Moodu Mulla Bandham – Katha

మూడు ముళ్ళ బంధం – తెలుగు కులాంతర ప్రేమ వివాహం కథ (Moodu Mulla Bandham Telugu Intercaste Love Marriage Story)

Intercaste Love Marriage in Telugu

సాయంత్రం…

ప్రేమికులూ, అపుడపుడూ వచ్చే సందర్శకులతో పార్కంతా సందడిగా ఉంది. గుబురు పొదల దగ్గర ఓ బెంచి పై ఒంటరిగా కూర్చునుంది అనురాధ తను ప్రేమించిన రాజు కోసం ఎదురుచూస్తూ…

అపుడే వచ్చిన రాజు బెంచి మీద… ఆమె పక్కన కూర్చుండటం చూసి- “ఏమైందీ ఇంతాలస్యం?” మాటల్లో అసహనం, చికాకు తొణికిసలాడుతుండగా అంది అనురాధ.

ఆమె మాటల్లో ఆ ఆకస్మిక మార్పెందుకొచ్చిందో అర్థంకాలేదు రాజుకు. “ఏమైంది అనూ…?” ఆమె భుజాల చుట్టూ చేయేస్తూ అన్నాడు.

మునుపటిలా అతను చేయేయగానే ప్రతిచర్యగా అతని భుజంపై తల ఆన్చాల్సిన అనురాధ ఈరోజలా చేయలేదు.

దీన్ని వెంటనే పసిగట్టిన రాజు ‘సీరియస్ విషయమా?’ అనుకుంటూ “ఏమైంది రా? నువ్వు మాట్లాడకుండా అలా ఉంటే నాకెలా అర్థమౌతుందీ” అన్నాడు.

విసురుగా రాజు వైపు తలతిప్పి అతని కళ్ళల్లోకి చూస్తూ “ నీకోసం ఎంతసేపట్నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అపుడు చెప్పా రమ్మని… ఇపుడా నువ్వు రావడం. ఇపుడే ఇలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నావు… ఇక మన పెళ్ళయ్యాక ఎలా ఉంటావో ఊహిస్తే క్లియర్ గా కనిపిస్తోంది మన ఫ్యూచర్” టపటపా అంది మాటలను.

అనురాధ నుండి ఊహించని ఆ స్పందనకు రాజుకి నోటమాట రాలేదు.

“ఏంటీ ఏం మాట్లాడవు?” తిరిగి తనే అడిగింది.

“నువ్వాలస్యంగా ఎన్ని సార్లు రాలేదు అనూ… నేనలాగే అన్నానా… వచ్చేపుడు కాస్తాలస్యమైంది” మెల్లగా అని, తిరిగి “అసలు విషయమేంట్రా…” అనునయంగా అన్నాడు.

అప్పటివరకూ తమ పెళ్లి జరగదన్న నిరాశతో కోపంలో ఉన్న అనురాధ, రాజు అనునయంగా మాట్లాడే సరికి కోపం కాస్త మాయమవుతూంటే నీరసంగా రాజు భుజం పై తలానించి “అంతా అయిపోయిందిరా… మన పెళ్లి జరగదు” అంది.

‘భుజంపై తల పెట్టిందంటే కోపం పోయినట్టే’ అని మురిసాడు రాజు. కానీ అంతలోనే బాంబుల్లా పేలిన అనురాధ మాటలకు అదిరిపడుతూ “వ్వాట్!!?” అనరిచాడు.

“నేను ఆలస్యంగా వచ్చానని మన ప్రేమకి స్వస్తి పలుకుతున్నావా? ఇది అన్యాయం అనూ… చాలా అన్యాయం…” కోపంగా అన్నాడు.

“ఎహే… ఆపు! నువ్వు లేటుగా వచ్చావని కాదు” అంది స్టడీగా కూర్చుంటూ.

“మరి?”

“నాన్న ఒప్పుకోరు” 

“ఒప్పుకోరని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు..?”

“నీకు తెలుసుగా… మనిద్దరి కులాలు వేరని. నాన్న ఒప్పుకోరు రాజు. నిన్నో సినిమా చూశాం. అందులో హీరో హీరోయిన్ లు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వట్టి సినిమా చూసే ‘ఇలాంటి సినిమాలు చూసే పిల్లలు పాడైపోతున్నారు. అసలు ప్రేమించుకుంటున్నాం… గీమించుకుంటున్నాం అనేవాళ్ళని నరికి పోగులు పెట్టాలి. అప్పుడుగాని ఇంకెవరూ ప్రేమ జోలికిపోరు’ అనన్నారు నాన్న చాలా కోపంగా. ఇక మన విషయం తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తోంది రా…” అసలు విషయాన్ని చెప్పింది అనురాధ.

