉన్నా, ఫోన్‌ మన చేతిలో ఉన్నంత వరకు మనం రీల్స్ చూడకుండా ఉండటం కష్టం. అందుకే, మనకు మనమే చిన్న చిన్న పరిమితులను పెట్టుకోవాలి.
ఆండ్రాయిడ్ ఫోన్లలో “డిజిటల్ వెల్‌బీయింగ్ (Digital Wellbeing)” అనే ఫీచర్ ఉంటుంది. ఐఫోన్ వాడేవాళ్లకి “స్క్రీన్ టైమ్ (Screen Time)” అనే సెట్టింగ్ ఉంటుంది. ఇవ్వన్నీ మనం ప్రతిరోజూ Instagram, YouTube లాంటి యాప్స్‌కు ఒక నిమిషం లేదా 30 నిమిషాల వరకు ఉపయోగించేలా టైమ్‌లిమిట్ పెట్టేందుకు ఉపయోగపడతాయి.
ఈ విధంగా మనకు మనమే రీల్స్ చూడటం పై మన దృష్టిని పరిమితం చేయడంలో ముందడుగు వేయొచ్చు.

Try this: Google Digital Wellbeing

4. రీల్స్ చూడటం అంత ఈజీగా కాకుండా చేయండి

ఒకవేళ మనం రీల్స్ చూడటం ఆపలేకపోతే, దాన్ని తక్కువగా చూడటానికి చిన్నచిన్న ఆటంకాలు సృష్టించొచ్చు. మనమే మన అలవాట్లకు చిన్న అడ్డంకులను వేయాలి.

ఉదాహరణకి:

  • ఇన్స్టాగ్రామ్ లాంటి యాప్‌లను ఫోన్‌లో ఒక hidden folder లో పెట్టండి.
  • ప్రతిసారి వాడిన తర్వాత logout అవ్వండి.
  • నోటిఫికేషన్లను పూర్తిగా ఆఫ్ చేయండి.
  • ఫోన్ స్క్రీన్‌ని grayscale కు మార్చండి, రంగుల ఆకర్షణ తక్కువ అవుతుంది.

ఇవి చాలా చిన్న మార్పులా అనిపించొచ్చు. కానీ మన దృష్టిని రీల్స్ నుంచి మరల్చడానికి ఇవి చాల బలంగా పనిచేస్తాయి.

5. మీ ఫీడ్‌లో ఎవరు ఉన్నారో ఒక్కసారి గమనించండి

మీరు ఫాలో అవుతున్న పేజీలే, మీరు రోజూ చూసే విషయాలను రూపుదిద్దుతుంటాయి. మీ ఫీడ్‌ లో ఎక్కువగా టైమ్ పాస్ లేదా ఎంటర్టైన్మెంట్ రీల్స్ ఉంటే… ఆ కంటెంట్ మీ సమయాన్ని ఎలా పీల్చేస్తోందో అర్థం చేసుకోండి.

  • దానికి బదులుగా, మోటివేషన్, ఉత్పాదకత (productivity), మానసిక ఆరోగ్యం లాంటి విషయాలపై దృష్టి పెట్టే పేజీలను ఫాలో అవ్వండి.
  • అవసరం లేని, మన శ్రద్ధను బయటకు లాగేస్తున్న కంటెంట్‌ను మెల్లగా తొలగించండి.

ఫీడ్‌ను మార్చడం అంటే రీల్స్ ను చూడటం మానేయాలని కాదు… కానీ మన దృష్టి ఏవైపు పోతుందో తెలుసుకొని అవగాహనతో దానిని మార్చుకోవడం.

6. రోజులో కొన్ని “రీల్స్-రహిత” సమయాలను నిర్దేశించండి

మన దైనందిన జీవితంలో కొంత సమయం రీల్స్ కు దూరంగా ఉండడమంటే, మన శ్రద్ధకు, మన శాంతికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చినట్టే.

ఉదాహరణకి:

  • లేచిన వెంటనే మొదటి 30 నిమిషాలు
  • భోజనం సమయంలో
  • పడుకోవడానికి 1 గంట ముందు

ఈ మార్పులు చిన్నవి అనిపించవచ్చు… కానీ ఇవి మన లోపల ఒక ప్రశాంతమైన స్థిరత్వాన్ని క్రమంగా పెంచుతాయి. దృష్టి, ప్రశాంతత, మనసులో స్పష్టత ఇవన్నీ మెల్లగా మన దైనందిన జీవితంలోకి తిరిగి వస్తాయి.