తేలిగ్గా నిట్టూరుస్తూ “ఓస్ ఇంత దానికేనా… సినిమా చూసి ఎదో ఆవేశంలో అనుంటారులే. నువ్వు దీన్నే సీరియస్ గా తీస్కుని మీ నాన్నే మన పెళ్లి వద్దన్నట్టు డెసిషన్ తీసుకుని విడిపోదామంటే ఎలా రా” అన్నాడు.

“నీకు తెలీదు రా. నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఒకసారి ఏదైనా మాట అన్నాడంటే… అన్నట్టే చేస్తారు” అని, రాజు కళ్ళల్లోకి చూస్తూ “నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను రాజు… నీకేదైనా జరక్కూడనిది జరిగితే నే తట్టుకోలేను. అందుకే… ప్లీజ్ మనం విడిపోదాం. విడిపోడమే అటు నీకు… ఇటు నాకు… మంచిది” అంది.

“ఏయ్ అనూ ఏం మాట్లాడుతున్నావు…” అనింకేదో అనబోతున్న రాజు మాటలను అడ్డుకుంటూ- 

“ఇంక మాట్లాడి ప్రయోజనం లేదు రాజు. నేను బయల్దేరుతున్నా” అని లేచింది. నడుస్తూ “ఇక నన్ను మర్చిపో రాజు” అంది బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్ళను తుడుచుకుంటూ.

రాజు అనురాధకి వినపడేట్టు గట్టిగా అరుస్తూ “మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటే నీకు ఓకేనా!?” అన్నాడు.

వేగంగా అడుగులేస్తున్న అనురాధ మోములో ఆనందం… నడకాపి తలతిప్పి రాజు వైపు చూసింది. అతని వైపు ఆరాధనగా చూస్తూ తలూపింది ‘ఓకే’ అన్నట్టు. కానీ అంతలోనే తండ్రి గుర్తొచ్చి నిరాశతో అక్కన్నుండి వెళ్లిపోయింది.

* * * * * *

మరుసటిరోజు ఉదయం… సమయం ఏడు గంటలు కావస్తోంది…. 

ఏదో పనిమీద వాకిట్లోకొచ్చిన పూర్ణిమ యధాతదంగా చుట్టూ చూసింది. ఇంటి ముంగిళ్ళలో, రోడ్డు మీద జనాలు ఏదో గుసగుసగా మాట్లడుకుంటూ ఎదురింటి సత్యనారాయణ ఇంటి వైపు చూస్తున్నారు. ఏమైందో అర్థం కాలేదు పూర్ణిమకి. పక్కింట్లోకెళ్తున్న పనిమనిషి లీల కనపడగానే-

“లీలా” అంటూ పిలిచింది.

“ఏంటమ్మా” అంటూ వచ్చింది లీల.

“ఏమైందే వీధిలో జనాలందరూ ఏదో మాట్లాడుకుంటున్నారు?” చిన్నగా అడిగింది పూర్ణిమ.

ముక్కు మీద వేలేసుకుంటూ “మీకు తెలీదా అమ్మా… ఎదురింటి సత్యనారాయణ కూతురు వాణీ లేదూ… ఆ పిల్ల లేచిపోయిందట” అంది.

పూర్ణిమ అది వినగానే “అవునా…!” అంటూ నోరెళ్ళబెట్టింది.

“ఎవర్నో కులంగాని పిల్లగాన్ని ప్రేమించిందట. ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట. ఇంకేముంది తెల్లారి లేవగానే ఆ పిల్లగానితో లేచిపోయింది” చెప్పింది లీల.

“ఏం మాయ రోగామొచ్చిందా పిల్లకి…” అంటూన్న పూర్ణిమ గుమ్మంలో అలికిడవడంతో వెనుదిరిగి చూసింది.

ఎప్పుడొచ్చాడో తెలీదుగాని గుమ్మంలో నిలబడున్నాడు ఆమె భర్త రాధారం.

“సరే లీల. నువ్వెళ్ళు” అని వెనుదిరిగి భర్త దగ్గరికొచ్చింది.

“ఇది విన్నారూ…” అంటూ లీల చెప్పిందంతా చెప్పి “అంత పనిచేసిందేంటండీ ఆ పిల్ల. లక్షణంగా ఉండేది.. ఛిఛీ! ఇంతకి బరితెగిస్తుందనుకోలేదు” అంది భర్తతో.

సత్యనారాయణ రాధారం చిన్ననాటి మిత్రుడు. అంతా విన్న రాధారాం క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయాడు. “నారాయణ ఇంటికెళ్ళొస్తానుండు” అంటూ తక్షణమే అక్కన్నుండి కదిలాడు.

ఏదో లోలోనే గొణుక్కుంటూ ఇంట్లోకి నడిచింది పూర్ణిమ.

* * * * * *

స్నేహితుడితో మాట్లాడి గుమ్మం దాటుతున్న రాధారాం కి అటుగా రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నవారి మాటలు వినపడ్డాయి- “కూతురి గురించి గొప్పలు పోయేవాడుగా. చదువులో ఫస్టూ… దాంట్లో ఫస్టని! లేచిపోవడంలో కూడా ఫస్టే అయింది ఈ గల్లీలో” అనడం… దాంతో మిగతా వాళ్ళంతా ఘోల్లున నవ్వడం.

రాధారాం వెనకే వచ్చిన సత్యనారాయణా విన్నాడు. వాళ్ళ మాటలు భరించలేక మౌనంగా లోపలికెళ్ళిపోయాడు.

వాళ్ళన్న మాటలకు అవమానంతో మిత్రుడు ఇంట్లోకి వెళ్ళడం చూసి తట్టుకోలేకపోయింది రాధారాం హృదయం.

‘ఛి! ఛీ!.. ఏం మనుషులు వీళ్ళు… కూతురు చేసిన పనికంటే వీళ్ళ మాటలే వాణ్ని ఎక్కువ కృంగదీస్తున్నాయి. కూతురు చేసిందానికి తండ్రి తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఖర్మ!’ అనుకుంటూ తమ ఇంటి వైపు బయల్దేరాడు.

సోఫాలో కూర్చున్న భర్తతో “వెళ్ళారా” అడిగింది పూర్ణిమ.

‘ఊ’ అంటూ ఇందాక బయట జరిగింది చెప్పి- 

“తప్పంతా ఆ పిల్లదే. కులంగాని వాణ్ని ప్రేమించడమే గాకుండా వాడితో లేచిపోయి చాలా పెద్ద తప్పు చేసింది. తల్లిదండ్రులను బయట ముఖమెత్తుకుని తిరగనివ్వకుండా చేసింది! అయినా ఆ పిల్లనని ఏం లాభం.. మాయ మాటలు చెప్పి ఆ పిల్లని వలలో వేసుకున్న ఆ వెధవని నాలుగు తన్నాలి ముందు” అన్నాడు కోపంగా.

అనురాధకి రాజు ఫోను చేసి ఇవ్వాళ ఆమె నాన్నతో తమ పెళ్లి గురించి మాట్లాడతానని చెప్పాడు. ఆ ఆనందంలో హాల్లోకి వచ్చిన ఆమెకి ఎదురింటి వాణి విషయంలో తండ్రి అంటున్న మాటలను వినగానే గుండె జారినట్టయింది.

* * * * * *

సమయం ఎనిమిదిన్నర…

బ్రేక్ఫాస్ట్ ముగించి టేబుల్ ముందు నుండి లేస్తుండగా రాధారాం మొబైల్ మోగింది. వాష్ బేసిన్లో త్వరగా చేయి కడుక్కుని ఫోన్ రిసీవ్ చేసాడు. రాధారాం ముఖం సీరయస్సుగా మారడంతో పూర్ణిమ, అనురాధ తినడమాపి అతన్నే చూస్తున్నారు.

కాల్ కట్ చేసి “పూర్ణిమ నేను వెళ్తున్నా” అంటూ వేగంగా గుమ్మం దగ్గరికెళ్ళి చెప్పులేసుకున్నాడు.

“ఎవరండీ ఫోనులో” అర్థంకాక అడిగింది పూర్ణిమ.

“సత్యనారాయణ” అంటూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కన్నుండి బయల్దేరాడు.

తండ్రి వెళ్ళాక “ఏమైందమ్మా నాన్నలా వెళ్ళాడు” అమాయకంగా అడిగింది అనురాధ.

“ఆ పిల్లని ఎత్తుకెళ్లిన వాడు దొరికినట్టున్నాడు. వాణ్ని నాలుగు తన్నడానికి వెళ్లినట్టున్నారు మీ నాన్న.. ఆయన స్నేహితులు..” ఊహించి అంది పూర్ణిమ.