7. ప్రతిరోజూ మీరు రీల్స్ ఎంతగా వాడుతున్నారో గమనించండి

మనం రీల్స్ వాడటం గురించి గమనించడమే మొదటి పెద్ద అడుగు.
ప్రతి రోజూ, రాత్రి పడుకునే ముందు.. ఒక చిన్న డైరీలో గానీ, లేక ఫోన్‌లోని నోట్‌లో గానీ ఇలా రాసుకోండి:

  • ఈరోజు నేను ఎంతసేపు రీల్స్ చూశాను?
  • ఏ సమయంలో ఫోన్ తెరిచాను? అది దేనికోసం?
  • ఆ సమయంలో చెయ్యాల్సిన పనులు ఏవి? వాటిని ఎందుకు వదిలిపెట్టాను?

ఇలా చేయడం వలన మీ ఫోన్ యూసెజ్ గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది.

8. శ్రద్ధ పెట్టడానికి సహాయపడే టూల్స్ ను ఉపయోగించండి

మనం మన పని మీద దృష్టి పెట్టడం ఈ రోజుల్లో అంత సులభం కాదు. అందుకే, కొన్ని మంచి టూల్స్ మనకు హెల్ప్ చేస్తాయి.

ఉపయోగకరమైన యాప్స్:

  • StayFocusd (Chrome బ్రౌజర్ కోసం) — వెబ్ సైట్లను నియంత్రిస్తుంది
  • Forest — productivity పెంచే ఆటలా ఉంటుంది, మీరు ఫోన్ వాడకుండా ఉన్నంతసేపు ఒక చెట్టు పెరుగుతుంది
  • Freedom — ఒకేసారి పలు పరికరాల్లో యాప్స్ ను బ్లాక్ చేయగలదు

ఈ టూల్స్ మీ శ్రద్ధను కాపాడుకోవడంలో, రీల్స్ చూడటం మానేయడంలో మీకు సహాయం చేస్తాయి.

9. “నేను రీల్స్ ను చూడటం ఎందుకు తగ్గించాలనుకుంటున్నాను?” అన్న ప్రశ్నను మీకు మీరే వేసుకోండి

ఇది పెద్ద ప్రశ్నలా అనిపించొచ్చు… కానీ దానితోనే మార్పు మొదలవుతుంది.
మీరు ఎందుకు ఈ అలవాట్లను మార్చాలనుకుంటున్నారు?
మీకు నిజంగా ఏం కావాలి?

ఉదాహరణకి:

  • మీరు శ్రద్ధతో మీ పనిలో నిమగ్నం కావాలనుకుంటున్నారా?
  • మీ కుటుంబం, స్నేహితులకు ఎక్కువ సమయం ఇవ్వాలనుకుంటున్నారా?
  • మీ చదువు లేదా ఫ్రీలాన్సింగ్‌లో మెరుగవ్వాలనుకుంటున్నారా?

మీరు ఈ “ఎందుకు” అన్న ప్రశ్నను ఒక చిన్న sticky note మీద రాసి… దాన్ని మీ గది గోడ మీద గానీ, టేబుల్ పైన గానీ పెట్టుకోండి.
మీరు రీల్స్ తెరవాలని భావించిన ప్రతిసారీ – మీరు ఆ “ఎందుకు” స్టిక్కీ వైపు చూసి, “నేను ఈ రీల్స్ ఎందుకు చూడాలి?” అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

చివరగా…

మీరు రీల్స్‌ను చూడటం పూర్తిగా మానేయాలి అని నేను చెప్పడం లేదు. కానీ మీ సమయం, శ్రద్ధ, మనశ్శాంతి అన్నీ మళ్లీ మీ చేతుల్లోకి రావాలంటే… కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి.

పెద్ద పెద్ద మార్పులు అవసరం లేదు.
ఒక్క చిన్న అడుగు చాలు.
ఒక్క రోజు రీల్స్ ను చూడకుండా గడిపితేనే, మీరు ఏం కోల్పోతున్నారో కాదు, మీరు ఏమి తిరిగి పొందొచ్చో తెలుస్తుంది.

రాసినవారు: పద్మశ్రీ

పద్మశ్రీ రాసిన ఇంకొన్ని ఆలోచనాత్మక వ్యాసాలను చూడండి: click here