ఆ మాట వినగానే అనురాధ గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయి. దఢతో తింటున్న ఇడ్లీ గొంతులోకి దిగలేదు.

గడియారంలో టైం వేగంగా గడిచిపోతోంది. సమయం మధ్యాహ్నం ఒకటి…

ఒకటిన్నరకు ఇంటికొచ్చాడు రాధారాం.

అతనొచ్చేవరకూ హాల్లోనే కూర్చునుంది అనురాధ.

సోఫాలో కూర్చుంటూ “ఎప్పట్నుంచి ప్రేమిస్తున్నావు రాజును!?” అన్నాడు రాధారాం అనురాధతో. అతని మాటలు కొరడా ఝులిపించినట్టుగా తాకాయి అనురాధను. ఉలిక్కిపడింది. ఊహించలేదు తండ్రి నుండా ప్రశ్న.

భర్త గొంతు విని హాల్లోకోచ్చింది పూర్ణిమ.

“చెప్పు ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు!?” గద్దించాడు.

“ఏం మాట్లడుతున్నారండీ…” అంది విషయం తెలియని పూర్ణిమ.

“మన పుత్రికరత్నం రాజు అనే కుర్రాన్ని ప్రేమించిందట. ఎంతకాలం నుండి ప్రేమించుకుంటున్నారని అడుగుతున్నా” అన్నాడు. 

తండ్రి మాటల్లోని కటినత్వం అనురాధకి తెలిగ్గానే అర్థమైంది.

అది వింటూనే “ఓరి… భగవంతుడా! ఎంత పని జేస్తివే… పరువు గంగలో కలిపావు కదే! ఏం తక్కువ చేశామనే మామీదిలా కక్ష గట్టావ్… తలకోట్టేసినట్టు చేసావు కదే పాపిష్టిదానా!!” కూతురు నెత్తిమీద టొంగలు పొడిచి… ఏడుస్తూ నేలమీద చతికిలపడి కూర్చుండి పోయింది పూర్ణిమ. 

మాటలు రానట్టు బిగుసుకుపోయింది అనురాధ భయంతో.

* * * * * *

నెల గడిచేలోపు అనురాధకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించేసారు రాధారాం, పూర్ణిమలు.

ఆ రోజు సాయంత్రం ఎప్పట్లానే కాఫీ కప్పు తెచ్చిచ్చి భర్తకెదురుగా కూర్చుంది పూర్ణిమ.

“ఏమాలోచిస్తున్నారండీ” అంది.

“ఏంలేదు. అనురాధ గుర్తొచ్చింది” అన్నాడు కాఫీ కప్పు పెదాలకు ఆనించుకుంటూ.

“అది కట్టుకున్నవాడితో సుఖంగా ఉంటే అదే చాలండి” అంది కూతురిని జ్ఞాపకం చేసుకుంటూ.

ఏదో గుర్తురావడంతో “నా డైరీ, పెన్ను తీసుకురా…” అన్నాడు కాఫీ తాగి, కప్పును టేబుల్ మీద పెడుతూ.

లేచెళ్లి తీసుకొచ్చిచ్చింది పూర్ణిమ.

‘దీన్ని ముట్టి నెల దాటుతోంది’ అనుకుంటూ డైరీ తెరిచాడు. ఒక్కొక్కటిగా జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చాయి రాధారాం కి. వాటిని అక్షరాలుగా మలిచి డైరీలో రాయడం మొదలుపెట్టాడు.

‘అందరిలా ఆలోచించే తండ్రినే నేను కూడా కానీ నా ఆలోచన మారింది. మారింది అని రాసే కంటే ఓ సంఘటన మార్చిందని రాయడం కరెక్టు. వాణి కులంగాని అబ్బాయిని ప్రేమించి లేచిపోయిందని తెలిసినపుడు ఆ పిల్ల తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో… బాధతో వాళ్ళని ఎంత దూశించారో కళ్ళారా చూసిన నాకే తెలుసు. కులం… మతం… అంటూ వీటినే చూస్తూ కని పెంచిన పిల్లలను వదులుకోడానిక్కూడా సిద్దపడ్డ వాణీ, ఆమెను ప్రేమించినబ్బాయి తల్లిదండ్రులకీ ఆ రోజు ఓ కాల్ వచ్చింది- ఆ ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని ప్రస్తుతం వాళ్ళు ఆస్పత్రిలో ఉన్నారని. ఆ కాల్ ఎవరు చేసారో… ఎందుకు చేసారో తెలియదు గానీ… ఆ దేవుడే చేయించాడనిపించింది నాకు.

నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాడు నారాయణ. 

వాణి ఆత్మహత్యకు పాల్పడిందని విన్న నాకే బాధనిపిస్తే కని పెంచిన ఆ తల్లిదండ్రులెంత బాధపడుండాలి? వాళ్ళను చూస్తె నా గుండె తరుక్కుపోయింది. ఎంతగా ఏడ్చారో పాలిపోయున్నాయి వాళ్ళ ముఖాలు. అపుడు వాడు నాతొ ‘ఒరేయ్… వాణి చేసిన పనికి కోపం వచ్చిన మాట నిజమే కానీ అదింత అఘాయిత్యానికి ఒడిగడుతుందనుకోలేదురా. పరువు, ప్రతిష్ట… కులాలు, మతాలూ… అంటూ నా కూతుర్ని దూరం చేసుకున్నాను కదరా..! ఒరేయ్ నాకు నా కూతురు కావాలిరా…’ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ అన్న వాడి మాటలు నా గుండెల్ని కదిలించాయి.

మేమంతా హాస్పిటల్కి వెళ్లేసరికి వాణి ప్రేమించినబ్బాయి తల్లిదండ్రులూ ఉన్నారు. అప్పుడు తెలిసిన నిజమేంటంటే ఆత్మహత్య చేసుకుంది వీరి పిల్లలు కాదని. ఆ విషయం తెలిసేసరికి ఆ ఇద్దరి తల్లిదండ్రులు సంతోషంతో ఒకరికొకరు కులాలను పక్కనబెట్టి ఆలింగనం చేసుకున్నారు. అదే క్షణాన వాళ్ళ పిల్లలకి పెళ్ళిచేయాలని నిర్ణయించుకున్నారు.

ఆ సంఘటన నా కళ్ళు తెరిపించింది.

ఏ కులమైనా… ఏ మతమైనా… బ్రతికుంటేనే కదా అవన్నీ ఉండేవి. చనిపోయాక అసలు ఆత్మ ఉంటుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ ఆత్మ ఉన్నా అది ఎక్కడికి వెళుతుందో కూడా ఎవరికీ తెలియదు. అలాంటప్పుడు బ్రతికున్నప్పుడు వీటన్నింటిని ఎందుకు పట్టించుకోవాలి? ప్రతి ఒకరినీ నాలాంటి మనిషే అన్న భావనతో ఎందుకు చూడకూడదు? ఈ ప్రశ్న తలెత్తగానే మానవ జన్మకి అర్థమేంటో నాకపుడర్థమైంది. అదేంటంటే… కులాలు, మతాలూ ముఖ్యం కాదని… ప్రతి మనిషిలో ఉండే మంచి, చేడులే ముఖ్యం అని తెలుసుకున్నాను. అంతే కాదు ఇదివరకు నేను యువతీయువకుల ప్రేమను, ప్రేమ పెళ్లిల్లను ద్వేషించేవాణ్ని కానీ అది తప్పని తెలుసుకున్నాను. ప్రేమకి కులాలతో, మతాలతో పనిలేదు. అది మనసుతో మాత్రమే ముడివడుంటుంది!

హాస్పిటల్ నుండి నేను ఇంటికి బయల్దేరి వస్తుండగా దారిలో… పరిచయం లేని ఓ అబ్బాయి కలిసాడు. తనకు తానూ పరిచయం చేస్కుని అతనూ, నా కూతురూ… ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని చెప్పాడు. అది విన్న నేను క్షణకాలం పాటు నేనిప్పటి వరకు జరిగిందంతా… ఆలోచించిందంతా మర్చిపోయి ఆవేశానికి లోనయ్యా..! కానీ అంతలోనే తేరుకున్న. సత్యనారాయణ చేసిన తప్పు నేను చేయకూడదనే నిర్ణయానికి వచ్చా. మనకు మనం పెట్టుకున్న ఈ కులమతాలకి నా కూతుర్ని బలి చేయదల్చుకోలేదు. అందుకే ఆ అబ్బాయి గురించి అన్నీ తెలుసుకుని నా కూతురికి ఆ అబ్బాయి తగిన వరుడని నిర్ధారించుకున్నాక ఇద్దరికీ సంతోషంగా పెళ్లి జరిపించాము’ అంటూ రాయడం ముగించి డైరీ మూశాడు. 

పక్కనే టేబుల్ మీదున్న ఫోటో చేతిలోకి తీసుకుని చూశాడు. ఆ ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు అనురాధ, రాజులు.

1 thought on “Moodu Mulla Bandham – Katha”

Comments are closed.